వ్యక్తిత్వం

వ్యక్తిత్వం

‘రేపు నీకోసం ఇక్కడే ఎదురు చూస్తుంటాను. సాయంత్రం 5.30కి వస్తావు కదూ!’ వికాస్‌ మాటలే చెవిలో మార్మోగుతున్నాయి.

వికాస్‌కి ‘బై’ చెప్పి ఇంకా రెండు గంటలైనా కాలేదు.. కానీ ఈ రెండు గంటల్లో కనీసం ఇరవై సార్లయినా ఆ మాటలు తలపుకొచ్చాయి వీణకి.

అసలేముందీ వికాస్‌లో ? అందగాడా అంటే కాదు. పెద్ద ఇంటలిజెంట్‌ ఫెలోనా అంటే అదీ కాదు. రంగేమో చామనఛాయ. ఆజానుబాహుడా ? అంటే అసలే కాదు. జస్ట్‌ ఐదున్నర అడుగుల ఎత్తు ఉంటాడు.. యావరేజ్‌… అంతే.. ఆస్తిపాస్తులంటూ ఏమీ లేవు. రెక్కల కష్టాన్ని నమ్ముకున్న ఓ చిరుద్యోగి. స్థానిక ఎం.డి.ఒ. ఆఫీసులో ఎల్‌.డి.సి. గా పనిచేస్తున్నాడు.

కానీ తనేమిటి ? వికాస్‌ విషయంలో ఇలా అయిపోతోంది ? ఆల్‌మోస్ట్‌ అన్ని విషయాల్లో వికాస్‌ కంటే తనే బెటర్‌. అందం, తెలివితేటలు, చక్కటి రంగు, మంచి శారీరక సౌందర్యం కలిగిన ఇరవై రెండేళ్ళ కన్నెపిల్ల వీణ.

తను కాలేజ్‌లో, యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో ఎంతో మంది ప్రపోజ్‌ చేస్తే సున్నితంగా కనిపించినట్లున్నా కఠినంగానే తిరస్కరించింది. కానీ ఈ వికాస్‌ని ఎందుకలా కట్‌ చేయలేకపోతోంది ? వీణకి అర్థం కావటం లేదు ఎంత ఆలోచించినా సరే.

తన ఫ్రెండ్‌ సాహిత్య చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఆడదాన్ని ప్రేమించాలంటే మగాడు ముందుగా చూసేది అందాన్ని.. తర్వాతే మిగిలినవన్నీ.. కానీ ఓ ఆడది ప్రేమించాలంటే మాత్రం ఆమెకి మగవాడి అందం అనేది లాస్ట్‌ ప్రిఫరెన్స్‌.. ఒక్కో ఆడది మగాడిలోని ఒక్కొక్క గుణాన్ని కోణాన్ని చూసి ప్రేమిస్తుంది.

సాహిత్య మాటలే నిజమైతే ఈ వికాస్‌ని తను ఏ కోణం నుంచి చూస్తోంది? అరే.. అదేమిటి ? తను ఏ కోణంలోంచి చూస్తోంది ? అనుకుంటోందే మిటి? అంటే తనుకూడా ఆ వికాస్‌. ఛ.. ఛ.. అలాంటిదేమీ లేదు. బలహీనపడుతున్న మనసుకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేసింది.

అసలు ఆపోజిట్‌ సెక్స్‌ మధ్య ఈ వయస్సులో ఇలాంటి ఆకర్షణ ఎందుకు కలుగుతుందో! ఈ వయస్సులోనేనా లేక పెద్ద వయస్సు వాళ్ళలో కూడా ఈ తతంగం ఉంటుందా? ఏమో తనకేం తెలుసు?

ఈ రకమైన ఆలోచనా ఝరితో వీణ హదయ రత్నాకరం మధించబడుతోంది. రాత్రి ఒంటిగంట అవుతున్నా నిద్రపట్టిచావటం లేదు. మరోచరిత్ర సినిమా గుర్తొచ్చింది. చేతి దగ్గరున్న టేబుల్‌లైట్‌ వేస్తోంది.. ఆర్పుతోంది.. ఆన్‌… ఆఫ్‌.. ఆన్‌… ఆఫ్‌.. అలా ఎంతసేపు చేసిందో. తెల్లారి ఏడున్నరకి గానీ మెలకువ రాలేదు.

‘ఏమ్మా నిద్ర పట్టలేదా? రాత్రి చాలా సేపు నీ గదిలో లైట్‌ వెలుగుతూనే ఉంది’ కాఫీ కప్పు చేతికందిస్తూ అన్నాడు వీణ తండ్రి ప్రసాద్‌.

చాలా గిల్టీగా ఫీలయింది వీణ జాము పొద్దెక్కిందాకా పడుకుని నాన్న చేత కాఫీ పెట్టించాల్సి వచ్చినందుకు.

‘సారీ నాన్నా ఆఫీస్‌లో నిన్నా..’ అంటూ ఏదో చెప్పబోయింది.

‘ఈమాత్రం దానికి రీజన్స్‌ ఎందుకురా ! త్వరగా కాఫీ తాగి స్నానం చెయ్యి. గీజర్‌ వేసే ఉంచాను. టిఫిన్‌ కూడా రెడీ. మళ్ళీ ఆఫీస్‌కి లేటవుతుంది’ హడావిడి పెట్టాడు ప్రసాద్‌.

‘ఓ.కే. నాన్నా…’ హడావిడిగా వెళ్ళింది వీణ.

అప్పుడే నాన్నతో అబద్దం అప్రయత్నంగా ఆడటానికి ప్రిపేరైపోయిన తనని చూసుకుని ‘ఇదేమిటి? ఇంత తేలిగ్గా అబద్దం చెప్పబోయాను? అదీ నాన్నతో ఛ’ అనుకుంది ఏదో ఆత్మన్యూనతా భావం ఆమెలో.

స్నానం చేస్తున్నా.. టిఫిన్‌ చేస్తున్నా.. మనసు మనసులో లేదు వీణకి. నాన్న అతి సామాన్యంగా కనబడ్డా అసామాన్య వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఆరేళ్ళ క్రితం అమ్మ ‘సెరిబ్రల్‌ మలేరియా’ వచ్చి పోయి నప్పుడు నాన్నకి జస్ట్‌ 40 ఏళ్లు. వీణకి 16 ఏళ్ళు. మళ్ళీ పెళ్ళి చేసుకోమని ఎందరెంత ఒత్తిడి చేసినా ఆయన ఒకటే అనేవారు ‘నాకు భార్య కాదురా కావలసింది. మా వీణమ్మకి తల్లి కావాల్రా. ఎవరు దొరుకుతార్రా ? అందుకే నేనే మా వీణకి తల్లినీ, తండ్రినీ కూడా అవుతాన్రా. ఇంకోసారి నా దగ్గర మళ్ళీ పెళ్ళి ప్రస్తావన తెస్తే మాత్రం బావుండదు’ అంటూ ఖండితంగా చెప్పేవాడు.

ఆ నాటికి వీణేం చిన్నపిల్ల కాదు. పదహారేళ్ళ పిల్ల. అప్పుడప్పుడే లోక జ్ఞానం.. వయసు… వగైరాలు అన్నీ తెలుస్తున్న పిల్ల. తెలిసీ తెలియని వయసు, మనసు.. తనకి నాన్న చాలు. అమ్మ మా ఇద్దరి గుండెల్లో కలకాలం ఉంటుంది అనుకుంది అంతే..

నాన్నని తను.. తనని నాన్న.. గత ఆరేళ్ళుగా ఎంతో ఆప్యాయంగా అలవిమాలిన అనురాగ బాంధవ్యాలతో పరస్పరం కన్ను, రెప్పల్లాగా చూసుకుంటూ బ్రతుకుతున్నారు.

అమ్మ లేదు కాబట్టి నాన్నకి కావలసిన టిఫిన్‌, భోజనం, బట్టలు వగైరా అవసరాలన్నీ చక్కగా చూసేది వీణ. కానీ వీటన్నింటినీ మించిన భార్యాభర్తల మధ్య ఉండే బంధం, ముడి, అవగాహన, అనుభూతులు అర్థం చేసుకునేటంత శక్తి ఆ వయసుకి వీణకి భగవంతుడు ఇవ్వలేదు అందరికీ లాగానే.

వయసులో ఉండగా భార్యాభర్తలకి ఉండే అవసరాలు, ముచ్చట్లు, హుషార్‌, ఎంజాయ్‌మెంట్‌ వగైరాలన్నీ ఎంతో సరదాగా ఉంటాయి. కానీ, వయసు పెరుగుతున్న కొద్దీ పరస్పర అవసరం యొక్క ఇంపార్టెన్స్‌ తెలుస్తుంది.

దాదాపు ఇరవై ఏళ్ళు సహధర్మ చారిణిగా ఉన్న భార్య పోవటమనేది ఏ మగాడికైనా భరించలేనంత శోకాన్ని మిగుల్చుతుంది. తొలి నాళ్ళలో కాకుండా అసలైన డిపెండెన్స్‌ అనేది అప్పుడే ప్రారంభ మవుతుంది. ఇక్కడ శారీరక అవసరాలు సెకండరీ అవుతాయి. అవ్యక్తమయిన అనురాగ బంధం నరనరాల్లో జీర్ణించుకుపోతుంది. పైకి ఎంత పోట్లాడుకున్నా, తిట్టుకున్నా ఒకర్ని వదిలి మరొకరు రెండ్రోజులన్నా ఉండలేని స్థితి.

అందుకే అనుకుంటా.. ఆడవాళ్ళు పునిస్త్రీగా పోవాలని కోరుకుంటారు. కానీ ఈ సమాజంలో విధురుడు (భార్య గతించినవాడు) గా బ్రతకడం, విధవగా బ్రతకడం కంటే వందరెట్లు కష్టమైనది. ఈ సత్యాన్ని ఎంతో తొందరగా గ్రహించాడు ప్రసాద్‌.

అచ్చంగా తల్లి పోలికలో ఉండే వీణనే ప్రాణంగా ప్రేమిస్తూ జీవితాన్ని హాయిగా వెళ్ళదీస్తున్నట్లు నటిస్తున్నాడు ప్రసాద్‌. గుండెల్లో బాధని ఏనాడూ కూతురికి చెప్పుకోలేదు నిండుకుండ.

తను డిగ్రీ అయి, పీజీ చదువుతున్నప్పుడు సైకాలజీ మీద అవగాహన ఏర్పడ్డాక తండ్రి ఔన్నత్యాన్ని గుర్తించింది వీణ. దాంతో అప్పటికే తండ్రి మీద ఉన్న ప్రేమానురాగాలు, అంతకు మించి గౌరవం రెట్టింపయ్యాయి.

అప్రయత్నంగా కళ్ళు చెమర్చాయి వీణకి. కూతుర్ని చూడకుండానే తన భావాలని పసిగట్టగలడు ప్రసాద్‌.

‘బై నాన్నా.. ఆఫీస్‌ కెళ్ళొస్తా’ అంటున్న వీణ దగ్గరకొచ్చి ‘ఏంట్రా అదోలా ఉన్నావు? రాత్రి సరిగా నిద్రపోయినట్లు లేవు.. అరే ఆ కన్నీళ్ళేంట్రా… ఆఁ! అమ్మ గుర్తొచ్చిందా?’ తలమీద చెయ్యి వేసి దగ్గరకు తీసుకున్నాడు.

బేలగా భోరుమనలేదు వీణ.. కంట్రోల్‌ చేసుకుంది. గతంలో ఒకసారి తండ్రి తనతో ‘అరేయ్‌ నీకు మీ అమ్మగుర్తొచ్చి ఏడ్చావంటే అది నా లోపం. ఐ హావ్‌ టు కరెక్ట్‌ మై సెల్ఫ్‌’ అన్న ఆ మాటలు గుర్తొచ్చాయి.

‘ఛ.. ఛ.. అదేమీ లేదు నాన్నా ఆఫీస్‌లో వర్క్‌ హెవీ అయి కొద్దిగా స్ట్రెయిన్‌.. చికాకు.. అంతే!’ అంటూ ‘బై’ చెప్పి వెళ్ళిపోయింది.

ఆఫీస్‌కైతే వెళ్ళింది కానీ తన ప్రాజెక్ట్‌ లీడర్‌ వేరే ప్రాజెక్ట్‌ వాళ్ళకి గైడెన్స్‌ ఇవ్వటానికి వెళ్ళడంతో ఇక్కడ పెద్దగా పనేమీ లేదు. పనంటూ ఉంటే దాన్లోపడి ఆలోచనలకి తాత్కాలికంగానైనా బ్రేక్‌ వేసేదేమో. కానీ అది లేకపోవటంతో వాటి ప్రవాహం, ప్రభావం అపరిమితంగా పెరిగిపోయింది.

‘సింహాచలం! స్ట్రాంగ్‌గా ఓ కాఫీ తెచ్చిపెట్టవా?’ అంటూ పది రూపాయలిచ్చింది. ఇలా వీణ అడగటం ఇదే ఫస్ట్‌ టైమ్‌. ఆశ్చర్యంగా చూస్తూ బయటికెళ్ళాడు అటెండర్‌ సింహాచలం.

హదయాంతరాళాల్లోంచి పెల్లుబుకుతున్న ఉత్తుంగ తరంగాల్లాంటి ఆలోచనలు. అమ్మే గనక ఉండుంటే ఈ బాధంతా తనకి చెప్పి సేద తీరేదా? ఏమో..అమ్మలేని లోటన్నది లేకుండా గత ఆరేడేళ్ళుగా క్లోజ్‌ ఫ్రెండ్‌లా ఉన్న నాన్నకే చెప్పలేనిది తనింకెవరికి చెప్పగలదు?

నో.. అమ్ముంటే ఆ దారి వేరు.. నాన్న ఎంత క్లోజ్‌ అయినా అపోజిట్‌ సెక్స్‌ గదా..! అమ్మతో ఉన్నంత యాక్సిస్‌ తనతో ఎలా ఉంటుంది? ఏమో.. అన్నీ పిచ్చి ఆలోచనలు.

సింహాచలం పొగలుకక్కే స్ట్రాంగ్‌ ఫిల్టర్‌ కాఫీ తెచ్చాడు. ‘థాంక్స్‌’ చెప్పి అలా హాయిగా కాఫీ తాగుతుంటే మళ్ళీ వికాస్‌ గురించిన ఆలోచనలు.

ఈ వికాస్‌ ఏమిటి ? తనని ప్రపోజ్‌ చేస్తాడు ? అదీ చాలా సిన్సియర్‌గా. ఆర్నెల్లుగా తనని రోజూ చూస్తున్నాడట. చక్కని వ్యక్తిత్వం ఉన్న అమ్మాయిలా కనిపించానట. అంటే తన అందాన్ని చూసి కాదా ప్రేమించింది? ఇదే మరొక అందవిహీనమైన అమ్మాయిలో చక్కని వ్యక్తిత్వాన్ని గమనించగలరా ఈ మగాళ్ళు? పోనీ, అందాన్నే చూశాడనుకుందాం. అవునులే ఏమైనా వస్తువు బావుంటేనే కదా ఎవరి కన్నైనా పడేది ? ఛ.. ఇదేమిటి మరీ ఇంత కమర్షియల్‌గా ఆలోచిస్తోంది తను ?

సరే.. ఆర్నెల్లు రోజూ చూసినంత మాత్రాన వ్యక్తిత్వాన్ని అంచనా వేయగల శక్తిగలవాడా ఈ వికాస్‌? తను రోజూ చూస్తూనే ఉంది వికాస్‌ని. మనిషి చాలా సిన్సియర్‌గా, భావరహితంగా చూస్తాడు. ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎటువంటి ఎట్రాక్షన్‌ కలిగించే ప్రయత్నం ఏనాడూ చేయలేదు. అలా చూస్తాడంతే!

రోజూ పరిచయమున్న మొహమే గదా అని తనే పలకరింపుగా నవ్వింది, చిరునవ్వుతో ప్రతిస్పందిం చాడు. హలో.. నుండి హాయ్‌.. దాకా వచ్చింది. నిన్న సాయంత్రం తనతో మాట్లాడాలన్నాడు.

పార్క్‌ దగ్గర ప్రపోజ్‌ చేశాడు. ఒకరి ఫ్యామిలీ బ్యాక్‌ గ్రౌండ్‌ మరొకరికి తెలీదు. కులాలు తెలియవు. జస్ట్‌ పేర్లు, మొహాలు తప్ప మరేం తెలియదు. కాలేజ్‌ డేస్‌లో ఇలాంటి ప్రపోజల్స్‌ కాజువల్‌గా తీసుకునేది. కానీ ఇది వేరు.. ఇప్పుడు వేరు.

అతని కళ్ళలో నిజాయితీ.. ప్రపోజల్లో అభ్యర్థన లేదు కచ్చితత్వం ఉంది. సిన్సియారిటీ ఉంది. ఆత్మీయత కనబడింది. ఆ పదిమందిలో తనూ ఒకడు అని తీసిపారేయలేకపోతోంది.. దీన్నేమంటారు?

తనకేం చెప్పాలి? అసలు అతని విషయంలో తనెందుకు ఇంతగా ఆలోచిస్తోంది? ఆ వికాస్‌ కళ్ళలో అంత పవర్‌, చూపుల్లో ప్రేమను మించిన అవ్యక్తానుభూతి ఎందుకుంది? ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోతోంది వీణకి.

‘ఏం వీణాదేవి? పొద్దుట్నుంచీ చూస్తున్నాను. ఎక్కడో ఉన్నావు. ఎవరో మీటుతూ ఉన్నట్లున్నారు. లంచ్‌అవరైంది తెలుసా?’

అంటున్న కొలీగ్‌ వారిజ మాటలతో ఈ లోకంలోకి వచ్చి ”ఛ.. ఛ.. నథింగ్‌ లైక్‌ దట్‌.. థాంక్స్‌..’ అంటూ తెచ్చి పెట్టుకుని నవ్వింది.

ఈ రోజు నాన్నే వంట చేశాడు కారేజ్‌ తీసి చూసింది. బంగాళదుంప కూర, గోంగూర పచ్చడి.. ఉల్లిపాయముక్క కూడా కోసి పెట్టాడు నాన్న. ఒక బాక్స్‌ నిండా అన్నం. తినబుద్ది కాలేదు. కానీ తన కోసం పొద్దున్నే లేచి వంట చేసిన నాన్న కష్టం గుర్తుకొచ్చింది. ఇంతలో సెల్‌ మోగింది… నాన్న..

‘అన్నం తిన్నావా?’ అంటూ పలకరింపు.

‘ఇంకా లేదు నాన్నా. ఇప్పుడే తింటున్నాను’ అంది.

‘గోంగూర పచ్చడి కారంగా ఉంది. ఎక్కువ కలుపుకోకు’

‘అలాగే నాన్నా’

నాన్నకి ఎంత కన్సర్న్‌ తనంటే! మనసులోని అన్ని ఆలోచనలనీ కాసేపు పక్కన పెట్టి నాన్న కోసం శుభ్రంగా భోంచేసింది వీణ. ఇటువంటి నాన్న ఎవరికైనా ఉంటాడా? ఈ ప్రశ్న ఈ ఆరేళ్ళలో ఎన్నిసార్లు వేసుకుందో.. రేపు తనకి పెళ్లై వెళ్ళిపోతే? నాన్నకి తోడెవరు? ఒంటరైపోడూ? ప్రకతి ధర్మం, హిందూ ధర్మం అంటూ ఆత్మవంచన చేసుకుంటూ తను భర్తతో హాపీగా గడుపుతూ.. నాన్నని ఒంటరి చేయగలదా? ఆర్ధ్రమైన హదయం బరువెక్కింది.

అసలు నాన్న బ్రతికేదే తనకోసం తను కమ్మగా తింటే చాలు. తాను పస్తున్నా నాన్నకి ఆనందమే! తనే లోకం. తనే జీవితం. సర్వస్వం. తనకోసమే బ్రతుకుతున్న తండ్రికి తనెప్పుడూ ద్రోహం చెయ్య కూడదు. చెయ్యదు కూడా! స్థిరమైన నిర్ణయానికి వచ్చింది.

తండ్రికి ఫోన్‌ చేసింది. ‘అన్నం తినేశా నాన్నా.. కూర, పచ్చడి ఎక్సలెంట్‌… నువ్వన్నంత కారంగా ఏం లేదు గోంగూర. థాంక్యూ నాన్నా. ఇంతకీ నువ్వు తిన్నావా?’ అంటూ హుషారుగా మాట్లాడింది.

‘ఏంట్రా ఎప్పుడూ లేనిది ఈ ఫోన్‌? ఏమిటి హుషారుగా ఉన్నావ్‌?’

‘ఏం లేదు నాన్నా. సాయంత్రం ఓ గంట పర్మిషన్‌ పెట్టి ముందొస్తాను. సరదాగా పార్క్‌కి వెళదాం నా బండి మీద’ అని చెప్పి పెట్టేసింది ఫోన్‌.

ఇంక వికాస్‌ ఆలోచనలు తననేం ఇబ్బంది పెట్టలేవు అనుకుంది. నాలుగింటికల్లా ఇంటికెళ్ళి తండ్రిని హడావిడి పెట్టి, అయిదున్నరకల్లా తన కొత్త బండి ప్లెజర్‌ మీద తండ్రిని కూర్చోబెట్టుకుని పార్క్‌కు చేరింది.

ఎప్పటి నుండి ఉన్నాడో తెలియదు కానీ, అక్కడి ఒక బెంచ్‌ మీద కాలు బెట్టి నిలబడి ఉన్నాడు వికాస్‌.

‘హాయ్‌ వికాస్‌ ఎంతసేపైంది వచ్చి?’ సమాధానం కోసం ఎదురు చూడకుండానే ‘నాన్నా మీట్‌ మిస్టర్‌ వికాస్‌. ఇక్కడ ఎమ్‌.డి.ఓ ఆఫీస్‌లో జాబ్‌ చేస్తున్నాడు’ పరిచయం చేసింది వీణ.

‘హలో అంకుల్‌’ అంటూ చేయందించాడు వికాస్‌.

తండ్రిని చూసికూడా ఏ మాత్రం బెరుకు లేకుండా హలో అంటూ చెయ్యందించిన వికాస్‌ ధైర్యానికి ఆశ్చర్యపోవటం వీణవంతైంది. ప్రసాద్‌ మొహంలో సన్నటి చిరునవ్వు తప్ప మరే భావమూ గోచరించ లేదు.

ఒక్క నిమిషం నిశ్శబ్దం రాజ్యమేలిందక్కడ.

ముందుగా తేరుకున్నాడు వికాస్‌ ‘అంకుల్‌.. నిన్న నేను మీ అమ్మాయిని మేరేజ్‌కి ప్రపోజ్‌ చేశాను. ఐ సిన్సియర్లీ లవ్‌ హర్‌. మీరొప్పుకుంటే..’

‘నువ్వెవరబ్బాయివి? మీ ఫాదరేం చేస్తారు? మీ ఫామిలీ బాక్‌గ్రౌండ్‌ ఏమిటి?” కట్‌ చేస్తూ అడిగాడు ప్రసాద్‌…

‘నా చిన్నప్పుడే నాన్న పోయారండీ. తల్లి, తండ్రీ తానే అయి మా అమ్మే నన్ను పెంచింది సార్‌. అమ్మ తప్ప ఈ ప్రపంచంలో నాకెవ్వరూ లేరు సార్‌. నేనిక్కడే ఎమ్‌.డి.ఓ ఆఫీస్‌లో జాబ్‌ చేస్తున్నాను. ఇంతే సార్‌ ఇదే నా ఫామిలీ బాక్‌గ్రౌండ్‌’ అతని మాటల్లో ఒకింత ఆర్ధ్రత. కళ్ళు చెమ్మగిల్లాయి వికాస్‌కి.

‘ఔను గానీ.. ఇంతకు ముందు నిన్నెక్కడో చూసినట్లుందే’ గుర్తు తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తూ అన్నాడు ప్రసాద్‌.

‘చూశారు సార్‌.. ఒక్కసారి మాత్రమే చూశారు. పొరపాటున ఒక్కరోజు మీ కంట పడ్డాను సార్‌’

‘అర్థం కాలా!?”

‘నేను మీ పక్కింట్లో అవతలి పక్క పోర్షన్‌లో ఉంటానండీ. గత ఆర్నెల్లుగా అక్కడే ఉంటున్నా మండీ. నేనూ, మా అమ్మా.. ఒక్కరోజు మాత్రమే పాల ప్యాకెట్‌ తెస్తూ ఉండగా మీరు నన్ను చూశారు సార్‌..’

‘అందులో తప్పేముందయ్యా అంత ఫీలవుతున్నావ్‌?’

‘అవును సార్‌! నేను మీ కుటుంబాన్ని అబ్జర్వ్‌ చేస్తున్న సంగతి మరొకరికి… ఆఖరికి మా అమ్మకి కూడా తెలియడం నాకిష్టం లేదు సార్‌. వీణగారిలో ఓ మధుర విపంచిని చూశాను నేను. మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని నిజం చెప్పాలంటే అధ్యయనం చేశాను. మీకు తెలియకుండా.. మీ అనుమతి లేకుండా.. మన్నించండి’

ఆశ్చర్యంగా చూస్తున్నారు తండ్రీ, కూతుళ్ళు.

ఆస్తి, అంతస్తు, ¬దా ఉన్న పిల్లకంటే వ్యక్తిత్వం ఉన్న పిల్ల కావాలనీ, అలాంటి పిల్లని వెతికి మరీ పెళ్ళి చేసుకోవాలనే నా కోరిక. అందుకే నా ఉద్యోగం చూసి పిల్లనివ్వడానికి ఇంతకు ముందు ఎందరొచ్చినా ఓ.కే చెయ్యలేదు. వీణగారి వ్యక్తిత్వం, తండ్రిని గొప్పగా ప్రేమించే తత్వానికి నేనెంతో ఆకర్షితుడన య్యాను. ఆ స్వభావం ఉన్న పిల్ల, రేపు భర్తని కూడా అంత గొప్పగానూ ప్రేమిస్తుందని గాఢంగా విశ్వ సించి, ఆర్నెల్ల అధ్యయనం అనంతరం ధైర్యం చేసి ప్రపోజ్‌ చేశాను’ ఒక్కక్షణం ‘పాజ్‌’ ఇచ్చాడు వికాస్‌.

అతని విశ్లేషణా సామర్ధ్యానికి అప్రతిభురాలై చూస్తోంది వీణ. ప్రసాద్‌ అవాక్కై చూస్తున్నాడు.

‘మీ ఇద్దరికీ మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే.. లేకపోతే సింపుల్‌గా మర్చిపోదాం.. ఈ విషయం నాలుగో వ్యక్తికి తెలియాల్సిన అవసరం కూడా లేదు సరేనా?’ అన్నాడు వికాస్‌.

ఏమనాలో తెలియడం లేదు వాళ్ళిద్దరికీ. వికాస్‌ చెబుతున్న దాంట్లో ఇసుమంతన్నా అసత్యం లేదన్నమాట మాత్రం నగ్నసత్యం.

యథాతథంగా, అందరిలాగా తన అందాన్ని మాత్రమే చూడకుండా ఆర్నెల్లపాటు తన వ్యక్తిత్వాన్ని స్టడీ చేయడమన్నది వీణ ఊహకందని విషయం. ఈ సమాజంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? మొదట్లో ఆ.. నన్ను చూసినంత మాత్రాన చక్కని వ్యక్తిత్వం ఉన్నదాన్నని ఎలా తెలిసిందో అనుకుంది తను. తన అంచనా తప్పని ఋజువైంది.

తండ్రితో కలిసి వచ్చి ‘సారీ వికాస్‌’ అని చెప్పేద్దామనుకుని నిర్ణయించుకుని వచ్చింది తను. కానీ ఈ వికాస్‌ తన నిజాయితీతో కూడిన వాదనతో తననే కాక, తండ్రిని కూడా ఆలోచనలో పడేశాడు.

ముందుగా ఈ లోకంలోకొచ్చింది వీణే ‘నాన్నా మీరు ఓ.కే. అంటే వికాస్‌తో పర్సనల్‌గా కాసేపు మాట్లాడతాను’

‘ఓ.కే రా! ఇద్దరూ మెచ్యూర్డ్‌ పిల్లలు. మాట్లాడుకోండి. త్వరగా ఇంటికి వచ్చెయ్యరా. నేను వెళ్తున్నాను.”

‘నాన్నా.. బండీ..’

‘వద్దురా.. నేనలా వాకింగ్‌ చేస్తూ వెళ్తాను హాయిగా..’ అంటూ నిష్క్రమించాడు ప్రసాద్‌.

వీణ వికాస్‌తో తన తండ్రి ఔన్యత్యం గురించీ, వారిద్దరి మధ్య బంధం గురించీ చెప్పి తనని వదిలి రాలేనని కచ్చితంగా చెప్పింది. లైఫ్‌లాంగ్‌ తను తండ్రితోనే ఉండి ఇప్పుడున్నంత ప్రేమనూ పంచాలన్నదే తన నిర్ణయమని ఖండితంగా చెప్పింది.

‘మీ తండ్రీ, కూతుళ్ళ బంధం ఎంత గొప్పదో నాకు తెలుసని నేను ఇందాకే చెప్పాను. కానీ, నీకు మీ నాన్న ఎంతో నాకు మా అమ్మ కూడా అంతే కదా వీణా..! అమ్మతో కూడా అన్నీ వివరంగా మాట్లాడతాను. రేపు ఫైనల్‌గా ఇక్కడే కలుద్దాం ఓ.కే’ అని వికాస్‌ అంటుంటే కాదనడం వీణ వల్ల కాలేదు. మరెవరివల్లా కాదు కూడా.. అంత కన్విన్సింగ్‌ మాన్‌ తను.

ఇంటికెళ్ళాక వాళ్లిద్దరి మధ్య జరిగిన డిస్కషన్‌ని తండ్రికి చెప్పింది వీణ. చిరునవ్వు నవ్వి ‘ఇఫ్‌ యూ డోంట్‌ మైండ్‌ రేపు నీతో నేనూ వస్తాను’ అన్నాడు ప్రసాద్‌.

‘వై నాట్‌ నాన్నా. షూర్‌’ అంది వీణ.

అక్కడ వికాస్‌ తల్లి రాగిణి కూడా కొడుకుతో అదేమాటంది. ‘తప్పకుండా రామ్మా!’ అన్నాడు వికాస్‌.

మర్నాడు సాయంత్రం పార్క్‌లో ప్రసాద్‌, వీణ, వికాస్‌, రాగిణి అందరూ కలిశారు.

వీణకి తండ్రి తప్ప మరెవ్వరూ లేరు. వికాస్‌కి తల్లి తప్ప మరెవ్వరూ లేరు. పిల్లలిద్దరికీ ఇష్టమైతే తమకేం అభ్యంతరం లేదన్నారు పెద్దలు.

కానీ పిల్లలిద్దరి పట్టుదల మీద ఒక పెద్ద ఇల్లు తీసుకుని అంతా ఒకే ఇంట్లో ఉండాలనీ, ఒక కొత్త ఆదర్శ కుటుంబంలా ఉన్నంతకాలం ఇదే ప్రేమాను రాగాలతో, బంధాలు, అనుబంధాలతో ఉండాలని నలుగురూ ముక్తకంఠంతో తీర్మానించారు.

వీణా-వికాసం మధురాతి మధురంగా మూర్ఛనలు పోయిందా నవ కుటుంబంలో.

–  మొగులు కమలాకాంత్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *