స్పందించిన మనసు

స్పందించిన మనసు

‘ఒరేయ్‌ ! తేడాగా ఉంది. బట్టలు ఉతికేశావ్‌ గా ! తీసి లోపల ఆరేసుకో ! లేకపోతే తడిచిపోయేలా ఉన్నాయ్‌’ అని స్నేహితుడు హెచ్చరించాడు. లాప్‌టాప్‌లో ఫొటోలు చూసుకుంటున్నాను. బాగున్న వాటికి ఒక ర్యాంకింగ్‌, బాగోని వాటికి మరో ర్యాంకింగ్‌ ఇస్తూ బిజీగా ఉన్నాను. ఎందుకా అని బయటకు చూశాను. రూమ్‌ చుట్టూ మెల్లిగా చీకటి కమ్ముకురావడం గమనించాను. తీరా చూస్తే, మేఘం తన పని తాను చేసుకుపోతోంది. ఆవిరినంతా తనలో అంటి పెట్టుకుని, కాసేపట్లో వదిలేయడం కోసం వాతావరణాన్ని చీకట్లోకి నెట్టేస్తుంది.

నేలకి, నింగికి మధ్య రాయబారాలు నడుపుతూ, అదృశ్య ప్రవాహమై సంచరించే గాలి రాకను పులకిస్తూ చెట్లు ఊగిసలాడున్నాయి. సుడులు తిరుగుతూ, రివ్వున లేచే పచ్చని పత్రాలు, చిరు సవ్వడులతో మేఘాలకు సంకేతాలు పంపుతున్నాయి. పంచ భూతాలన్నీ ఏకమై, ప్రకృతినంతా చల్లదనంతో నింపుతున్నాయి. చకోరమై ఎదురు చూస్తున్న ధరణి తల్లి రాబోతున్న సమయానికి ఆరాట పడుతోంది.

నిశ్శబ్ద వాతావరణంలో, ఒకదానినొకటి అనుసరిస్తూ స్వాతి బిందువులు నేలపైకి దిగుతున్న వేళలో మనోహరమైన దశ్యమాలికను వీక్షిస్తూ మనసు కేరింతలు కొడుతోంది. ఆశలను నెరవేర్చుతూ వర్షం వచ్చేసింది. పుడమికి, ప్రకృతికి వారధి వర్షం.

‘రూపమే లేని గాలి రాకపోకలు శూన్యంలో సృష్టించే చిరు అల్లర్లకు, తనువంతా గాయాలు చేసుకున్న మేఘం జాలు వార్చె ఆనంద బాష్పాలే వర్షం. మనిషి ఆనంద బాష్పాలకు మనసు తడుస్తుంది. మేఘం ఆనంద బాష్పాలకు పుడమి తడుస్తుంది. మనలోని ఆనందాలను తట్టి లేపిన ఈ క్షణం, మనలోని తన్మయత్వాల్ని మిగిల్చిన ఈ తరుణం ఎప్పటికీ సజీవంగా నిలిచే ఉంటుంది’ అని కవితాత్మకంగా అనిపించింది.

వర్షం పడి వెలిసిన తర్వాత ప్రకృతిలో కనిపించే అందాలెన్నో. మనసు పెట్టి చూడాలే గాని ప్రతంతా అందమే, ప్రశాంతమైన గంభీర్యమే. నాకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఒకసారి కెమెరా గుర్తోచ్చాక, అదీ వర్షం వెలిశాక మనసెందుకు ఊరుకుంటుంది. అందుకే బయలుదేరాను. లాప్‌టాప్‌ లోపల పెట్టేశాను. ఒకసారి మెడలో కెమెరా పెట్టుకుని బయట ప్రపంచానికి వెళ్తే మెమోరీ కార్డు నిండి పోతుంది.

సమయమో ? కాదో ? తెలుసుకోకుండా, సూర్యుడిని కాసేపైనా విశ్రాంతి తీసుకోమని చెప్పి, ఏదో తొందరలో వచ్చేసి వెళ్ళిపోయిన వర్షం ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చింది. అందరి ఒంట్లో చలిని పెంచిన ఈ వర్షం కూడా విశ్రాంతి తీసుకోవడంతో, ఒంట్లోకి వేడి తెచ్చుకోవడం కోసం జనాలు పరుగులు పెడుతున్నారు.

రోడ్డుకు పక్కనే ఉన్న పార్క్‌ దగ్గరికెళ్ళాను. అది రూమ్‌కు దగ్గరే. ‘లోపలకు’ ‘బయటకు’ అని వేర్వేరు చోట్ల రెండు ద్వారాలున్నాయి అక్కడ. విచిత్రమే మిటంటే లోపలకొచ్చిన ద్వారం గుండానే బయటకూ వెళ్ళే వెసులుబాటుండడం. నిజం చెప్పాలంటే అదో చెరువు. కబ్జాల బారిన పడకుండా, ప్రభుత్వ ఆధీనంలో ఉన్నంత మేర, చెరువు చుట్టూరా పార్కులా అభివృద్ధి చేశారు. ఎక్కడెక్కడో ఉండే చెట్ల జాతులిక్కడ అద్భుతంగా పెరుగుతున్నాయి. చాలా ప్రశాంతమైన వాతావరణమది.

అక్కడే పచ్చటి గడ్డి మీద ఒక బల్ల వేసి ఉంది. ఖాళీగా లేదు. వృద్ధ దంపతులు కూర్చొని ఉన్నారు. వారి మొహాల్లో ఆనంద పరవశం కనిపించింది. ప్రకృతిని బాగా ఆస్వాదిస్తున్నారు. ఏం చేస్తారోనని కొంచెం దూరం నుంచి అలా చూస్తూనే ఉన్నాను. ఏవేవో ఊసులు వారి మనస్సులోకి చొరబడుతు న్నాయి. బహుశా అవి వారి అనుభవాలు అయి ఉండొచ్చు. నవ దంపతులు దగ్గరగా కూర్చున్నంత ప్రేమగా కూర్చున్నారు. పసిపిల్లల నవ్వుల్లాగా స్వచ్ఛంగా నవ్వుతున్నారు. వారికి, పసివాళ్ళకి, తేడా లేదేమో అనిపించింది. పిల్లలకి, వృద్ధులకి దోస్తీ బాగా కుదురుతుంది. తల్లిదండ్రులు బాధ్యత వహిస్తారే తప్ప వాళ్ళల్లో కలిసిపోయి జీవించరు. అందుకేనేమో, ఎక్కడ చూసినా పిల్లలు, వారితో పాటు వాళ్ళ తాతలు, బామ్మలే కనిపిస్తుంటారు.

ఆలోచనలన్నీ దారి మళ్ళాక మనసుకేదో తెలియని అనుభూతి కలిగింది. వెంటనే బయట ప్రపంచంలోకి వచ్చేశాను. ఒకసారి కలవాలనిపించి వారిని సమీపించాను. వారివైపు నా రాకను చూసి సంకోచించడం లేదు, ఆశ్చర్యపడడం లేదు. వాళ్ళవి చేయకపోయినా నా మనసుకు మాత్రం అన్నీ అనుమానాలే వస్తున్నాయి. వాళ్ళు ఏమంటారోనని.

లేని నవ్వుని తెచ్చుకోవడం చాలా కష్టం. తెచ్చుకున్న నవ్వుని వదిలేయకుండా ఉండడం ఇంకా కష్టం. కష్టాలన్నీ ఇష్టాలయినప్పుడే కదా అనుకున్నది జరిగేది, విజయాలు సాధించేది.

‘నేనిక్కడ కాసేపు కూర్చోవచ్చా అండి ?’ అంటూ సంకోచిస్తూనే అడిగాను.

‘దానికేం భాగ్యం. రా బాబు. కూర్చో.’ అంటూ వారి పక్కన కూర్చోనిచ్చారు, పలకరింపుగా చూసి నవ్వాను.

‘ఏం పేరు బాబు ? ఎక్కడుంటావ్‌ ? ఏం చేస్తుంటావ్‌ ?’ అంటూ వివరాలడిగారు. యోగక్షేమాలు కనుక్కున్నారు. చేసే పని గురించి కూడా తెలుసు కున్నారు.

‘ఫోటోగ్రఫి అంటే ఇష్టమా ? చాలా మంచి వృత్తి. ఇలా విభిన్నమైన వృత్తిని ఎంచుకునే వారెందరు బాబు ? ఈ రోజుల్లో డబ్బులొచ్చేదే కావాలి. దానికోసం దేశాలైనా దాటేస్తారు. కాని మనసుకు నచ్చింది మాత్రం చేయరు’ అన్నాడాయన.

ఒక్కసారిగా ఛాతీ పెరిగింది. అది గర్వమేమో నన్న భావన. ఒక పక్షి ఫోటో అందంగా తీయడానికి చెట్ల మధ్యలో గంటలు గంటలు ఓపికగా కూర్చో డానికి ఎంత సహనం కావాలో తెలిసినతను కావడం చేతనో, మరో కారణమో తెలియదు కాని నన్ను పొగడడం చాలా ఆనందాన్నిచ్చింది. కళాకారుల కైనా, ఏదేని వృత్తిలో ఉన్న వారికైనా తాము చేసే పని గురించి ఒకరు మెచ్చుకుంటే పులకించిపోతారు.

అతని భుజంపై మెత్తగా నొక్కుతూ ‘మీరెంతమంది నాయనా ?’ అని అడిగిందామె.

‘మేం ముగ్గురం బామ్మగారు. ఇద్దరక్కలు మెట్టినింట్లో, నేనిలా పేరెంట్స్‌కు దూరంగా హైదరాబాద్‌లో ఉంటున్నాను’ అన్నాను.

‘ఒక మంచి జీవితం కోసం వచ్చావ్‌ కదా ? ఇక అవన్నీ మర్చిపోవాలి. నీకు పెళ్లి అయిందా ?’ అని అడిగింది.

ఎందుకో పెళ్లి మాట ఎత్తితేనే భయం పుట్టుకొస్తుంది. చాలామంది పురుషులు చేసే ఏకైక ఫిర్యాదు ‘త్వరగా పెళ్లి చేసుకోకు’ అని. అంతే నిక్కచ్చిగా చెప్పలేక సిగ్గుమొహం పెట్టాను. అర్థం చేసుకున్నారనుకుంటా. ఇద్దరూ ఒక్కసారిగా నవ్వారు.

‘పెళ్ళయ్యాక పేరెంట్స్‌ను ఇక్కడికి తీసుకోస్తావా?’ అడిగాడాయన.

‘ఏమో తెలీదండీ. చూడాలి. వాళ్ళూ ఇష్టపడితే తీసుకొస్తాను. వాళ్లకి నచ్చినట్లు నడుచుకోవడం నాకిష్టం’ అన్నాను. ఏమైందో ఏమో గాని వాళ్ళ మొహాల్లో మార్పు కనిపించింది. ఏమైందని అడిగాను. ఏం లేదని వాళ్ళ అనుభవాలు, అనుభూతులు చెప్పారు. బిడ్డలెక్కడో దూరంగా ఉద్యోగాలు చేసుకుంటూంటే దంపతులిద్దరూ ఒకరికొకరు తోడుంటూ గడిపేస్తున్నారు. కన్న పేగు దగ్గరలో లేనప్పుడు, మిగతావారంతా కన్నపేగుతో సమానమేనన్నట్లుంది వ్యవహారం. ఉమ్మడి కుటుంబాలు చిద్రమైపోయిన ఈ రోజుల్లో, కొన్ని అనివార్య కారణాల చేత గ్రామాలు వదిలేసి, పట్టణాల్లో అపార్ట్‌మెంట్‌లలో ఉంటున్నవారిని పలకరించే నాథుడే కరువైపోయాడు. స్వచ్ఛమైన పైరగాలి తగిలి ఎన్నాళ్ళవుతుందోనని తమ ఊరు, అక్కడి మనుషులను గుర్తుచేసుకున్నారు. పెద్దవాళ్ళకు ఎలాంటి సాయం చెయ్యనక్కర లేదు. ఓ గంటసేపు వారితో ప్రేమగా మెలిగితే చాలు, ఆ గంట జ్ఞాపకాలతో రోజంతా వారు గడిపేస్తారని అర్థమైంది. మనసు భారమైంది. ఒకరి గురించి ఆలోచించడం, బాధపడడం అనేది నాకు నచ్చని విషయం. నేనింత వరకు అలా చేయలేదు. మనసు మారిపోతుందేమో ననిపించింది. అందుకే వాళ్లకు చెప్పకుండా వచ్చేస్తుంటే వెనక్కి పిలిచారు.

‘ఫోటోగ్రఫీ అంటే ఇష్టం అన్నావ్‌. మెడలో కెమెరా వేలాడేసుకున్నావ్‌. మరి మా ఫోటో తీయవా?’ అని అడిగిందామె. అప్పుడు గాని ఈ మట్టి బుర్రకు తట్టలేదు. నాకు ఒదార్పునివ్వడానికి వాళ్ళే గుర్తుచేశారని అర్థమైంది. వెంటనే నా కన్ను కెమెరా అద్దాల్లో చిక్కుకుంది. వారి కళ్ళూ కళ్ళూ కలుసుకున్నాయి.

‘స్మైల్‌ ప్లీజ్‌’ అనగానే దగ్గరగా ఉన్నవారు ఇంకాస్త దగ్గరగా జరిగి ఒకరి చేతిని మరొకరు గట్టిగా ఒడిసి పట్టుకున్నారు. వారి వేళ్ళు పెనవేసుకుపోయాయి. మాటల్లేని ఆ హావభావాలకి పేరేం పెట్టాలో తెలీలేదు. ఆ సన్నివేశం నాలో అలజడులు రేపింది. ఒక ఫోటోగ్రాఫర్‌గా వాళ్ళు సరిగ్గా కూర్చున్నారా ? లేదా? వెనక నేపథ్యం సరిగా ఉందా లేదా ? ఫ్రేమ్‌ ఎలా ఉంది ? నవ్వుతూ కూర్చున్నారా? లేదా? అని చూసుకొని ఫోటో తీయడమే తెలిసిన నాకు, వాళ్ళ హావభావాలు చూశాక, అద్భుమైన ప్రేమను వ్యక్తపరచడం చూశాక ఆర్ధ్రత నిండుకుంది. ప్రేమకు మాటల్లేవని అర్థమైంది. ఈ ఒక్క క్షణం నేను వారినలా చూసుండకపోతే, ఈ రోజు ఎంత గొప్ప మధురానుభూతిని కోల్పోయేవాడినో!

మామూలుగా చూడడం వేరు, మనసు పెట్టి చూడడం వేరు. మనసు పెట్టి చూడటం వల్లనేమో నాకు ఇంత మంచి అనుభూతి కలిగింది. ఇది లేకపోవడం వల్లే నా ఫోటోలు ఎక్కువ మందిని ఆకర్షించేవి కావేమో. ఏదో మిస్‌ అయిందే అనే వారే కాని, ఏం మిస్‌ అయిందో చెప్పే వారు కాదు. ఇప్పుడు తెలిసిపోయింది. సహజత్వం మిస్‌ అయింది. వీక్షకుల మనస్సులోకి సహజత్వమనే అనుభూతిని తీసుకెళ్లలేకపోవడం మిస్‌ అయిందని ఈ ఫోటోను చూశాక అర్థమైంది.

చూసే ప్రతి చూపులో, చేసే ప్రతి పనిలో ఏదో ఒక ఆర్ధ్రతాభావం నిండి ఉంటుంది. అది కనుక పట్టుకోగలిగితే ప్రతి వ్యక్తీ విజయం సాధిస్తాడు. క్షణ క్షణానికి మన కళ్ళముందు ఎన్నో సంగతులు జరుగుతుంటాయి. వాటిని కళ్ళతో కాకుండా మనసుతో చూస్తే ప్రతీదీ అద్భుతమే. నాకు ఈ విషయం ఈ క్షణం తెలిసింది.

అది చెయ్యి, ఇది చెయ్యి అని చాలామంది శ్రేయోభిలాషులు చెప్తారు. కాని నీ మనసు మాత్రం ఇంకొకటి కోరుకుంటుంది. నీ మీద నీకు నమ్మకం లేనప్పుడు ఎదుటివాడు చెప్పిందే చేస్తావ్‌. నీ మనసుకు నచ్చింది కాదు. అటువంటప్పుడే ఎన్నో మధురానుభూతుల్ని కోల్పోతావ్‌. నీతో తీసుకెళ్ళాల్సిన మరెన్నో జ్ఞాపకాలను వదిలేస్తావ్‌. జ్ఞాపకమంటే బాధించే విషయం కాకూడదు. నిన్ను ప్రేరేపించే ఉత్ప్రేరకం కావాలి.

ఆలోచించుకుంటూ వెళ్తున్న నా మనసు ఒక్కసారి ఆగింది. వెనక్కి తిరిగి చూశాను. దూరం నుంచి చూస్తున్నా, దగ్గరి నుంచే చూస్తున్న భావన కలిగింది. సూర్యుడు తన తీవ్రతను పెంచక పోవడంతో, ఒంట్లో చలి తగ్గడం కోసం, చేతులు రెండూ రాపిడి చేశాక, ఉద్భవించిన వేడిని భార్య చెంపలకు అంటిస్తున్నాడాయన. ఆ స్పర్శకు మెల్లగా కళ్ళు మూసుకుందామె. చలికోటులు కప్పుకున్నా, వారి ప్రేమే వారిలో వేడిని రగిల్చింది. నా మొహంపై చిరునవ్వు విరిసింది.

మరొకరి వల్ల నేనలా ఆనందంగా, ఆశ్చర్యంగా ఉండడం అదే మొదటిసారి. సంప్రదాయబద్ధమైన పెళ్లి, సష్టి రహస్యం దాగున్న పెళ్లి కూడా చిన్న చిన్న మనస్పర్థలకే కూలిపోతున్న ఈ రోజుల్లో, మా అమ్మానాన్నల తర్వాత అంత ప్రేమగా మెలిగే వాళ్ళను చూస్తున్నాను. అమ్మానాన్నలు అప్పుడప్పుడైనా చిన్న చిన్నగా గొడవపడి, మళ్ళీ సర్ధుకుంటారు. కాని వీళ్ళను చూస్తుంటే మాత్రం అలాంటి వాటికి అవకాశమే లేదనిపిస్తుంది. అపురూపమైన బంధం అది. ప్రేమకు భాష లేదంటే ఇదేనేమో. నిస్వార్ధమైన ప్రేమ సంతోషాన్ని, సంరక్షణను కన్నా మరేం పట్టించుకోదని తెలిసింది. మనసు కొద్దిగా స్పందించింది.

వెంటనే ఇంటికి, తర్వాత చకచకా ల్యాబ్‌కు వెళ్లాను. నాలో ఉత్సాహాన్ని రేకెత్తించిన ఈ చిత్ర పటాన్ని మెమోరీ కార్డు నుండి బయటకు తీశాను. ‘మాటల్లేని ప్రేమే అనిర్వచనీయం, అమోఘం’ అనే కొటేషన్‌ను ఫోటోపై ప్రింట్‌ చేసి, దాన్నో ఫ్రేమ్‌గా కట్టించి, ప్యాక్‌ చేశాను. వారికందించాలన్న తపనే మర్చిపోయిన వారి అడ్రస్‌ను గుర్తు తెచ్చుకునేలా చేసింది. సాయంత్రంకల్లా వారి ఇంటిముందు వాలిపోయాను.

లంకంత కొంప అంటే ఇదేనేమో ! చూడ్డానికి లంకంత ఉంది. కాని దాంట్లో సీతారాములే ఉన్నారు. ఇదెలా సాధ్యం ? జ్ఞాపకాలు, అనుభూతులు నీ చుట్టూ పరచుకున్నప్పుడు సాధ్యం. ఇల్లే ఓ పల్లెటూరయింది. నచ్చినన్ని అపార్ట్‌మెంట్లు కట్టేస్తూ, గాలిని చొరబడనీయకుండా పంకాలను అమర్చిన ఈ సమాజంలో, మార్పు మొదలైందేమో అన్పించేలా అలంకరణ ఉంది. ఇంటి గోడలు ఖాళీగా లేవు. దర్వాజా ఖాళీగా లేదు. సోఫాలు ఖాళీగా లేవు. ప్రతి దాంట్లోనూ వారి ప్రేమ, వారి నిబద్ధత నిండున్నాయి. గతమెంత ఘనమైతేనేమి బ్రతుకంతా ఆనందంగా ఇలా బ్రతకగలమా ! ఇప్పుడేంటని నిలదీస్తున్న కాలం, నీవేంటో చూపించమని ప్రశ్నిస్తున్న సమాజంలో వాళ్ళ ఉనికిని చాటు కుంటున్నారు.

నన్నక్కడ చూడగానే వారి హావభావాల్లో ఆనందం తొణికిసలాడింది. ఎంత వింతగా చూసినా, ఆశ్చర్యపోయినా ఆహ్వానించడమనే సహజ లక్షణాన్ని మానుకోలేం. దానికో తోడు దొరికితే, ఆనందమనే వర్ణమవుతుంది.

‘నువ్వు ఉదయం పార్క్‌లో కలిశావ్‌ కదా బాబు? లోపలికి రా. చాలామంది ఋతుపవనాల్లా వచ్చి, పలకరించి వెళ్ళడమే కాని ఇలా వసంతంలా చిగురించేలా చేసింది నువ్వే బాబు’ అన్నదామె.

ఎందుకో ఆ మాటలు కొత్తగా అనిపించాయి. నేనొచ్చానని అతనికి చెప్పడానికి లోపలికెళ్ళింది. ఇంటినెలా అలంకరించుకున్నారో అనుకుంటూ మొత్తం పరికించి చూస్తుండగా అతనొచ్చాడు.

‘ఆశ్చర్యంగా ఉంది బాబు’ అంటూ కుర్చీలో కూర్చుంటూ, నన్నూ కూర్చోమని సైగ చేశాడు.

‘ఈ ముసలి ప్రాణాలను చూడడానికి వచ్చావా?’ అని కొద్దిగా కంటతడి పెట్టుకున్నారు వాళ్లు.

నేనది గ్రహించలేదు కాని, నేనిచ్చిన జ్ఞాపకాన్ని తీసుకుని, మొదటిసారి ఘనతను సాధించిన చిన్నపిల్లల లాగా సంబరపడిపోవడం గ్రహించాను. దాన్ని వాళ్ళ జీవితంలో, వారు సాధించిన గొప్ప పరిణామంగా భావించడం, నా కళ్ళల్లో నీళ్ళు తిరిగేలా చేసింది. అంతే మరేం మాట్లాడకుండా సెలవు తీసుకుని వెనుదిరిగాను. వాళ్ళు పిలుస్తున్నారు కాని వినిపించడంలేదు. గేటు వేస్తూ కిటికీలోంచి చూశాను. దగ్గరగా కూర్చొని, ఏవేవో మాట్లాడు కుంటూ, అపురూపంగా ఫోటోను చూస్తూ, స్పర్శిస్తున్నారు. అప్పుడర్థమైంది. మారింది వాళ్ళు కాదు నేనని. మార్పు అనివార్యమని నిరూపించిన క్షణమది.

– దొండపాటి కృష్ణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *