వేసివి విడిది కొడైకెనాల్‌

వేసివి విడిది కొడైకెనాల్‌

దక్షిణ భారతదేశంలో వేసవి విడిదులుగా పేరు గాంచిన ప్రదేశాలు రెండే రెండు. అవి తమిళనాడు లోని 1. ఊటీ (ఉదక మండలం), 2. కొడైకెనాల్‌.

కొడైకెనాల్‌ తూర్పు కనుమల వరుసలో ఉన్న అందమైన హిల్‌స్టేషన్‌. దీనికి ఆనుకొని ఉన్న కొండలు పశ్చిమ భాగంలో ఉన్న ‘పళని’ వరకు విస్తరించాయి. అందువల్ల అక్కడ ఉన్న వరుసను పళని కొండలు అని, ఇక్కడున్న వరుసను ‘కొడైకెనాల్‌’ అని పిలుస్తుంటారు.

కొడైకెనాల్‌ తమిళనాడు రాష్ట్రంలో ఉంది. దీనికి దక్షిణ భాగంలో 12 కిలో మీటర్ల దూరంలో మధురై, పశ్చిమ భాగంలో 64 కి.మీ. దూరంలో పళని, ఉత్తర భాగంలో 99 కి.మీ. దూరంలో దిండిగల్‌ ఉన్నాయి.

కొడైకెనాల్‌ పూర్తిగా కొండ ప్రాంతంలో ఉంటుంది. కనుక మధురై నుంచి అక్కడికి వెళ్లేందుకు సుమారు నాలుగున్నర గంటలు, దిండిగల్‌ నుంచి అయితే మూడున్నర గంటల బస్సు ప్రయాణం చేయాలి. అయితే మద్రాసు మహానగరం (చెన్నై) నుండి పాండ్యన్‌ ఎక్స్‌ప్రెస్‌లో దిండిగల్‌ చేరుకుని, అక్కణ్ణుంచి టాక్సీలో కొడైకెనాల్‌ తొందరగా చేరుకోవచ్చు. కొడైకెనాల్‌ని ముద్దుగా ‘కొడై’ అని అక్కడి ప్రజలు పిలుస్తుంటారు.

ఇక్కడ చలి విపరీతంగా ఉంటుంది. కొడైకి వెళ్లే వాళ్లు వయసుతో సంబంధం లేకుండా ఎంజాయ్‌ చేస్తారు. చుట్టూ కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రకృతి అందాలు అందర్ని కట్టిపడేస్తాయి. ఆ ప్రాంతమంతా ఎయిర్‌ కండిషన్‌లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. వేసవి కాలంలో చాలా మంది భార్య, భర్తలు ఈ ప్రాంతానికి హనీమూన్‌కి వస్తుంటారు. దేశంలోని పర్వతాలన్ని అందాల పోటీలో పాల్గొంటే కొడైకెనాల్‌కే ప్రథమ బహుమతి వస్తుంది.

కొడైకెనాల్‌లోని యాత్రా సంస్థలు (ట్రావెల్‌ ఏజెన్సీలు) ఈ ప్రాంతాన్ని రెండు రోజులు, రెండు భాగాలుగా చూపిస్తారు. మొదటి రోజు కొడై పట్టణానికి ఆనుకొని, దగ్గరగా ఉన్న ప్రదేశాలన్నిటిని చూపిస్తారు. రెండో రోజు టూర్‌ని ‘ఫారెస్ట్‌ టూర్‌’ (అరణ్య సందర్శన) అని పిలుస్తారు. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. కొడైకి పది కిలోమీటర్ల దూరంలో ఒక కొండ దారి ఉంది. సుమారు పదిహేను కిలోమీటర్ల పొడవున్న ఈ రోడు ఒక గోడలాగ ఉన్న కొండల వరుస అంచునే పొడవుగా సాగిపోతుంది. ఈ తోవ పక్కనే ఉన్న పెద్ద పెద్ద చెట్లు మనల్ని ఆకట్టుకుంటాయి. తోవకు అవతలి వైపు ఒక పెద్ద లోయ కూడా ఉంటుంది. రోడ్డు మొత్తం ఈ చివర నుండి ఆ చివరి వరకు ఇదే దృశ్యం కనువిందు చేస్తూ ఉంటుంది.

నిజానికి కొడైకెనాల్‌లో అందాలను వీక్షించాలంటే ఎన్ని రోజులైనా సరిపోవు. అయితే ఇక్కడ మూడో రోజు యాత్రగా మరొకటుంది. దానినే ‘ట్రెకింగ్‌’ అంటారు. ఇందులో భాగంగా యాత్రికులను ‘డౌల్ఫిన్‌ నోస్‌’ అనే ప్రదేశానికి తీసుకెళతారు. దీనికి ప్రత్యేక రుసం చెల్లించాల్సి ఉంటుంది. కొడైలో తప్పక దర్శించాల్సిన విశేషాలు, వింతలు సుమారు పది ఉన్నాయి. అందులో మొదటిది కోకర్స్‌ వాక్‌. ఇది కొండ అంచునే సన్నగా, పొడవుగా ఉన్నటువంటి కాలి బాట. ఈ దారి వెంట వెళుతుంటే చుట్టూ కనిపించే ప్రకృతి చూడముచ్చటగా ఉంటుంది.

రెండోది ‘పంపార్‌ జలపాతం’. ఇక్కడ ఎత్తుపల్లాలతో ఉన్న రాతి నేల మీద ప్రవహిస్తున్న వాగు యాత్రికులను నువిందు చేస్తుంది. ఈ వాగు కేవలం పదిహేను నుంచి ఇరవై అడుగుల వెడల్పు మాత్రమే ఉంటుంది.

కొడైకెనాల్‌లో మరొక అత్యంత చూడదగ్గ ప్రదేశం ‘గ్రీన్‌ వ్యాలీ’. ఇక్కడ ఒక కొండ అంచున యాత్రికులు నిలబడి చూడటానికి అనువుగా ఒక ప్లాట్‌ ఫాం నిర్మించారు. ఇక్కణ్ణుంచి చూస్తే విశాలమైన లోయ, చెట్లతో నిండిన చిన్న చిన్న కొండలు, పచ్చని ప్రకృతి ఆకట్టుకుంటాయి.

మరొక చూడదగ్గ ప్రదేశం ‘గుణగుహ’ దీన్ని రోడు నుంచి సుమారు యాభై గజాల ఇవతలే నిలబడి చూడాలి. చెట్ల మధ్యలో నుంచి దూరంగా ఉన్న గుహ ముఖద్వారం మాత్రమే కనిపిస్తుంటుంది. ఇక్కడి స్థానికులు దీనిని ‘దెయ్యల గుహ’ అంటారు.

కొడైకెనాల్‌లో పైన్‌ చెట్లు విరివిగా ఉంటాయి. ఇవి కేవలం కొండ ప్రాంతంలోనే ఏపుగా పెరుగుతాయి. బాగా మంచు, చలి ఉన్న ప్రాంతంలో మాత్రమే ఇవి పెరుగుతాయి. ఇవి మన సరివి చెట్ల మాదిరిగా ఉంటాయి. ఈ చెట్లు ఎవరో వరుసలుగా పేర్చినట్లు కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని చలన చిత్రాలు నిర్మించే వారికి ఇష్టమైన ప్రదేశంగా పేర్కొంటారు.

‘శాంతిలోయ’. ఇది వృక్షాలతో నిండిన ఒక విశాలమైన లోయ. ఇక్కడ ఉన్న కురింజ ఆంద్వర్‌ ఆలయాన్ని 1930లో ఒక యూరోపియన్‌ వనితకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కలలో కనిపించి ఆశీర్వదిస్తే ఆమె కృతజ్ఞతా భావంతో నిర్మించిందట. అప్పటి నుంచి ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది.

కొడైకెనాల్‌ పట్టణానికి చివరలో ఒక సరస్సు ఉంది. ఈ సరస్సులో బోటు షికారు చాలా అద్భుత అనుభూతిని కలిగిస్తుంది. చుట్టూ కొండల మధ్య సాగే ఆ ప్రయాణం యాత్రికులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

నైసర్గికంగా కొడైకెనాల్‌ చాలా చిన్న పట్టణం. ఈ పట్టణం కొండల మధ్య ఉండడం వల్ల ప్రతీ వస్తువును మైదాన ప్రాంతం నుండి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఇక్కడ వస్తువులకు రేట్లు ఎక్కువగానే ఉంటాయి.

కొడైలోని అటవీ ప్రాంతంలో తేనె, యూకలిప్టస్‌, యాలకులు, సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేసే వాళ్లు ఎక్కువగా కనిపిస్తుంటారు. కొడైకి వచ్చే విహార యాత్రికుల కోసం అనేక వసతి గృహాలు, హోటల్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక సంస్థ విచారణ కార్యాలయం కూడా ఉంది. పర్యాటకులు బస చేయడానికి హిల్‌ కం ట్రీ రిసార్ట్‌, స్టెర్లింగ్‌ రిసార్ట్‌ చాలా సౌకర్యంగా ఉంటాయి. ఇక్కడి అస్టోరియా రెస్టారెంట్‌, హోటల్‌ హిల్‌టాప్‌ ఇన్‌లలో మంచి భోజనం లభిస్తుంది. మీనాక్షి భవన్‌ అనే హోటల్‌లో వంటలు అద్భుతంగా ఉంటాయి.

ఎలా వెళ్ళాలి

విమాన ప్రయాణం చేయాలనుకునే వాళ్ళు చెన్నై, మధురై, కోయంబత్తూర్‌, తిరుచునాపల్లి దాకా విమానంలో ప్రయాణించి అక్కణ్ణుంచి బస్‌లో కొడైకెనాల్‌కు వెళ్ళాల్సి ఉంటుంది. పాండ్యన్‌ ఎక్స్‌ప్రెస్‌ లేదా మధురైకు వెళ్లే ఏ రైలు ఎక్కినా కొడై రోడ్డు స్టేషన్‌ గాని, దిండిగల్‌ గాని చేరుకొని అక్కడి నుంచి టాక్సీ లేక కార్లలో ఎన్‌.హెచ్‌. 5 మీదుగా కొడైకెనాల్‌ చేరుకోవచ్చు.

– డా|| మంతెన సూర్యనారాయణ రాజు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *