అశ్విని ఆనందానికి అవధుల్లేవు. ఎక్కడలేని ఉత్సాహం.. శరీరంలో అణువణువూ ఆనందం నిండడం వల్ల ఏదో కొత్త కళ. అద్దం ముందు నిలబడి రూపాన్ని పదే పదే చూసుకుంది.
ఆ ఆనందానికి కారణం తన కంప్యూటర్ స్క్రీన్‌పైన మెరిసిన మెసేజ్. కొత్త మిత్రుడు జాలీబాయ్. ఈ మధ్యే పరిచయమయ్యాడు. పరిచయం చేసుకోవడంతోనే ఆకర్షించాడు.
హాయ్ స్నేహ హస్తమందించడానికి సిద్ధంగా ఉన్నావా ? ఇద్దరం లైఫ్‌ను పూర్తిగా ఎంజాయ్ చేద్దాం. అనంత ఆకాశంలోకి ఎగిరిపోదాం. చుక్కల చాటున చక్కని కబుర్లు చెప్పుకుందాం. వెన్నెల రాత్రుల్లో చేయిచేయి పట్టుకుని తిరుగుదాం… ఇంకా ఏదేదో కవిత ధోరణిలో… ఒకదాని తరువాత మరొకటి ఎన్నెన్ని మెసేజ్‌లో…
‘…అయితే ఇదంతా ఈ జాలీబాయ్కి హలో చెబితేనే… చెప్పాలనిపిస్తోందా? తొందరలేదు.. ఆలోచించుకుని చెప్పు’.
అశ్విని చాలా నెమ్మదస్తురాలు. ఎంత అందమైన అమ్మాయో అంత అణకువ. సంప్రదాయ కుటుంబం కావడంతో ఒకలాంటి బెరుకు. కాలేజీలో కూడా అంతే. స్నేహితులు జోక్స్ వేయడం, కేరింతలు కొట్టడం… అశ్విని వాళ్ళ కంపెనీలో ఉండి చూసి ఆనందించడమే. వయసులో అదే టీనేజ్‌లో ఉండే ఆకర్షణ ఎక్కడికి పోతుంది. సినిమాకెళ్ళినా, షాపింగ్‌కి వెళ్ళినా ఫ్రెండ్స్ ప్రోద్పలంతోనే. ‘రా అశ్విని కమాన్… మాతో మూవీకి వస్తున్నావు’ అంటూ తీసుకుపోవడం. ఒక్కోసారి అనిపించేది వారిలో ఉండే చొరవ తనలో లేదే అని. విషయాల్ని వాళ్ళు చాలా తేలిగ్గా తీసుకుంటారు. అశ్వినికి అది చేతకాదు. వాళ్ళు డ్రస్ చేసుకునే విధానం, హెయిర్‌స్టైల్, ఇయర్ రింగ్స్, చెయిన్… అన్నో వేరు. తను – సంప్రదాయం, వాళ్ళు – ఆధునికం. సహజ సౌందర్యం తనకున్నా, ఉన్న కాస్తని రెట్టింపు చేసుకోగల సామర్థ్యం వారికుంది. బ్యూటీపార్లర్లకు వెళ్ళి అందాలకు మెరుగులు దిద్దుకుంటారు. అయితే అశ్విని తల్లిదండ్రులు ఎంతో గర్వంగా చెప్పుకుంటారు. ‘మా అశ్వినికి పుస్తకాలంటే ప్రాణం. ఎప్పుడూ కామ్‌గా ఏదో ఒకటి చదువు కుంటూ ఉంటుంది’ అని. అశ్విని కెరీర్‌ను కూడా వాళ్ళే డిసైడ్ చేసేసారు.
అశ్విని గది పింక్ కలర్. దానికి తగిన కర్టెన్స్. అమ్మానాన్నలు ఎంతో ఇష్టంగా అలంకరించారు. ఆ అలంకరణ ఆమె ఆలోచనలకు తగ్గట్లు ఉందనుకుంటారు. ఇప్పటికీ తన బెడ్‌పైన స్టఫ్డ్ టాయ్స్. స్నేహితురాళ్ళ ఇళ్ళకు వెళ్ళి వాళ్ళ బెడ్రూములు చూసినప్పుడు బుర్ర తిరిగినట్టు అనిపిస్తుంది. గోడల మీద సినిమా తారల బొమ్మలు. డ్రెసింగ్ టేబుల్ దగ్గర రకరకాల కాస్మటిక్స్, పర్ఫ్యూమ్స్, హెయిర్జెల్స్, నెయిల్పాలీష్లు. వాళ్ళ పేరెంట్స్ అంత ఫ్రీడమ్ ఇచ్చారా ! ఏమో…!
ఎందుకో ఈ మధ్య కొత్తగా తనకీ మార్పు అవసరమనిపిస్తోంది. మారాలనిపిస్తోంది. ఫ్రెండ్ సుమన చెప్పిన మాటలు థ్రిల్ కలిగించాయి. ‘కాస్త మేకప్ చేసుకుంటే చాలు… అదిరిపోతావు. అబ్బాయిలు క్యూ కడతారు చూడటానికి’ అంటూ కొంటెగా అడనమే కాదు, మేకప్ చేసి చూపించింది ఓ సెలవు రోజున.
మేకప్ అయ్యాక డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర తన ప్రతిబింబం చూసి షాక్ అయింది.
‘అశ్విని… అదిరిపోయావు. బాలీవుడ్ హీరోయిన్లు బలాదూర్ నీ ముందు. ఐ లైనర్, కాస్త లిప్‌స్టిక్, ఇయర్ రింగ్స్తోటే ఇంత మార్పా…! నా దగ్గరున్న వాటితో నువ్వు నీ అందానికి మెరుగులు దిద్దడం ప్రారంభించు..’ అంటూ తన దగ్గరి సరంజామాను ఓ క్యారీబాగ్లో వేసి ఇచ్చింది.
అశ్వినిలో వచ్చిన కొత్త మార్పుకు అమ్మానాన్నలు ఆశ్చర్యపోయారు.
బ్యూటీకి సంబంధించిన టిప్స్కోసం నెట్సర్చ్లో పడిపోయింది అశ్విని.
‘ఏమిటే ఆ అవతారం’ అమ్మ అడిగింది.
నాన్న ఆశ్చర్యపోయాడు.
‘ఆ డ్రస్ ఎక్కడిదే’ అమ్మ.
తల్లిదండ్రుల వింత చూపులకు, విచిత్రమైన ప్రశ్నలకు పరిగెత్తుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయి గభాల్న తలుపు వేసేసుకుంది. ఎంతో మంది బావుందన్న ఆ డ్రస్సు అమ్మానాన్నలకు ఎందుకు నచ్చలేదు. సుమన వాళ్ళ అమ్మానాన్నల లాగా, ఇంకా ఎందరో తన ఫ్రెండ్స్ పేరెంట్స్ లాగా తన పేరెంట్స్ ఎందుకు బిహేవ్ చేయరు. వయసులో ఉన్న ఆడపిల్ల మోడ్రన్‌గా. అందంగా ముస్తాబవ కూడదా. తలగడలో ముఖం దాచుకుని భోరుమంది.
జాలీబాయ్ సందేశం కంప్యూటర్ స్క్రీన్ మీద.
ఒక్కసారిగా బాధ పటాపంచలైంది.
ఇంట్లో వారిపైన ఒక రకమైన తిరుగుబాటు ధోరణి… తెగింపు. తన స్వేచ్ఛకు అంతా అడ్డు తగులుతున్నారన్న భావన. తన అందానికి అసూయ చెందుతున్నారనే ఆలోచన…
కంప్యూటర్ స్క్రీన్‌పైన ఆ మెసేజ్ చూడగానే పట్టరాని ఆనందం.
‘హాయ్… నీ హాబీస్’ అంటూ స్పందించింది అశ్విని.
అంతే…
కథ అక్కడ మలుపు తిరిగింది.
ఏదో తెలియని ఆకర్షణ. నవమన్మథుడిలా కనిపించిన జాలీబాయ్ ప్రొఫైల్ ఫోటో… హృదయం పైన ముద్ర వేసింది.
పరిమళింపు జల్లుల్లా మెసేజస్.
….
….
‘నీకు తెలియదు. మా పేరెంట్స్ నియంతల్లా బిహేవ్ చేస్తుంటారు. హిట్లర్, ముస్సోలిలను కలిపి ఒకరిగా చేస్తే ఎలా ఉంటారో అలా’
‘పట్టించుకోకూడదు. వాళ్ళ ఆలోచనలకు వాళ్ళను వదిలేయాలి’
‘నేను ఆడపిల్లను కదా’
‘సో వాట్. ఆడపిల్లలు ఎంజాయ్ చేయకూడదా!’
‘మరి ఎట్లా ?’
‘జస్ట్ ఇగ్నోర్… అన్ని విషయాలు వాళ్ళతో షేర్ చేసుకోనక్కర్లేదు. పర్సనల్ అనేది కొంత ఉంచుకోవాలి’
హాబీస్తో ప్రారంభమై మ్యూజిక్, సినిమాలు, సినిమా తారల వ్యవహారాలు, రొమాంటిక్ సీన్స్ అలా ఎన్నో విషయాలు కొన్ని రోజల పాటు..
తరువాత స్మార్ట్ ఫోన్లో సంభాషణలు..
అమ్మానాన్నలకు అశ్విని వ్యవహారశైలిలో వచ్చిన కొత్త మార్పుకు వర్రీ కావడం ప్రారంభమైంది.. కాలేజీ విషయాలు చెప్పడం పూర్తిగా మానేసింది ఇంట్లో. దూరం దూరంగా ఉంటోంది. ఒంటరితనం కోరుకుంటోంది. తను.. తన గది.. కంప్యూటర్‌కు పరిమితమైపోయింది. ఏం అడిగినా దాట వేస్తున్నట్లు జవాబులు. ప్రాజెక్టు అంటుంది… క్విజ్ ప్రోగ్రాం అంటుంది. కాంపిటీషన్స్ అంటుంది…
చిత్రం-
ఈ మధ్య స్నేహితులతో కూడా కలవడం తగ్గిపోయింది. బాగా చనువున్న ఫ్రెండ్స్ అడిగేసారు. ‘బాయ్ ఫ్రెండ్ దొరికాడా ?’ కాదని దాటేసింది. కానీ సిగ్గు బుగ్గలను ఎర్రబరచింది.
ఒకరిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్‌తో జాలీబాయ్ గురించి చెప్పింది. జస్ట్ఫ్రెండ్ అంది. కానీ అతని గురించిన ఆలోచనలను మనసులోనే దాచుకుంది.
జాలీబాయ్ కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపించినా, ఫోన్లో పలకరించినా ఒళ్ళంతా ఏదో పులకింత. కళ్ళు మూసినా, తెరిచినా అతని మెసేజ్‌లు…
‘మీ పేరెంట్స్ గొప్పవాళ్లు కావచ్చు. కానీ అంత స్ట్రిక్ట్ అయితే ఎలా ? నీలో తెగింపు ఉంటేనే లైఫ్ ఎంజాయ్ చేయగలవు. సంకెళ్ళను తెంచుకుని బయటపడాలి. బయట అందమైన ప్రపంచముంది. అనుభవించాల్సిన వయసుంది..’
జాలీబాయ్ మనసంతా ఆక్రమించుకున్నాడు.
ఆ విషయాల్ని ఫ్రెండ్ సుమనతో పంచుకోవా లనుకుంది. అంతా విని ‘ఇలాంటి సంబంధాలను సీరియస్‌గా తీసుకోకూడదు. ఇలాంటి వాళ్ళు అమ్మాయిలతో కాలక్షేపం చేసి ముంచుతారు. ఇన్వాల్వ్ కాకపోవడమే మంచిది. చాలామంది అనుభవాలు తెలుసు. జాగ్రత్తగా ఉండాలి’ అందామె.
ఆ మాటలు రుచించలేదు. ఆ టాపిక్ ఇక ఎత్తకూడదు అనుకుంది.
ఆ మరునాడు జాలీబాయ్ పలకరించాడు. ఎక్కడుంటున్నదీ వివరాలు అడిగాడు.
ఆలోచనలు భయపెట్టాయి. దాంతో చెప్పలేదు. మాట మార్చింది. జాలీబాయ్ పట్టించుకోలేదు.
‘నీ కళ్ళు ఎలా ఉంటాయి ? విశాలంగానా ! నేను ఈత కొట్టొచ్చా?’
ఆ మాటలకు అశ్విని ఇబ్బందిగా ఫీలైంది ఎందుకో…
అయితే ఆ ఇబ్బందిలోనే ఒక థ్రిల్..
తన స్నేహితురాళ్ళలో చాలా మందికి బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారు. బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అవుట్ స్కర్ట్స్‌లో బైకులమీద షికార్లు చేస్తుంటారు.. మల్టీప్లెక్స్‌లో మూవీస్… స్మార్ట్ఫోన్లలో థ్రిలింగ్ వీడియోస్, స్వీట్ మెసేజెస్… పేరెంట్స్‌కు తెలిస్తే ఏమవుతుందన్న విషయం ఎవరికీ పట్టదు..
సుమన రెండురోజులుగా కాలేజీకి రాలేదు. అశ్విని ఇంటికి వెళ్ళింది కలుసుకోవాలని.
‘ఎందుకు రావట్లేదు ?’ అడిగింది.
సుమన ముఖం అదోలా ఉంది. నీరసంగా. కళ్ళ కింద నల్ల చారలు. కళ్ళలో ఒకలాంటి భయం. ఎంతో చలాకీగా కనిపించే సుమనేన అనిపించింది. ఆమె కళ్ళలోంచి నీటి బిందువులు బుగ్గల మీదగా జారుతున్నాయి.
అశ్విని ఏం అడిగినా సుమన నుంచి జవాబు లేదు. ఏదో చెప్పలేని బాధ ఉందని అర్థమైంది. మూగగా ఉండిపోయింది సుమన.
ఆ వారంలోనే అశ్విని, సుమన తల్లులు రైతుబజార్లో కలుసుకున్నప్పుడు షాక్‌కు గురి చేసే విషయం బయటకొచ్చింది.
బజారు నుంచి ఇంటికొచ్చిన తల్లి అశ్వినిని చూసీ చూడగానే భోరుమంది.
ఇల్లంతా నిశ్శబ్దం.
ఎప్పటికో మాటలు మేల్కొన్నాయి.
‘అశ్వినీ… తెలుసా ఏం జరిగిందో. నీ ఫ్రెండ్ సుమన ఒక సమస్యలో చిక్కుకుంది. ఎవరో అబ్బాయితో ప్రేమలో పడింది’
‘అవును ప్రకాశ్ అని’ నెమ్మదిగా అంది.
‘ప్రకాశ్ కాదు… ఈ అబ్బాయి ఎవరో, ఎప్పుడూ కలవలేదు. చూడలేదు. ఇంటర్నెట్లో కబుర్లు… కాలక్షేపం…’
అశ్విని గుండెల్లో రాయి పడినట్టు అయింది.
‘నెట్లో పరిచయానికే వాడు ఏవేవో అడగడం, ఈ పిచ్చిది వివరాలు చెప్పడం..’ చెప్పుకుంటూ పోయింది తల్లి.
‘……………..’
‘సుమన ఒక ఫోటో కూడా పంపిందట. చెప్పిన రోజున చెప్పిన చోటుకి కలవడానికి వెళ్ళిందట… ఏదో కాఫీ షాప్. చీకటి పడిపోయింది దా. ఇంటిదాకా వచ్చి డ్రాప్ చేస్తానన్నాడట. జన సంచారం లేకపోవడం చేత ఏం బుద్ధి పుట్టిందో ఏమో ఒక్కసారిగా మీద పడ్డాడట. అరిచినా లాభం లేకపోయింది. లక్కీగా ఏ సినిమాలో చూసిందో ఏమో పెప్పర్‌స్ప్రే బ్యాగులో ఉంచుకునే అలవాటుందట. దాంతో రక్షించబడింది. అయితే బట్టలు చిరగడం, మోకాళ్ళు, చేతులకు దెబ్బలు… పిల్ల బెదిరి పోయింది… వాడు పారిపోయాడట. ఆడపిల్లలు ఇదో హెచ్చరికగా తీసుకోవాలి. ఇంటర్నెట్ ఓ మాయా జాలం. చాలా జాగ్రత్తగా ఉండాలి.
అశ్వినికి ఒక్కసారి కళ్ళు తెరుచుకున్నాయి. ఎన్నోసార్లు సుమన తనను వార్న్ చేసింది. కానీ తనే ఆ విష వలయంలో చిక్కుకుంటుందని ఊహించలేదు.
‘పోలీసులకు ఏమన్నా…’ అంది అశ్విని.
‘ఏమో… ప్రయత్నాలు చేయకుండా ఉంటారా. అంత తేలికా పట్టుకోవడం. ఇలాంటి వాళ్ళు ఎంతమందో… ఏ అమ్మాయి పడుతుందా అని ఎదురు చూస్తుంటారు ‘నెట్’లో బలత్కారాలు, హత్యలు.. ఎన్ని టీవీల్లో చూడటం లేదు…’
అశ్విని నోట మాట పెగల్లేదు.
‘… పట్టుకునేందుకు అవసరమైన వివరాలన్నీ పోలీసులు అమ్మాయి నుంచి సేకరించారు. ఏమైనా అమ్మాయిలు ధైర్యంగా ఉండాలి. కానీ మొండి ధైర్యం పనికిరాదు. ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి. ఎందుకంటే ఎవరి జీవితం వారిదే’
వారం తరువాత
ఊహించని విషయం ఏమిటంటే సుమనను వలలో వేసుకున్నది తన ‘జాలీబాయ్’ మిత్రబృందం లోని వాడే కావడం. ఎప్పుడైతే ఈ విషయం బయటపడిందో నెట్లో ‘జాలీబాయ్’ కథ ముగిసింది.
అశ్విని కళ్ళు మాత్రం బాగా తెరుచుకున్నాయి.
– మంత్రవాది మహేశ్వర్