వాడికి మరణం లేదు

వాడికి మరణం లేదు

వాడ్ని చూస్తే నాకు మండుతున్న అగ్ని గోళంలా కనిపించేవాడు. ఒక్కొక్కసారి జ్ఞాన సూర్యుడిలా, ఇంకొన్నిసార్లు హేతువాదిలా, మరికొన్ని సార్లు విప్లవ నాయకుడిలా దర్శనమిచ్చేవాడు. ఉన్నట్టుండి తుఫాన్‌లా వచ్చేవాడు. వాడి మదిలో కందిరీగల్లా మెదులుతున్న అనేక ప్రశ్నలకి నా దగ్గర నుంచి సమాధానాలు ఆశించేవాడు.

ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పదవీ విరమణ చేసిన నేను నాకున్న జ్ఞాన పరిధిలో వాడి ప్రశ్నలకి జవాబులు చెప్పేవాడిని. కానీ ఒక పట్టాన వాడు అంగీకరించేవాడు కాదు. తర్కంతో ప్రతీ విషయాన్ని వాదించేవాడు. చివరకు కొన్నింటికి ‘ఊ’ కొట్టేవాడు. సరైన సమాధానం దొరకని ప్రశ్నల్ని మననం చేసుకుంటూ తనలో తానే ఏదో గొణుక్కుంటూ వెళ్ళిపోయేవాడు.

వాడి పేరు అభినవ్‌. అభ్యుదయ భావాలు నరనరాన జీర్ణించుకుపోయిన నవీన యువకుడు. నా బాల్య స్నేహితుడు బాలరాజు కొడుకు. నా కొడుకు వికాస్‌, వాడు ఒకే వయస్సు వాళ్ళు. మా వాడు ఎం.బి.ఏ. చదివి ఒక ప్రైవేటు కంపెనీలో ప్రాజెక్టు మేనేజర్‌గా పనిచేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు. పెళ్లై పిల్లలు పుట్టగానే పుట్టిన ఊరితో పేగుబంధం తెంచుకోవడానికి పది నిముషాలు పట్టలేదు మా వాడికి. నేను, సావిత్రి మాత్రం ఒంటరి పక్షుల్లా ఆ ఊరులోనే కాలక్షేపం చేస్తున్నాం. అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ పోతూ ఉండే అభినవ్‌, బాలరాజులే మాకు ఆప్తులు. వాడు మాత్రం పుస్తకాల కంటే ప్రపంచాన్ని ఎక్కువగా చదివాడు. సమాజంలో జరుగుతున్న అన్యాయల్నీ, అక్రమాల్నీ చూసి చలించిపోయేవాడు. ప్రతి విషయాన్ని భుజాన వేసుకుని తిరిగేవాడు. ఒక్కొక్కసారి అవి పోలీస్‌ స్టేషన్ల వరకు వెళ్ళేవి. ఉన్న ఒక్కగానొక్క కొడుకు భవిష్యత్‌ ఏమైపోతుందో అని తరచూ బాలరాజు మధనపడే వాడు. అవును మరి ! చెట్టంత ఎదిగిన పిల్లలు ఏళ్ళు ముదిరి, కీళ్ళు కదిలిన అవసాన దశలో ఆసరాగా ఉంటారనే ఆశిస్తారు ప్రతీ తల్లి, తండ్రి.. ‘పోనీలేరా… నెమ్మదిగా వాడే సర్దుకుంటాడు’ నా ఊరడింపు బాలరాజుకి కొండంత భరోసా. కానీ వాడ్ని చూస్తే నాక్కూడా ఒక్కొక్కసారి భయమేసేది.

ఒకరోజు సాయంత్రం నేను మొక్కలకి నీళ్ళు పెడుతుంటే వాడు కంగారుగా వచ్చాడు. వస్తూనే ఆయాస పడుతూ కుర్చీలో కూలబడి ‘బాబాయ్‌ అసలు దేవుడున్నాడంటావా?’ అని అడిగాడు. వాడి వాలకం చూస్తే ఏదో జరగకూడనిది జరిగిందని అర్థమయింది.

‘ఎందుకు లేడురా.. ఈ సృష్టిలోని అణువణువులో భగవంతుడున్నాడు’ నవ్వుతూ అన్నాను. వాడి సీరియస్‌నెస్‌ని కొంత తగ్గిద్దామని.

‘ఎక్కడున్నాడు బాబాయ్‌…? ఉంటే ఎందుకిలా చేస్తాడు?’ వాడి ముక్కుపుటాలు అదురుతున్నాయి. ఏదో బాధ వాడి మనసుని మెలిపెడుతుందని స్పష్టంగా తెలుస్తుంది.

‘ఏం జరిగిందిరా?’ విషయం తెలుసుకోవాలని అడిగాను.

‘ముక్కు పచ్చలారని చిన్నపిల్ల బాబాయ్‌. నిండా అయిదేళ్ళు కూడా ఉండవ్‌. స్కూలు నుంచి ఇంటికి వెళుతూ లారీ కింద పడి చనిపోయింది. అమ్మ, నాన్న ఒళ్ళో అల్లరి చేస్తూ ఆడుకోవలసిన ఈడు. నిజంగా దేవుడుంటే ఇలా ఎందుకు చేస్తాడు..?’ దుఃఖం తన్నుకొస్తుంది వాడికి.

అది విని నా మనసు చివుక్కుమంది. జరిగింది దారుణమే.. కాదనలేం. కానీ ప్రతిరోజు ప్రతిక్షణం అలాంటి దారుణాలు ఈ ప్రపంచంలో ఎన్నో ఎన్నెన్నో జరుగుతున్నాయి. పేపర్లు, టీవీలు చూస్తుంటే ఒళ్ళు జలదరిస్తుంది. వాటన్నింటిని గురించి అదే పనిగా ఆలోచిస్తే మనం బ్రతకగలమా ? అందుకే ముందు వాడి దుఃఖాన్ని పోగొట్టాలని నిర్ణయించుకున్నాను.

‘అది ఆ తల్లిదండ్రులు చేసుకున్న కర్మ ఫలంరా… దాన్నెవ్వరూ తప్పించలేరు’ అన్నాను అదేమంత పెద్ద విషయం కాదన్నట్లు.

‘కంప్యూటర్‌ యుగంలో కూడా కంటికి కనిపించని కర్మఫలాల గురించి మాట్లాడతావేంటి బాబాయ్‌?’ వాడి ప్రశ్న నా పెద్దరికానికి శరా ఘాతంలా తగిలింది. ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా నిలబడ్డాను.

కొద్ది సేపటికి వాడే ‘లేదు బాబాయ్‌… దేవుడు లేడు. ఉంటే లోకంలో ఎందుకిన్ని అన్యాయాలు, అక్రమాలు జరుగుతాయి. అభం శుభం తెలియని బ్రతుకులు ఎందుకిలా అర్థాంతరంగా తెల్లారి పోతాయి. కొంతమంది కోట్ల డబ్బు, పట్టు పరుపులతో కులుకుతుంటే మరికొంత మంది కూటికి గతి లేకుండా పస్తులెందుకుంటున్నారు ? లేడు.. దేవుడు లేడు..’ కళ్ళు తుడుచుకుని వాడిలో వాడే గొణుక్కుంటూ విసురుగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.

నిజమే.. వాడి ఆలోచనల్లో వాస్తవం ఉంది. వాడికి వాడి జీవితం కంటే చుట్టూ ఉన్న సమాజం ముఖ్యం. ఆ సమాజం పట్ల వాడికి అంతులేని ప్రేమ. వాడిది విశాలమైన ప్రపంచం. ఆ ప్రపంచంలో ప్రతీ ప్రాణికి, ప్రాణానికి విలువుంది. ప్రతీ బాధకి ఒక ప్రశ్న ఉంది. ఆ ప్రశ్నలకి సరైన సమాధానాల కోసం వాడు అన్వేషిస్తున్నాడు. కానీ అరవై ఏళ్ళ మా జీవన మహా ప్రస్థానంలో ఎన్నో నగ్న సత్యాల్ని చూశాం. ఎత్తు పల్లాలను దాటాం. కష్టాల్నీ, కన్నీళ్లనీ, అవమానాల్నీ భరించాం. ‘నేను.. నా కుటుంబం’ అనుకునే చిన్న ప్రపంచం మాది. స్వార్థం నిండిన ఇరుకు సందుల్లో సాఫీగా సాగిపోతున్న బ్రతుకు ప్రయాణం మాది.

అలా వెళ్ళిపోయిన వాడు ఆరు నెలల వరకు మా గడప తొక్కలేదు. వాడికది అలవాటే. కానీ ఈ ఆరు నెలల్లో వాడి గురించి చాలా విషయాలు నాకు తెలిశాయి. వాడిలాంటి పదిమంది కుర్రాళ్ళతో కలసి ‘హెల్ప్‌ హేండ్స్‌’ అనే స్వచ్ఛంద సంస్థని ప్రారంభించా డనీ, దిక్కులేని అభాగ్యులకు, ఆపదలో ఉన్న వారికి అన్నదానం, వస్త్రదానం, రక్తదానం చేస్తున్నాడని, మద్యం షాపుల దగ్గర తాగి పడిపోతున్న వాళ్ళని ఇంటికి చేర్చి, మద్యం తాగొద్దని కౌన్సిలింగ్‌ చేస్తున్నాడనీ, తమ వ్యాపారానికి అడ్డొస్తున్నాడని మద్యం వ్యాపారులు వాడి మీద చేయి కూడా చేసుకున్నారనీ ఇలా… చాలా చాలా విషయాలు ఆ నోటా ఈ నోటా నా చెవిన పడ్డాయి.

ఆ రోజు ఆదివారం అనుకుంటాను. అనుకోని అతిథిలా ఊడిపడ్డాడు.

‘ఈ రోజు ఏం స్పెషల్‌ పిన్నీ…’ అంటా వంట గదిలోకెళ్ళి గిన్నెలు వెతకడం మొదలెట్టాడు.

‘ఏరా… ఏమైపోయావ్‌ ఇన్ని రోజులూ..’ ఆప్యాయంగా అడిగింది సావిత్రి.

‘ఏవేవో పనులు పిన్నీ… బిజీగా ఉండి రాలేకపోయాను.’

‘అవన్నీ ఎప్పుడూ ఉండేవేరా… ఏదో చిన్న ఉద్యోగం చూసుకుని పెళ్ళి చేసుకోరా. మీ నాన్నకేమో వయసు మళ్ళింది. ఆయన బరువు బాధ్యతలు కూడా నీ మీదే ఉన్నాయి. ఆయనకి రేపేదన్నా అయితే ఎవరు చూస్తారు ?’ నచ్చ చెపుతున్నట్లు అంది.

‘నాన్నను చూసుకోవడానికి మీరున్నారు కదా పిన్నీ… ఇంక పెళ్ళంటారా… నేనెప్పుడూ దాని గురించి అస్సలు ఆలోచించలేదు. నా దృష్టిలో పెళ్ళనేది ఒక అందమైన అబద్ధం. విరుద్ధ మనస్తత్వాలు గల ఇద్దరు మనుషులు వాళ్ళ ఇష్టాలనీ, అభిప్రాయాల్నీ త్యాగం చేసి నలుగురి కోసం నవ్వుతూ ఒకే ఇంటిలో బలవంతంగా బ్రతకడం. అటువంటి పెళ్ళి నాకవసరం లేదు.’

వయసొచ్చిన ప్రతీవాడు పెళ్ళి కావాలంటూ ఇల్లెక్కి మరీ అల్లరి చేస్తుంటే వీడు మాత్రం పెళ్ళొద్దని చెప్పడం వింతగా అనిపించింది.

‘అది కాదురా…’ సావిత్రి చెప్పబోతుంటే.

‘నాకు ఆకలేస్తుంది పిన్నీ.. అన్నం పెట్టు’ అని డైనింగ్‌ టేబుల్‌ దగ్గర కూర్చుండిపోయాడు. సావిత్రి మారు మాట్లాడకుండా వాడికి భోజనం వడ్డించింది. గుత్తి వంకాయ కూర, సాంబారు, ఆవకాయ పచ్చడి, పెరుగు వేసుకుని సుష్టుగా భోజనం చేశాడు. బయట అరుగు మీద కూర్చుని వాళ్ళిద్దరి సంభాషణ వింటూ విననట్టు నటిస్తున్నాను నేను. కొద్ది సేపటికి వాడు బయటకొచ్చి నా పక్కన కూర్చున్నాడు. కొంతసేపు మా ఇద్దరి మధ్య నిశ్శబ్ధం రాజ్యమేలింది.

‘ఏరా… ఊళ్ళో కొత్తగా పెడుతున్న ‘ఆక్వా ప్రాసెసింగ్‌ యూనిట్‌’కి వ్యతిరేకంగా జనం మద్ధతు కూడగడుతున్నావంట. ఆ కంపెనీ వెనుక పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నార్రా. కొన్ని కోట్ల ప్రాజెక్టు అది. దాని జోలికెళితే నీ ప్రాణాలకే ముప్పు. ఇలాంటి గొడవలన్నీ నీకెందుకురా…’ నా హితబోధ వాడికి రుచించదని తెలిసినా మంచి, చెడులు చెప్పడం నా ధర్మం కాబట్టి చెప్పాను.

‘అందరం అలా అనుకుంటే ఎలా బాబాయ్‌ ? అన్నం పెట్టే పచ్చని పంట పొలాలన్నీ ఈ రోజు రొయ్యల చెరువులయిపోయాయి. ఇవ్వాళ చూద్దామంటే దుర్భిణీ వేసి వెతికినా పచ్చని పంట చేను కంటికి కనిపించట్లేదు. నాకు తెలియ కడుగుతాను ఆకలేస్తే వీళ్ళు అన్నం తింటారా లేక రోజూ రొయ్యలు తింటారా ? ఇప్పటికే ఆ చెరువుల వలన భూగర్భ జలాలు కలుషితమై తాగునీటికి కూడా కష్టమవుతోంది. ఇప్పుడు మళ్ళీ మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్లు ఈ కంపెనీ వస్తే దాని నుంచి వెలువడే వ్యర్థాలు, విష వాయువుల వలన ఈ పల్లె వల్లకాడయిపోతుంది’.

‘అది నిజమేరా.. కానీ మన ఆపద గుర్తించి అడుగెయ్యమంటున్నాను’

‘పోనీ, అన్నీ మానేసి ఇంట్లో కూర్చుంటాను. వందేళ్లు బ్రతుకుతానన్న గ్యారంటీ ఉందా? ఆ పోయేదేదో ఒక మంచి పనికోసం పోతే ఆత్మ సంతృప్తి అయినా మిగులుతుంది. మార్పు ఎక్కడో ఒక చోట మొదలవ్వాలి. నువ్వేం కంగారు పడకు బాబాయ్‌… నేను పోరాడేది మంచి కోసం. నాకేం కాదు’ అని నా సమాధానం కోసం తిరిగి చూడకుండా తిరుగు పయనమయ్యాడు. నాకు తెలుసు నా భయం కన్నా వాడి సంకల్పం గొప్పదని. తరువాత వాడి ప్రతి కదలిక నాకు తెలుస్తూనే ఉంది. అతికొద్ది కాలంలోనే ఆ కంపెనీకి వ్యతిరేకంగా ఊళ్ళో ఒక పెద్ద విప్లవమే లేవ దీశాడు. వాడి మాటలు ప్రజల్ని ఉత్తేజితుల్ని చేశాయి. ముఖ్యంగా యువతరమయితే వాడి ఉపన్యాసాలకి ఉర్రూతలూగేవారు. వాడిచ్చే సందేశం కోసం ఎదురు చూసేవారు. వాళ్ళకి వాడే హీరో. ఊళ్ళోని చిన్నా, పెద్ద, ముసలి, ముతక అంతా వాడి వెంట నడవాల్సి వచ్చింది ఆఖరుకి బాలరాజు, నాతో సహా.

పరపతి, పలుకుబడి గల ప్రత్యర్థులు బలగాలతో ఊరు మీద విరుచుకు పడ్డారు. దొరికిన వాళ్ళను దొరికినట్లు చావబాదారు. ఊరు రణ రంగాన్ని తలపించింది. బెదిరింపులు, దౌర్జన్యాలు, ప్రలోభాలు చివరకు ఊళ్లోని కొంత మంది రహస్యంగా కంపెనీ యాజమాన్యంతో చేతులు కలిపారు. ఒకరోజు తెల్లారి నిద్ర లేచేసరికి వాడి శవం ఊరు చివర మర్రి చెట్టుకి వేలాడుతూ కనిపించింది.

కొడుకు శవాన్ని చూసి కుప్పకూలిపోయాడు బాలరాజు. నాకైతే వాడి శవాన్ని చూడాలనిపించ లేదు. ఎందుకంటే నా దృష్టిలో వాడింకా బ్రతికే ఉన్నాడు. సమాజంలోని సమస్యలతో, పంచభూతాల్ని కూడా పంచేసుకుంటున్న వంచనగాళ్ళతో వాడింకా యుద్ధం చేస్తూనే ఉన్నాడు. వాడు వీరుడు. వాడికి మరణం లేదు. భగత్‌సింగ్‌, ఆజాద్‌, అల్లూరి లాంటి వీరులు దేశ స్వాతంత్య్రం కోసం చిన్నతనంలోనే ప్రాణ త్యాగం చేసారు. వాళ్ళ ప్రాణాల్ని తీసిన బ్రిటీష్‌ ప్రభుత్వం ఆనందం ఎక్కువకాలం నిలువలేదు. వాళ్ళ స్ఫూర్తితో అనంతర కాలంలో అనేకమంది నాయకులు ఆ బాధ్యతను భూజాన వేసుకుని అర్థబలం, అంగబలం గల బ్రిటీష్‌ ప్రభుత్వంతో అలుపెరగని పోరాటం చేసారు. ఆ పోరాటాలకి కరడు గట్టిన కసాయి బ్రిటీష్‌ ప్రభుత్వం సైతం చివరకు తలవంచక తప్పలేదు. భారతదేశానికి స్వాతంత్య్రం ఇవ్వక తప్పలేదు. మనిషికి మరణం ఉండొచ్చు గానీ ఆలోచనకి మరణం ఉంటుందా ? అది మళ్ళీ ఎవరి మెదడులోనో కొత్త రూపు సంతరించుకుంటుంది. స్వార్థం బుసలు కొడుతున్న విష సర్పాలను సంహరించడానికి కొత్త నాదంతో నినాదంతో ఉప్పెనలా ఉరికి వస్తుంది.

పునరపి జననం.. పునరపి మరణం.. అదే బ్రతుకు పాట చరణం.

–  మామిడిశెట్టి శ్రీనివాసరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *