యో యో టెస్ట్‌తో క్రికెటర్ల సిగపట్లు !

యో యో టెస్ట్‌తో క్రికెటర్ల సిగపట్లు !

భారత క్రికెటర్ల కోసం రెండేళ్ల క్రితం ప్రవేశ పెట్టిన ఫిట్‌నెస్‌ కమ్‌ యో యో టెస్ట్‌ వివాదాస్పదంగా మారింది. క్రికెటర్ల ప్రతిభ, అనుభవం, గత రికార్డుల కంటే ఫిట్‌నెస్‌కు మాత్రమే అధిక ప్రాధాన్యమివ్వడం విమర్శలకు దారితీస్తోంది.

ఫిట్‌నెస్‌ ఉంటేనే క్రికెట్‌ ?

క్రికెట్‌లో కాలాన్ని బట్టి అర్థాలు మారి పోతున్నాయి. 14 దశాబ్దాల టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఆటగాళ్ల శారీరక పటుత్వం కంటే ప్రతిభకు మాత్రమే ప్రాధాన్యమిచ్చేవారు. సర్‌ డోనాల్డ్‌ బ్రాడ్మన్‌, సర్‌ గార్‌ఫీల్డ్‌ సోబర్స్‌, ఇరాపల్లి ప్రసన్న, బిషన్‌ సింగ్‌ బేడీ, భగవత్‌ చంద్రశేఖర్‌ లాంటి ఎందరో గొప్ప గొప్ప క్రికెటర్లు కనీస ఫిట్‌నెస్‌తో మాత్రమే పాల్గొని అసాధారణ ప్రతిభతో క్రికెట్‌ చరిత్రలోనే తమకంటూ ప్రత్యేక గుర్తింపు, స్థానం సంపాదించుకోగలిగారు.

అయితే ప్రపంచీకరణతో పాటే క్రికెట్‌లోనూ భారీగా మార్పులు చోటు చేసుకున్నాయి. టెస్ట్‌ క్రికెట్‌తో పాటు వన్డే, టి-20 ఫార్మాట్లు, లీగ్‌ టోర్నీలు రావడంతో క్రికెటర్లకు ఫిట్‌నెస్‌ అవసరంగా మారింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అను గుణంగా ఫిట్‌నెస్‌ ఉంటేనే ఏడాది పొడుగునా రాణించే అవకాశం ఏర్పడింది. దీనికితోడు క్రికెటర్ల మ్యాచ్‌ ఫీజు, వార్షిక కాంట్రాక్టు వేతనాలు కోట్లకు చేరడంతో వివిధ దేశాల క్రికెట్‌ బోర్డులు ప్రతిభతో పాటు ఫిట్‌నెస్‌కు సైతం ఎనలేని ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభించాయి.

2016 నుంచి యో యో టెస్ట్‌

భారత క్రికెట్‌లో 2010 నుంచే పూర్తిస్థాయి ప్రొఫెషనల్‌ ధోరణి ఉన్నా అంతర్జాతీయ స్థాయిలో ఆడే క్రికెటర్ల ఫిట్‌నెస్‌ నిర్ధారణ కోసం 2016లో ప్రధాన శిక్షకుడిగా బాధ్యతలు చేపట్టిన అనిల్‌ కుంబ్లే తొలిసారిగా యో యో ఫిట్‌నెస్‌ పరీక్షలను ప్రవేశ పెట్టారు. భారత జట్టులో సభ్యుడిగా ఆడాలంటే విధిగా ఫిట్‌నెస్‌ పరీక్షల్లో నెగ్గుకురావాలన్న నిబంధన విధించారు. అనిల్‌ కుంబ్లే నేతత్వంలో అప్పటి కండిషనింగ్‌ కోచ్‌ శంకర్‌ బసు భారత క్రికెటర్ల శరీరతత్వానికి సరిపడిన విధంగా యో యో టెస్టులు నిర్వహించడం ప్రారంభించారు.

ఏమిటీ యో యో టెస్ట్‌ ?

క్రికెట్‌ ప్లేయర్ల శారీరక, మానసిక పటుత్వాన్ని మదింపు చేయటానికి వివిధ క్రికెట్‌ సంఘాలు ఉపయోగిస్తున్న విధానమే యో యో టెస్ట్‌. ఫిట్‌నెస్‌ను పలు రకాలుగా మదింపు చేయటానికి మాంట్రియల్‌ విశ్వవిద్యాలయానికి చెందిన లూక్‌లెగర్‌ ప్రతిపాదించిన విధానాలకు ప్రతిరూపమే యో యో టెస్ట్‌. నిర్ణీత సమయంలో ఓ క్రికెటర్‌ 20 మీటర్ల దూరంలో ఉన్న గమ్యాన్ని చేరి మళ్లీ వెనక్కి ఎంతవేగంగా తిరిగిరాగలడు ? ఇలా ఎన్నిసార్లు చేయగలడు ? అన్న అంశాలను నమోదు చేయడం ద్వారా పాయింట్లు ఇస్తారు. అదే సమయంలో మొబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెంత్‌, పవర్‌, కార్డియో వాస్కులర్‌ ఎండ్యురెన్స్‌ లాంటి అంశాలను సమగ్రంగా పరీక్షిస్తారు. సగటు మనిషి భాషలో చెప్పాలంటే 8 నిమిషాల సమయంలో 2 కిలోమీటర్ల దూరాన్ని పరుగెత్త గలిగితే యో యో టెస్ట్‌ ప్రమాణాలు అందుకొన్నట్లు గానే పరిగణిస్తారు.

ఒక్కో దేశంలో ఒక్కో లక్ష్యం..

యో యో టెస్ట్‌లో సఫలం కావాలంటే భారత క్రికెట్‌ నిబంధనల ప్రకారం 16.1 పాయింట్లు సాధిస్తే చాలు. అదే మన పొరుగు దేశం పాకిస్థాన్‌లో 17.4, వెస్టిండీస్‌లో 19, న్యూజిలాండ్‌లో 20.1 పాయింట్లు సాధించి తీరాలి. బీసీసీఐ ప్రమాణాల ప్రకారం మొత్తం 1120 మీటర్ల దూరాన్ని 567 సెకన్ల సమయంలో పరుగెత్తగలిగిన ఆటగాళ్లే యో యో పరీక్షలో సఫలమైనట్లుగా పరిగణిస్తారు. అదే న్యూజిలాండ్‌లో 1170 సెకన్లలో 2400 మీటర్లు, వెస్టిండీస్‌లో 1023 సెకన్లలో 2080 మీటర్లు, పాకిస్థాన్‌లో 778 సెకన్లలో 1560 మీటర్ల దూరం పరుగెత్తాల్సి ఉంటుంది. భారత క్రికెటర్లలో యువరాజ్‌ సింగ్‌, సురేశ్‌ రైనా, రవీంద్ర జడేజా ప్రస్తుత సీజన్‌లో అంబటి రాయుడు, సంజు శాంసన్‌, మహ్మద్‌ షమీ లాంటి క్రికెటర్లు యో యో టెస్టులో విఫలమైనవారే.

అయితే పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ మిస్బావుల్‌ హక్‌ 42 ఏళ్ల వయస్సులో 18.5 పాయింట్లు, భారత మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ అశీష్‌ నెహ్రా 39 ఏళ్ల వయస్సులో 18.4 పాయింట్లు సాధించి వారేవ్వా అనిపించు కొన్నారు. మాస్టర్‌ సచిన్‌ టెండుల్కర్‌ సైతం 39 ఏళ్ల వయస్సులోనూ వికెట్ల మధ్య మెరుపువేగంతో చురుగ్గా పరుగెత్తడంలో తనకుతానే సాటిగా నిలిచాడు. ప్రస్తుత టీమిండియా ఆటగాళ్లలో మనీశ్‌ పాండే ఒక్కడే యో యో టెస్టులో 19.1 పాయింట్లు సాధించి సంచలనం సష్టించాడు. కెప్టెన్‌ విరాట్‌ కొహ్లీ, రవీంద్ర జడేజా 16.1 పాయింట్ల లక్ష్యాన్ని అందుకోగలిగారు. మరోవైపు ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో పాల్గొనే భారతజట్టులో చోటు సంపాదించిన అంబటి రాయుడు యో యో టెస్టులో 16.1 పాయింట్లకు కేవలం 14 పాయింట్లు మాత్రమే సాధించి జట్టులో స్థానం కోల్పోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

విమర్శల వెల్లువ

క్రికెటర్లలోని ప్రతిభా పాటవాలకు, ఫిట్‌నెస్‌కు అసలు సంబంధం ఏంటన్న చర్చ ప్రారంభ మయ్యింది. యో యో టెస్ట్‌ పేరుతో అత్యుత్తమంగా రాణించిన రాయుడు, సంజు శాంసన్‌ లాంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లను పక్కన పెట్టడం విమర్శలకు దారితీసింది. ఐపిఎల్‌ 11వ సీజన్‌లో అత్యుత్తమంగా రాణించి 800కు పైగా పరుగులు సాధించిన అంబటి రాయుడు తగిన ఫిట్‌నెస్‌ లేకుండానే ఇదంతా సాధించాడా? అంటూ హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం బీసీసీఐని నిలదీసింది. యో యో టెస్ట్‌ పేరుతో రాయుడిని పక్కన పెట్టడం అన్యాయమంటూ హెచ్‌సిఏ కార్యదర్శి ఆవేదన వ్యక్తం చేశారు. యో యో టెస్టుల్లో పారదర్శకత పాటించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

మరోవైపు బీసీసీఐ మాజీ చీఫ్‌ సెలెక్టర్‌ సందీప్‌ పాటిల్‌ మాత్రం టెస్ట్‌ క్రికెట్లో సత్తా చాటుకోడానికి ఒక్కో ఆటగాడికి రెండు ఇన్నింగ్స్‌ ద్వారా రెండు అవకాశాలు ఉన్నట్లే యో యో పరీక్షలో విఫలమైన ఆటగాళ్లకూ కొద్ది గంటలు లేదా కొద్దిరోజుల విరామం తర్వాత రెండో అవకాశం ఇవ్వాలని సూచించారు. ఒక్కమాటలో చెప్పాలంటే అపార ప్రతిభ ఉన్న క్రికెటర్లకు సాధారణ ఫిట్‌నెస్‌ ఉంటే సరిపోతుందని అంటున్నారు.

ఇక నుంచి జట్టు ఎంపికకు ముందే యో యో టెస్ట్‌..

అంబటి రాయుడు, సంజు శాంసన్‌ లాంటి క్రికెటర్లను యో యో టెస్ట్‌ ఫలితంతో ముడిపెట్టి పక్కన పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తడంతో బీసీసీఐ ఆలస్యంగానైనా కళ్లు తెరిచింది. ఇక నుంచి భారతజట్లను ఎంపిక చేయటానికి ముందే యో యో టెస్టులు నిర్వహించాలని నలుగురు సభ్యుల పాలక మండలి నిర్ణయించింది. మెరుపు వేగంతో సాగిపోయే ఆధునిక క్రికెట్లో అత్యుత్తమ స్థాయి ఫిట్‌నెస్‌ ఉన్న క్రికెటర్లు మాత్రమే అసాధారణంగా రాణించగలరని బీసీసీఐ పెద్దలు మాత్రమే కాదు ప్రధాన శిక్షకుడు రవిశాస్త్రి, కెప్టెన్‌ విరాట్‌ కొహ్లీ గట్టిగా చెబుతున్నారు.

ఇదంతా చూస్తుంటే కండ గలవాడే మనిషి అన్నట్లుగా ఫిట్‌నెస్‌ ఉన్నవాడే ఆధునిక క్రికెటర్‌ అనుకోక తప్పదు మరి !

– క్రీడా కృష్ణ , 84668 64969

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *