రాజకీయాల్లో విభేదాలు సహజం. విభేదాలు లేకపోతే అసలైన ప్రజాస్వామ్యానికి అర్థమే లేదు. అయితే అవి రాజకీయ అంశాలపరంగా అంటే పాలకపక్షం అవలంబిస్తున్న విధానాలు సరిగా లేవని గాని, లేదా ఫలానా విధంగా చేస్తే ప్రభుత్వ ఖజానాకు తక్కువ వ్యయమయ్యే సానుకూల ఫలితాలు వస్తాయనిగాని చెప్పొచ్చు. అంతేగాని నాయకుల వ్యక్తిగత విషయాలకు, దేశ అభివృద్ధికి ముడిపెట్టడం కరెక్టు కాదు.
ఎబిఎన్-ఆంధ్రజ్యోతి ఛానల్లో ఏప్రిల్ 1వ తేదీన ‘అతడొక అపరిచితుడు’ శీర్షికతో ఓ చర్చా కార్యక్రమం నిర్వహించారు. దానికి ఓ ప్రముఖ మనస్తత్వశాస్త్ర నిపుణుడు ముఖ్య అతిథిగా వచ్చారు. ప్రధాని నరేంద్రమోది వ్యక్తిగత విషయాలకు, దేశ అభివృద్ధికి ముడిపెడుతూ ఆయన మాట్లాడారు. ఆ ప్రోగ్రాంపై ఓ విశ్లేషణ.
వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లొద్దు
ప్రధానమంత్రి పదవిలో ఉన్న మోది సతీమణి ఎక్కడో దూరంగా ఉంటున్నారని, ఆయన సోదరుడు ఇంకా కిరోసిన్ డీలర్గానే ఉన్నాడని, మోదికి బంధుప్రీతి లేదని, ప్రజలపైన కూడా ఆయనకు గౌరవం లేదని చర్చలో పాల్గొన్న వక్త విమర్శించారు.
ప్రస్తుతం ఓ వ్యక్తి కేవలం పంచాయితీ స్థాయి పదవిని అధిష్టించినా ఆయన బంధువులందరూ ఉన్నతోన్నత స్థాయికి ఎదగడం, అలారటి వారి అనైతికత విమర్శలకు గురి కావడం కూడా మనం చూస్తున్నాం. ఈనేపధ్యరలో మోది వ్యక్తిత్వాన్ని తప్పు పట్టి వక్త తన అవగాహనా రాహిత్యాన్ని వెల్లడిరచుకున్నారు. ఈ సందర్భంగా మనం నరేంద్ర మోది చరిత్రను ఓ సారి పరిశీలిస్తే ఆర్.ఎస్.ఎస్. ప్రచారక్గా అన్నీ వదిలి దేశ ఆశయాలే ఎజెండాగా ఎదిగిన వ్యక్తి ఆయన. మోది ఎన్నడూ పదవుల కోసం ఆరాటపడలేదు. పదవులే ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాయి. అలాంటి వ్యక్తి ఎంత ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ తన కుటుంబ సభ్యులు నిజాయితీగా, సింపుల్గా ఉండాలనే కోరుకుంటారు. అంతేగాని ఆయనకు కుటుంబ సభ్యుల పట్ల అభిమానం లేక కాదు. వాస్తవంగా చెప్పాలంటే ఇలాంటి వ్యక్తి మన దేశ ప్రధానిగా ఉన్నందుకు మనం గర్వపడాలి. అంతేకాని విమ ర్శించి అల్పబుద్ధిని బయట పెట్టుకోవడం తగదు.
పరిజ్ఞానం లేనిదే ప్రధాని అయ్యారా ?
ఆ వక్త మోదిని మరో విషయంలో కూడా తీవ్రంగా విమర్శించారు. ప్రధాని మోదికి ఏ విషయంలోనూ పరిజ్ఞానం లేదని, తన మంత్రి వర్గంలో అనర్హులను చేర్చుకున్నాడన్నారు. ఇది కరెక్టు కాదు. ఎందుకంటే మోది నాలుగేళ్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా విశేష సేవలందించారు. అక్కడ ఎన్నో అభివృద్ది కార్యక్రమాలకు అంకురార్పణ చేశారు. ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి. అందుకే ప్రజలు ఆయన్ను ప్రధానిగా చూడాలనుకున్నారు. గత పద్నాలుగేళ్లుగా దేశ ప్రజల్ని అభివృద్ది బాటలో నడిపిస్తున్నారు. అంతేకాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధానిగా సేవలందిస్తున్నారు. ఇవన్నీ అయనకు పరిజ్ఞానం లేకుండానే సాధ్యమవుతాయా ? ప్రధాని తన మంత్రివర్గంలో ఎవర్ని చేర్చుకోవాలన్నది ఆయన వ్యక్తిగత అంశం. అనుభవం ఉన్నవాళ్లను లేదా ఫలానా రంగానికి సంబంధించిన నిపుణులకు మంత్రులకుగా అవకాశం ఇస్తారు.
తెలుసుకోకుండా మాట్లాడొద్దు
అంతేకాకుండా మోది మాట మార్చడంలో నెం.1 అని విమర్శించారు. 2015లో అమరావతిలో రాజధాని శంకుస్థాపనకు మోది వచ్చినప్పుడు ‘అమరావతిని ఢిల్లీని మించిన రాజధానిగా చేస్తా’ అన్నారని గుర్తుచేశారు. అయితే ఇక్కడ మనం ఇంకో విషయాన్ని గుర్తుంచుకోవాలి. మోది మాటల్లోని అర్థం ఏంటంటే అమరావతికి ఢిల్లీ మాదిరి సౌకర్యాలు కల్పించడం. అంతేగాని రంగులద్దడం, ఆకాశ హర్మ్యాలు నిర్మించడం కాదు.
ప్రాధాన్యాలు తెలీదా ?
ప్రధానికి ప్రాధాన్యం గురించి తెలీదని కూడా ఆ వక్త అన్నారు. మోది దృష్టిలో ప్రాధాన్యం అంటే ఎప్పుడు ఏ పని చేయకపోతే దేశం తీవ్రంగా నష్టపోతుందో ఆ పనిని చేయడం. అందుకే ఆనాడు ‘పెద్దనోట్ల రద్దు’ తప్పనిసరి అయింది. మరి దానివల్ల అద్భుతాలు జరిగిపోయాయా? అంటే అద్భుతాలు భవిష్యత్లో తప్ప జరుగుతాయి. ప్రస్తుతం అనర్థాలు తప్పాయి.
అనుచరులే సహచరులు
మోదికి అనుచరులే తప్ప సహచరులు లేరని కూడా విమర్శించారు. అసలు ఈ రెండింటికీ పెద్ద తేడా ఉండదు. అనుచరులే సహచరులవుతారు. అలాకాక అనుక్షణం వెన్నంటి ఉన్నవాడే అనుచరుడు, సహాయం చేసేవాడే సహచరుడు అని వర్గీకరించినా మోదికి ఆ స్థాయి జనాభా అధికమే. ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి రాకముందే ఆర్.ఎస్.ఎస్.లో కీలక బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా ప్రజలతో మంచి సంబంధాలున్నాయి.
విభేదాలు విధానాల పరంగా ఉండాలే తప్ప వ్యక్తిగతంగా ఉండరాదు. ఇవేవి తెలుసుకోకుండా కేవలం రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఇతరులపై బురద చల్లే ప్రయత్నం చేస్తే వారే నష్టపోతారు.
– స్ఫూర్తి