మెంటల్‌ మదిలో

మెంటల్‌ మదిలో

‘పెళ్ళిచూపులు’ చిత్రంతో నిర్మాత రాజ్‌కందుకూరికి చక్కని గుర్తింపు వచ్చింది. ఆ సినిమా ఘనవిజయం సాధించడంతో పాటు జాతీయ, ప్రాంతీయ స్థాయిలో పలు అవార్డులను గెలుచుకుంది. అదే బ్యానర్‌లో ఆ వెంటనే మరో సినిమా వస్తోందంటే, అందరిలో సహజంగానే ఉత్సుకత నెలకొంటుంది. ఈ సినిమా కూడా ‘పెళ్లిచూపులు’ తరహాలో చక్కని కుటుంబ ప్రేమకథ చిత్రం అవుతుందనే ఆశలు ఉంటాయి. నూతన దర్శకుడు వివేక్‌ ఆత్రేయను పరిచయం చేస్తూ రాజ్‌ కందుకూరి నిర్మించిన ‘మెంటల్‌ మదిలో’ చిత్రం ఎలా ఉందో మరి తెలుసుకుందాం !

తికమక ప్రేమకుడి కథ

అరవింద్‌ కృష్ణ (శ్రీవిష్ణు) మధ్యతరగతి కుర్రాడు. మనోడు పుట్టిన వేళావిశేషం ఏమో గాని అతనికి ఛాయిస్‌ (ఆప్షన్స్‌) ఇస్తే మాత్రం తికమక పడిపోతాడు. ఆ కన్‌ఫ్యూజన్‌ ఇతగాడికి పుట్టినప్పటి నుండి ఉన్న బలహీనత. టీ తాగాలో కాఫీ తాగాలో తేల్చుకోలేడు. రెడ్‌షర్ట్‌ వేసుకోవాలో వైట్‌షర్ట్‌ వేసుకోవాలో నిర్ణయించుకోలేడు. చివరికి మెయిన్‌ క్వశ్చన్‌ పేపర్‌కు సూపర్‌గా సమాధానాలు రాసి, ఆప్షనల్‌ క్వశ్చన్‌ పేపర్‌లో ఏ జవాబు ఎంపిక చేయలేని అసమర్థుడు. పెరిగి పెద్దయ్యాక ఈ తికమకే అతన్ని అనేక ఇబ్బందుల పాలు చేస్తుంది. చిన్నప్పుడు పొరపాటున జరిగిన ఓ సంఘటనలో ఆడవాళ్లతో మాట్లాడటానికి, వారికళ్లలో కళ్లు పెట్టి చూడటానికి కూడా భయపడుతుంటాడు. ఈ లక్షణాల వల్ల పది, పన్నెండు పెళ్లి సంబంధాలు చెడిపోతాయి. ఆ తర్వాత స్వేచ్ఛ (నివేతా పెతురాజ్‌)ను పెళ్లిచూపుల్లో ఇష్టపడ తాడు. అతని ‘కన్‌ఫ్యూజింగ్‌ మెంటాలిటీ’ తెలుసుకున్న స్వేచ్ఛ అతన్ని సరైన దారిలో పెట్టగలనని భావించి పెళ్ళి చేసుకోవ టానికి ఆసక్తి చూపుతుంది. ఒకరికొకరు నచ్చడంతో పెద్దలు నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేస్తారు. సరిగ్గా ఆ కార్యక్రమం జరుగుతుండగా స్వేచ్ఛ నానమ్మ చనిపోతుంది. దాంతో ఎంగేజ్‌మెంట్‌ రెండు నెలలు వాయిదా పడుతుంది. ఈలోగా అరవింద్‌ కృష్ణ ఆఫీస్‌ పని మీద ముంబై బయలు దేరతాడు. అతనికి బస్సు జర్నీలో రేణు (అమృత శ్రీనివాసన్‌) పరిచయం అవుతుంది. ఆమె చలాకీ తనం, ప్రవర్తనతో అరవింద్‌ ఇంప్రెస్‌ అవుతాడు. దాంతో హీరోకు స్వేచ్ఛ, రేణు ఇద్దరిలో ఎవరిని వివాహం చేసుకోవాలనే కొత్త కన్‌ఫ్యూజన్‌ మొదలవుతుంది. ప్రేమ విషయంలోనూ మెంటల్‌గా ప్రవర్తించిన అరవింద్‌ కృష్ణ జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే మిగతా కథ.

నిజానికి ఒకరితో నిశ్చితార్థం జరిగిన తర్వాత వేరొకరు యువతి లేదా యువకుడి జీవితంలోకి ప్రవేశించడం, ఎవరి వైపు మొగ్గు చూపాలనే విషయంలో తికమక పడటం ఎన్నో చిత్రాల్లో మనం చూసిందే. అందులో కొత్తదనం ఏమీ లేదు. అయితే ఈ రకమైన బలహీనతను ఈ సినిమాలో ఇంకాస్త ఎక్కువగా ఎస్టాబ్లిష్‌ చేశారు. దానితోనే ప్రథమార్థం అంతా సరదాగా సాగిపోయింది. కాని ద్వితీయార్థం లో రొటీన్‌ ట్రయాంగిల్‌ లవ్‌స్టోరిగా మారిపోవడంతో బోర్‌ కొట్టేసింది.

నటీనటుల విషయానికి వస్తే ఇచ్చిన పాత్రకు న్యాయం చేకూర్చడానికి ప్రతి ఒక్కరూ ఎంతో కృషి చేశారు. కాని యు.ఎస్‌.రిటర్ట్న్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ పాత్రలో శ్రీ విష్ణును చూసి తృప్తిపడలేం. అలానే ‘నాది విజయవాడ’ అంటూ సెకండ్‌ హీరోయిన్‌గా అమృత ఎంట్రీ ఇచ్చినా, నార్త్‌లుక్‌ తరహా స్టైలే ఆమెలో కనిపించింది. భాష, యాస కూడా ఉత్తరాదినే పోలి ఉన్నాయి. ఆ పాత్రకు ఆమె సరైన ఎంపిక కాదు. ఇక నూరు శాతం పాత్రలో లీనమై పోయిందంటే కథనాయిక నివేత పెతురాజ్‌ మాత్రమే. అన్ని రకాల భావోద్వేగాలను సునాయాసంగా పోషించింది. ‘కన్‌ఫ్యూజ్డ్‌ లవర్‌’ అనేది వినడానికి కాస్తంత కొత్తగా ఉన్నా వెండితెర పైకి వచ్చేసరికీ సాదా, సీదా రొమాంటిక్‌ లవ్‌స్టోరీ గానే కనిపించింది. అతను టక్కున రేణుతో ప్రేమలో పడే సన్నివేశాల్లోనూ ఏ మాత్రం బలం లేదు. పైగా సినిమా కథ నత్త నడకను గుర్తు చేస్తుంది. ముఖ్యంగా ద్వితీయార్థంలోని ముంబై ఎపిసోడ్‌ ఏమంత ఆకట్టుకునేలా లేదు. చివరిలో నారా రోహిత్‌ ప్లెజంట్‌ సర్‌ప్రైజ్‌, క్లయిమాక్స్‌ చివరి 15 నిమిషాలు కాస్తంత రిలీఫ్‌ను ఇచ్చాయి. వేదరామన్‌ కెమెరా, ప్రశాంత ఆర్‌.విహారి సంగీతం కథా గమనానికి బాగానే దోహదం చేశాయి. శివాజీరాజా, రాజ్‌ మాదిరాజు, అనితా చౌదరి, మధుమణి తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. నిజానికి ఈ కథకు ‘మెంటల్‌ మదిలో’ అనే పేరు కూడా సరైనది కాదు. ఏదో రకంగా కాస్తంత కొత్తగా ఉండి నలుగురిని ఆకట్టుకుంటుందనే భావనతో పెట్టినట్లుగా ఉంది. నిశ్చితార్థం ఆగిపోగానే ప్రేమికులు గోవా ట్రిప్‌కు వెళ్ళిపోవటం, ఇంట్లో అబద్ధాలు చెప్పి పరాయి ఊరు చెక్కేయడం కూడా ఎబ్బెట్టుగానే ఉన్నాయి. మామూలుగా అయితే ఫర్వాలేదు గాని ‘పెళ్ళిచూపులు’ వంటి చిత్రం నిర్మించిన సంస్థ నుండి ఈ సినిమా రావడం కాస్తంత నిరాశకు గురిచేస్తుంది.

– చంద్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *