సంకష్టహర చతుర్థి

సంకష్టహర చతుర్థి

కలియుగంలో వెంటనే అనుగ్రహించే దేవతలు దుర్గ, గణపతి మాత్రమే అని శాస్త్రవచనం. గణేశునికి సంబంధించిన ఉపాసన, సాధన, సాహిత్యం, మంత్ర, తంత్ర విధానాలు, అన్ని ‘గాణాపత్యం’ అనే పేరుతో ప్రసిద్ధమయ్యాయి.

గణపతిని పూజించకుండా ఏ కార్యాన్ని తలపెట్టం. అక్షర గణపాలకుడు, వేదపురోహితుడు, అభీష్టసిద్ధి ప్రదాయకుడు, విఘ్నములను తొలగించే ప్రణవ స్వరూపుడే ఈ మహాగణపతి.

మన కోరికలు నెరవేర్చుకొనుటకు మనం వివిధ దేవతలనకు పూజిస్తాం. అయితే ఏ దేవతను ఆరాధించవలెనన్నా మొదట ఈ మోదక ప్రియుడైన గణపతిని తప్పక పూజించాలి.

వ్రతం :

చవితి తిథి గణపతికి ఎంతో ప్రీతి పాత్రమైనది. కారణం వినాయకుడు ఆ తిథియందే జన్మించాడు కనుక. అటువంటి గణపతిని పూజించి ఆయన అనుగ్రహానికి పాత్రులగుటకు మనం ఆచరించే వాటిలో ముఖ్యమైనది సంకష్ట హరచతుర్థి వ్రతం. ఈ వ్రతాన్ని మన రాష్ట్రాల్లో అంతగా ఆచరించడం లేదు. కాని ఉత్తరాది రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా ఆచరిస్తున్నారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడ ఈ వత్రాన్ని చాలామంది ఆచరిస్తారు.

ఈ వ్రతాన్ని ప్రతి మాసంలో కృష్ణపక్షం (బహుళపక్షం)లో చవితి తిథి రోజున చేసుకోవాలి. అంటే పౌర్ణమి వెళ్ళిన చవితి రోజున ఉదయాన్నే ఆచరించాలి. ఆనాటి ప్రదోష కాలానికి లేదా చంద్రోదయ సమయానికి చవితి తిథి ఉండాలి. ఒకవేళ రెండు రోజు ల్లోను ప్రదోషకాలంలో చవితి తిథి ఉన్నట్లయితే రెండవ రోజున ఉన్న చవితి రోజునే ఈ వ్రతం చేసుకోవాలి. ‘సంకష్టహర చతుర్థి మహాగణపతి పూజ’ అనే పుస్తకంలో ఈ వ్రతానికి సంబంధించిన పుజావిధానాన్ని గురించి చక్కగా వివరించారు. దానిని అనుసరించవచ్చు. లేదా పరోహితుని సహాయంతో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు.

ఈ వ్రతం ఆచరించే నాడు ఉపవాసం ఉండాలి. ఆరోజు సాయంత్రం వినాయకుడిని షోడశోపచారము లతో పూజించి ఉండ్రాళ్ళు, లడ్డు, బెల్లం, మొదలైన పదార్థాలు నివేదించాలి. 21 ఉండ్రాళ్లు నివేదన చేయాలి. ప్రధానంగా మాఘ బహుళ మంగళవారం చవితినాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి. శ్రావణ బహుళ చతుర్థి సాయంకాలం ఆచరించినా మంచిదే. ఈ వ్రతం చేసుకోవడం వలన కోరిన కోర్కెలు సిద్ధిస్తాయి. వివాహాం కాని స్త్రీ, పురుషులు, సంతానం లేని దంపతులు, నిరుద్యోగులు, చదువులో వెనుకబడిన వారు, ఉద్యోగంలో స్థిరత్వం లేని వారు, ఈ వ్రతాన్ని ఆచరిస్తే తప్పకుండా సత్ఫలితాలు పొందుతారు. ఈ వ్రతం ఆచరించిన తర్వాత పూజానంతరం వ్రతకథను చదివి అక్షింతలు స్వామి వారికి కొన్ని వేసి మిగిలినవి స్వామి ఆశీర్వచన అక్షింతలుగా భావించి శిరస్సున ధరించాలి. తోరణపూజ చేసి తోరణాన్ని ధరించాలి. తరువాత ‘ఓం గంగణపతియే నమః’ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మంచిది. వ్రతం చేసుకున్న వారు వ్రతానంతరం తమ శక్తి, సామర్థ్యాలను బట్టి ముత్తయిదువులకు లేదా బ్రాహ్మణులకు దానం చేస్తే మంచిది.

మహాభారతంలో ధర్మరాజు ఈ వ్రతాన్ని ఆచరించి యుద్ధంలో శత్రువులను సంహరించి రాజ్యాన్ని పొందెనట. దమయంతీ దేవి ఈ వ్రతం ఆచరించి భర్తయైన నలచక్రవర్తిని చేరి సుఖంగా ఉంన్నది. మొదటగా పార్వతీదేవి పరమేశ్వరుని ఆజ్ఞతో ఈ వ్రతాన్ని ఆచరించిందని పురాణం చెబుతుంది. రుక్మిణీ దేవి తన కుమారుడైన ప్రద్యుమ్నుడు దూరమైతే లోమశ ముని ఆదేశానుసారం ఈ వ్రతమాచరించి తన పుత్ర వియోగాన్ని ఎడబాసిందట. కార్త వీర్యార్జునుడు ఈ వ్రతాన్ని ఆచరించి అనంతశక్తిని సంపాదించి శత్రువులను జయించాడని ఈ వ్రత ప్రాధాన్యతను శౌనకాది మహామునులకు సూతుడు వివరించాడని పురాణ వాక్యం.

ఆర్థికశక్తి గలవారు గణపతిపూజ, మహాగణపతి హోమం ఇంటి వద్ద ఘనంగా జరుపుకోవచ్చు. ఒక సంవత్సరం పాటు ఈ వ్రతాన్ని పైన చెప్పిన తిథులలో ఆచరిస్తే వారికి తీరని కోర్కెలంటూ ఏవి ఉండవు. భవసాగరాన్ని దాటడానికి, తాము తలచిన ఉత్తమమైన సర్వకార్యాల్ని స్వామి సిద్ధింపజేసి విజయం చేకూరుస్తారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కుల, మత, జాతి, వర్ణ వివక్షలు లేకుండా ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించి ఆ మహాగణేశుని కృపకు పాత్రులు కావచ్చు.

ఇంట్లో ఈ వ్రతం చేసుకొనుట సాధ్యంకాని వారు. 108 వినాయకులు గల వినాయగర్‌ దేవాలయాన్ని దర్శించొచ్చు. ఈ దేవాలయం తమిళనాడు రాష్ట్రంలో తిరుచునాపల్లికి 50 కి.మీ.దూరంలో గల దిండిగల్‌ పట్టణంలో ఉంది. అక్కడ 2013 సంవత్సరంలో 32 సంకష్ట గణపతులని ఏకశిలతో, కూర్చొని ఉన్న భంగిమలో రూపొందించి నిత్య పూజలు, దీపారానధలు, అభిషేకాలు, వ్రతాలు నిర్వహిస్తున్నారు.

2018లో వచ్చే సంకష్ట చతుర్థిల్లో ఏప్రిల్‌ 3వ తేదిన, జూలై 31 మంగళవారం రోజున, నవంబర్‌ 26 సోమవారం నాడు ఈ వ్రతం చేసుకుంటే మంచిది. మిగిలిన చవితి తిథులను పూర్తిగా పంచాగకర్తలు పంచాంగమునందు ఇస్తారు. ఈ సంవత్సరంలో డిసెంబర్‌ 6వ తేదీన కూడా ఈ వ్రతం ఆచరించుట చాలా మంచిది.

– ఎస్‌.వి.ఎస్‌. భగవానులు, విశ్రాంత డివిజనల్‌ ఇంజనీరు, ఎ.పి.ట్రాన్స్‌కో, ఒంగోలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *