సాకర్‌ సందడి

సాకర్‌ సందడి

ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా సంబరానికి రష్యా గడ్డపై రంగం సిద్ధమైంది. నాలుగు సంవత్స రాల కోసారి జరిగే ఒలింపిక్స్‌ను మించి జనాదరణ కలిగిన 2018 ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ సమరానికి 32 దేశాల జట్లు సై అంటే సై అంటున్నాయి. జూన్‌ 14 నుంచి జులై 15 వరకూ నెలరోజుల పాటు జరిగే ఈ సాకర్‌ సందడి కోసం 210 దేశాలకు చెందిన వందల కోట్ల అభిమానులు ఎక్కడా లేని ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

ప్రపంచ క్రీడ..

క్రీడలు ఎన్ని రకాలున్నా ప్రపంచంలోనే అత్యంత జనాదరణ పొందుతున్న క్రీడ ఏదంటే ఫుట్‌బాల్‌ అన్న సమాధానమే వస్తుంది. పురుషులు, మహిళలు, పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లను ఆదరించే క్రీడాభిమానులే విశ్వవ్యాప్తంగా ఎక్కువ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. గత 88 సంవత్సరాలుగా ప్రపంచ క్రీడాభిమానులను అలరిస్తూ నిత్యనూతనంగా ఉంటూ వస్తున్న ప్రపంచకప్‌ సాకర్‌ పరంపరలోని 21వ పోటీలకు తూర్పు యూరోప్‌ దేశం రష్యా తొలిసారిగా ఆతిథ్యమిస్తోంది.

నెలరోజుల పండుగ..

రష్యాలోని 11 నగరాలు, 12 వేదికల్లో జూన్‌ 14 నుంచి జులై 15 వరకూ జరిగే 2018 ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ పోటీలలో ఆరు ఖండాలకు చెందిన మొత్తం 32 దేశాల జట్లు ఢీ కొనబో తున్నాయి. గత రెండున్నర సంవత్సరాలుగా సాగిన అర్హత పోటీలలో 31 స్థానాల కోసం 210 దేశాల జట్లు తలపడ్డాయంటే ఆశ్చర్యపోవడం మనవంతే అవుతుంది.

ఆతిథ్య రష్యా నేరుగా ప్రపంచకప్‌లో పాల్గొంటుంటే మిగిలిన 31 దేశాల జట్లు 209 దేశాల జట్లతో పోటీపడి 872 అర్హత పోటీల ద్వారా ఫైనల్‌ రౌండ్‌కు అర్హత సంపాదించాయి.

ఆసియా నుంచి 5 దేశాలు…

ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ చరిత్రలోనే ఆసియాకు చెందిన ఐదుదేశాలు తొలిసారిగా బరిలోకి దిగబోతున్నాయి. ఇరాన్‌, జపాన్‌, సౌదీ అరేబియా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా జట్లు ఆసియాకు ప్రాతినిథ్యం వహిస్తున్నాయి.

ఇక ఆఫ్రికా ఖండం నుంచి ఈజిప్టు, మొరాకో, నైజీరియా, సెనెగల్‌, ట్యునీసియా సమరానికి అర్హత సంపాదించాయి. కోస్టా రికా, మెక్సికో, పనామా మథ్య, అమెరికా నుంచి, అర్జెంటీనా, బ్రెజిల్‌, కొలంబియా, పెరూ, ఉరుగ్వే దేశాల జట్లు బరిలోకి దిగుతున్నాయి.

అయితే యూరోప్‌ నుంచి 14 దేశాల జట్లు ఫైనల్‌ రౌండ్‌ బెర్త్‌లు ఖాయం చేసుకొన్నాయి. వీటిలో బెల్జియం, క్రొయేషియా, డెన్మార్క్‌, ఇంగ్లండ్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, ఐస్‌ లాండ్‌, పోలాండ్‌, పోర్చుగల్‌, రష్యా, సెర్బియా, స్పెయిన్‌, స్వీడన్‌, స్విట్జర్లాండ్‌ ఉన్నాయి.

ఇటలీ లేని తొలి ప్రపంచకప్‌..

ప్రపంచకప్‌కు రెండుసార్లు ఆతిథ్యమిచ్చి, నాలుగుసార్లు విజేతగా నిలిచిన ఇటలీ జట్టు తొలిసారిగా అర్హత సంపాదించ లేకపోయింది. 1960 తర్వాత ఇటలీ లేకుండా ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ పోటీలు జరగడం ఇదే మొదటిసారి. అంతేకాదు ఇప్పటి వరకూ ప్రపంచకప్‌ విజేతలుగా నిలిచిన మొత్తం ఎనిమిది దేశాలలో ఇటలీ మినహా మిగిలిన ఏడు దేశాలు 2018 ప్రపంచకప్‌ ఫైనల్‌ రౌండ్‌కు అర్హత సాధించడం విశేషం.

భారీ బడ్జెట్‌…

21వ ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ పోటీలకు ఆతిథ్యమిస్తున్న రష్యా నెలరోజుల ఈ టోర్నీ నిర్వహణ కోసం 80వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. రష్యా రాజధాని మాస్కో తో పాటు కలినన్‌ గ్రాడ్‌, కజాన్‌, క్రసాండర్‌, నిజ్నీనోవాగ్రాడ్‌, రోస్టావ్‌ ఆన్‌ డాన్‌, సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌, సమారా, సారానిస్కా, సోచీ, ఓల్గా గ్రాడ్‌, యోరాస్లావ్‌, ఎకతెరీన్‌ బర్గ్‌ నగరాలలో కోట్లాది రూపాయల వ్యయంతో అత్యాధునిక స్టేడియంలు నిర్మించారు.

జూన్‌ 14 నుంచి 29 వరకూ ఎనిమిది గ్రూపుల తొలిదశ రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పోటీలు నిర్వహిస్తారు. జూన్‌ 30 నుంచి ప్రీ-క్వార్టర్‌ ఫైనల్స్‌, జులై 6 నుంచి క్వార్టర్‌ ఫైనల్స్‌, జులై 10 నుంచి సెమీఫైనల్స్‌, జులై 15న మాస్కోలోని లుజుంకీ స్టేడియం వేదికగా ఫైనల్స్‌ నిర్వహిస్తారు.

రికార్డు ప్రైజ్‌ మనీ..

2018 ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌లో గతంలో ఎన్నడూ లేనంతగా 400 మిలియన్‌ డాలర్లు ప్రైజ్‌ మనీగా ఇవ్వనున్నారు. మన రూపాయలలో చూస్తే ఇది 2 వేల 707 కోట్లకు సమానం. ఇక విజేతగా నిలిచిన జట్టు 257 కోట్ల రూపాయలు ప్రైజ్‌ మనీగా అందుకోనుంది. రన్నరప్‌ జట్టుకు 28 మిలియన్‌ డాలర్లు, మూడోస్థానంలో నిలిచిన జట్టుకు 24 మిలియన్‌ డాలర్లు నజరానాగా ఇస్తారు. నాలుగో స్థానంలో నిలిచిన జట్టు 22 మిలియన్‌ డాలర్లు అందుకొంటుంది. ఐదు నుంచి ఎనిమిది స్థానాలు సాధించిన జట్లకు 64 మిలియన్‌ డాలర్లు, 9 నుంచి 16 స్థానాలు పొందిన జట్లకు 96 మిలియన్‌ డాలర్లు, 17 నుంచి 32 స్థానాల్లో నిలిచిన జట్లకు 128 మిలియన్‌ డాలర్లు ప్రైజ్‌ మనీగా కేటాయించారు. గ్రూప్‌ దశలోనే ఇంటిదారి పట్టినజట్లకు సైతం 58 కోట్ల రూపాయల చొప్పున ఇస్తారు.

తొలిసారిగా..

ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా సమాఖ్య పిఫా (ప్రపంచ ఫుట్‌బాల్‌ సమాఖ్య)లో 207 దేశాలకు సభ్యత్వం ఉంది. అయితే నాలుగేళ్లకోసారి జరిగే ప్రపంచకప్‌ ఫైనల్‌ రౌండ్లో పాల్గొనే అవకాశం కేవలం 32 అత్యుత్తమ జట్లకు మాత్రమే ఉంది. జనాభా పరంగా ప్రపంచంలోనే మొదటి రెండు అతిపెద్ద దేశాలైనా చైనా, భారత్‌ ఇప్పటి వరకూ ప్రపంచకప్‌ ఫైనల్‌ రౌండ్‌కు అర్హత సాధించలేదు. సాకర్‌ సమాఖ్యలోని ప్రతి దేశం ప్రపంచకప్‌ ఫైనల్‌ రౌండ్‌ చేరాలని తపిస్తూనే ఉంటుంది.

ప్రపంచ మాజీ ఛాంపియన్లు ఇటలీ, నెదర్లాండ్స్‌, చిలీ, అమెరికా, కెమరూన్‌ లాంటి మేటి జట్లు ప్రస్తుత ప్రపంచకప్‌ ఫైనల్‌ రౌండ్‌కు అర్హత సాధించడంలో విఫలమయ్యాయి. అయితే ఐస్‌లాండ్‌, పనామా లాంటి అతి చిన్న దేశాలు తొలిసారిగా ప్రపంచకప్‌ ఫైనల్‌ రౌండ్‌ బెర్త్‌లు సంపాదించి చరిత్ర సష్టించాయి. అంతేకాదు 28 ఏళ్ల తర్వాత ఈజిప్ట్‌, 36 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పెరూ జట్లు ఫైనల్‌ రౌండ్లో పాల్గొంటున్నాయి.

ప్రపంచకప్‌ ఫైనల్‌ రౌండ్లో పోటీపడుతున్న మొత్తం 32 జట్లను ఎనిమిది గ్రూపులుగా విభజించారు. గ్రూప్‌- ఏ లీగ్‌లో ఆతిథ్య రష్యా, సౌదీ అరేబియా, ఈజిప్టు, ఉరుగ్వే, గ్రూప్‌ -బి లో పోర్చుగల్‌, స్పెయిన్‌, మొరాకో, ఇరాన్‌ జట్లు తలపడనున్నాయి. గ్రూప్‌ -సి లో ఫ్రాన్స్‌, ఆస్ట్రేలియా, పెరూ, డెన్మార్క్‌, గ్రూప్‌-డి లో అర్జెంటీనా, ఐస్‌లాండ్‌, క్రొయేషియా, నైజీరియా జట్లు పోటీపడనున్నాయి. గ్రూప్‌-ఇ లో బ్రెజిల్‌, స్విట్జర్లాండ్‌, కోస్టారికా, సెర్బియా, గ్రూప్‌-ఎఫ్‌ లో జర్మనీ, మెక్సికో, స్వీడన్‌, దక్షిణ కొరియా తలపడతాయి. గ్రూప్‌- జిలో బెల్జియం, పనామా, ట్యునీసియా, ఇంగ్లండ్‌, గ్రూప్‌-హెచ్‌ లో పోలెండ్‌, సెనెగల్‌, కొలంబియా, జపాన్‌ జట్లు పోటీపడతాయి.

అయితే బరిలోకి 32 జట్లు దిగుతున్నా టైటిల్‌ ఫేవరెట్లుగా ప్రస్తుత ఛాంపియన్‌ జర్మనీ, ఆల్‌టైమ్‌ గ్రేట్‌ బ్రెజిల్‌, మాజీ ఛాంపియన్‌ అర్జెంటీనా, ప్రపంచ మేటి ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో నాయకత్వంలోని పోర్చుగల్‌ జట్లు టైటిల్‌ వేటకు దిగుతున్నాయి. విశ్వవిఖ్యాత బ్రాండ్లు అడిడాస్‌, కోకాకోలా, హ్యుందాయ్‌, ఖతర్‌ ఏర్‌ వేస్‌, వీసా, వీవో 2018 ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌కు ప్రధాన స్పానర్లుగా ఉన్నాయి.

ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో వివిధ జట్ల తరపున మొత్తం 600 మంది ఆటగాళ్లు పోటీకి దిగుతుంటే కోట్లాదిమంది అభిమానులను తమ ఆటతీరుతో సమ్మోహకం చేసే సత్తా ఉన్న స్టార్‌ ప్లేయర్లు ఎవరంటే అర్జెంటీనా కెప్టెన్‌ లయనల్‌ మెస్సీ, పోర్చుగల్‌ సారథి క్రిస్టియానో రొనాల్డో, బ్రెజీలియన్‌ థండర్‌ నైమార్‌, వేల్స్‌ వండర్‌ గారెత్‌ బాలే మాత్రమే ముందు వరుసలో నిలుస్తారు.

పాసింగ్‌, డ్రిబ్లింగ్‌, స్పాట్‌ కిక్‌, సిజర్స్‌ కిక్‌, టాక్లింగ్‌, బ్లాకింగ్‌, హెడ్డర్‌ విన్యాసాలతో సాగే ఈ దశాబ్దపు ఆఖరి ప్రపంచకప్‌లో మ్యాజిక్‌ చేసే సాకర్‌ వీరుడు ఎవరు ? విశ్వవిజేతగా నిలిచే జట్టు ఏదో తెలుసుకోవాలంటే నాలుగు వారాల పాటు వేచిచూడక తప్పదు. నెలరోజుల ఈ సాకర్‌ మ్యాచ్‌లను వీక్షించిన వారు మాత్రం సాకర్‌ కిక్కే వేరు అనుకుంటారు.

– క్రీడా కృష్ణ , 84668 64969

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *