సిద్ధార్థ-7

సిద్ధార్థ-7

2. ప్రజలలో

సిద్ధార్థుడు కామస్వామిని చూడడానికి వెళ్ళాడు. ఆ ఇల్లు ఒక పెద్దమహలు. నౌకరులు అతనిని తివాసీలమీద నడిపించుకుంటూ లోపలికి తీసుకవెళ్ళారు. యజమాని కోసం నిరీక్షిస్తూ గదిలో కూర్చున్నాడు.

కామస్వామి వచ్చాడు. ఇద్దరు స్నేహసూచకంగా వందనాలు తెలుపుకున్నారు. ”నీవు బ్రాహ్మణుడవనీ, పండితుడవనీ, ఉద్యోగం కోసం తిరుగుతున్నావని విన్నాను. అయితే జరగక ఉద్యోగంలో చేరదలచా వన్న మాట” అన్నాడు షాహుకారు.

”నాకు జరగకపోవడమనేది ఏనాడూ లేదు. నేను చాలా కాలం శ్రమణులతో కలిసి ఉన్నాను. అక్కడ నుంచే వచ్చాను.”

”అయితే నీకు జరుగుబాటు ఏలాగు ? మీ శ్రమణులకు ఆస్తిపాస్తులు ఉండవుగా?”

”నాకు ఆస్తిలేని మాట నిజమే. స్వబుద్ధితోనే నేను ఆస్తిని వదులుకున్నాను. దాని అవసరం కూడా నాకు లేదు.”

”అయితే బ్రతకడం ఏలాగు ?”

”ఆ సంగతి ఎప్పుడూ నేను ఆలోచించలేదు. మూడు సంవత్సరాల నుంచి ఈలాగే ఉన్నాను. బ్రతకడం ఏలాగన్న ప్రశ్నే నాకు తట్టలేదు.”

”అయితే ఇతరుల ఆస్తిమీద ఆధారపడి బ్రతుకుతున్నావన్న మాట”

”కావచ్చు – షాహుకారు కూడా ఒకరిమీద ఆధారపడే బ్రతుకుతాడు.”

”అయితే ఇతరుల వద్దనుంచి ఊరికే సొమ్ము తీసుకోడు. తన సరుకులిచ్చి సొమ్ము తీసుకుంటాడు షాహుకారు.”

”లోకం పోకడ ఆలాగే ఉంటుంది. ప్రతివాడు ఒకటి ఇచ్చి వేరొకటి తీసుకొంటాడు. బ్రతుకే ఆలాంటిది.”

”నీకు ఆస్తి లేదు గదా! నీవేమి ఇవ్వగలవు?”

”ప్రతివాడు తనకున్నది ఇస్తాడు. సైనికుడు బలాన్ని, వర్తకుడు సరుకులను, ఉపాధ్యాయుడు విద్యను, కర్షకుడు ధాన్యాన్ని ఈ విధంగా ఇస్తారు.”

”నీవు ఇవ్వగలిగింది ఏమిటి ?”

”నేను ఆలోచించగలను. వేచియుండగలను. పస్తులు చేయగలను.”

”ఇంతేనా?”

”ఇంతే.”

”వీటివల్ల ఏమి ప్రయోజనం? పస్తులుండి ఏమి సంపాదిస్తావు?”

”దానిలో చాలా ప్రయోజనం ఉన్నది. తినడానికి తిండిలేనప్పుడు పస్తుపండుకోవడమే తెలివిగలపని. నాకు పస్తులుండే అలవాటు లేకపోతే ఈనాడు ఏదో చాకిరి చేయక తప్పేది కాదు. ఆకలిమంటే ఆ పని చేయించేది. కాని నేను శాంతంగా వేచి ఉండగలను. ఆకలికి ఓర్చుకుంటాను. చాలా కాలం అణుచు కుంటాను. నవ్వుకుంటాను. పస్తుల వల్ల నాకు ఎంతో మేలు కలిగింది.”

”క్షణంసేపు కూర్చో; ఇప్పుడే వస్తాను” అని కామస్వామి లోపలికి పోయి కొన్ని కాగితాలు తెచ్చి సిద్ధార్థునికిచ్చి, వాటిని చదవమన్నాడు. అవి అమ్మకపు ఖరారు కాగితాలు. వెంటనే సిద్ధార్థుడు చదివి వివరాలన్నీ చెప్పాడు. తరువాత కామస్వామి అతని చేతికి ఒక కాగితమిచ్చి ఏదైనా వ్రాయమన్నాడు. ”వ్రాయడం మంచిదే, ఆలోచించడం ఇంకా మంచిది. తెలివిగలిగి ఉండడం మంచిదే, ఓర్పుగలిగి ఉండటం ఇంకా మంచిది” అని సిద్ధార్థుడు ఆ కాగితం మీద వ్రాసి ఇచ్చాడు. కామస్వామి చదువుకున్నాడు. ”నీవు చక్కగానే వ్రాస్తావు. అయితే మనం మాట్లాడుకోవలసిన సంగతులు ఎన్నో ఉన్నవి. ఈనాడు నీవు నాకు అతిథిగా మా ఇంట్లోనే ఉండు” అన్నాడు.

ఆరోజు నుంచి సిద్ధార్థుడు కామస్వామి ఇంటి లోనే వున్నాడు. స్నానపానాది సౌకర్యాలన్నీ కామ స్వామి కల్పిస్తున్నాడు. ఒక్కపూట మాత్రమే భోజనం చేసేవాడు. మద్యమాంసాలు ముట్టేవాడు కాడు. కామస్వామి అతనికి వ్యాపార విషయాలన్నీ బోధపరచాడు. అన్ని రహస్యాలు తెలుసుకున్నాడు. అన్ని వ్యవహారాలు చూస్తున్నాడు. మితంగా మాట్లాడే వాడు. కమల ఆదేశించిన ప్రకారం కామస్వామికి లొంగకుండా సరిసమానంగా ప్రవర్తించేవాడు. వ్యాపారం విషయంలో కామస్వామికి మహాజాగ్రత్త, తగని ఆసక్తి. అన్ని పనులు చూస్తూ ఉండినా సిద్ధార్థునికి అదంతా ఒక ఆటగా, విలాసంగా ఉండేది. ఏవీ అతని హదయాన్ని సోకేవి కావు.

ప్రతిరోజు సిద్ధార్థునికి కమల కబురు పంపేది. అందమైన దుస్తులు ధరించి బహుమానాలు తీసుకొని వెళ్ళేవాడు. ఆమె యెర్రని పెదవులు అతనికి ఎన్నో విషయాలు నేర్పినవి. లేత చివుళ్ళవంటి ఆమె చేతులు అతనిని బాగా తరిబీతు చేసినవి. కాని కామకళలో అతనికి ఇంకా పసితనం వదలలేదు. కళ్లుమూసుకొని తీరని తమితో కమలా శంగార సరస్సులో మునిగి తేలుతున్నాడు.

సుఖాన్ని అనుభవించ వలెనంటే సుఖాన్ని ఇవ్వడం నేర్చుకోవలెననీ; ప్రతిభంగిమ, ప్రతిలాలన, ప్రతి స్పర్శ, ప్రతిచూపు, దేహంలో ప్రతి అంగమూ, గ్రహించగలవానికి ఒక ఆనందాన్ని అందించగలవనీ అతడు కమల శిక్షణ వల్ల నేర్చుకొంటున్నాడు. సంప్రయోగసమయంలో ఒకరిని ఒకరు మెచ్చు కోవడమూ, ఒకరిని ఒకరు జయించడమూ, జయించబడడమూ లేకుండా ఇద్దరు విడిపోరాదనీ; అలా జరిగినప్పుడే ప్రేమికులు పూర్తి సంతప్తి కానీ, అసంతప్తి కానీ పొందకుండా పరస్పర రక్తిని నిలుపుకోగలరనీ; తాను అక్రమంగా వినియోగించు కున్నాను, అక్రమంగా వినియోగించబడ్డాను అన్న అసహ్యభావం ఇద్దరికీ కలగదనీ; అతనికి కమల అభ్యాసపూర్వకంగా ఉపదేశించింది.

సిద్ధార్థుడు కమలకు శిష్యుడు, ప్రియుడు, మిత్రుడు. కమలతో గడిపే కాలం అద్భుతంగా ఉండేది. ప్రస్తుతం అతని జీవిత పరమార్థం కమల విలాసాలతో ముడిపడి ఉన్నది. కామస్వామి వ్యాపారంతో కాదు.

ఉత్తర ప్రత్యుత్తరాలు నడపడం, కొనుగోలు అమ్మకాలు జరపడం ఈ పనంతా సిద్ధార్థునికే అప్ప గించాడు కామస్వామి. అన్ని ముఖ్య విషయాలలో అతనితో సంప్రదిస్తూ ఉన్నాడు. అతనిని గూర్చి కామస్వామి ఒక స్నేహితునితో ఈలా చెప్పాడు. ”ఈ మనిషికి సరుకుల నాణెం అంతగా తెలియదు. కాని నాకు అలవడని ఒక శుభ లక్షణం ఇతనిలో ఉన్నది. తొందరపాటు లేకుండా నెమ్మదిగా మంచి అభిప్రాయం కలిగేట్టుగా అందరితో మాట్లాడుతాడు. వారు చెప్పేది కూడా అలాగే వింటాడు. ఇతనికి వ్యాపార స్వభావం లేదు. అందులో మనస్సు మగ్నం కాదు. కాని అదష్టం దానంతట అది కలిసివచ్చే రహస్యం ఇతనిలో ఉన్నది. అది జన్మనక్షత్ర బలమో శ్రమణుల దగ్గర నేర్చిన తంత్రమో కావలెను. వ్యాపారాన్ని ఒక ఆటగా చూస్తాడు. లాభం వచ్చినా నష్టం వచ్చినా మనసుకు పట్టించుకోడు.” కామ స్వామికి ఆ మిత్రుడు ఈలా సలహా చెప్పాడు : ”ఇతనికి వ్యాపార లాభాలలో మూడోభాగం పెట్టి. నష్టం వచ్చినా తన వాటా పంచుకోవలెనని చెప్పు. అతనికే ఉత్సాహం కలుగుతుంది.”

కామస్వామి ఆలాగే ఏర్పాటు చేశాడు. ఆ మార్పు కూడా సిద్ధార్థుని మీద పని చేయలేదు. లాభం వచ్చిన నాడు పొంగిపోయేవాడు కాడు. నష్టం వచ్చిననాడు క్రుంగిపోయేవాడు కాడు. ”సరే పోనీ” అనుకునేవాడు.

ఒక పర్యాయం ధాన్యం ఖరీదు చేయడానికి ఒక గ్రామానికి వెళ్ళాడు. అతడు వెళ్ళేటప్పటికి ధాన్యం అమ్మకమైంది. తిరిగి రాకుండా దీర్ఘకాలం ఆ గ్రామం లోనే ఉన్నాడు. అక్కడ రైతులతో వినోద ప్రసంగాలు చేస్తూ, పిల్లలకు పైసాలు పంచిపెడుతూ, పెండ్లి పేరంటాలకు హాజరవుతూ తప్తికరంగా కాలం గడిపి తిరిగి వచ్చాడు. కామస్వామికి చాలా కోపం వచ్చింది. సిద్ధార్థుడు అన్నాడు; ”మిత్రమా ! కోపం వల్ల ఏమీ లాభించదు. నీకు నష్టం కలిగితే అదంతా నేను భరిస్తాను. ఈ ప్రయాణం నాకు చాలా తప్తికరంగా జరిగింది. ఎందరితోనో పరిచయం స్నేహం కలిగింది.”

”అంతా బాగానే వున్నది. నీవు వ్యాపారానికి వెళ్ళినట్టా? విలాసానికి వెళ్ళినట్టా?” అన్నాడు కామస్వామి.

”నిజంగా నా సంతోషానికే వెళ్ళాను. ఎందుకు వెళ్ళగూడదు? కొత్త స్థలాలు చూచాను. క్రొత్త మనుషులతో పరిచయమూ, స్నేహమూ కలిగింది. నేను కామస్వామిని అయి ఉంటే వెంటనే తిరిగివచ్చి వుందును. అప్పుడైనా ఏమీ లాభించేది కాదు. కాని ఇన్ని దినాలు ఎంతో ఆనందంగా గడిపాను. ఈ పర్యాయం వెళ్ళినప్పుడు ఎందరో స్నేహితులు నన్ను ఆప్యాయంగా ఆహ్వానిస్తారు. నా పైన కోపం తెచ్చు కోవడం నీకే క్షేమంకాదు. నా వల్ల నష్టం కలుగుతూ ఉన్నట్టు తోస్తే వెంటనే చెప్పు. మరుక్షణం నన్ను చూడవు. అంతవరకూ స్నేహంగానే వుందాము” అన్నాడు సిద్ధార్థుడు. ”ఇన్నాళ్ళు నా ఉప్పు తినికదా నీవు బ్రతుకుతున్నది?” అన్నాడు కామ స్వామి. ”మిత్రమా! నా ఉప్పే నేను తింటున్నాను. నిజానికి నీవూ నేనూ అందరి ఉప్పూ తింటున్నాము” అన్నాడు సిద్ధార్థుడు.

కామస్వామికి స్వంత కష్టాలు ఎన్నో ఉండేవి. అవేవీ సిద్ధార్థునికి పట్టేవి కావు. ఎవరి వల్లనైనా నష్టం కలిగినప్పుడు కోపం చూపడం అవసరమని కామ స్వామి చెప్పేవాడు. ఆ మాటలు అతని తలకెక్కేవి కావు. ఒకసారి కామస్వామి అన్నాడు: ”వ్యాపారం సంగతులన్నీ నా మూలంగా తెలుసుకున్నా”వని. సిద్ధార్థుడు జవాబు చెప్పాడు: ”కామస్వామీ! ఈ చమత్కారాలు కట్టిపెట్టు. ధాన్యం కొనుగోలు, అమ్మకాలు, వడ్డీ పెంపకాలు, ఇవే నీ దగ్గర నేను నేర్చుకున్నది. ఇవే నీకు తెలిసినవి. కాని ఆలోచించ డమంటే ఏమో నీ దగ్గర నేర్చుకోలేదు. దానిని నీవు నా దగ్గర నేర్చుకుంటే బాగుండేది” అని.

వాస్తవంగా అతని మనస్సు వ్యాపారం మీద లేదు. కమల కోసం ద్రవ్యాన్ని సంపాదించడానికే వ్యాపారం అతనికి వినియోగించింది. ఆ ద్రవ్యం అక్కరకు మిక్కిలిగా లభించింది. ప్రజలమీద అతనికి ఎంతైనా సానుభూతి ఉండేది. కాని ప్రజల కష్టసుఖాలు, గుణదోషాలు అతనిని సోకేవి కావు. అందరితోనూ కలిసి మెలిసి తిరిగేవాడు. కాని ఆ ప్రజల నుంచి తనను వేరుపరిచేది ఏదో తనలో ఉన్నట్టు తోచేది. ఆ భావం అతనిలో గాఢంగా ఉండేది. అల్ప సుఖాల కోసం ప్రజలు పడే పాటులను, వారి రాగ ద్వేషాలను చూచి నవ్వుకునే వాడు.

అతని వద్దకు వ్యాపారం కోసం వర్తకులు వచ్చేవారు. అప్పులకోసం కొందరు వచ్చేవారు. భిక్షుకులు వచ్చి తమ దరిద్ర బాధలను చెప్పుకునే వారు. అందరినీ ఆదరంతో చూచేవాడు. పండ్ల నమ్ముకునే మనిషిని, తనవద్ద నౌకరును, పెద్ద షాహుకారును సమాన దష్టితోనే చూచేవాడు. ఎవరైనా కొద్ది మోసం చేసినా లెక్క పెట్టేవాడు కాడు. కామస్వామి వచ్చి మంచి చెడ్డలు మాట్లాడినప్పుడు కొద్దిగా శ్రద్ధగా వినేవాడు. ఏదో సమాధానం చెప్పి పంపేవాడు.

ఒక్కొక్క సమయంలో అతనికి లోపలనుంచి ఏదో వాణి మదువుగా మెల్లగా వినిపించేది. ఆ వాణి అతనికి ఏదో స్మృతికి తెచ్చేది. ఏదో హెచ్చరిక చేసేది. కాని స్పష్టంగా వినిపించేదికాదు. ఉన్నట్టుండి అతనికి ఒకభావం స్పష్టంగా గోచరించింది. తాను ఒక వింత బ్రతుకు బ్రతుకుతున్నాడు. ఆటలాడుకున్నట్టుగా ఏమేమో చేస్తున్నాడు. ఉత్సాహంగా సంతోషముగా కాలం గడుపుతున్నాడు. కాని వాస్తవ జీవితం తన కళ్ళముందు ప్రవాహంగా పారతున్నది. ఆ ప్రవాహాన్ని తాను స్పశించడం లేదు. అతనికి వ్యాపారం ఒక కందుక క్రీడలాగా ఉన్నది. అందరితో అతని సంబంధం కూడా ఆలాగే లీలామాత్రంగా ఉన్నది. కాని అతని హదయం, అతని సహజస్వభావం, వాటిలో లేదు. అతడు కూడా లేడు. అతని అంతరాత్మ ఎక్కడో దూరంగా అదశ్యంగా తిరుగుతూ ఉన్నది. అతని బ్రతుకుతో దానికి సంబంధం లేదు.

ఈ రకం భావాలు కలిగినప్పుడు అతనికి భయం వేసేది. తాను కూడా అందరిలాగే రక్తితో, ఆసక్తితో బ్రతకకూడదా అనిపించేది. ఒక ప్రేక్షునిలాగా ఈ నాటకాన్ని పరికించడం ఎందుకు అనుకునేవాడు.

ప్రతిదినం కమల వద్దకు వెళ్ళి కామకళ నభ్యసిస్తూ వుండేవాడు. ఆ సాధనలో ఇచ్చిపుచ్చు కోడాలు ఒక్కటిగా మెలవేసుకుని పోయేవి. తనకు కమలకు ప్రవృత్తిలో ఏదో సామ్యం అతనికి గోచరించింది. ఒకసారి ఆమెతో అన్నాడు: ”కమల! నీకూ నాకూ పోలిక ఉన్నది. నీవూ అందరివంటి దానవు కావు. నీవు కమలగానే ఉండగలవు. నీ లోపల ప్రశాంతమైన ఒక స్థానం ఉన్నది. ఏక్షణంలోనైనా ఆ స్థానంలోకి పోయి నీవు నీవుగా ఉండగలవు. ఆలాగే వుంటాను నేను కూడా. ఆ శక్తి తక్కువ మందికి వుంటుంది. కాని ప్రతి మనిషికి అది సాధ్యమే.”

”అందరికీ ఆ తెలివి ఉంటుందా” అన్నది కమల. ”దానికి తెలివితో పని లేదు. కామస్వామికి నా మాత్రం తెలివి ఉన్నది. కాని నేను చెప్పిన స్థానం ఒకటి తనలో వున్నదని యెరగడు. కమలా ! చాలామంది చెట్లపై ఆకుల మాదిరి గాలికి ఊగుతూ నేలమీద రాలిపోతారు. కొందరుమాత్రం నక్షత్రాల మాదిరి ఒక నిర్ణీత పథంలో ప్రయాణం చేస్తారు. ఆ మార్గము నడిపేశక్తి వారిలోనే ఉంటుంది. నేను చాలామంది జ్ఞానులను ఎరుగుదును. ఈ విధమైన శక్తిగల వ్యక్తిని ఒక్కరినే చూచాను. ఆయనను ఏనాటికీ మరచిపోలేను. ఆయనే బుద్ధభగవానుడు. వేలకొలదిగా ఆయన బోధలు వింటున్నారు. ఆయన ఉపదేశాలను ఆచరిస్తున్నారు. కాని వారందరు కూడా రాలిపోయే ఆకులే. కారణమే మంటే ఆ నడిపేశక్తి, ఆ జ్ఞానం వారి లోపల లేదు.”

”నీవు బుద్ధుని సంగతి ప్రారంభించావు. శ్రమణ భావాలు నీలో తిరిగి పొటమరిస్తూన్నవి.”

సిద్ధార్థుడు మౌనంగా కూర్చున్నాడు. అంతలో ఇద్దరు కామరంగంలో దిగారు. కమల శరీరమార్దవం నాగుపాము లాంటిది. ఎన్ని మెలికలైనా ఎన్ని వంపులైనా తిరుగుతుంది. సిద్ధార్థునితో కూడి ఏవేవో క్రీడలలో నోలలాడించింది. ఓడించింది. పరవశుని చేసింది. ఆమె విజయానికి ఆనందభరితుడై అలసి సొలసి సిద్ధార్థుడు ఆమెను సర్యాంగాలింగనం చేసుకొని పండుకొన్నాడు.

కమల అతని మీద వంగి చాలాసేపు అతని ముఖాన్నీ, అలసిపోయిన అతని కళ్ళనూ చూస్తూ ఉన్నది.

”నీ వంటి రసికుని ఎన్నడూ చూచియెరగను. నీ బలమూ, నీ మార్దవమూ, నీ అనుకూలత ఎవ్వరికీ లేవు. సిద్ధార్థా! నా కళను నీవు చక్కగా నేర్చుకున్నావు. నీ వల్ల నేను తల్లిని కూడా కావచ్చు. కాని నీవు ఎన్నడూ శ్రమణుడవే. నీవు వాస్తవంగా నన్ను ప్రేమించడం లేదు. నీకు ఎవ్వరిమీదను ప్రేమలేదు. నిజమేకదూ?” అన్నది కమల.

”కావచ్చు! నేనూ నీ వంటివాడనే. నీవు కూడా నిజంగా ప్రేమించలేవు. నీవు ప్రేమించగలిగి వుంటే కామాన్ని ఒక కళగా సాధించగలిగేదానవు కావు. బహుశా మనవంటి వ్యక్తులు ప్రేమించలేరేమో! సామాన్యులకే అది సాధ్యం. అదే వారి ప్రవృత్తిలో రహస్యం.” అన్నాడు సిద్ధార్థుడు నిట్టూరుస్తూ.

(ఇంకా ఉంది)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *