వెలుగు రేఖ

వెలుగు రేఖ

ఆకాశంలో సూర్యుడు ఆరిపోతున్న దీపంలా ఉన్నాడు. వెలుగు వీధుల్లోంచి చీకటి స్మశానంలోకి తోవతీసే కాలి బాటలా ఉంది ఆ సాయం సంధ్య !

ఊరి చివరన ఓ కొండ. ఆ కొండమీద గుడి. దేవుడు పప్పుడూ మనుషులకు దూరంగా ఉంటాడా అనిపిస్తుంది దాన్ని చూస్తే. పంత దూరంలో ఉన్న దేవున్ని మనిషి మాత్రం వెంటాడుతూనే ఉంటాడు తన కోర్కెలు తీర్చమని. అందుకే కాబోలు కొండమీద గుడికి వస్తూ పోతూ ఉన్నారు భక్తజన సందోహం కాంక్షల భారంతో ! ఆశల దాహంతో !

ఆనాటి సాయంత్రం వేళ గుడికి వచ్చిన భక్తుల్లో ఒక వ్యక్తి మాత్రం అందుకు భిన్నంగా ఏ విన్నపాల నైవేద్యాలు లేకుండానే దర్శనం చేసుకున్నాడు. మాసిన బట్టలతో, పెరిగిన గడ్డంతో దరిద్ర దేవతకు దగ్గరి చుట్టంలా ఉన్న ఆ వ్యక్తి, భగవంతునికి విన్నవించు కోవటానికి కూడా తన దగ్గర ఏమీ లేవు అన్నట్లుగా

ఉన్నాడు.

అతని పేరే రాంబాబు. దురదృష్టానికి, దైన్యానికి అడ్రస్‌ అతని జీవితం. హఠాత్తుగా సంభవించిన తండ్రి మరణంతో డిగ్రీ చదువును వదిలేసి తల్లిని, చెల్లిని పోషించాల్సిన భాద్యత చేపట్టాడు. అడిగిన వెంటనే అప్పు పుట్టేటంత ఆర్ధిక పరిస్థితి కూడా కాదు తనది. రక రకాల ఉద్యోగాలు చేశాడు. ఎన్ని చేసినా తమ కుటుంబంలో ముగ్గురూ కనీసం ఒక్క పూటైనా తృప్తిగా ఆకలి తీర్చుకునే సంపాదనలేదు. దానికి తోడు తల్లికి కేన్సర్‌ అని ఈ మధ్యే తెలిసింది. మందులు కొనివ్వడం మాట అటుంచి కనీసం మంచి తిండైనా పెట్టలేని దౌర్భాగ్య స్ధితి తనది. చెల్లి చదువు కూడా అంతంత మాత్రమే. గాలి గట్టిగా వీస్తే పగిరిపోతారేమో అనిపించే ఆ ఇద్దరు అర్భక ప్రాణులని చూస్తే రాంబాబు గుండె తరుక్కుపోతుంటుంది.

ఎప్పటిలాగే ఆ రోజు పొద్దున కూడా రాంబాబు ఊరిమీద పడ్డాడు ఏదైనా పని దొరికితే చేద్దామని. అరిగిన కాళ్ళతో, ఆకలి కళ్ళతో సాయంత్రం వరకూ తిరిగాడు. షరా మామూలే! ఏ పనీ దొరకలేదు. కూలీ పనైనా చేద్దామని రెండు మూడు సార్లు ప్రయత్నించాడు. నామోషీ, బలహీనత ఈ రెండూ ఆ పనికి అడ్డు పడ్డాయి. అలసిన దేహంతో, ఆవేదన నిండిన మనసుతో సాయంత్రానికి కొండమీదున్న గుడికి చేరుకున్నాడు.

ఆలోచనల వెల్లువతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. తల్లికి, చెల్లికి పట్టెడన్నాం కూడా పెట్టలేని పనికిమాలిన బతుకైపోయింది తనది. వారి బాధను చూడలేడు, తీర్చలేడు. ఇలాంటి నీచమైన జీవితాన్నిచ్చిన దేవుడిపై కోపమొచ్చింది. ఈ గుడిలోని శిలను కాదు డైరక్టుగా ఆ పైనున్న ఈశ్వరుడ్నే అడుగుదామనుకున్నాడు. ఇక ఇంటికి పోకూడదని ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నాడు. గుడికి కొంచెం దూరంలో ఆ ఎత్తైన కొండమీద ఒక పెద్ద బండరాయి బలిపీఠంలా పరుచుకునుంది. అంతులేని పదురీత లతో విసిగి వేసారిన అభాగ్యులెంతో మంది తమ జీవన పయనాన్ని అక్కడనుంచే అలా అర్ధాంతంగా ముగించే శారు. ఇప్పుడు రాంబాబుకి అదే మార్గదర్శకం అయింది. ఆ రాయెక్కి కిందున్న లోయలోకి దూకేద్దామనుకున్నాడు.

సమయం సాయంత్రం ఆరు గంటలయింది. బాగా చీకటి పడేదాక, జన సంచారం తగ్గే వరకు ఆగుదామనుకున్నాడు. కనీసం చావడానికైనా అడ్డులేవీ ఉండకూడదని!

ఆతృతతో ఉన్న రాంబాబుకి కరుగుతున్న కాలం కరుడుగట్టిన విధిలా కర్కశంగా, నెమ్మదిగా నడుస్తున్నట్లు అనిపిస్తోంది. మనసులో పగిసిపడుతున్న ఉద్వేగ కెరటాల ఆటుపోట్లకి ఒక చోట స్ధిమితంగా

ఉండలేక పోతున్నాడు. ఆలయ ప్రాంగణమంతా తిరుగుతున్నాడు బయిట మెట్ల మీదున్న బిచ్చగాళ్ళు, పదే పదే ‘ధర్మం చెయ్యండి బాబూ’ అంటుంటే తన దగ్గరున్న ప్లాస్టిక్‌ డబ్బా, సీసాతో సహా చిల్లర డబ్బులన్నీ ఇచ్చేశాడు.

మెల్లగా చీకటి మ్ముకుంది. జనం పల్చబడ్డారు. రాంబాబు బండరాయి దగ్గరకు చేరుకున్నాడు. చుట్టూ చూస్తే కటిక చీకటి! దూరంగా మినుకు మినుకు మంటూ భూమ్మీద నక్షత్రాల దుప్పటి పరిచినట్లుగా మెరిసిపోతుంది నగరం!

తనకొక తోవ చూపించ లేని ఈ లోకం నుండి తనే తోవ వెతుక్కుని వెళ్లిపోతున్నాడు. ‘ఇక సెలవ్‌! ఈ బాధలకి, బెంగలకి ఇక సెలవ్‌!’ అనుకుంటూ రాంబాబు బండ పక్కేశాడు. గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నాడు. గుడివైపు ఒకసారి చూశాడు.

అప్పుడే గమనించాడు. రెండు మనుషుల ఆకారాలు గుడివైపు నుండి వడి వడిగా తనవైపు రావడం! ఇక లాభం లేదు. వెంటనే దూకేయ్యాలి అనుకున్నాడు.

‘బాబూ ఒక్క నిమిషం!’ ఇద్దరిలో ఒకడు కేకేశాడు. ఆ మాట విని వాళ్ళవైపు పరీక్షగా చూశాడు. దగ్గరవుతున్న వాళ్ళిదరూ గుడి మెట్లమీద కూర్చున్న బిచ్చగాళ్ళని పోల్చుకున్నాడు.

వగర్చుకుంటూ ఇద్దరూ దగ్గరికి వచ్చారు. ఒకడు గుడ్డివాడిలా ఉన్నాడు. రెండవ వాడు వాడి చెయ్య పట్టుకుని వచ్చాడు.

‘బాబూ! తమరేటీ అనుకోకపోతే చిన్న విషయం అడుగుతాం’ అన్నాడు.

‘ఊ!’ అన్నాడు రాంబాబు.

‘మరేటి లేదు బాబు. తమరిక్కడికి వచ్చింది సచ్చిపోడానికే కదా?’

‘ఊ!’ అన్నాడు అప్రయత్నంగానే.

ఆ సమాధానం వినగానే బిచ్చగాళ్ళ ముఖాలు వెలిగిపోయాయి.

‘బాబ్బాబు! తమరు సచ్చిపోయే ముందు మాకో చిన్న సాయం సేసి పుణ్యం కట్టుకోవాల!’

‘నా దగ్గర ఏముందయ్యా? ఈ బట్టలు కూడా చిరుగులే! మీకు పనికి రావు’

‘అయ్యక్కర్లేదు బాబు! ఇదిగో వీడ్ని సూసారు కదా ! వీడు పోలిగాడు! సిన్నప్పుడే వీడి రెండు కళ్లు పోనాయి. ఈ మధ్యన గవర్నమెంటోళ్లు గుడారాలేసి మందులిస్తుంటే మేమూ పోయినం బాబు! అక్కడ డాక్టరు గారు ఈడికెవరైనా కళ్లు దానం చేస్తే మళ్లీ సూపొస్తాదన్నారు’ అని ఒక్క క్షణం ఆగాడు.

రారబాబుకి విషయం ఆసక్తిగా అనిపించి కూర్చున్నాడు బండ మీద. ‘బాబూ తమరెలాగూ సచ్చిపోదామనుకుంటున్నారు గదా ! తమరి కళ్లు మా పోలిగాడికి దానం ఇప్పిస్తారా బాబూ!’ అని ప్రాధేయపూర్వకంగా చేతులు కట్టుకుని అడిగాడు ఆ బిచ్చగాడు.

‘మాలాంటోళ్లకి దిక్కూ, దైవం తమరి లాంటోళ్లే బాబూ! కాదనకుండా మీ కళ్లు దానం సేసి నాకు సూపు తెప్పించండి’ అని రెండు చేతులూ జోడిస్తూ, ఏడుస్తున్నాడు పోలిగాడు.

రాంబాబు ఒక్క క్షణం విచలితుడయ్యాడు. అయోమయం, ఆశ్చర్యాల నుండి తేరుకుని ‘అలాగేలేవయ్యా! ఇస్తాలే! కనీసం నేను చచ్చిన తరువాతైనా నా వలన ఉపయోగం ఉంటుందను కుంటే నాకూ సంతోషమే’ అన్నాడు.

ఇంతలో మరొక బిచ్చగాడు నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి వాళ్ళ పక్కన చేరాడు. పండిన మామిడి టెంకలా ఉన్న వాడి వాలకం చూస్తే రాంబాబుకి తన తల్లీ, చెల్లీ గుర్తుకు వచ్చి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఆ వెంటనే ఏదో గుర్తుకువచ్చిన వాడిలా ఒక్కసారి లేచి నిలబడ్డాడు. అనుబంధాల బంధనాలు తనని మళ్ళీ బతుకు బండి వైపు లాగ కూడదని, ఆ బండ మీద మనసు ‘రాయి’ చేసుకుని, నిటారుగా నిలబడి పటో చూస్తున్నాడు.

‘బాబూ మరో సిన్న విన్నపం!’ అంటూ మొదటి బిచ్చగాడు చెప్తున్నాడు. ‘వీడు అసిరిగాడు బాబూ!’ అని ఆ మూడో వ్యక్తిని చూపిస్తూ ‘వీడ్ని కూడా ఆ గవర్నమెంటు డాక్టరు పరీక్షలు సేసి, వీడి కిడ్డీలు రెండూ పాడయిపోనాయి అన్నాడు బాబూ!’

రాంబాబు పరీక్షగా చూశాడు ఆ కొత్త వ్యక్తిని. ‘కిడ్డీ ఏంటీ ఓహో కిడ్నీ అన్నమాట’ అనుకున్నాడు.

‘పవరైనా ఒక కిడ్డీ దానం చేస్తే బతుకుతాడు అన్నారు బాబూ!’ మరి తమరేటీ అనుకోకపోతే తమరి కిడ్డీ ఒకటి ఈడికి ఇప్పించారంటే మీ పేరు సెప్పుకుని బతికి బట్ట కడతాడు బాబు!’

అసిరి గాడు అతి కష్టంమీద మాట్లాడుతూ ‘బాబూ! మా నూకరాజు గాడన్నట్లు మీ దయలేందే నేను బతకలేను. మేము తమరిలాగ సదూకున్నోళ్లం కాదు, మాకేటీ తెలీదు. ఈ వెధవ పానాల మీద, ఈ అడుక్కుతినే బతుకుల మీద తీపి ఇంకా పోనేదు. అందుకే సావలేక బతుకుతున్నాం. తమరు ఎలాగూ సచ్చిపోదామనుకున్నారు కావున మీ కిడ్డీ నాకిచ్చి నన్ను బతికించండి బాబూ!’ అన్నాడు. ఆ మాటలు విన్న రాంబాబుకి హృదయం ద్రవించిరది.

వెంటనే నూకరాజు అందుకున్నాడు.

‘బాబూ! తమరిలాగ కొండమీద నుంచి దూకెత్తే నుజ్జు నుజ్జు అయిపోతారు. మాకు తమరి కళ్ళు, కిడ్డీ కావాలి కనుక తమరు సుఖంగా పేనాలు వదిలేలా మేము సేత్తాం’ వాళ్ళ అమాయకత్వానికి, తాపత్రయానికి ఆ పరిస్థితిలో కూడా రాంబాబుకి నవ్వొచ్చింది.

‘ఆకలి భూతానికి నా కిడ్నీని పప్పుడో ఆహారంగా వేసేసానయ్యా! ఇంకా మీ వరకూ ఉంటుందా?’ అన్నాడు.

ఇంతలో మరొక వ్యక్తి పరుగులాంటి నడకతో అక్కడికి చేరుకున్నాడు. ‘ఒరేయ్‌! నూకరాజు! నా సంగతి సెప్పావా, నేదురా?’ అని అడిగాడు.

‘అరే ! ఊర్కోయెస్‌! నీకెన్ని సార్లు సెప్పాల్రా? అలా సెయ్యి బదులు సెయ్యి యెట్టీడం అవదురా అని!’ నూకరాజు కసురుకున్నాడు.

కొత్తగా వచ్చిన వ్యక్తి రాంబాబు వైపు తిరిగి ‘బాబూ నా పేరు తవిట్రాజండి! ఇగో నాకు ఎడమ సెయ్యి లేదండి! మా నూకరాజు గాడు ఆళ్లిద్దరికీ కళ్లు, కిడ్డీ అడిగినోడు. నా సెయ్యి గురించి కూడా అడగాలి కదండి. అహా! అలా కుదరదు అంటన్నాడండి!’

‘బాబూ! నాకాడ డబ్బులు తక్కువున్నాయని వీళ్లు నాటకాలాడుతున్నారు. నాను కూడా వెయ్యి రూపాయలు కూడబెట్టాను బాబూ! తమరి శవాన్ని నేను దగ్గరుండి కాల్పిస్తాను, ఆ ఖర్చంతా నానెట్టుకుంటాను. దయుంచి తమరి సెయ్యి ఒకటి నాకు దానం ఇప్పించండి. ఈ అవిటోడ్ని ఆదుకోండి బాబూ!’ అని బండరాయి దగ్గరకు వచ్చి ఒక్క చేత్తోనే రాంబాబు కాళ్ళకి దండం పెట్టేస్తున్నాడు.

రాంబాబు ఒళ్ళు జలదరించింది. కమ్మిన మైకమేదో ఒక్కసారి కరిగినట్లైంది. బండరాయి మీదనుండి కిందకు దిగాడు.

అక్కడున్న బిచ్చగాళ్ళను పరికించి చూశాడు. చేతులెత్తి నలుగురివైపు తిరిగి దండంపెట్టాడు. మనసుని కడిగిన నీరు కళ్ళనుండి కారుతుండగా ‘మీ అందరికీ నా జన్మంతా రుణపడి ఉంటానయ్యా!’ అన్నాడు.

‘ఊరుకోండి బాబూ! ముస్టోళ్లం. మావేటి, మీరేటి! మీరు మాకు రుణపడి పోవడవేటి!?’ నూకరాజు అంటున్నాడు.

‘ముష్టోళ్ళు కాదయ్యా మీరు. నాకు మరో జన్మదానం చేసిన మహాదాతలు! మీరు అడుక్కుంటే నేనిచ్చింది నాలుగు చిల్లర డబ్బులే. కాని, నేనడక్కున్నా మీరు నాకిచ్చింది పదికాలాల పాటు బతికే బతుకయ్యా!’ అని కళ్ళు తుడుచుకుంటూ చెప్తున్నాడు రాంబాబు.

ఆతృతనాపుకోలేని తవిట్రాజు మాత్రం ‘అంటే తమరు సచ్చిపోవటం లేదా బాబూ!’ అని అడిగేశాడు.

‘లేదయ్యా! లేదు. కళ్ళు లేని పోలిగాడు, కిడ్నీలు పాడయిన అసిరిగాడు, ఒక చెయ్యిలేని నువ్వు మీరందరూ ఎలాగైనా సరే బతకాలని అనుకోగా అన్నీ ఉన్న నేను బతకలేనా!? బతికి తీరుతాను’. ధృఢ నిశ్చయంతో, గుండె నిబ్బరంతో అన్నాడు రాంబాబు.

‘ఏటయిందిరా ఆ బాబు సావట్లేదా?’ అని అడిగాడు పోలిగాడు గాలిలో తడుముకుంటూ.

‘ఛస్‌! ఊరుకోరా. బాబు మనసు మార్చుకున్నాడు’ అని నూకరాజు మెల్లగా చెప్తున్నాడు.

‘లేదు పోలీ! నే చావట్లేదు. చావడానికన్నా బతకడానికే మార్గాలు పక్కువున్నాయని తెలుసు కున్నాను. అవిటితనం, బీదరికంతో నిత్యం బాధపడుతున్న మీలో కూడా వీలైతే ఇంకా బాగా బతుకుదామనే తపన చూసిన తరువాత నాకు కూడా బతుకు మీద తీపి పెరిగింది.

ఇన్నాళ్ళూ నా చుట్టూ గిరి గీసుకుని అదే బతుకని అందులోనే బతకాలని లేకపోతే చావే దిక్కని అనుకున్నాను. ఈ రోజు మిమ్మల్నందరినీ చూసిన తరువాత ఈ ప్రపంచం పంత విశాలమైందో అర్ధమైంది.

ఆశ, నిరాశలు పగలూ, రాత్రి లాంటివి. ఒకదాని వెంట మరొకటి వస్తూ పోతూ ఉంటాయి. నిశిరాత్రి లాంటి నిరాశలో ఆశల వేకువకై వేచి చూస్తాను. ఆశల సాఫల్యంలో నిరాశను పదుర్కునే శక్తిని పుంజుకుంటాను. నాలో ఈ స్ఫూర్తిని, కొత్త ఉత్తేజాన్ని నింపిన మీ అందరికీ నా వేవేల కృతజ్ఞతలు. మరి నేను బయల్దేరుతాను’ అని రాంబాబు ముందుకు కదిలాడు.

‘మంచిది బాబూ సేమంగా యెల్లండి’ అంటున్న నూకరాజు కళ్ళు చెమర్చాయి.

‘అయ్యో! ఆదేట్రా మరి నా సంగతేట్రా!’ అంటున్న అసిరిగాడితో నూకరాజు ‘గాబరా పడకేస్‌! ఈ బాబంటే తెలివి తెచ్చుకుని బండ దిగిపోనాడు కాని ఈ పపంచంలో బాధలకేటి తక్కువా? ఏ తెలివి తక్కువ నాయాలో రేపో మాపో సావుల బండకాడికి రాకపోడు. మళ్ళా సూద్దాంలే’ అన్న మాటలు రాంబాబు చెవిన పడ్డాయి.

పవరి చావులోనో తమ బతుకును వెతుక్కునే స్థితిలో కూడా వాళ్ళని నడిపిస్తున్న ఆశావాహ శక్తికున్న బలాన్ని చూసి అబ్బర పడ్డాడు. అలాంటి ఆత్మ విశ్వాసమే గుండెలనిండా ఉప్పొంగగా, రెట్టించిన ఉత్సాహంతో అడుగులు వేస్తూ మెట్లు దిగి వెళ్తున్నాడు రాంబాబు. అతని నూతన జీవన ప్రస్థానానికి శుభారంభంగా గుడి గంట మోగింది!. మబ్బులు పట్టిన ఆకాశంలో ఉన్నట్టుండి ఒక మెరుపు మెరిసింది! చీకటి నిండిన రాంబాబు జీవితంలో కాంతి నింపుతూ వెలుగు రేఖ విరిసింది.

ఉక్కపోతతో, గుబులుగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా తేలికపడి చల్లబడింది. చిరుజల్లు తుంపర మొదలయింది. చిగురాశల చినుకులతో తొలకరి వాన రాంబాబు బతుకు తోటలో ఉత్సాహపు విరిజల్లులు కురిపించింది.!!

– దేవులపల్లి దుర్గాప్రసాద్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *