రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించనున్న సినిమాలు

రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించనున్న సినిమాలు

ఎన్నికల సమయంలో ఒకటో రెండో రాజకీయ నేపథ్య చిత్రాలు రావడం గత కొంత కాలంగా జరుగుతున్నదే! అయితే అధికారంలో ఉన్న పార్టీ పనితీరును ఎండకడుతూనో, అధినేత చేష్టలను వ్యంగ్య రీతిలో విమర్శిస్తూనో గతంలో సినిమాలు వచ్చాయి. అలాంటివి రూపొందించలేని సమయంలో కొందరు పరాయి రాష్ట్రాలకు చెందిన రాజకీయ చిత్రాలలో తమకు ఉపయోగపడే అంశాలు ఉన్నవి చూసుకుని తెలుగులో డబ్బింగ్‌ చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఈసారి ఆ తరహాలో తెరకెక్కుతున్న సినిమాల సంఖ్య బాగానే పెరుగుతోంది. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే విషయంలో స్పష్టత లేకపోయినా, రెండు తెలుగు రాష్ట్రాలలో ఆ వాతావరణం నివురుగప్పిన నిప్పులా ఉంది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో అయితే… కొందరు ఎం.పి.ల రాజీనామా నేపథ్యంలో పొలిటికల్‌ హీట్‌ రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాబోతున్న సినిమాలు సైతం అందుకు ఎంతో కొంత దోహదం చేస్తాయని అనిపిస్తోంది.

మహేశ్‌ బాబు ప్రత్యేకంగా ఏ పార్టీకీ చెందిన వ్యక్తి కాదు. అయితే అతని తండ్రి, సీనియర్‌ నటుడు కృష్ణ తెలుగుదేశం పార్టీ వ్యతిరేకి. బాబాయ్‌ ఆదిశేషగిరిరావు వైసిపికి చెందిన వ్యక్తి. మహేశ్‌ బావ గల్లా జయదేవ్‌ తెలుగు దేశం ఎంపి. దాంతో మహేశ్‌ బాబు నటించిన తాజా చిత్రం ‘భరత్‌ అనే నేను’ను కొందరు రాజకీయ కోణంలోనే చూస్తున్నారు. ఓ అగ్ర కథానాయకుడు సి.ఎం. పాత్ర పోషించడం అంటే మామూలు విషయం కాదు. ప్రస్తుతం ఉన్న వాతావరణంలో ఇందులోని ప్రతి సంభాషణను ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఆ సినిమాలోని పాటల సాహిత్యాన్ని, సన్నివేశాలను నిశితంగా విశ్లేషిస్తున్నారు. ఇంతవరకూ వచ్చిన పాటలను, ప్రచార చిత్రాలను చూసిన వారు ఈ సినిమా వైఎస్‌. జగన్‌కు ఉపయోగపడే ఛాన్స్‌ ఉందనే అంచనాలకు వచ్చారు. అందులో వాస్తవం ఎంత అనేది సినిమా విడుదలైతే కానీ చెప్పలేం.

ఇక అల్లు అర్జున్‌ నటించిన ‘నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా’లోనూ రాజకీయ అంశాలు ఉంటాయనిపిస్తోంది. అల్లు అర్జున్‌ చినమావయ్య పవన్‌ కళ్యాణ్‌ గత కొంతకాలంగా ఈ దేశాన్ని ఉత్తర, దక్షిణ భారతదేశాలుగా విభజించి చూస్తున్నారు. ఉత్తరాది వారికి దక్షిణాది పౌరుషం రుచి చూపించా లని తహతహలాడుతున్నాడు. ఈ నేపథ్యంలో రాబోతున్న ‘నా పేరు సూర్య’లోని ఓ డైలాగ్‌ను ఇటీవల విడుదల చేశారు. ఇందులో హీరోని కొందరు ‘సౌతిండియా కా సాలా’ అని తిడితే.. ‘సౌత్‌ ఇండియా, నార్త్‌ ఇండియా, ఈస్ట్‌, వెస్ట్‌.. అంటూ అన్ని ఇండియాలు లేవురా.. మనకు ఒక్కటే ఇండియా..’ అంటూ అల్లు అర్జున్‌ జవాబిస్తాడు. చూడటానికి ఇది దేశభక్తి చిత్రంగా పైకి కనిపించినా… అంతర్లీనంగా పాలిటిక్స్‌కూ చోటు ఉంటుందనిపిస్తోంది.

ఈ రెండు సినిమాలదీ ఒక ఎత్తు కాగా బాలకృష్ణ తన మిత్రులతో కలిసి తేజ దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘ఎన్టీయార్‌’ బయోపిక్‌ది మరో ఎత్తు. తెలుగువారి ఆత్మగౌరవం అనే నిదానంతో ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించడం, తొమ్మిదినెలల్లో అధికారాన్ని హస్తగతం చేసుకోవడమే ప్రాధానాంశంగా ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌ రూపుదిద్దుకుంటోంది. నిజానికి వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని తొలుత అనుకున్నా… రాజకీయ వాతావరణం వేడెక్కిన దరిమిలా ఈ చిత్రాన్ని దసరాకే విడుదల చేస్తామని బాలకృష్ణ చెబుతున్నారు. ఈ సినిమా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఇదిలా ఉంటే… మరోవైపు మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ వై.యస్‌. రాజశేఖర రెడ్డి జీవితంలోని ప్రధాన ఘట్టమైన పాదయాత్ర నేపథ్యంలోనూ ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి రాజశేఖర రెడ్డి పాత్రను పోషిస్తున్న ఈ సినిమాను ‘యాత్ర’ పేరుతో మహి వి.రాఘవ తెరకెక్కిస్తున్నారు. వైయస్‌. పాదయాత్ర ప్రారంభించిన ఏప్రిల్‌ 9నే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కావడం విశేషం. ఈ సినిమానూ వైఎస్‌ఆర్‌సిపి వర్గాలు ఎన్నికల అస్త్రంగా వాడుకుంటాయన్నది నిర్వివాదాంశం.

అలానే చిరంజీవి కథానాయకుడిగా రూపుదిద్దు కుంటున్న ‘సైరా’ చిత్రం చారిత్రకమే అయినా.. అందులోనూ రాజకీయ అంశాలు, ప్రజలను చైతన్య పరిచే సన్నివేశాలు ఉంటాయన్నది వాస్తవం. ఇక రామ్‌గోపాల్‌ వర్మ సైతం ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ పేరుతో ఓ సినిమా తీస్తానని గతంలో ప్రకటించారు. ప్రస్తుతం ‘ఆఫీసర్‌’ షూటింగ్‌తో బిజీగా ఉన్న వర్మ.. ఎప్పటి లానే నిశ్శబ్దంగా ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమాను పూర్తి చేసి, ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌కు పోటీగా విడుదల చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఏదేమైనా ఈసారి అటు ఎన్నికలతో పాటు దానికంటే ముందే రాజకీయ నేపథ్య చిత్రాలతో వాతావరణం మరింత వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. మరి ఇందులో ఏవి ప్రజలను, ఎంతవరకూ ప్రభావితం చేస్తాయో చూడాలి.

– చంద్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *