సంప్రోక్షణ

సంప్రోక్షణ

ఆ వార్త విన్న శరత్‌ ఉలిక్కిపడ్డాడు.

పక్కన కాదు.. నడి నెత్తిన అగ్నిపర్వతం విరుచుకుపడి తన చుట్టూ ఆ జ్వాలలన్ని ఎగసి పడుతున్నట్టు, తను అందులో సజీవంగా దహించుకు పోతున్నట్టు ఒళ్ళంతా భగ భగ లాడింది.

ఇది నిజమా..? కాదు.. కాకూడదు..

ఎలా జరిగింది ? జరక్కూడదు.. నో.. ఇంతలోనే అంతఘోరమా..? ఎందుకలా జరిగింది..? విరగ బూసిన పూల తోట అలా ఎలా తగలబడింది ? బూడిద కుప్పలా మారిన అందమైన పూల తోట కనిపించసాగింది. అప్పటి దాకా గుండెల్లో మోగిన గుడిగంటలు ఇప్పుడు మరణ మదంగాల్లా వినిపిస్తు న్నాయి. ఇంటి నిండా చిందులేసిన ఆనందం ఇంతలో ఏమైంది. ముప్ఫైఆరు గంటల్లో ఇంత భయంకరమైన మార్పా ?

మధుర స్వప్నాలతో మెరిసిన కళ్ళు కాంతిని కోల్పోయి కళా విహీనంగా ఉన్నాయి. అప్పుడే చేతిలో ఉప్మా ప్లేట్‌తో వచ్చిన శారద చైతన్య రహితంగా నిలబడిన కొడుకు వైపు ఆందోళనగా చూసింది. ప్లేట్‌ను టేబుల్‌ మీద పెట్టి కొడుకు దగ్గరకి వచ్చి చేయి పట్టుకుని కుదుపుతూ శరత్‌.. నాన్నా శరత్‌.. ఏంటిరా ? ఏమైంది? అని అడిగింది.

శరత్‌ గాజుకళ్ళతో చూశాడు తల్లి వైపు. చూస్తుండగానే అతని కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరిగాయి. అచేతనంగా కుర్చీలో కూలబడ్డాడు. చేతుల్లోంచి మొబైల్‌ జారి పడింది. రెండు చేతుల్లో మొహం దాచుకున్నాడు.

శారదకి అయోమయంగా అనిపించింది. పది నిమిషాల క్రితం ‘అమ్మా టిఫిన్‌ రెడీనా ? నాకు టైం అయింది’ అంటూ హుషారుగా అరిచిన శరత్‌కి ఇంతలో ఏమైంది ?

కిందపడిన మొబైల్‌ తీసుకుంది శారద. అప్పుడే పూజ ముగించి భుజం మీద కండువా తీసి లాల్చీ తొడుక్కుంటూ శారదా టిఫిన్‌ రెడీనా ? అంటూ అక్కడికి వచ్చాడు సూర్యనారాయణ.

చేతిలో మొబైల్‌తో రెండుచేతుల్లో మొహం దాచుకుని కూర్చున్న కొడుకు వైపు తెల్లబోయి చూస్తున్న ఆవిడ దగ్గరకి వచ్చి ‘ఏం జరిగింది శారదా? శరత్‌కి ఏమైంది?’ కంగారుగా అడిగాడు.

‘తెలియదండి. ఇంతకు ముందే టిఫిన్‌ రెడీ అయిందా ? అని పిలిచాడు. తీసుకుని వచ్చేసరికి..’ అంటూ కొడుకువైపు చూసింది.

సూర్యనారాయణ కొడుకు దగ్గరకు వెళ్లి అతని మొహం మీద నుంచి చేతులు తీసి ‘ఏమైందిరా?’ అని అడిగాడు.

‘నాన్నా’ అంటూ గభాల్న వాటేసుకుని బావురు మన్నాడు శరత్‌. ‘ఘోరం జరిగింది నాన్నా’

‘ఏం జరిగిందిరా ?’ ఎప్పుడూ హుషారుగా, నవ్వుతూ ఉండే శరత్‌ని ఆ పరిస్థితిలో చూస్తుంటే ఆయనకి కాళ్ళు, చేతులు గజగజ వణికాయి.

బలవంతంగా గొంతు పెగల్చుకుని ‘హారిక.. హారిక..’ అన్నాడు శరత్‌.

హారిక పేరు వినగానే శారద గభాల్న అడిగింది ‘ఏమైంది హారికకు’

శరత్‌ నేను చెప్పలేను అన్నట్టు రెండు చేతులూ అడ్డంగా ఊగిస్తూ లోపలికి పరిగెత్తాడు. భార్యభర్త లిద్దరూ అయోమయంగా ఒకరినొకరు చూసు కున్నారు.

‘ఏవండీ ఆ అమ్మాయికి ఏమైందో ఫోన్‌ చేయండి మూర్తి గారికి. బహుశా వాళ్ళ దగ్గరి నుంచే ఏదో వార్త వచ్చింది. అది విన్నాకే వాడిలా అయ్యాడు’ అంది.

ఆయన గబుక్కున మొబైల్‌ తీసుకున్నాడు. కాని ఫోన్‌ చేసి కాబోయే వియ్యంకుడితో ఏం మాట్లాడాలో, మీ ఇంట్లో ఏం జరిగింది ? అని ఎలా అడగాలో అర్థం కాలేదు. శుభకార్యం జరుపుకుని, పెళ్లి ముహుర్తాలు పెట్టుకుని, ఎంతో సంబరంగా అక్కడినుంచి వచ్చిన ముప్ఫైఆరు గంటల తరవాత మీ ఇంట్లో ఏం జరిగింది ? మీ అమ్మాయికి ఏదన్నా ప్రమాదం జరిగిందా ? మా అబ్బాయి ఇలా అయ్యాడు అని ఎలా అడగడం. అసలు శరత్‌ని ఇంతగా కదిలించిన ఫోన్‌ కాల్‌ వాళ్ళ దగ్గరి నుంచేనా? శరత్‌ ఫోన్‌లాగ్‌లో ఇన్‌కమింగ్‌ కాల్స్‌ చూశాడు. లాస్ట్‌కాల్‌ గురుమూర్తి దగ్గరనుంచే. ఆరు నిమిషాల క్రితం వచ్చింది.

‘అంటే.. అంటే.. వాళ్ళింట్లో ఏదో జరిగింది. మూర్తిగారికి ఏం కాలేదు కదా.. వేదవతి గారు క్షేమంగా ఉన్నారు కదా’ ఆయన చేతులు వనక సాగాయి. భర్త ఆలోచిస్తూ ఉండిపోడం చూసి శారద అసహనంగా ‘చేయండి.. ఆలోచిస్తారేంటి.. పాపం ఏం జరిగిందో ఏంటో..’ అంది. భార్య మొహంలోకి కొన్ని క్షణాలు చూసి నెంబర్‌ నొక్కాడు సూర్య నారాయణ. అవతల రింగ్‌ అవుతోంది. ఎవరూ లిఫ్ట్‌ చేయడం లేదు. భార్యాభర్తలిద్దరి మొహాల్లో ఆందోళన ఎక్కువైంది. ‘ఎవరూ తీయడం లేదు శారదా’ అన్నాడు.

‘పదండి మనం వాళ్ళింటికి వెళ్లి చూద్దాం. కాబోయే వియ్యాలవారు. వాళ్ళకి వచ్చిన కష్టం ఏంటో తెలుసుకోడం మన బాధ్యత’ అంది శారద.

‘పద చీర మార్చుకురా నేను కూడా రెడీ అవుతా’ అంటూ సూర్యనారాయణ తన గదిలోకి వెళ్లబోతుండగా శరత్‌ గభాల్న వచ్చి ‘వద్దు.. మీరు వెళ్ళద్దు..’ అని గట్టిగా అన్నాడు. ‘ఇద్దరూ మ్రాన్పడి చూశారు కొడుకు మొహంలోకి.

‘వెళ్ళద్దు నాన్న. మీరు వెళ్లి పరామర్శించడానికి ఏం లేదు. అంతా అయిపోయింది. సర్వనాశనం అయ్యింది’

‘ఏంట్రా ? ఏమంటున్నావు నువ్వు ? ఎం జరిగిందో చెప్పరా’ శారద కొడుకు చేయి పట్టుకుని బతిమూలుతూ అడిగింది.

శరత్‌ కొద్దిసేపు మౌనంగా ఉండి నెమ్మదిగా చెప్పాడు.

శారద కెవ్వున అరిచి విరుచుకు పడిపోయింది. సూర్యనారాయణ నిశ్చేష్టుడై నిలబడిపోయాడు.

—- —

హిమాయత్‌నగర్‌లో స్ట్రీట్‌ నెంబర్‌ ఆరులో ఉన్న ఇంటి ముందు కారాపాడు శరత్‌. ముందు వాసవి దిగి వెనకాల డోర్‌ తెరిచింది. సూర్యనారాయణ, శారద దిగారు. గేటు దగ్గరే ఎదురు చూస్తున్న గురుమూర్తి, ఆయన భార్య వేదవతి మర్యాదగా రిసీవ్‌ చేసుకుని వారిని లోపలికి ఆహ్వానించారు.

విశాలమైన హాల్‌లో ఖరీదైన సోఫాలు, అందమైన పూల కుండీలు ఇంటివాళ్ళ ¬దానే కాక వాళ్ళ అభిరుచిని కూడా తెలియచేస్తున్నాయి. ఇద్దరు అమ్మాయిలు జ్యూస్‌ తీసుకొచ్చి ఇచ్చారు. గురుమూర్తి, ఆయన భార్య ఆప్యాయంగా, మర్యాదగా మాట్లాడారు. ఇంతలో పచ్చని మేని ఛాయతో, బంగారు బొమ్మలా, నడకలో రాచ ఠీవి ఒలకబోస్తూ వచ్చి పెద్దవాళ్ళకు నమస్కారాలు పెట్టి, శరత్‌కి, వాసవికి హాయ్‌ చెప్పి కుర్చీలో కూర్చుంది చిరునవ్వు చిందిస్తూ హారిక. ఫోటోలో కన్నా అందంగా ఉంది అనుకున్నాడు శరత్‌ ఆమె వైపు ముగ్ధుడై చూస్తూ.

వాసవి నెమ్మదిగా తమ్ముడి చెవిలో ‘ఏంట్రా ? ఇలా ఉంది. అబ్బే ఇంత నలుపేంటి?’ అంది. కోపంగా చూడబోయిన శరత్‌ అక్క కళ్ళల్లో చిందు లేస్తున్న కొంటెతనం చూసి మొహం తిప్పకున్నాడు. నిజానికి ఆమె ప్రొఫైల్‌ చూసినప్పడే సగం ఒప్పకున్నాడు. ఇప్పడు ఆమెను చూడగానే పెళ్ళంటూ చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకోవాలి, నా భార్య కాగల అర్హత ఈమెకే ఉంది అనిపించింది.

శరత్‌కి ఇప్పుడు వయసు ఇరవై ఎనిమిది. బి.టెక్‌ పూర్తి చేసి డెల్‌ కంపెనీలో చేరి ఆరేళ్ళు అయింది. ఉద్యోగంలో చేరిన రెండేళ్ల నుంచి శారద కొడుక్కి పెళ్లి చేసి కోడల్ని తెచ్చుకోవాలని సణగడం మొదలు పెట్టింది. శరత్‌, వాసవికి దాదాపు ఏడేళ్ళ తేడా ఉంది. వాసవి డిగ్రీ అవగానే మంచి సంబంధం రావడంతో పెళ్లి చేసేసారు. అబ్బాయి ఐసిఐసిఐ బ్యాంకు కొండాపూర్‌ బ్రాంచ్‌లో మేనేజర్‌. అక్కడికి దగ్గరలోనే ప్లాట్‌ కొనుక్కున్నారు వాళ్ళు. వాసవి వెళ్ళిన దగ్గరి నుంచి ఇంట్లో ఆడపిల్లలు లేక ఇల్లు బోసిపోతోందని కోడలు వస్తే కళకళ్ళాడుతుందని కొడుకును పెళ్లి చేసుకోమని బతిమాలితే చివరికి ఒప్పుకున్నాడు శరత్‌.

రెండేళ్ల నుంచి అనేక సంబంధాలు వచ్చినా శరత్‌కి ఒక్క అమ్మాయి కూడా నచ్చలేదు. ఆఖరికి వారంక్రితం తెలిసినవాళ్ళ ద్వారా హారిక సంబంధం వచ్చింది. పిల్ల కూడా ఇంజనీరని, హైటెక్‌ సిటీలో చేస్తోందని, ఒక్కతే కూతురని, ఆస్తిపరులని, మంచి కుటుంబమని అవతలి వాళ్ళు చెప్పి ఆ అమ్మాయి బయోడాటా, ఫోటో చూపించారు. చూడగానే శరత్‌కే కాక ఇంటిల్లిపాదికి నచ్చేసింది. పెళ్లిచూపులకి లాంఛనంగా వస్తున్నామని, పిల్ల నచ్చిందని, తాంబూలాలు పుచ్చుకుందాం అని గురుమూర్తి దంపతులకు కబురు చేశారు. ఇంకా పెళ్లి చూపులేంటి ముహూర్తాలు పెట్టించేసేయచ్చు కదా అనుకున్నాడు శరత్‌.

‘మీరిద్దరూ ఏమన్నా మాట్లాడుకుంటారా?’ అడిగాడు గురుమూర్తి. శరత్‌ హారిక వైపు చూశాడు. ఆమె చిరునవ్వుతో చూసింది. వాళ్ళ చూపుల్లో భావం గమనించిన పెద్దలు ఇద్దరినీ బ్యాక్‌యార్డ్‌లో ఉన్న చెట్ల వైపు పంపించారు. ఇద్దరూ అలా నడుస్తూ సంపంగి చెట్టు దగ్గరకు వెళ్లారు. అక్కడ రెండు కేన్‌ కుర్చీలున్నాయి. కొద్దిసేపు ఇద్దరికీ మాటలు రాలేదు. ముందు హారికే మాట్లాడింది. ‘ఏమన్నా అడగాలను కుంటున్నారా?’ శరత్‌ తల ఊపి ‘మీకు ఓకే నా’ అన్నాడు.

‘ఓకే కాదంటే మీరు ఏమన్నా అనుకుంటారా?’

ఆమె వైపు సూటిగా చూశాడు. అతని కళ్ళల్లో రెపరెపలాడిన సన్నటి బాధ గమనించిన హారిక నవ్వు దాచుకుంటూ ‘ఓకే’ అంది.

‘థాంక్స్‌’ అన్నాడు.

‘ఇంకా ఏమన్నా?’ అంది.

‘మీరు ఏమీ అనుకోకపోతే రేపు ఆఫీస్‌ అయ్యాక కాసేపు కలుద్దామా ?’ అడిగాడు.

‘ష్యూర్‌’ అంది.

ఇద్దరు లోపలికి వచ్చేసారు. వాళ్ళ కళ్ళల్లోని ఆనందం, అంగీకారం చూసిన పెద్దలు తాంబూలాలు పుచ్చుకుని సంబంధం సెటిల్‌ చేసుకున్నారు. ‘పది రోజుల్లో ఎంగేజ్‌మెంట్‌ ఏర్పాటు చేస్తాను. మీరు ఎక్కడ అంటే అక్కడే. ఏదన్నా స్టార్‌ ¬టల్లో చేయమంటారా ?’ అడిగాడు గురుమూర్తి. ‘ఎందు కండీ ఛట్నిస్‌లో చేయండి’ అన్నాడు సూర్య నారాయణ.

‘మీ అబ్బాయికి ఓకేనా’ అడిగాడు గురుమూర్తి.

ఇప్పుడు శరత్‌కి ఎంత తొందరగా హారిక తన జీవితంలోకి వస్తుందా ? అనే ఆలోచన తప్ప మరో ఆలోచన లేకపోవడంతో యాంత్రికంగా సరే అన్నాడు. నోరు తీపి చేసుకుని బయలుదేరి వచ్చేశారు సూర్యనారాయణ కుటుంబం. ‘బావగారికి గుడ్‌న్యూస్‌ చెప్పేస్తున్నారా’ అంది వాసవి మొబైల్‌ తీసుకుని. నవ్వాడు శరత్‌.

‘మొత్తానికి వీడి పెళ్లి అవుతోంది. నాకు దండిగా కానుకలు ఇవ్వాలిరోయ్‌’ అంది వాసవి.

‘నీకన్నానా అక్కా’ అన్నాడు.

ఆ రాత్రి అక్కను కొండాపూర్‌లో ఉన్న వాళ్ళ ఇంట్లో దింపి వచ్చి హారిక గురించిన తీయని తలపులతో పడుకున్నాడు. కలలో హారికే, మదిలో హరికే అయిపోయింది.

మర్నాడు ఉదయమే ఫోన్‌ చేసి ఆఫీస్‌ అవగానే కాఫీక్లబ్‌లో కలుసుకుందాం అని చెప్పాడు. హారిక సరే అంది. సాయంత్రం హారికకు ఏదో మీటింగ్‌ ఉండడంతో ఆమె శరత్‌ పని చేస్తున్న డెల్‌ కంపెనీ దగ్గరకు రావడానికి ఏడు అయింది. అయితే అనుకోకుండా శరత్‌కి కూడా లేట్‌ అవడంతో ఇద్దరూ ఏడింటికి ఆఫీసుల్లోంచి బయటికి వచ్చారు. అక్కడికి దగ్గరలో ఉన్న కాఫీక్లబ్‌లో కూర్చుని ఓ గంటసేపు కబుర్లు చెప్పకుని, మళ్ళీ వీలైతే మర్నాడు కలవాలని అనుకుని ఎవరి బండి మీద వాళ్ళు బయలు దేరారు.

కానీ.. కానీ.. తెల్లవారేసరికి ఇంత ఘోరం జరుగుతుందని ఊహించాడా? ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకున్నాడా ?

రోజూ టివిలో ఇలాంటి వార్తలు వింటూనే ఉన్నాడు. కానీ ఇవాళ అదే వార్త ఇలా తనకు సంబంధించిన వాళ్ళకు జరిగందని వినాల్సి రావడం ఎంత దురదష్టం. ఏంటి ఈ దౌర్భాగ్యం.. అసలు ఎలా జరిగింది.. శరత్‌ మెదడంతా ప్రశ్నలతో బరువెక్కింది. సూర్యనారాయణ, శారద చేష్టలుడిగి, మతిపోయిన వాళ్ళలా కూర్చున్నారు. కుదరక కుదరక వాడికి సంబంధం కుదరడం ఏంటి? కుదిరిన వెంటనే ఇలాంటి ఘోరం జరగడం ఏంటి? ఆవిడకు ఏమీ అర్థం కావడం లేదు. అసలే ఏం జరిగినా చిలవలు, పలవలతో బాధిత కుటుంబాలను బజారుకీడ్చే మీడియా ఉంది. ఈ విషయం బయటికి పొక్కిందంటే వాళ్లతో పాటు తమ కుటుంబం కూడా బజూరు కెక్కినట్టే. కాకపోతే అటు న్యూస్‌ పేపర్‌లో కానీ, టివి ఛానెల్‌లో కానీ సంఘటన జరిగినట్టు చెప్పారు. కానీ ఎవరి పేర్లు బయట పెట్టలేదు. అంటే వాళ్ళు జాగ్రత్త తీసుకున్నారన్నమాట అనుకున్నారు భార్యాభర్తలు. కానీ కొన్ని వార్తలు ఎంత దాచినా దాగవు. ఎలా వెళ్తాయో వెళ్ళిపోతాయి.

వాసవి ఫోన్‌ చేసి ‘నేను విన్నది నిజమేనా ?’ అని అడిగింది.

‘నువ్వు విన్నదే మేమూ విన్నాం. నిజమనేగా’ అంది శారద.

‘అసలు ఎలా జరిగిందట. మీరు వెళ్లి పలకరించారా ? లేదా ?’ అడిగింది వాసవి.

‘ఏమని పలకరించమంటావు. మీ అమ్మాయి మీద అఘాయిత్యం జరిగిందట కదా నిజమేనా ? అని అడిగి బాధపడుతున్న వాళ్ళని ఇంకా బాధ పెట్టి రమ్మంటావా? లేక కోర్టులోనో, పోలీస్‌ స్టేషన్‌లోనే అడిగినట్టు ఎలా జరిగింది? ఎవరు చేసారు? అని అడగమంటావా? అయిందేదో అయింది. మనకింక ఏం సంబంధం వాళ్లతో’ అంటున్న శారదతో విస్మయంగా అంది వాసవి ‘అదేంటమ్మా సంబంధం కాన్సిల్‌ చేస్తావా’ అని.

‘కాక ఇంత జరిగాక ఈ సంబంధం చేసుకుని పరువు పోగొట్టుకోమంటావా’ వాసవికి చాలా బాధ అనిపించింది. ‘శరత్‌ కూడా ఇదే అన్నాడా ?’ అని అడిగింది.

‘ఇంకేమంటాడే. అయినా వాడు అనడానికి ఏం ఉంది? ఎవరు మాత్రం చేసుకుంటారు ఆ పిల్లని ?’ వాసవి తల్లి మాటలకి అసహనంగా ఫోన్‌ డిస్‌కనెక్ట్‌ చేసి శరత్‌కి చేసింది. అతను లిఫ్ట్‌ చేయకపోడంతో ‘తమ్ముడూ జరిగింది విన్నాను. ఈ సమయంలో ఆ అమ్మాయికి నీ ఓదార్పు చాలా అవసరం. అమ్మ మాటల్ని బట్టి మీరెవరు ఇంతవరకు వాళ్ళని పరామర్శించడానికి వెళ్లలేదని తెలిసింది. చాలా తప్ప చేశారు. చదువుకున్న వాడివి. నీకు వేరే చెప్పే అవసరం లేదు. వెంటనే వెళ్లి వాళ్ళకి మోరల్‌ సపోర్ట్‌ ఇవ్వు’ అంటూ వాట్సాప్‌ మెసేజ్‌ పెట్టింది.

అది చూసాక కానీ శరత్‌కి ఆ క్షణంలో హారికను కానీ ఆమె తల్లి తండ్రులను కానీ పలకరించాలని, ధైర్యం చెప్పాలన్న ధ్యాస రాలేదు. తప్పు చేసానా? వెళ్ళాల్సిందేమో అనుకున్నాడు. కానీ వెళ్ళడానికి మనస్కరించలేదు. హారికను ఎలా చూడగలడు. రెండు రోజుల క్రితం తన ఊహల్లో కవ్వించి కలవర పెట్టిన ఆ అందాల సుందరి ఇప్పుడు ఎందుకిలా అంటరాని దానిలా అనిపిస్తోంది? ఆమెని చూడడానికి కూడా మనసు అంగీకరించడం లేదు.

నాలుగు రోజుల తరవాత సంబంధం కుదిర్చిన శాస్త్రిగారు వచ్చారు. అప్పుడు శరత్‌ కూడా ఇంట్లోనే ఉన్నాడు. మనసు బాగోలేక ఆఫీస్‌ నుంచి త్వరగా వచ్చాడు. తన గదిలో పడుకుని ఉన్నాడు.

‘జరిగిన ఘోరం మీకు తెలుసు కదా ? మీరు కనీసం ఒక్కసారి కూడా రాలేదని, ఫోన్‌ కూడా చేయలేదని వాళ్లు చాలా బాధపడుతున్నారు. ఆ అమ్మాయి సంగతి వేరే చెప్పే పనిలేదు. దుఃఖంతో కృశించిపోయింది. ఆఫీస్‌కి కూడా వెళ్ళడం లేదు. గదిలోంచి బయటకి రావడం లేదు. కనీసం మానవత్వంతో అయినా మీరు ఒక్కసారి పలక రించండి పెద్ద మనసుతో ఆ అమ్మాయిని. ఆమె కావాలని చేసిన నేరం కాదు కదా’ అన్నాడు.

‘అసలు అంతలోనే ఇంత దారుణం ఎలా జరిగింది?’ అడిగాడు సూర్యనారాయణ.

‘ఆరోజు మీ అబ్బాయినే కలిసి ఎనిమిది, ఎనిమిదిన్నరకి బండిమీద ఇంటికి బయలు దేరిందట. జూబ్లీ చెక్‌ పోస్ట్‌దగ్గరకి వచ్చేసరికి విపరీతమైన ట్రాఫిక్‌ ఆగిపోయి కనిపించి, తను అంతకుముందు ఎప్పుడో తెలుసుకున్న దారిలో సిగ్నల్స్‌ ఉండవని గుర్తొచ్చి బండి అటు తిప్పిందట. ఎందుకోగాని దారి మర్చిపోయి ఏటేటో వెళ్ళిందట. ఆ దారి మళ్ళి వెనక్కి అంబేద్కర్‌ యూనివర్సిటి వైపు వెళ్ళడం, అక్కడ నిర్మానుష్యంగా ఉండడం, ఎవరో ఇద్దరు కనిపిస్తే బండి ఆపి దారి అడిగిందట. అంతే అప్పటికే పీకలదాకా తాగి ఉన్న ఆ వెధవలు’ ఆయన స్వరం దుఃఖంతో వణికింది. ‘కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. పోలీసు వాన్‌ రావడం రోడ్డుమీద అపస్మారకంగా పడి ఉన్న ఈ అమ్మాయిని ఇంటికి చేర్చడం జరిగింది. వాళ్ళు కేసు రాసుకున్నారు పరువన్నా మిగలాలని, గురుమూర్తి ఈ సంఘటన విషయమై అనవసరంగా మీడియాతో చర్చించవద్దని పోలీస్‌ వాళ్ళని వేడుకున్నారు’

ఫెళఫెళా పెద్ద కొండచరియలు విరిగిపడు తున్నట్టుగా అనిపించి పడుకున్నవాడు గభాల్న లేచి కూర్చున్నాడు శరత్‌. అంటే.. అంటే.. తనని కలిసి వెళ్ళాక జరిగిందా.. ఎంత పని జరిగింది.. దారుణం.. అయినా దారి మర్చిపోతే తనకి ఒక్కసారి ఫోన్‌ చేయచ్చుగా.. అసలు దారి మర్చిపోడం ఏంటి? తనని కలిసి వెళ్ళాక. తనుకూడా ఆ రాత్రంతా ఆమె గురించిన తీయని తలపులతో పెరుగన్నం తినకుండా చేయి కడుక్కోవడం గుర్తొచ్చింది. మైగాడ్‌.. మెదడు మొద్దుబారినట్టుగా చలనం లేకుండా చేష్టలుడిగి కూర్చున్నాడు.

‘మనం తప్పు చేస్తున్నాం శారదా. బంధుత్వం సంగతి ఎలా ఉన్నా ఒక్కసారి వెళ్లి పలకరించి రావల్సిందేమో’ అన్నాడు సూర్యనారాయణ. ‘వెళ్లి ఏం మాట్లాడతాం చెప్పండి. మనకి సానుభూతి ఉంది. బాధ ఉంది. కానీ ఏం చేయగలం. మన పిల్లవాడి జీవితం చూస్తూ, చూస్తూ పాడుచేయలేం కదా’ అంది శారద నిట్టురుస్తూ.

‘సంబంధం కాన్సిల్‌ అని వాడు చెప్పాడా’ అడిగాడు సూర్యనారాయణ.

‘చెప్పాలా ఇంత జరిగాక ఆ అమ్మాయిని ఎలా చేసుకుంటాడు?’ సీరియస్‌గా అంది శారద.

ఆయన సమాధానం చెప్పలేదు. కానీ మనసులో ముళ్ళు గుచ్చుకున్నట్టు అనిపించింది. పాపం ఆ అమ్మాయి బతుకు ఇంతేనా. చేయని నేరానికి జీవితాంతం శిక్ష అనుభవించ వలసిందేనా..?

శరత్‌ గుండె మీద సమ్మెట పోట్లు తగులు తున్నట్టుగా ఉన్నాయి వాళ్ళ మాటలు. నిశ్చింతగా సాగిపోతున్న తన జీవిత ప్రయాణం ఎవరో పగతో అల్లకల్లోలం చేసినట్టు అనిపిస్తోంది.

లేకపోతే ఎవరూ నచ్చని తనకి హారిక మొదటి చూపులోనే నచ్చడం ఏంటి? పెళ్లి చూపుల రోజే నిశ్చితార్ధం జరగడం ఏంటి? నిశ్చితార్థం అయి, అందమైన భవిష్యత్తు గురించి తీయని కలల్లో తేలిపోతున్న క్షణంలో పీడకల లాంటి ఇన్సిడెంట్‌ ఏంటి? ఎవరికీ తనమీద ఇంత పగ? తాను ఎవరికీ ఏమీ అపకారం చేయలేదే. ఒక అపురూపమైన బహుమతి ఇచ్చినట్టే ఇచ్చి దాన్ని తను కనీసం కళ్లారా పూర్తిగా చూసుకోకుండానే లాగేసుకున్నాడు దేవుడు. ఎంత నిర్ధయుడు. ఇక ఈ బతుకులో సంతోషం, ఆనందం అనేవి శాశ్వతంగా తుడిచి పెట్టుకు పోయినట్టే. తలగడలో మొహం దాచుకున్నాడు శరత్‌.

మరో పది రోజులు గడిచాయి. హారిక దగ్గర నుంచి కానీ, వాళ్ళ పేరెంట్స్‌ దగ్గర నుంచి కానీ ఎలాంటి సమాచారం అందలేదు. శరత్‌ పూర్తిగా నీరసించాడు. తిండి సరిగా తినడం లేదు. తల్లి దండ్రులు అతని స్థితి చూస్తూ ఏమీ చేయలేక పోతున్నారు.

ఆ రోజు ఆఫీసుకి వెళ్ళిన శరత్‌ స్టాఫ్‌ అంతా గుంపుగా నిలబడి ఏదో చర్చించుకోడం గమనించాడు. ఎప్పుడూ ఎవరి సీట్లో వాళ్ళు కూర్చుని నిశ్శబ్దంగా పనిచేసుకుంటూ ఉండే వాళ్ళంతా గుంపుగా నిలబడి సీరియస్‌గా ఉన్నారు. అందరి మొహాల్లో ఆందోళన కనపడుతోంది. ఏం జరిగి ఉంటుందా అనుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ‘ఏమైంది’ అని అడిగాడు శరత్‌.

‘ఒక కొలీగ్‌ శిల్ప సూసైడ్‌ చేసుకుంది. పేపర్‌ చూడలేదా ?’ చెప్పాడు రేవంత్‌.

‘వాట్‌?’ అదిరిపడి చూశాడు ‘ఎందుకు ? ఏం జరిగింది ?’

‘రేప్‌… రాత్రి లేట్‌ అయిందట ఆఫీసులో క్యాబ్‌ వాడే దారి మళ్ళించి, మరో ఇద్దరితో కలిసి’

‘స్టాప్‌’ గట్టిగా అరిచాడు శరత్‌.

అతని కాళ్ళు, చేతులు వణికిపోసాగాయి. ఎంతో డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ గర్ల్‌ అని పేరు తెచ్చుకున్న శిల్ప ఆత్మహత్య చేసుకుందా ? అయ్యో భగవంతుడా ఈ అమ్మాయిల మీద ఎందుకింత పగ నీకు. పది రోజులు కాలేదు మరో అమ్మాయి అసాంఘిక శక్తులకు బలైపోయింది. ధైర్యవంతురాలు అయిన శిల్పనే ఆత్మహత్య చేసుకుంటే పాపం హారిక.. నో.. మిత్రులు పిలుస్తున్నా వినకుండా మెరుపు వేగంతో పరిగెత్తాడు శరత్‌.

నేరుగా బండి హారిక ఇంటికి పోనిచ్చాడు. కాలింగ్‌బెల్‌ నొక్కేసరికి పని పిల్ల కాబోలు వచ్చి తలుపు తీసింది. అతన్ని చూడగానే గురుమూర్తి కళ్ళల్లో కాంతి ‘రండి బాబు బాగున్నారా ?’ అంటూ అదే ఆప్యాయతతో ఆ రోజు పెళ్ళి చూపులకి వచ్చి నపుడు ఎలా ఆహ్వానించాడో అలాగే ఆహ్వానించాడు. ఇల్లంతా స్మశాన నిశ్శబ్దం ఆవరించి ఉంది.

ముందు తప్పు చేసినవాడిలా గిల్టీగా మాట్లాడలేక పోయినా మెల్లిగా అడిగాడు ‘హా.. హారిక..’

‘…’

‘బతికే ఉంది బాబు చావలేక’

‘అలా అనకండి. ఒక్కసారి పిలుస్తారా?’

‘అలాగే’ అని లోపలికి వెళ్ళాడాయన.

శరత్‌కి ఆ ఇంటి వాతావరణం, ఆ నిశ్శబ్దం చూస్తుంటే భయం వేసింది. హారిక తనని చూసి ఎలా రియాక్ట్‌ అవుతుందో అనుకుంటూ ఉద్విగ్నంగా కూర్చున్నాడు.

హారిక గది కర్టెన్‌ కదిలింది. పల్చటి పాదం మీద లేత రంగు షిఫాన్‌ చీర కుచ్చిళ్ళు.. శరత్‌ గుండె దడ దడ లాడింది.. హారిక వచ్చి అతని ఎదురుగా సోఫాలో తప్పు చేసిన దానిలా తలవంచుకుని కూర్చుంది.

ఏం మాట్లాడాలో శరత్‌కి అర్థం కాలేదు. ఆమె వైపు చూసాడు. ఒళ్ళో పెట్టుకున్న ఆమె చేతుల మీద కన్నీళ్ళు జల జల రాలుతున్నాయి. ఎద ఎగసిపడు తోంది. నిశ్శబ్దంగా కుమిలి కుమిలి ఏడుస్తోంది.

శరత్‌ హృదయం ద్రవించిపోయింది. ఏమిటి ఈ శిక్ష ? అనుకున్నాడు.

‘ఏమన్నా తెలిసిందా ? నేరస్తులని పట్టుకున్నారా ?’ అడగాలనుకున్నాడు కానీ గొంతు పెగిలి మాట రాలేదు..

దుఃఖంతో, బాధతో గుండె బరువుగా అనిపించింది. హారిక ఆ రోజు చూసినట్టే ఉంది. కాకపోతే ఆ చిరునవ్వు.. ఆ కాంతి.. ఆ ఆనందం.. ఆ చిలిపితనం.. ఏమి లేవు. ఆమె మీద జరిగిన అత్యాచారం వలన ఆమె కళ్ళు, ముక్కు, నోరు మనిషి మొత్తం మామూలుగానే ఉంది. మరి ఎందుకు అందరు చెడిపోయింది అంటారు. ఏమి చెడిపోలేదు. ఒక మామూలు చీరలో నుదుట చిన్న స్టిక్కర్‌తో నిరాడంబరంగా ఉంది. అలంకరణకి అర్హురాలు కానట్టుగా ఉంది.

గురుమూర్తి చేతిలో కాఫీ గ్లాస్‌తో వచ్చాడు. ‘తీసుకోండి’ అంటూ శరత్‌కి అందించాడు. శరత్‌ దాన్ని టేబుల్‌ మీద పెట్టాడు. ఈ మర్యాదలు అవసరమా? ఇది అతిథి మర్యాదల సమయమా ? కాని ఆయన సంస్కారం.

‘అన్యాయంగా నా కూతురుని చెడ గొట్టి దాని జీవితం నాశనం చేసారు. వాళ్లు ఎవరో ? ఏమిటో? ఇంతవరకు పోలీసులు తెలుసుకోలేదు. మేము ఎందుకు బతికి ఉన్నామో కూడా అర్థం కావడం లేదు’ అన్నాడు ఏడుస్తూ.

‘అలా అనకండి’ గొంతు పెగల్చుకుని అన్నాడు శరత్‌.

‘మీరు ఇప్పుడన్నా వచ్చారు చాలా సంతోషం బాబు. మీ వాళ్ళు బాగున్నారా’

ఆ పరామర్శకి సిగ్గుతో చచ్చిపోతున్నట్టు అనిపించింది శరత్‌కి.

‘మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని సుఖంగా ఉండండి బాబూ. అయిపొయింది.. మా ఇంట్లో ఇక శుభకార్యం ఆశ లేదు’ ఆయన అక్కడినుంచి లేచి వెళ్తూ హారిక దగ్గరికి వెళ్లి ‘రామ్మా’ అంటూ చేయి అందించాడు. హారిక లేచి వెళ్లి పోయింది. ఒక్క మాట, ఒక్క చూపు ఏమి లేదు.

శరత్‌ ఒక్క క్షణం కూడా కూర్చోలేకపోయాడు. అక్కడినుంచి లేచి వచ్చేసాడు. ఇంటికి వెళ్ళాలనిపించ లేదు. ఎటు వెళ్లాలో, ఎం చేయాలో తోచలేదు. శోక మూర్తిలా కూర్చున్న హారిక రూపం కలవరపెడు తోంది. తను అమానుషంగా ప్రవర్తిస్తున్నాడా? ఆమె చేయని తప్పుకి ఆమెని దోషిగా చూస్తున్నాడా? ఇదేనా నీ సంస్కారం? అంతరాత్మ నిలదీసినట్టు అనిపించ సాగింది. సాయంత్రం వరకూ అటు, ఇటూ తిరిగి ఇంటికి వచ్చాడు.

కానీ ఒక దగ్గర కుర్చోలేకపోయాడు. టి.వి. ఆన్‌ చేసాడు. ఏ ఛానల్‌ తిప్పినా దేని మీద మనసు నిలవడం లేదు. ఒక ఛానెల్‌లో రామాయణం సీరియల్‌ వస్తోంది. విశ్వామిత్రుడి వెంట రాముడు, లక్ష్మణుడు యాగ రక్షణకోసం వెళ్తున్నారు. రాముడి పాద ధూళి తగిలి రాయి స్త్రీగా మారింది. ఆమె అహల్య. ఇంద్రుడి కామవాంఛకి బలై, భర్త శాపానికి గురై రాముడి పాదధూళితో శాపవిమోచనం పొందింది అహల్య. శరత్‌ రిమోట్‌ విసిరేసి లోపలికి వెళ్ళిపోయాడు. బట్టలు మార్చుకోకుండానే మంచం మీద వాలాడు. పడుకోవాలనిపించలేదు. పిచ్చెక్కి పోతోంది. శోకమూర్తిలా ఉన్న హారిక కళ్ళముందు నుంచి పోవడంలేదు. కనీసం తనని తలెత్తి చూడలేదు. రమ్మని పిలవగానే వచ్చింది. వెళ్దాం అనగానే వెళ్ళిపోయింది. ఆయన ఉదాత్తుడు ! ఒక్కమాట అనలేదు. పైగా మర్యాదగా కాఫీ తెచ్చిచ్చాడు. హారిక ఇంట్లో నుంచి కదలడం లేదా…! ఆమె భవిష్యత్తు ఎంత ప్రశ్నార్థకం ! ఆమెకి ఉద్యోగం ప్రస్తుత పరిస్థితిలో ఎంతో అవసరం.

తల్లి భోజనానికి పిలిచినా వెళ్ళలేదు. పిచ్చివాడిలా ఆలోచిస్తూ ఉండిపోయిన కొడుకు దగ్గరకు వచ్చి బతిమాలుతూ ‘జరిగింది మర్చిపో నాన్న. నీకు ప్రాప్తం లేదనుకో. మీ ఇద్దరికీ రాసిపెట్టి లేదనుకో. అసలు మనం అప్పటికప్పుడు తొందరపడి తాంబూలాలు తీసుకోకుంటే బాగుండేది. ముహూర్తం చూడకుండా అలా తీసుకున్నందుకే ఇలా అయిందేమో’ అంది శారద. శరత్‌ ఏం మాట్లాడ లేదు.

అలాగే రాత్రంతా వ్యాకులంగా గడిపిన శరత్‌ తెల్లవారుజామున నిద్రపోయాడు. కాని ఒక భయంకరమైన కల అతడిని నిద్రపోనివ్వలేదు. ఉరి వేసుకున్న శిల్ప ఫ్యాన్‌కి వేలాడుతూ కనిపించింది. గబుక్కున వెళ్లి ఆమెని కిందకి దింపాడు. అయితే అది శిల్ప కాదు. హారిక. అదిరిపడి లేచాడు.

టైం ఆరు కావస్తోంది. గదిలోంచి బయటికి వచ్చాడు. ఎవరూ లేవలేదు. బాత్రూంలోకి వెళ్లి కాలకత్యాలు తీర్చుకుని స్నానం చేశాడు. బీరువా దగ్గరకి వెళ్లి కొత్త డ్రెస్‌ తీసుకున్నాడు. నీట్‌గా తయారై కీస్‌ తీసుకుని బయటికి వెళ్ళి కారు స్టార్ట్‌ చేసాడు.

శరత్‌ కారు గురుమూర్తి ఇంటిముందు ఆగింది. వేగంగా లోపలికి వెళ్ళాడు. తలుపు తీసే ఉంది. పనమ్మాయి మాబ్‌ చేస్తోంది. అతన్ని చూడగానే లోపలికి పరిగెత్తి గురుమూర్తిని తీసుకొచ్చింది. ఉదయాన్నే వచ్చిన శరత్‌ని ఆశ్చర్యంగా చూసాడు.

‘అంకుల్‌ హారికను బయటకి తీసుకువెళ్తాను పర్మిషన్‌ ఇస్తారా’ అన్నాడు శరత్‌ నిబ్బరంగా.

‘ఎందుకు బాబు ? ఎక్కడికి?’ అడిగాడు అయన.

‘ఒక్క అరగంట చాలు. నన్ను నమ్మండి ప్లీజ్‌’ అన్నాడు.

ఆయన ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్లి హారికకు విషయం చెప్పాడు. అప్పటికే నిద్ర లేచి స్నానం చేసి మెడిటేషన్‌ చేసుకుంటున్న హారిక ఆశ్చర్యంగా అడిగింది.

‘ఎందుకు నాన్న. ఇంత పొద్దున్నే’

‘తెలియదమ్మా.. వెళ్లిరా.. ఏదన్నా చెప్పాలను కుంటున్నాడేమో’ అన్నాడు ఆశగా.

‘కానీ’ సంశయంగా ఏదో అనబోతున్న హారికను ఆపి ‘అతను మంచివాడు. నాకు నమ్మకం ఉంది. అరగంట పర్మిషన్‌ అడిగాడు వెళ్లిరామ్మా’ అన్నాడు.

హారిక తలవంచుకుని గదిలోంచి బయటికి వచ్చింది. లేత రంగు క్రేప్‌ చీర చిన్న స్టిక్కర్‌, విషాదం ముర్తిభవించి ఉన్న ఆమెని చూడలేక చూపు తిప్పుకుని ‘థాంక్స్‌ అంకుల్‌’ అని చెప్పి బయటికి నడిచాడు. హారిక తండ్రి వైపు చూసింది. వెళ్ళమన్నట్టు సైగ చేసాడు. హారిక కదిలింది. కారులో ఇద్దరు మాట్లాడు కోలేదు ఎవరికీ వారే ఆలోచనల్లో మౌనంగా ఉండిపోయారు. ఎక్కడికి తీసుకెళ్తున్నాడో అర్థం కాలేదు ఆమెకు. కారు చిక్కడపల్లి వెంకటేశ్వరస్వామి గుడి ముందు ఆగింది. తను దిగి ఆమె కూర్చున్న వైపు డోర్‌ తిసిపట్టుకుని ‘దిగు హారిక’ అన్నాడు.

అయోమయంగా చూస్తూ దిగిందామె. శరత్‌ రెండు పూల దండలు, కొబ్బరికాయ, కర్పూరం, అరటిపళ్ళు కొన్నాడు. కౌంటర్‌లో అభిషేకం టికెట్టు కొన్నాడు. ఆమె చేయి అందుకుని లోపలికి నడిచాడు. అప్పటికే కొందరు భక్తులు గోవింద నామాలు చదువుతున్నారు. అర్చకులు మంత్రాలు చదువు తున్నారు. ప్రసాదాలు తయారు చేస్తున్న కమ్మటి వాసనలు వస్తున్నాయి. ఆంజనేయస్వామికి దణ్ణం పెట్టుకుని, ఎడమ పక్కనున్న అరుగు మీద కూర్చున్నాడు శరత్‌. హారిక మంత్రించిన దానిలా అతన్ని అనుసరించింది.

‘హారికా నన్ను క్షమించు. జరిగిన దారుణమైన సంఘటన దెబ్బ నుంచి కోలుకోడానికి నాకు చాలా సమయం పట్టింది. నిన్ను ఈ దేవాలయంలో స్వామి సాక్షిగా భార్యగా స్వీకరిస్తున్నాను. నీకు ఏదన్నా అభ్యంతరం ఉంటే చెప్పు’ గొంతు సవరించుకుని మార్దవంగా అన్నాడు శరత్‌.

హారిక నిశ్చేష్టురాలై చూసింది. ఆమె కళ్ళు నీటితో నిండాయి. రెండు చేతి వేళ్ళు నోటికి అడ్డం పెట్టుకుని వెక్కిళ్ళు ఆపుకోడానికి ప్రయత్నిస్తూ ‘ఈ అపవిత్రు రాలిని’ అంది ఏడుపు అడ్డం పడగా.

‘హరికా రోజు ఈ గుడికి ఎంతో మంది వస్తుంటారు, వెళ్తుంటారు. అందులో ఉత్తములు ఉంటారు, పాపాత్ములు ఉంటారు. ఎవరు వచ్చినా, ఎవరు ఆ స్వామిని తమ చేతితో కానీ, చూపులతో స్పశించినా ఆయనకి మాలిన్యం అంటదు. ఒకవేళ అంటినా మరునాడు అర్చకుడు వేద మంత్రాలు చదువుతూ విగ్రహాన్ని శుద్ధి చేస్తాడు. నీకు అంటిన మాలిన్యం ఆ మంత్రాలు వింటే పోతుంది. ఆ మంత్రాలు విను. భక్తులు పాడుతున్న గోవింద నామాలు విను. ఇప్పుడు స్వామికి అభిషేకం చేసి ఆ జలం మన మీద చల్లుతారు పూజారిగారు. ఆ జలంతో నువ్వు, నీ తప్పు లేదని తెలిసినా నిన్ను కనీసం ఓదార్చడానికి కూడా రాని పాపిని నేను కూడా పవిత్రులం అవుతాము. ఈ దండలు మార్చుకుని స్వామి దీవెనలతో కొత్త జీవితం ప్రారంబిద్ధాం. మన జీవితాలకు పట్టిన గ్రహణానికి ఇదే సంప్రోక్షణ. చెప్పు హారిక నీకు ఇష్టమేనా ?’

దుఃఖం గొంతుకి అడ్డు పడుతుంటే రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్న హారిక చేతులు పట్టుకుని స్వామి సన్నిధికి బయలుదేరాడు శరత్‌.

– అత్తలూరి విజయలక్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *