శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు

శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు

కరువు, కాటకాలు తొలగిపోవాలంటే వరుణ యాగాలు చేయాలి. సంతానం కావాలన్నా, వివాహం తొందరగా కుదరాలన్నా సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఆరాధించాలి. ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం సూర్యారాధన చేయాలి. గ్రహానుకూలతకు నవగ్రహ ధ్యానం చేయాలి. మరి ఇవేవీ అనేకానేక కారణాల వల్ల చెయ్యలేకపోతే ఏం చేయాలి? ఒక్కసారి మనసారా ‘ఓం నమఃశివాయః’ అంటే చాలు, సర్వ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఈ విషయాన్ని ఎందరో పెద్దలు గతంలో అనేక సందర్భాల్లో చెప్పారు. ఇదే విషయాన్ని ఫిబ్రవరి 4న భక్తి టి.వి.లో రాత్రి 10 గంటలకు ప్రసారమైన ‘ధర్మ సందేహాలు’ కార్యక్రమంలో ఒక ప్రేక్షకుడి సందేహానికి సమాధానంగా ఆనాటి సమాధానకర్త చెప్పారు. అసలు ‘శివ-శంకర’ శబ్దంలోనే సంతోషం కలిగించేవాడు అన్న అర్థం ఉంది. అందుకే ఆ సర్వేశ్వరుడు లోకమంతా తానే అయి ఉన్నాడు అని చేప్పే సందర్భంలో ‘శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు’ అంటారని ఆయన వివరించారు. శివరాత్రి పండగ దగ్గరికొస్తున్న సందర్భంగా తెలుగు ఛానళ్లలో కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. వాటిపై ఓ పరిశీలన.

లక్ష్మీదేవి చిత్రపటం ఎలా ఉంటే మంచిది !

‘ధర్మసందేహాలు’ కార్యక్రమాన్ని వీక్షించడం ద్వారా మనకొచ్చే అనేక సందేహాలు తొలగిపోతాయి. ఉదాహరణకు చాలామందిలో ఇంట్లో ఏర్పరుచుకునే లక్ష్మీదేవి చిత్రపటం కూర్చున్న భంగిమలో ఉన్న దాన్నే కొనుక్కోవాలి. నిల్చొని ఉన్నది ఇంట్లో పెట్టుకుంటే ఆ ఇంట్లో ధనం నిలవదన్న భావన ఉంది. మరి ఇది నిజమా? అన్న ప్రశ్న ఓ వీక్షకుడు సంధిస్తే ‘అదేం లేదు. ఎలాంటి భంగిమలో ఉన్న ఫోటోనైనా నిరభ్యంతరంగా ఇంట్లో పెట్టుకోవచ్చు, లక్ష్మీదేవి నిల్చుని ఉంటే ధనం నిలువదనేది కేవలం అపోహ మాత్రమేనని అన్నారు. అయితే ఇలాంటి మరో కార్యక్రమంలో ‘బల్లి మీద పడడం వల్ల కలిగే దోషాన్ని నివారించుకోవడానికి కంచిలో ఉన్న బంగారు బల్లిని ముట్టుకుంటే సరిపోతుంది? అని తెలిపారు ఓ వక్త.

శివ మహాపురాణం

భక్తితో పరమశివుణ్ణి దర్శిస్తే చాలు, అనుకున్నవి ఇట్టే జరిగిపోతాయి. ఇది ఎంతోమంది విషయంలో నిరూపితమైన సత్యం. ఇదే అంశాన్ని టిటిడి ఛానల్‌లో ఫిబ్రవరి 5వ తేదీ రాత్రి 9.30 నిమిషాలకు ప్రసారమైన ‘శివ మహాపురాణం’ ప్రవచన కార్యక్రమంలో బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ అతి మనోహరంగా చెప్పారు. ఇహపర సుఖాల్ని ఉదారంగా సంప్రాప్తింప చేసే మహత్తర గుణం మహాశివుని సొంతం. దాని దరిమిలా మనిషి నాకు మోక్షం ఇయ్యి అని శివుణ్ణి ధ్యానిస్తూ ఉంటాడు. ఈ అంశాలను గురించి ఆనాటి కార్యక్రమంలో మనసుకు హత్తుకునేలా చెప్పారు. అసలు ‘మోక్షం’ అంటే ఏమిటి? అది ఎప్పుడు వస్తుంది? దాని కోసం ఏం చేయాలి? అన్న విషయాలను ఆయన అందరికి అర్థమయ్యేలా చెప్పారు.

మోక్షం రావాలంటే దుఃఖం వదలాలి. దుఃఖం వదలాలంటే మనిషిని అన్ని ఆనందాలే ఆవరించాలి. అసలు ఆనందమంటే ఏమిటి? మన దేహానికి, మనసుకు మంచి చేసేవన్నీ ఆనందాలేనా? ఇలా అనేక విషయాల్ని ఒకదాని నుంచి మరొకదానికి సందర్భానుసారంగా చెప్పారాయన. స్థూలంగా చెప్పాలంటే సుఖ, దుఃఖాలకు అతీతంగా మనసును ఉంచుకుంటే మోక్షం వస్తుంది అన్నారు. మనసుని అలా ఉంచుకోవాలంటే ప్రకృతిని అధీనంలో ఉంచుకోవాలి. అలా ఉండాలంటే నిరంతర సాధన చేయాలి. ‘సాధన’ నిరంతరంగా సాగాలంటే భగవ వంతుని ధ్యానం, భగవంతుని కృప అవసరమన్నారు. దానికి ఉదాహరణగా జాయింట్‌వీల్‌తో సంసార చక్రాన్ని పోల్చారు. తిరుగుతున్న జాయింట్‌వీల్‌ను ఆపాలంటే ఆ యంత్రాన్ని నడిపే ఆపరేటర్‌ను సంప్రదించాలి. అంతేగాని మనకు మనముగా దాన్ని ఆపలేం. అలాగే సంసార సాగరాన్ని ఈదుతున్న వ్యక్తి బాధల నుంచి విముక్తి పొందాలంటే ఆ భగవంతుణ్ణిని ఆశ్రయించాలి అని చెప్పారు. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి తెలిసి చేసినా, తెలియక చేసినా తాను చేసిన కర్మఫలాల అనంతరమే ముక్తిని పొందుతాడని అర్థం.

ప్రత్యేకత

సాధారణంగా మనం శివాలయాల్లో లింగాకారుడైన పరమశివుడి ఎదురుగా ఒక నంది ఉండడమే మాత్రమే చూశాం. కాని శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖం గ్రామంలో ఉన్న శ్రీముఖ లింగేశ్వర ఆలయంలో మాత్రం రెండు నందులు ఉన్నాయన్న ఆసక్తికర అంశాల్ని భక్తి టి.వి.లో ఫిబ్రవరి 5న ప్రసారమైన ‘పుణ్యక్షేత్రం’ అనే కార్యక్రమంలో చెప్పారు. శ్రీకాకుళం నుంచి 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయంలో స్వామివారి గర్భగుడి వెనుక ఉండే మట్టిపాత్ర గురించి విశేషంగా చెప్పారు. అలాగే ఈ ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా జరిగే ఉత్సవాలతో పాటు కృత్తికా నక్షత్రం కూడిన పౌర్ణమి, సోమవారం కలసి వచ్చినపుడు నియమిత కాల నిబంధన విశేషాల్ని బాగా వివరించారు. నిత్యం సమస్యలు, ఆందోళనలు చుట్టుముట్టేసిన మనిషి జీవితం ప్రశాంతంగా ధార్మిక మార్గంలో పయనించ డానికి ఈ తరహా కార్యక్రమాలు తప్పకుండా ఉపయోగపడతాయి.

– స్ఫూర్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *