విఫలమైన ‘ఆచారి అమెరికా యాత్ర’

విఫలమైన ‘ఆచారి అమెరికా యాత్ర’

నవలగా విశేష ఆదరణ పొందిన చాలా రచనలు వెండితెరపైకి సినిమాగా మారేసరికి ఆ పట్టును కోల్పోతాయి. దాంతో విఫల ప్రయత్నాలుగా మిగిలిపోతాయి. యండమూరి వీరేంద్రనాథ్‌ నవలలతో పోల్చితే, మల్లాది వెంకట కృష్ణమూర్తి నవలలు సినిమాలుగా విజయం సాధించింది తక్కువ. అయినా ఆయన రచనలను సినిమాలుగా తెరకెక్కించడానికి ఎంతోమంది దర్శకులు తాపత్రయ పడుతుంటారు. తాజాగా అలా వచ్చిందే ‘ఆచారి అమెరికా యాత్ర’ సినిమా. మల్లాది రచనను ఆధారం చేసుకుని దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి ఈ సినిమా రూపొందించారు. మంచు విష్ణు, ప్రగ్యాజైస్వాల్‌ జంటగా కిట్టు, కీర్తి ఈ సినిమాను నిర్మించారు. ప్రముఖ నిర్మాత ఎం.ఎల్‌. కుమార్‌ చౌదరి సమర్పకుడిగా వ్యవహరించారు.

కథ ఏమిటనేది సినిమా పేరులోనే స్పష్టంగా ఉంది. ఆచారి అనే వ్యక్తి అమెరికా యాత్రకు సంబంధించిన సినిమా ఇది. అయితే ఆచారి అమెరికాకు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ? అక్కడ ఎలాంటి పాట్లు పడ్డాడు ? వాటి నుండి ఎలా తప్పించుకున్నాడు ? అనేది ఇందులో ప్రధానాంశం. అప్పలాచారి (బ్రహ్మానందం), కృష్ణమాచారి (మంచు విష్ణు) పౌరోహిత్యం చేస్తుంటారు. అందులో భాగంగా ఓసారి ఓ పెద్దాయన ఇంటికి వెళ్ళి హోమం చేస్తుంటే ఆ పొగకు ఆయన కాస్త బాల్చీ తన్నేస్తాడు. దాంతో ఆయన అల్లుళ్ళు తమ మామ చావుకు ఈ పంతుళ్ళే కారణమంటూ వెంటపడతారు. వారి నుంచి తప్పించుకోవాలంటే అమెరికా వెళ్ళటం తప్ప మరో గత్యంతరం లేదని కృష్ణమాచారి చెబుతాడు. ఇష్టం లేకపోయినా ఈ పురోహితుల బృందం అమెరికాకు వెళుతుంది. బోలెడు అబద్దాలు చెప్పి వారిని ఆమెరికాకు తీసుకొచ్చిన కృష్ణమాచారి అక్కడకు వెళ్ళాక అసలు విషయం చెబుతాడు. ఎవరి ఇంటికైతే వారు ¬మం చేయడానికి వెళ్లారో ఆ పెద్దాయన మనవరాలు రేణుక (ప్రగ్యాజైస్వాల్‌)ను తాను ప్రేమించానని, ఇప్పుడు ఆ అమ్మాయి అమెరికాలోనే ఉందని, ఇష్టంలేని పెళ్ళి చేసుకుంటున్న ఆమెను కాపాడటమే తన లక్ష్యమని చెబుతాడు. మరి ఆచారి అమెరికా ప్రయాణం సఫలం అయ్యిందా ? పెద్దాయన అల్లుళ్ళు నుండి ఆచారి తనను తాను కాపాడుకున్నాడా ? రేణుకను అనుకున్న విధంగా వివాహం చేసుకున్నాడా ? వీటికి సమాధానం మిగతా సినిమా !

గత కొంతకాలంగా మోహన్‌బాబు కుటుంబం లోని నటీనటులు ఎవరికీ పెద్దంతగా కలిసి రావడం లేదు. మోహన్‌బాబుతో సహా వారి కుమారులు విష్ణు, మనోజ్‌ సైతం మంచి విజయాన్ని అందుకుని చాలా రోజులే అయిపోయింది. మంచు లక్ష్మీ పరిస్థితీ అలానే ఉంది. ఆమె చేస్తున్న టివి కార్యక్రమాలకు లభిస్తున్న ఆదరణ సినిమాలకు లభించడం లేదు. ఈ నేపథ్యంలో వచ్చిన విష్ణు నటించిన ‘ఆచారి అమెరికా యాత్ర’ కూడా అదే బాటలో సాగింది. అవుట్‌ డేటెడ్‌ సబ్జెక్ట్‌తో కామెడీ పండించి, పబ్బం గడుపుకోవాలని చూసిన నిర్మాతలకు నిరాశే మిగిలింది. జి. నాగేశ్వరరెడ్డికి కామెడీ చిత్రాల దర్శకుడిగా మంచి పేరే ఉంది. కానీ పరమ రొటీన్‌ స్టోరీలను ఎంపిక చేసుకోవడం వల్ల గత కొంతకాలంగా అతనికీ సరైన విజయం లేకుండా పోయింది. ఈ చిత్రమూ దానికి మినహాయింపు కాదు. బ్రహ్మానందం వంటి స్టార్‌ కమెడియన్‌ను ప్రధాన పాత్రకు తీసుకున్నప్పుడు కథ, కథనాలపై మరింత శ్రద్ధ తీసుకుని ఉండాల్సింది. సినిమాలోని ఏ ఒక్కసన్నివేశం కూడా మనకు కొత్తగా అనిపించదు. వినోదాన్ని అందించదు. ఇక చివరలో వచ్చే పృథ్వీరాజ్‌ ఎపిసోడ్‌ అయితే ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. విష్ణు తన పాత్రను ఈజ్‌తో చేశాడు. ప్రగ్యా జైస్వాల్‌ గ్లామర్‌ డాల్‌లా ఉంది. కోట శ్రీనివాసరావు, ప్రభాస్‌ శ్రీను, ప్రవీణ్‌ వీళ్ళంత సీజన్డ్‌ ఆర్టిస్టులు కాబట్టి ఆయా పాత్రలను సులువుగా పోషించారు. తమన్‌ సంగీతమూ పెద్దంత ఆకట్టుకోలేదు. ఇలాంటి సినిమాలు చూసినప్పుడు నటీనటులు, దర్శకులు ఇంటి దగ్గర ఖాళీగా ఉండటం ఇష్టంలేక, సక్సెస్‌ కావు అని తెలిసి కూడా చేస్తుంటా రేమో అనిపిస్తుంటుంది ! అయితే విజయంపై ఏదో చిన్న ఆశలేకపోతే కోట్లు ఖర్చుపెట్టి ఎవరూ సినిమాలు నిర్మించరు.

విచిత్రం ఏమంటే ఈ సినిమా షూటింగ్‌ మారిషస్‌లో జరుగుతున్నప్పుడు బైక్‌ ఛేంజ్‌ చేసే క్రమంలో విష్ణు, ప్రగ్యా జైస్వాల్‌ కిందపడ్డారు. విష్ణుకు బలమైన గాయాలే అయ్యాయి. కానీ సినిమా మొత్తంలో ఆ సన్నివేశమే లేదు. కేవలం ఎండ్‌ టైటిల్స్‌లో ఆ యాక్సిడెంట్‌ను చూపించారు. అంటే స్క్రిప్ట్‌ను ఎంత తేలికగా దర్శకుడు రాసుకున్నాడో అర్థమవుతోంది ! లేదా పెరిగిన నిర్మాణ వ్యయం కారణంగా రాజీపడి అయినా ఉండాలి ! ఏదేమైనా ఎన్నో నెలలుగా వాయిదా పడుతూ వచ్చిన ‘ఆచారి అమెరికా యాత్ర’కు విడుదల రూపంలో ఫుల్‌స్టాప్‌ పడింది !

– చంద్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *