వస్తు సేవల పన్ను వార్షికోత్సవం

వస్తు సేవల పన్ను వార్షికోత్సవం

ఏదైనా ఓ కొత్త విషయం లేదా ఓ మంచి విషయం ప్రారంభంలో కచ్ఛితంగా పెద్దఎత్తున వ్యతిరేకతను ఎదుర్కోవలసి వస్తుందని స్వామి వివేకానంద ఓ సందర్భంలో చెప్పారు. ఈ మాటలు గత సంవత్సరం జూలై 1న మనదేశంలో అతిపెద్ద పన్నుల సంస్కరణగా ఆరంభమై 2018 జూలై 1తో మొదటి వార్షికోత్సవం పూర్తి చేసుకున్న వస్తుసేవల పన్ను (జిఎస్‌టి) విషయంలో మాత్రం వంద శాతం నిజమయ్యాయి.

జిఎస్‌టి తొలి వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని దగ్గర నుంచి పేరొందిన కొందరు ఆర్థిక వేత్తలందరూ వివిధ టి.వి. కార్యక్రమాల్లో జిఎస్‌టి అమలు, లాభాల గురించి వివరంగా తెలియచేశారు.

ప్రత్యేకంగా చెప్పాలంటే జూలై 1, 2018న ‘టైమ్స్‌ నౌ’ ఛానల్‌ వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులతో చర్చలు జరిపి మరోసారి వస్తుసేవల పన్ను ఉపయోగ విస్తృతిని సవివరంగా తెలియ జెప్పింది.

ఒకే పన్ను

పన్నుల సరళీకరణ అంటే అన్నిటికీ ఒకే పన్ను ఉండటం అన్న కొత్త అర్థాన్ని కాంగ్రెస్‌ పార్టీ నూతన ఏలిక ఈ మధ్య సెలవివ్వడమే కాక పలు రకాల వేదికలపై ప్రముఖంగా పదే పదే చెప్తున్నారు. అది ఎలా సాధ్యం ? అంటే మీ దృష్టిలో పాలకు, విలాసవంతమైన కార్లకు ఒకే తరహా పన్ను విధించాలా? అంటూ సూటిగా ప్రధాని మోది ఓ సందర్భంలో ప్రశ్నించారు. ఇదే విషయం అటు టైమ్స్‌ నౌ ఛానల్‌ స్పెషల్‌ ఎడిషన్‌ పేరిట జూలై 1న రాత్రి ప్రసారం చేసిన దానికి.. ఇటు న్యూస్‌ ఎక్స్‌ ఛానల్‌ తన 9 గంటల వార్తా ప్రసారాల్లో భాగంగా చూపిన దానికి.. ప్రత్యేక చర్చా కార్యక్రమానికి కేంద్ర బిందువైంది.

సంఖ్య పెరిగింది

ఆరంభంలో విధించిన పన్నుల్ని, శ్లాబుల్ని వస్తు సేవా మండళ్ల సమావేశాల్లో వెలిబుచ్చిన అభిప్రాయా లకు అనుగుణంగా మార్చి మరింత సరళతరం చేసి ప్రజామోదాన్ని చూరగొన్నారు అన్న అభిప్రాయాన్ని చర్చలో పాల్గొన్న వక్తలు తెలిపారు. అంతెందుకు ? స్వాతంత్య్రం వచ్చిన డెబ్భై ఏళ్ళలో 66 లక్షల పరోక్ష పన్ను చెల్లింపుదారులుంటే వస్తు సేవల పన్ను ప్రారంభమైన మొదటి సంవత్సరంలోనే ఆ సంఖ్య 48 లక్షలుగా ఉందంటే ఇది ఎంతగా ప్రజాదరణ పొందిందో అర్థం చేసుకోవచ్చు.

తప్పుడు ప్రచారం

ప్రజలకు మేలు చేసేది ఎల్లప్పుడూ కాంగ్రెస్‌కు కీడు చేసే దానిలా కనిపిస్తుందని ఒక వక్త వెలిబుచ్చిన అభిప్రాయం వినడానికి కాస్త కఠినంగా అనిపించినా నిజమనుకోవచ్చు. జిఎస్‌టి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని పిల్లి శాపనార్థాలు పెట్టిన కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు జిఎస్‌టి అమలు వల్ల దేశానికి మంచి జరుగుతున్నా దాన్ని జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారాలు చేస్తోంది.

అలా అనడం సరి కాదు

వీటన్నిటికి పరాకాష్ట మాజీ కేంద్ర మంత్రి జిఎస్‌టిని ఆర్‌.ఎస్‌.ఎస్‌. టాక్స్‌గా అభివర్ణించడం. అందుకు కారణంగా పలుమార్లు పన్నులు వేయడమని చెప్పడం హాస్యాస్పదం. ఇది సరి కాదు.

పరిధిలోనికి రానివి..

ఇంత బృహత్తరమైన పన్నుల సంస్కరణ జిఎస్‌టి రూపేణా వచ్చినా దాదాపు యాభై రకాల వ్యాపార ఉత్పత్తులు, తదితరాలు ఈ చట్టంలోకి రాలేదని ఒక వక్త అభిప్రాయపడ్డారు. ఇది నిజంగా ఆలోచించాల్సిన అంశం. దీనికి కొనసాగింపుగా పెట్రోలు, చమురు ఉత్పత్తులు, మద్యం పన్ను పరిధిలోకి ఇంకా రాలేదు. ఇవి దేశ ఆర్థిక వ్యవస్థలో నలభై ఐదు శాతంగా ఉన్నాయని మరో వక్త తెలిపారు.

కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలే వద్దంటున్నాయి

ఈ సందర్భంగా మరో ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. జిఎస్‌టి పరిధిలోకి పెట్రోలియం ఉత్పత్తులు రావాలని కొందరంటున్నారని అయితే దానికి కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలే అడ్డుపడుతున్నాయని వివరించారు. అయితే త్వరలోనే ఈ పరిధిలోకి అవి కూడా వస్తాయని చర్చలో పాల్గొన్న ఓ వక్త అభిప్రాయపడ్డారు.

అధిగమించాలి

ఈ చర్చ జిఎస్‌టి అధిగమించాల్సిన కొన్ని లోపాల్ని కూడా ఎత్తి చూపింది.

ఉదాహరణకు అధికంగా కట్టిన పన్ను కాని, పన్ను మదింపులో చెల్లింపుదారులకు అందచేయాల్సిన పన్ను వాపస్‌లో గాని నెలకొంటున్న సుదీర్ఘ ఆలస్యాన్ని నివారించాల్సి ఉందన్నారు. ఇది తప్పకుండా చేయాలి. ఎందుకంటే కట్టిన పన్నులో పొరపాట్లున్నా లేదా వేరే కారణం చేత అధికంగా పన్ను చెల్లిస్తే ప్రభుత్వం దానిని సాధ్యమైనంత తొందరగా పన్ను చెల్లింపుదారుడికి తిరిగి చెల్లించాలి అప్పుడే ప్రభుత్వంపై ప్రజలకు విశ్వసనీయత పెరుగుతుంది.

అలాగే కొన్ని కొన్ని చోట్ల విధించిన పన్ను అధికంగా ఉంది. దానివల్ల సక్రమంగా పన్ను కడుతున్న వారు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. పన్ను మొత్తానికే కట్టనివారు హాయిగా ఉన్నారని కొందరు అభిప్రాయపడ్డారు.

ఏది ఏమైనా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ అన్నట్లు ‘జిఎస్‌టిని అమలు చేస్తున్న ప్రపంచంలోని 115 దేశాలు తొలిదశలో ఎదురైన కష్టాలను అధిగమించడానికి పట్టిన కాలం కంటే మనకు చాలా తక్కువ సమయం పట్టింది. ఇది భారతీయుల అర్థం చేసుకునేతనానికి అద్దం పడుతోంది’ అన్నది నూటికి నూరుపాళ్లు నిజం.

సమకాలీన అంశాల విషయంలో గాని, నిష్పక్షపాత చర్చల విషయంలో గాని ఆంగ్ల ఛానల్స్‌ ముందుంటాయన్న అభిప్రాయాన్ని ఈ చర్చలు మరోసారి నిరూపించాయి.

– స్ఫూర్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *