సర్దార్‌ సింగ్‌ @ 300

సర్దార్‌ సింగ్‌ @ 300

జాతీయ క్రీడ హాకీలో భారత్‌ ఎందరో గొప్ప గొప్ప ఆటగాళ్లను అందించినా ఆధునిక హాకీలో మాత్రం మిడ్‌ ఫీల్డర్‌ సర్దార్‌ సింగ్‌ తర్వాతే ఎవరైనా..

సర్దార్‌సింగ్‌ తన 13 ఏళ్ల అంతర్జాతీయ హాకీ జీవితంలో ఎన్నో అరుదైన విజయాలు, ఘనతలు, రికార్డులు సాధించాడు. నెదర్లాండ్స్‌ వేదికగా జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీ హాకీ టోర్నీలో 300వ అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడటం ద్వారా సర్దార్‌ సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

ఒలింపిక్స్‌లో భారత్‌కు ఎనిమిది బంగారు పతకాలు, ఒక ప్రపంచ టైటిల్‌ను అందించిన ఒకే ఒక్క క్రీడ హాకీ. సాంప్రదాయ పచ్చిక మైదానాల నుంచి అత్యాధునిక ఆస్ట్రోటర్ఫ్‌ వేదికలకు మారిన ఈ కళాత్మక క్రీడలో భారత్‌ కాలపరీక్షకు నిలిచి తన అస్థిత్వాన్ని కాపాడుకొంటూ వస్తోంది.

ఎందరో దిగ్గజాలు

భారత హాకీ అనగానే ముందుగా పంజాబ్‌, హర్యానా రాష్ట్రాలు.. ఆ తర్వాత హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్‌… అజిత్‌పాల్‌సింగ్‌, సుర్జిత్‌సింగ్‌, పర్గత్‌సింగ్‌, జాఫర్‌ ఇక్బాల్‌, మహ్మద్‌ షాహీద్‌, మెర్విన్‌ ఫెర్నాండేజ్‌, అశోక్‌ కుమార్‌ లాంటి ఎందరో గొప్ప గొప్ప ఆటగాళ్లు గుర్తుకొస్తారు. అయితే సుదీర్ఘకాలం భారతహాకీ జట్టులో సభ్యుడిగా కొనసాగిన ఘనత మాత్రం అతికొద్ది మంది ఆటగాళ్లకు మాత్రమే దక్కుతుంది. అలాంటి వారిలో సర్దార్‌సింగ్‌ అందరికంటే ముందు వరుసలో కనిపిస్తాడు.

సిర్సా టు ప్రపంచ హాకీ

క్రీడల పుట్టినిల్లు హర్యానాలోని సిర్సా నగరం సంత్‌నగర్‌ ప్రాంతంలో 1986 జూలై 15న జన్మించిన సర్దార్‌సింగ్‌ హాకీ ఆటనే ఊపిరిగా చేసుకొన్నాడు. నిరంతర సాధనతో ప్రతిభావంతుడైన మిడ్‌ ఫీల్డర్‌గా గుర్తింపు తెచ్చుకొన్నాడు. హాఫ్‌ బ్యాక్‌ స్థానంలో ఆడుతూ భారత జూనియర్‌ జట్టులో 2003-04 సీజన్లో చోటు దక్కించుకొన్నాడు. పోలెండ్‌ టూర్‌కు ఎంపిక కావడం ద్వారా తన అంతర్జాతీయ కెరియర్‌కు శ్రీకారం చుట్టాడు.

భారత ప్రస్తుత ప్రధాన శిక్షకుడు హరేంద్రసింగ్‌ శిక్షణలో రాటుదేలిన సర్దార్‌ సింగ్‌ ఆ తర్వాత సీనియర్‌ జట్టులో సైతం చోటు సంపాదించి ఓ కీలక సభ్యుడి స్థాయికి ఎదిగిపోయాడు. హర్యానా, చండీగఢ్‌ డైనమోస్‌ జట్లకు ఆడుతూ వచ్చిన సర్దార్‌సింగ్‌ భారత సీనియర్‌ జట్టులో సులభంగా చోటు సంపాదించాడు.

పాకిస్థాన్‌ ప్రత్యర్థిగా అరంగేట్రం

పాకిస్థాన్‌ ప్రత్యర్థిగా తన తొలి సీనియర్‌ అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడిన సర్దార్‌సింగ్‌ ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. భారతజట్టుకు ఎనిమిది సంవత్సరాలపాటు నాయకత్వం వహించిన సర్దార్‌ రెండేళ్ల క్రితమే జట్టు పగ్గాలను గోల్‌ కీపర్‌ శ్రీజేష్‌కు అప్పజెప్పాడు.

నెదర్లాండ్స్‌ వేదికగా జరిగిన 2018 ఛాంపియన్స్‌ ట్రోఫీ హాకీ టోర్నీ రౌండ్‌ రాబిన్‌ లీగ్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ అర్జెంటీనాతో ఆడిన మ్యాచ్‌ ద్వారా తన 300వ అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడిన భారత హాకీ స్టార్‌గా సర్దార్‌సింగ్‌ అరుదైన ఘనత సొంతం చేసుకొన్నాడు.

అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 2-1 గోల్స్‌తో విజయం సాధించడం ద్వారా సర్దార్‌సింగ్‌ కెరియర్‌లో తన 300వ మ్యాచ్‌ను చిరస్మరణీయంగా మిగుల్చుకొన్నాడు. భారతజట్టు తరఫున 16 గోల్స్‌ సాధించిన రికార్డు సైతం సర్దార్‌సింగ్‌కు ఉంది.

చిరస్మరణీయ విజయాలు

2007, 2017 ఆసియాకప్‌ టోర్నీలతో పాటు, 2014 ఇంచియోన్‌ ఆసియా క్రీడల్లో బంగారు పతకాలు సాధించిన భారత జట్టులో సభ్యుడిగా సర్దార్‌ ప్రధాన పాత్ర పోషించాడు. 2010, 2014 కామన్వెల్త్‌ గేమ్స్‌ హాకీలో రన్నరప్‌ స్థానాలు సాధించిన భారతజట్టులోనూ సభ్యుడిగా ఉన్నాడు.

2007, 2009, 2011 సంవత్సరాల ఛాంపియన్స్‌ ఛాలెంజ్‌ హాకీలో భారతజట్టు సభ్యుడిగా మూడు కాంస్య పతకాలను సైతం సర్దార్‌సింగ్‌ అందుకొన్నాడు.

2011 సీజన్లో బెల్జియం హాకీ క్లబ్‌ కెహెచ్‌సి ల్యూవెన్‌కు భారీ కాంట్రాక్టుపై ఆడిన తొలి భారత హాకీ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. 2013 ఆసియాకప్‌ తర్వాత నెదర్లాండ్స్‌ క్లబ్‌ హెచ్‌సి బ్లోమెండాల్‌తో కాంట్రాక్టు కుదుర్చుకోడం ద్వారా యూరోపియన్‌ శైలి పవర్‌ హాకీని అలవరచు కొన్నాడు.

ఇండియన్‌ ప్రీమియర్‌ హాకీ లీగ్‌ 2005 సీజన్లో చండీగఢ్‌ డైనమోస్‌కు ఆడిన సర్దార్‌ ఆ తర్వాత 2006 నుంచి 2008 వరకూ హైదరాబాద్‌ సుల్తాన్స్‌ జట్టు తరఫున ఆడాడు. ఢిల్లీ వేవ్‌ రైడర్స్‌, పంజాబ్‌ వారియర్స్‌ జట్లకూ సర్దార్‌ ప్రాతినిధ్యం వహించాడు. 2008 సుల్తాన్‌ అజ్లాన్‌ షా గోల్డ్‌ కప్‌ హాకీలో భారత జట్టుకు నాయకత్వం వహించడం ద్వారా అత్యంత పిన్నవయసులోనే భారత సీనియర్‌ హాకీ ఆటగాడిగా సర్దార్‌సింగ్‌ రికార్డుల్లో చేరాడు.

అరుదైన పురస్కారాలు

భారత హాకీకి 13 సంవత్సరాలపాటు అమూల్యమైన సేవలు అందించిన సర్దార్‌సింగ్‌ను పలు రకాల క్రీడా, పౌర పురస్కారాలు వెతుక్కొంటూ వచ్చాయి. అర్జున అవార్డుతో పాటు దేశ అత్యున్నత క్రీడాపురస్కారం రాజీవ్‌గాంధీ ఖేల్‌ రత్న అవార్డును సైతం సర్దార్‌సింగ్‌ అందుకొన్నాడు. 2015 సంవత్సరానికి దేశంలోని నాలుగో అత్యున్నత పౌరపురస్కారం పద్మశ్రీ గౌరవాన్ని సైతం సంపాదిం చాడు. హర్యానా రాష్ట్ర పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సర్దార్‌సింగ్‌ రానున్న ఆసియా క్రీడల్లోనూ భారత్‌కు బంగారు పతకం అందించాలన్న పట్టుదలతో ఉన్నాడు.

ఇప్పటికే 300 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రికార్డు బద్దలు కొట్టిన సర్దార్‌సింగ్‌ నిలకడగా రాణించగలిగితే 400 మ్యాచ్‌ల రికార్డు అందుకొన్నా ఆశ్చర్యంలేదు. అంతర్జాతీయ హాకీలో 13 ఏళ్లపాటు కొనసాగటం… 300 మ్యాచ్‌ల రికార్డును అందుకొన్న సర్దార్‌సింగ్‌… ఆధునిక భారత హాకీకి సర్దార్‌ అన్నా అతిశయోక్తి లేదు.

– క్రీడా కృష్ణ , 84668 64969

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *