విషాద వినోదం

విషాద వినోదం

‘అమ్మమ్మా నీకిష్టమని మా అమ్మ పాకుండలు చేసింది ఇవిగో తిను’ అంటూ పదహారేళ్ల ఆ అమ్మాయి డబ్బా తెరచి అందించింది.

‘అరిసెలు కూడా పంపిందమ్మమ్మ ఇవి కూడా తీసుకో’ నవ్వుతూ అందించాడు అక్కడున్న మరో అబ్బాయి.

డెబ్భై ఏళ్ళ వాళ్ళ అమ్మమ్మ పసిపాపలా నవ్వుతూ ‘ఇంకా నా పళ్ళు పని చేస్తున్నాయని మీ అమ్మకు ఎంత నమ్మకం రా’ అంది.

‘అమ్మ నీకు రెండు చీరలు కూడా పంపించింది. తప్పకుండా కట్టు కొమ్మని చెప్పిందమ్మమ్మ’ అంది ఆ అమ్మాయి. ఆ చీరల్ని చూడగానే పెద్దావిడ కళ్లలో నీళ్లు తిరిగాయి.

వాళ్ళనలా గుడ్లప్పగించి చూడటం సభ్యత కాదని తెలుసు. కాని ఈ కవల పిల్లలిద్దరూ వాళ్ల అమ్మమ్మాను చూసేందుకు వచ్చినప్పుడల్లా వాళ్లనే గమనిస్తూ ఉండిపోయే నా కళ్లను నేనెప్పుడూ అదుపు చేసుకోలేను. ఎంత ఈ వృద్ధాశ్రమంలో ఉద్యోగినైనా ఆ ¬దాను ఇలా ఉపయోగించుకోవడం ఇష్టం లేకపోయినా, ఆ పిల్లలున్నంత వరకు నేను అక్కడే ఏదో ఒక పని కల్పించుకుని తచ్చాడటమో, ఆవిడ ఉండే గదికి పక్కనే ఉండే నా టేబుల్‌ దగ్గర ఏదో రాసుకుంటు న్నట్టుగా నటించడమో నా బలహీనత.

నేను ఇక్కడ ఉద్యోగంలో చేరి పదేళ్లు కావస్తోంది. రెండేళ్ల క్రితం ఈ కవల పిల్లలిద్దరూ, వాళ్లమ్మ, ఆ పెద్దావిడ కలిసి ఆశ్రమానికి రావడం నాకెప్పుడూ తాజాగానే ఉంటుంది. ఎందుకంటే ఆ పెద్దావిడ తనంతట తానే ఆశ్రమంలో చేర్చమని వాళ్లకు చెప్పింది. చుట్టాల ఇంట్లో దిగబెట్టి వెళ్లినట్టుగా వాళ్లు వెళ్లారు. ఆ రోజు వాళ్లు పైకి సంతోషంగా కనిపించినా లోపల ఎంతో బాధపడుతున్నట్టుగా నాకు అనిపించింది.

తమ తల్లిదండ్రుల్ని ఇక్కడ చేర్చే కొడుకులు, కూతుళ్ళు నా దగ్గర రాసే వివరాల్లో ఫోన్‌ నంబర్లు కూడా రాయాలి. అయితే సాధారణంగా వాళ్ళిచ్చే నంబర్లన్నీ తప్పుడు నంబర్లే. పిల్లలు తమ తల్లిదండ్రుల్ని అక్కడ వదిలి వెళ్లి పోయేటప్పుడు కొందరు తల్లిదండ్రులు చేసే రోదనలు గుండెను మెలి పెట్టేస్తూ ఉంటాయి. ఇంకొంతమంది నిశ్శబ్దంగా దుఃఖిస్తూ కనిపించినప్పుడు ఆ బాధ ఓ రంపంలా నా హృదయాన్ని కోసినట్టుగా అనిపిస్తుంది.

‘అమ్మా రాధమ్మ. మా అబ్బాయి ఎప్పుడొస్తాడో కనుక్కో. ఇక్కడ నాకేమీ తోచకుండా ఉంది’

‘పాప రాధా మా అమ్మాయి వచ్చి రెండు నెలలైందమ్మా. కాస్త ఫోన్‌ చేసి రమ్మని చెప్పవా నీకు పుణ్యముంటుంది’

ఇలాంటి మాటలు రోజు నాకు వినిపిస్తూనే ఉంటాయి. వీళ్లు వంశోద్దారకులా? కావాలనే నంబర్లను తప్పుగా రాశారని వాళ్లకు చెప్పకుండానే సముదాయించే ప్రయత్నం చేస్తాను. కొందరు ఊరుకుంటారు. కొందరు కన్నీళ్లు కారుస్తారు. ఇంకొందరైతే ‘ఆ వెధవ తప్పు నంబర్‌ ఇచ్చి ఉంటాడు. అందుకే నువ్వు పిలవలేకపోతున్నావ్‌. నాకంతా తెలుసులే’ అని కోపంగా కన్నీటిని జారనివ్వకుండా జాగ్రత్తపడతారు.

ఆ పెద్దావిడ పేరు వసుంధర. ఆమె కూతురు, మనవలు మాత్రం ఫోన్‌ నంబర్‌ కరెక్టుగానే ఇవ్వడం నాకు వింతగా అనిపించింది.

నాతో పాటు ఈ ఆశ్రమంలోనే పనిచేసే మరో అమ్మాయి, ఇంకో ఇద్దరు అబ్బాయిలు కూడా సేవాభావంతోనే ఉండటం వల్ల వాళ్లకు అందే సేవల్లో ఏ లోపం ఉండదు. కాని రక్తసంబంధం ఇచ్చే రాగబంధం వేరు కదా ? అది మేం ఇవ్వలేం. ఆత్మీయుల పలకరింపుకు తపించిపోయే వాళ్ల ఆవేదనను పూర్తిగా తీర్చలేం.

‘చీరలు బాగున్నాయ్‌ రా. అమ్మకు చెప్పండి నేను కూడా బాగున్నానని. ఇంతకూ తనెప్పుడొస్తుంది? ఈ సారి వచ్చినప్పుడు తనను కూడా తీసుకొని రండి. తను డ్యూటీలో ఉంటుందని నాకు తెలుసు. కాని మధ్యలో ఏదో ఒకరోజు కుదుర్చుకొని రమ్మని చెప్పండి. బాగా చదువుకోండి ఇద్దరూ’ అని వాళ్ల చేతిలో కొంత డబ్బు పెట్టింది వసుంధర.

వెంటనే వాళ్లు ఆ డబ్బును తిరిగి ఆమె చేతిలోనే పెట్టేసి ‘వద్దు అమ్మమ్మ. నువ్వు సంతోషంగా ఉంటే మేం సంతోషంగా ఉన్నట్లే’ అని వాళ్ల మాటల్లో చెప్పేశారు.

‘అమ్మమ్మ మాట వినని పిల్లల్ని మిమ్ముల్నే చూశాను’ కోపాన్ని నటిస్తూ చెప్పింది వసుంధర.

‘అలా అయితే నేను అలుగుతాను. అక్క కూడా అలుగుతుంది’ ఆ అబ్బాయి గడుసుగా నవ్వాడు.

‘దొంగభడవల్లారా’ అంటూ వసుంధర కూడా నవ్వింది.

అన్నం తిను అమ్మమ్మ అంటూ వాళ్లు తెచ్చిన కేరేజ్‌ తెరుస్తూ ‘అమ్మ ఇవాళ నీ కోసం గుత్తొంకాయ కూర చేసింది. కాని నీ అంత బాగా తనకి రాదట కదా’ అంది ఆమె మనవరాలు.

‘అదేమీ లేదు. ఒక్కోసారి నాకంటే కూడా బ్రహ్మాండంగా చేస్తుంది మీ అమ్మ. ఈ సారీ అంతే’ బొటనవేలిని, చూపుడువేలిని కలిపి బాగుందన్నట్టుగా సైగ చేస్తూ చెప్పింది వసుంధర.

‘మీకు ఆకలి వెయ్యడంలేదేమర్రా? మిమ్మల్ని కడుపులు కాలబెట్టి నేను తీనేస్తున్నాను’

‘అబ్బే అలాంటిదేమీ లేదు. మేం ఇంటికి వెళ్ళగానే తినేస్తాం కదా. ఇవాళ అమ్మ వేరే టిఫిన్‌ చెయ్యలేదు. అన్నం తినేసి వచ్చాం లే. మరేం ఫర్వాలేదు’ చెప్పాడు మనవడు.

ఆమె భోజనం పూర్తయ్యాక కూడా ఎన్నో కబుర్లు చెప్పి గంట తర్వాత బయల్దేరారు ఆ పిల్లలిద్దరూ.

నేను కూడా నా బాక్స్‌ తెరచి భోజనం చేస్తున్నా. కాని నా రెండు చెవులు వాళ్ల మాటలు వినేందుకే ఆసక్తి చూపాయి. వాళ్లిద్దరికి ఒకే గవర్నమెంట్‌ రెసిడెన్షియల్‌ కాలేజీలో సీటు వచ్చిందని తెలిశాక అమ్మమ్మను చూసేందుకు వాళ్లు ఇక తరచూ రారని తెలిసి నా మనసు చివుక్కుమంది.

వసుంధర గారు మాత్రం బాగానే సర్దుకున్నారు. ‘రెండేళ్లే కదా. ఎంతసేపు? మీ అమ్మ వస్తూ ఉంటుందిలే. బాగా చదువుకోండి’ అని చెప్పారు వాళ్లకి.

‘సరే అమ్మమ్మ వస్తాం’ అని చెప్పి బయల్దేరారు. పిల్లలతో పాటు వసుంధర గారు కూడా వాళ్లను గేటు వరకు సాగనంపడానికి వెళ్లారు. ‘వస్తాం రాధాంటీ’ అని చెప్పి నా ముందు నుంచి ఆ ముగ్గురు బయల్దేరారు. నాపైన నమ్మకమో? మరేమో? తెలీదు కానీ ‘మా అమ్మమ్మ జాగ్రత్త’ అని వాళ్లెప్పుడూ చెప్పరు. ఆ పిల్లల తల్లి కూడా అంతే.

పిల్లల్ని సాగనంపి నా దగ్గరకు వచ్చి కూర్చున్నారు వసుంధర. కాసేపు తన కూతురు, మనవడు, మనవరాలు గురించి కబుర్లు చెప్పారు.

మరో ఆరునెలలు గడిచాయి. మధ్యలో రెండుసార్లు వసుంధర కూతురు వచ్చి వెళ్లింది. కాని పిల్లలు మాత్రం రాలేదు. ఏవో పోటీ పరీక్షలకు సిద్ధం చేయడం కోసం కాలేజీ వాళ్లు పిల్లల్ని ఇంటికి పంపడం లేదని చెప్పారు వసుంధర, ఆమె కూతురు.

మరికొన్నాళ్లు గడిచాయి. వసుంధర గారి కూతురు రాకపోకలు బాగా తగ్గి పోయాయి. మొదట అయిదు నెలలు. ఆ తర్వాత ఏడెనిమిది నెలలు. మళ్ళీ ఆమె ఎప్పుడొస్తుందో అని వసుంధర గారి కంటే నాకే ఆత్రుత ఎక్కువయ్యేది. పిల్లలు కూడా ఎందుకు రావడం లేదు అన్న బాధ నన్ను దహించివేసేది.

నా కలవరానికి వసుంధర గారు నవ్వి ఊరుకునే వారు. పైకి నవ్వినా ఆమె బాధను దాస్తోందని నాకు అర్థమయ్యేది. పిల్లలు వెళ్లి రెండేళ్లు గడుస్తాయనగా ఒకరోజు ఉదయాన్నే నేను ఆశ్రమం గేటు దాటగానే కనిపించిన దృశ్యాన్ని చూసి కొయ్యబారిపోయాను. ఎదురుగా వసుంధర గారి నిర్జీవదేహం. గబగబా దగ్గరకు వెళ్ళాను. అప్రయత్నంగా నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తెల్లవారు ఝాము నాలుగున్నర ప్రాంతంలో ఆవిడ పక్క గది తలుపు తట్టి గుండె పట్టినట్టుందని చెప్పి, మరో రెండు నిమిషాలకే ఆ గుమ్మం దగ్గరే కుప్పకూలి పోయారట. ఆశ్రమంలోనే ఉండే డాక్టర్‌ వచ్చి ఆమె మరణించారని బాధపడుతూ చెప్పారట.

అక్కడున్న పెద్దవాళ్ళంతా ఆవిడ కలుపుగోలు తనాన్ని, పలకరించే తీరును, ఎవరైనా బాధపడితే చెప్పే ఓదార్పు మాటలను, తనకు ఏడుపొచ్చినా కప్పి పుచ్చుకునే ఆత్మాభిమానాన్ని చెబుతూ బాధపడుతుంటే ఇంకా పెద్దవవుతోన్న నా కన్నీళ్లను బలవంతంగా ఆపుకొని, జరగవలసిన కార్యక్రమాలలో పడ్డాను. వసుంధర గారి కూతురికి ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా ఫోన్‌ ఆఫ్‌ చేసి ఉన్నట్టుగానే జవాబు రావడంతో చేసేదేమీ లేక ఆమె దహన సంస్కారాలన్నీ ఆశ్రమ వాసులందరి సహాయంతో పూర్తి చేయించాను.

ఆశ్రమం అంతా అలముకున్న నిశ్శబ్దం దుఃఖాన్ని మరింతగా పెంచుతోంది. ఇక్కడ ఎవరు చనిపోయినా దాదాపు నెల వరకు ఎవరూ మామూలు మనుషులు కాలేరు. ఎక్కడినుంచో వచ్చి ఇక్కడ తలదాచుకున్నా ఒకరిపై ఒకరు చూపే ఆప్యాయతకు కారణం బహుశా తాము కోల్పోయింది ఇంకొకరికి అందించాలనే తాపత్రయమేమో?

మౌనంగా కూర్చున్న నాకు టేబుల్‌ మీద వసుంధర గారి డైరీ కనిపించింది. ఇంకేదైనా ఫోన్‌ నంబర్‌ దొరుకుతుందేమో అని భావించి ఆ డైరీని అందుకుని పేజీలు తిప్పాను. ఆశ్రమంలో తను గడిపిన విషయాలు, అప్పుడప్పుడు తన కూతురు, ఆమె పిల్లలు వచ్చి వెళ్లినప్పుడు పొందిన సంతోషకరమైన అనుభూతుల గురించి అందంగా రాసుకున్నారామె.

డైరీలోని విషయాలు ఒక్కొక్కటీ గుండెను పిండుతున్నాయి.

‘నీ భర్తను కోల్పోయిన ఒంటరితనం నుంచి నువ్వు పూర్తిగా కోలుకోకుండానే నేను ఆశ్రమానికి రావలసి వచ్చింది. నీ మనసుకు కష్టమని తెలుసు. కాని నేను నీకు ఆర్థికంగా భారం కాకూడదనే ఇలా వచ్చేశాను. ఈ ఆశ్రమం ఓ సేవాసంస్థ ఆధ్వర్యంలో నడుస్తుంది. కావున నాకు డబ్బులతో పనిలేదు. నా పెన్షన్‌ డబ్బుల తోను, నీకు హాస్పిటల్లో వచ్చిన చిన్న ఉద్యోగంతోను నువ్వు, పిల్లలు హాయిగా బతకాలని నా ఆశ. నువ్వెంత బ్రతిమాలినా నేను నీ దగ్గర ఉండకపోవడానికి అదే కారణం తల్లీ’

‘పిల్లలు వచ్చినప్పుడల్లా మనసుకెంతో హాయిగా ఉంటుంది. వాళ్లతో కలిసి ఇంటికి వచ్చేద్దామని కూడా అనిపిస్తుంది. కాని ఇలా ఉండటంలో కూడా ఓ విధమైన స్వేచ్ఛ ఉంది. ఇష్టం లేని స్వేచ్ఛే అయినా స్వేచ్ఛ స్వేచ్ఛే కదా! హహహ ఏమిటేమిటో రాసేస్తున్నా కదూ !’

‘ఇవాళ పిల్లలొచ్చి రెసిడెన్షియల్‌ కాలేజీలో సీట్లొచ్చాయని చెప్పగానే చాలా సంతోషంగా అనిపించి. కాని నువ్వు ఒంటరై పోతున్నావని బాధగా కూడా అని పించింది. వాళ్ళేమైపోతారో అని నీ జీవితానికి మరో వెలుగు లేకుండా చేసుకున్నావు. పెళ్లి చేసుకోమంటే ససేమిరా అన్నావు. అంతేలే నాన్న గారు చనిపోయాక నేను కూడా నిన్ను బాగా పెంచుకోవడంలోనేగా దృష్టి పెట్టాను ! అయినా నీకు మంచి ఉద్యోగం వచ్చేలా చదివించలేకపోయాను. నాకెంతసేపూ నిన్ను ఓ అయ్య చేతిలో పెట్టడమే ముఖ్యం మరి. కాని అతను కూడా అర్థంతరంగా ఆయుష్షు ముగించుకుంటాడని ఎవరనుకున్నాం? మన దురదృష్టం అంతే. భయపడకు, వాళ్లు ఎదిగొచ్చాక నీకు సాయపడతారులే’

‘ఇప్పుడు పిల్లలు రావడం లేదు, నువ్వూ రావడం లేదు. ఎందుకింత విరామం. నీకు ఉద్యోగ బాధ్యతలు ఎక్కువయ్యాయా ? నేను రాసుకోవడమే తప్ప జవాబు తెలియని ప్రశ్నలివి. అయినా నేను నీతో మాట్లాడినట్టుగానే నాకనిపిస్తుంది. నిద్రలేని రాత్రులను నిర్విఘ్నంగా సాగదీయాలంటే ఇంతకంటే దారేముంది చెప్పు?’

‘త్వరగా రండర్రా. పిల్లల పరీక్షలైపోయినా రాలేదు. నువ్వూ తగ్గించేశావు. ఏమైందిరా తల్లీ. ఎందుకు రావడం లేదు? డ్యూటీలు ఎక్కువై పోయాయా? నీ ఆరోగ్యమేమైనా బాగుండడం లేదా? నిన్ను చూడాలని ఉందమ్మా. ఇంకెన్నాళ్లో ఉండనని నాకెందుకో బలంగానే అనిపిస్తోంది. ఒక్కసారి రావూ ప్లీజ్‌’

‘ఈ రోజు నువ్వొచ్చాక పండగొచ్చినట్టే అనిపించింది. అంతలోనే పిడుగులాంటి వార్తను చెప్పావు. ఇక్కడ మీ హాస్పిటల్‌ బ్రాంచ్‌ని మూసేశారా? అయ్యో ఎంత ఘోరం? హైదరాబాద్‌కి ట్రాన్స్‌ఫరా?! పోనీ నీతో వచ్చేస్తా అని చెబుదామంటే నువ్వేమంటావో అని భయం. దూరంగా ఉన్నా స్థానికంగా ఉండటం వేరు. ఇక్కడే ఎంతో దగ్గరగా నువ్వూ నీ పిల్లలూ ఉన్నారులే అన్న భరోసా ఈ ఒంటరితనానికి జవాబుగా అనిపిస్తుంది. ఏమిటో ఈ ఊగిసలాట. ఏదో పాత పాట గుర్తుకొస్తోంది సుమీ ‘ఊగిసలాడకె మనసా..నువ్వు ఉబలాటపడకే మనసా’

పేజీలు తిపుతున్న కొద్దీ నాకు మరింత బాధగా అనిపిస్తోంది. భారంగా లేచి వరండాలో ఉన్న కుండలోని మంచినీళ్ళు తాగి వచ్చి కూర్చుని రెండు నిమిషాలు కళ్లు మూసుకున్న. దట్టంగా కమ్మిన నీటిపొరలు రెప్పలను త్వరగా మూతపడనీయలేదు. రెప్పల సందుల్లో నుంచి అవి ముత్యాల్లా దొర్లుతూ నేల జారాయి. కళ్లు తుడుచుకుని మళ్ళీ ఇంకొన్ని పేజీలను తిప్పకుండా ఉండలేకపోయాను.

‘ఏమైందమ్మా? నీ ఫోన్‌ కలవడం లేదని రాధ చెబుతోంది. పిల్లల జాడ కూడా లేదు. నాకేదో భయంగా ఉందిరా’ మీరెవరో ఒకరు వస్తే కాని నాకు మనశ్శాంతిగా ఉండదు’

‘ఇవాళ మళ్ళీ రాధతో నీకు ఫోన్‌ చేయించాను. పాపం ఎంత మంచిదో అసలు విసుక్కోదు. తను విసుక్కోకుండా అన్ని సార్లు నీకు ఫోన్‌ చేసినా ఏం లాభం? నీ ఫోన్‌ పలికితేగా? మర్చిపోయావా ఈ తల్లిని ? నా మనవలను కూడా పంపించవా ? త్వరగా వచ్చి ‘అమ్మ’ అని నువ్వు, ‘అమ్మమ్మ’ అని వాళ్లూ ఒక్కసారి పిలిస్తే చాలు. అది విని ఆనందంగా చచ్చిపోతానే’

అవే వసుంధర గారి ఆఖరి వాక్యాలవడం నన్ను మరింత దుఃఖించేలా చేశాయి.

వసుంధర గారు నాకు రక్తసంబంధికులు కాకపోయిన ఆమె నాతో పంచుకున్న విషయాలు, కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు వాళ్ళకు ఆమె చెప్పే కబుర్లు, ఇవన్నీ తెలీకుండానే ఆమెకు నన్ను దగ్గర చేశాయి. అందుకే మరో మూడు నెలలు గడిచినా కూడా నేను మామూలు మనిషిని కాలేకపోతున్నాను.

‘రాధాంటీ బాగున్నారా?’ చిరపరిచితమైన జంట స్వరాలు విని విస్మయంతో తల పైకి ఎత్తాను ఓ రోజు.

ఎదురుగా వసుంధర గారి మనవడు, మనవరాలు.

‘ఏమైంది బాబూ? ఏమైందిరా తల్లీ? మీరు, మీ అమ్మ రాక అమ్మమ్మ చాలా బాధపడిపోయా రమ్మా’ వాళ్లను దగ్గరగా తీసుకొని మనసులోనే రోధించాను.

‘మాకు కాలేజీ నుంచి రావడం వీలు కాలేదు అంటీ. అమ్మమ్మ దగ్గరకెళ్ళొస్తాం’ గబగబా అడుగులెయ్యబోతూ చెప్పారిద్దరూ.

‘ఇంకెక్కడి అమ్మమ్మరా తల్లీ’ అంటూ మళ్ళీ ఆ పాపను, బాబును దగ్గరకు తీసుకున్నాను.

ఆ మాట విని తట్టుకోలేక వాళ్ళిద్దరూ ‘అమ్మమ్మ’ అని అరుస్తూ పెద్దగా రోధిస్తున్నారు. ఆశ్రమవాసు లంతా వచ్చి వాళ్ళను ఓదార్చే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయిది. దాదాపు గంటన్నర సేపు ఆ అక్కా, తమ్ముళ్ల వేదన అందరి హృదయాలను పగిలేలా చేసింది.

అందరం తలో మాట చెప్పి పిల్లలను ఊరుకో బెట్టాం. వెక్కిళ్లు పెడుతున్న వాళ్ళిద్దరినీ నీళ్లు తాగించి స్థిమితంగా కూర్చోబెట్టాను.

చాలాసేపు దొర్లిన నిశ్శబ్దం తర్వాత బాబు నోరు విప్పాడు. ‘కనీసం అమ్మమ్మ చితాభస్మం అయినా ఉందా అంటీ?’

మళ్ళీ నా కళ్లల్లో ఒక్కసారిగా నీళ్లు చిప్పిల్లాయి. బలవంతంగా ఆపే ప్రయత్నం చేస్తూ చెప్పాను. ‘అవును మీరు ఎప్పటికైనా వస్తారని ఉంచాను. మీరంటే కాలేజీలో ఉండిపోయారు. అమ్మకి ట్రాన్స్‌ఫర్‌ అయిందని తెలుసు. కాని ఒక్కరోజైనా సెలవు పెట్టి రాలేకపోయిందేంటమ్మా?’

‘రాధాంటీ అమ్మ కూడా శాశ్వతంగా సెలవు తీసుకుని వెళ్లిపోయింది. ట్రెయిన్‌లో వస్తుంటే ప్రమాదంలో బోగీ కాలిపోయింది’ పెల్లుబికిన దుఃఖంతో నా భుజం మీద వాలిపోయింది పాప. నాకు ఏం మాట్లాడాలో తెలీలేదు. అప్రయత్నంగా బాబును కూడా దగ్గరకు తీసుకున్నాను.

విషాదానికెంత వినోదం?

– రాజేష్‌ యాళ్ల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *