స్వర్ణ ధీరలు

స్వర్ణ ధీరలు

నేడు భారత మహిళలు రంగం ఏదైనా ఆకాశమే హద్దుగా దూసుకు పోతున్నారు. కండబలం, గుండెబలం దండిగా అవసరమైన వెయిట్‌ లిఫ్టింగ్‌ క్రీడలో సైతం పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. ఆస్ట్రేలియా లోని గోల్డ్‌ కోస్ట్‌ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్‌ గేమ్స్‌లో మణిపూర్‌ రాష్ట్రానికి చెందిన ఉక్కుమహిళలు, స్వర్ణ ధీరలు మీరాబాయి, సంజీత బంగారు పతకాలు సాధించి అందరి చేత ‘వారేవ్వా !’ అనిపించుకున్నారు.

దమ్మున్నోళ్ల క్రీడ

వెయిట్‌ లిఫ్టింగ్‌ కండబలం, గుండెబలం అమితంగా ఉన్నవారి క్రీడ. ఒకప్పుడు పురుషులకు మాత్రమే పరిమితమైన ఈ ఆటలో నేడు మహిళలు సైతం రాణిస్తున్నారు. భారత మహిళలు కుటుంబ బాధ్యతలకు మాత్రమే పరిమితమవుతున్న నేటి రోజుల్లో ఈశాన్య రాష్ట్రానికి చెందిన ఈ ఇద్దరు మహిళలు కామన్వెల్త్‌ గేమ్స్‌లో బంగారు పతకాలు సాధించడం నిజంగా గర్వకారణం.

మనకు మణిపూర్‌ అనగానే ఎవర్‌ గ్రీన్‌ బాక్సర్‌ మేరీ కోమ్‌ మాత్రమే గుర్తుకొస్తుంది. అయితే మేరీ కోమ్‌, సరితా దేవి లాంటి బాక్సర్లకు ముందే కుంజరాణి దేవి లాంటి ఆల్‌టైమ్‌ గ్రేట్‌ వెయిట్‌ లిఫ్టర్‌ను భారత్‌కు అందించిన ఘనత ఈ రాష్ట్రానికి ఉంది.

కొండలు, గుట్టలతో కూడిన మణిపూర్‌ సమాజంలో పురుషుల కంటే మహిళలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంది. మహిళలు లేని మణిపూర్‌ రాష్ట్రాన్ని ఊహించడం అసాధ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

పురుషులను మించి శ్రమించే తత్వం ఉన్న మణిపూర్‌ యువతులు ఫుట్‌బాల్‌, బాక్సింగ్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌ లాంటి సత్తాకు సవాలుగా నిలిచే క్రీడలను ఎంపిక చేసుకొని మరీ రాణిస్తున్నారు. వీరు తాము ఎంచుకొన్న క్రీడల్లో బంగారు కొండలు అనిపించుకొంటూ భారత మహిళల గౌరవాన్ని అంతర్జాతీయంగా ఇనుమడింప చేస్తున్నారు.

కుంజరాణి స్ఫూర్తితో

ఆస్ట్రేలియాలోని గోల్డ్‌ కోస్ట్‌ వేదికగా జరుగుతున్న 2018 కామన్వెల్త్‌ గేమ్స్‌ తొలిరోజు పోటీల్లోనే మహిళల వెయిట్‌ లిఫ్టింగ్‌ 48 కిలోల విభాగంలో ప్రపంచ ఛాంపియన్‌ మీరాబాయి చాను భారత్‌కు తొలి బంగారు పతకాన్ని అందించింది.

క్లీన్‌ అండ్‌ జెర్క్‌ విభాగాలలో మీరాబాయి మూడో ప్రయత్నంలో 110 కిలోల బరువెత్తి కామన్వెల్త్‌ గేమ్స్‌లో సరికొత్త రికార్డు నమోదు చేసింది. స్నాచ్‌, క్లీన్‌ అండ్‌ జెర్క్‌ విభాగాలతో పాటు ఓవరాల్‌గా 196 కిలోల రికార్డుతో బంగారు పతకం అందుకొంది. కేవలం 23 ఏళ్ల వయసులోనే ప్రపంచ, కామన్వెల్త్‌ గేమ్స్‌లో బంగారు పతకాలు సాధించిన భారత తొలి మహిళా లిఫ్టర్‌గా చరిత్ర సష్టించింది.

మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌కు 25 కిలోమీటర్ల దూరంలోని నాంగ్‌ సోక్‌ కక్సింగ్‌ అనే మారుమూల గ్రామానికి చెందిన మీరా బాయి ఓ నిరుపేద కుటుంబం నుంచి జాతీయ వెయిట్‌ లిఫ్టింగ్‌లోకి దూసుకొచ్చింది. అనేక కష్ట నష్టాలకు ఓర్చి అంతర్జాతీయ లిఫ్టర్‌గా రూపుదిద్దుకొంది. కేవలం 23 ఏళ్ల చిన్న వయసులోనే ప్రపంచ పోటీల్లో బంగారు పతకంతో పాటు కామన్వెల్త్‌ గేమ్స్‌లోనూ స్వర్ణపతకం సాధించే స్థాయికి ఎదిగింది.

బంగారుకొండ సంజీత చాను

మీరాబాయి స్నేహితురాలు, సహ లిఫ్టర్‌ సంజీత చాను సైతం కామన్వెల్త్‌ గేమ్స్‌ రెండో రోజు పోటీల్లోనే దేశానికి రెండో బంగారు పతకాన్ని అందించింది. మహిళల 53 కిలోల విభాగంలో సంజీత మొత్తం 192 కిలోల బరువెత్తి వరుసగా రెండోగేమ్‌లో గోల్డెన్‌ విన్నర్‌గా నిలిచింది.

నాలుగేళ్ల క్రితం గ్లాస్గోలో ముగిసిన 2014 కామన్వెల్త్‌ గేమ్స్‌లో తొలిసారిగా బంగారు పతకం సాధించిన సంజీత ఆ తర్వాత గాయాలబారిన పడి పలు రకాల సమస్యలు ఎదుర్కొంది. అంతేకాదు తన సత్తాను మించిన 53 కిలోల విభాగంలో పోటీకి దిగాల్సి వచ్చింది. చివరకు బ్యాక్‌ టు బ్యాక్‌ బంగారు పతకాలతో తానేమిటో నిరూపించుకొంది.

అర్జున కోసం న్యాయపోరాటం

అర్జున అవార్డుల జాబితాలో తనపేరు లేకపోడంతో సంజీత చాను న్యాయ పోరాటం చేసినా ప్రయోజనం లేకపోయింది. అయినా నిరుత్సాహపడలేదు. ఆ తర్వాత ఐదేళ్ల వ్యవధిలోనే రెండు కామన్వెల్త్‌ గేమ్స్‌ల్లో బంగారు పతకాలు సాధించి విజేతగా నిలవడం ద్వారా తానేమిటో నిరూపించుకొంది.

వెయిట్‌ లిఫ్టింగ్‌లో మణిపూర్‌ మహిళలు రాణించడం ఇదేం మొదటిసారి కాదు. 2006 గేమ్స్‌ వరకూ భారత మహిళా వెయిట్‌ లిఫ్టింగ్‌ పతాకాన్ని రెపరెపలాడించిన ఘనత కుంజరాణి దేవికి మాత్రమే దక్కుతుంది. అంతర్జాతీయ వెయిట్‌ లిఫ్టింగ్‌లో 50 పతకాలు సాధించిన అరుదైన రికార్డు కుంజరాణి దేవికి ఉంది. అంతేకాదు తెలుగుతేజం కరణం మల్లీశ్వరి 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించడం ద్వారా చరిత్ర సష్టిస్తే ఆ తర్వాత కుంజరాణి దేవి అంతర్జాతీయ క్రీడల్లో రాణించింది.

మల్లీశ్వరి, కుంజరాణిదేవిల స్ఫూర్తితో వెయిట్‌ లిఫ్టింగ్‌లో అడుగు పెట్టిన మీరాబాయి చాను, సంజీత చాను స్వర్ణపతకాలు సాధించడం ద్వారా ఆ పరంపరను కొనసాగించడమే కాక తామే తగిన వారసులమని తమ రికార్డులు, విజయాల ద్వారా చెప్పకనే చెప్పారు. మణిపూర్‌కు మాత్రమే కాకుండా భారత మహిళా శక్తికే ప్రతీకలుగా నిలిచిన మీరా, సంజీత రానున్న ఆసియా క్రీడలు, టోక్యో ఒలింపిక్స్‌లో సైతం పతకాలు సాధించాలని కోరుకుందాం !

– క్రీడా కృష్ణ , 84668 64969

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *