మానవా ! వెళ్లొస్తా !

మానవా ! వెళ్లొస్తా !

తన 54 ఏళ్ల జీవిత కాలంలో ఒక వ్యక్తి ఒకే పనిలో నిమగ్నమై ఉన్నారంటే ఆ వ్యక్తి ఆ పనిని ఎంతగా ప్రేమించారో అర్థం చేసుకోవచ్చు. అలాంటి అనితర సాధ్య ప్రగతిని సాధించిన వ్యక్తి తిరిగిరాని లోకాలకు వెళ్లేపోతే ఆ బాధ వర్ణనాతీతం. ఆ వ్యక్తి ఎవరో కాదు అతిలోక సుందరీ శ్రీదేవి. అందం, అభినయం కలగలిపిన నటి శ్రీదేవి. ఫిబ్రవరి 24న అర్ధరాత్రి ప్రాంతంలో గుండె పోటుతో దుబాయ్‌లోని ఓ హొటల్లో నీటి తొట్టిలో పడి శ్రీదేవి మరణించారు. ఆ మరుసటి రోజు 25.02.2018 ఆదివారం నాడు కొన్ని టి.వి. ఛానళ్లు శ్రీదేవి పేరుతో అనేక ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాయి. వాటిపై ఓ పరిశీలన.

ఆమెకు మరణం లేదు

హెచ్‌.ఎం. టి.వి. ఫిబ్రవరి 25న రాత్రి 9.30కి ‘మానవా వెళ్లొస్తా’ అనే పేరుతో ప్రసారం చేసిన ఓ కార్యక్రమంలో ‘అందం, అభినయం కలబోసిన రూపం శ్రీదేవిది. ఆమెకు మరణం లేదు స్మరణమే’ అని చెప్పారు. నిజమే ఇంతటి ప్రతిభాశాలికి అభిమానుల హృదయాల్లో ఎప్పటికీ మరణం ఉండదు.

రెండు తరాల నటులతో..

రెండు తరాల హీరోలతో కలిసి నటించడం కేవలం అందాల నటి శ్రీదేవికే సాధ్యమైంది. అటు అక్కినేని నాగేశ్వరరావుతో ప్రేమాభిషేకం, ప్రేమ కానుక, శ్రీరంగనీతులు మొదలైన సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన శ్రీదేవి, ఆయన కుమారుడు అక్కినేని నాగార్జునతో కలిసి గోవింద గోవింద, ఆఖరి పోరాటం చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నారు. ఇది ఆమెలోని బహుముఖ ప్రతిభకు తరగని గుర్తింపు. ఎన్‌టిఆర్‌కు మనవరాలిగా బడిపంతులు చిత్రంలో నటించిన శ్రీదేవి ‘వేటగాడు, రౌడీ రాముడు, కొంటె కృష్ణుడు’ తదితర చిత్రాల్లో ఎన్‌టిఆర్‌కు ప్రియురాలిగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇటువంటి అనేక విషయాల్ని ఆనాటి చర్చా కార్యక్రమాల్లో ఛానళ్లు గుర్తుచేశాయి.

మూడువందలకు పైగా చిత్రాలు

దాదాపు మూడువందలకు పైగా చిత్రాల్లో నటించిన ఆల్‌టైం సూపర్‌స్టార్‌ శ్రీదేవికి జాతీయ అవార్డు రాకపోవడం బాధాకరమని ‘వసంత కోకిలకు ఆత్మీయ నివాళి’ అనే పేరుతో సాక్షి టి.వి.లో ఫిబ్రవరి 25న ప్రసారం చేసిన ఓ కార్యక్రమంలో వక్తలు అభిప్రాయ పడ్డారు. శ్రీదేవికి జాతీయ అవార్డు రాకపోవడం ఆ అవార్డు దురదృష్టమన్నారు.

వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లొద్దు

శ్రీదేవి-బోనీకపూర్‌ల దాంపత్య జీవితం గురించి, వారి పెళ్లి గురించి చర్చల్లో పాల్గొన్న వ్తలు రకరకాలుగా మాట్లాడారు. ఓ ఛానల్‌ ద్వారా నటి జయసుధ సంతాప సందేశాన్ని ఫోన్‌లో పంచుకున్న సందర్భంలో ‘అందాన్ని కాపాడుకు నేందుకు శ్రీదేవి ఒత్తిడికి గురయ్యే వారా ?’ అని యాంకర్‌ అడిగిన ప్రశ్నకు జయసుధ స్పందిస్తూ ‘ప్రతీ నటికి అందం విషయంలో ఒత్తిడి ఉండే మాట వాస్తవమే. కాని, ఈ సమయంలో వాటిని చర్చించడం భావ్యం కాదు’ అని సమాధానమిచ్చారు.

హీరోలతో పోటీ పడి డ్యాన్సులు..

మామూలుగా కథానాయికలు హీరోలతో పోటీ పడి డ్యాన్సులు చేయడం కష్టం. అయితే ఈ విషయంలో శ్రీదేవికి మాత్రం మినహాయింపు లభిస్తుంది. ఎందుంటే శ్రీదేవి చాలా అద్భుతమైన డ్యాన్సర్‌. ఈ విషయాన్ని సాక్షాత్తూ ఎన్‌టిఆర్‌ ఓ సందర్భంలో గుర్తుచేశారు కూడా. ఇదే విషయాన్ని అప్పట్లో తన చిత్రాలకు కొరియోగ్రాఫర్లుగా పనిచేసిన డ్యాన్సు మాస్టర్లు సైతం వివిధ చర్చల్లో చెప్పారు.

కన్నడ ఛానల్స్‌ కూడా…

శ్రీదేవి కేవలం ఆరు కన్నడ చిత్రాల్లో మాత్రమే నటించారు. అయినా కన్నడ ఛానళ్లు కూడా శ్రీదేవి మృతి పట్ల సంతాప కార్యక్రమాలు ప్రసారం చేశాయి. టి.వి.9 కన్నడ ఛానల్‌ను ఈ సందర్భంగా మనం అభినందించాలి.

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌

శ్రీదేవి హిందీ చిత్రరంగ ప్రయాణంలో నూటికి నూరుపాళ్లు విజయం సాధించారు. తొలుత శ్రీదేవికి తమిళ, తెలుగు రంగాల్లో ఎనలేని పేరు, ప్రఖ్యాతులు సంపాదించి పెట్టిన ‘పదహారేళ్ల వయసు’ చిత్రం హిందీలో ‘సోలా శావన్‌’ పేరుతో రీమేక్‌ చేశారు. కాని ఆ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అది విడుదలైన ఐదేళ్ల తర్వాత ‘హిమ్మత్‌వాలా’ చిత్రంతో బాలీవుడ్‌ ప్రేక్షకులను మెప్పించారు శ్రీదేవి. తర్వాత ఆమెకు వరుసగా హిందీలో అవకాశాలు వచ్చాయి. ఈ చిత్రాన్ని ‘ఊరికి మొనగాడు’ పేరుతో తెలుగులో రీమేక్‌ చేశారు. అది ఇక్కడ కూడా మంచి ఫలితాన్నిచ్చింది. ఇలా శ్రీదేవి తెలుగు, హిందీ చిత్ర రంగాల్లో తిరుగులేని నటిగా ఎదిగారని ప్రముఖ నటుడు కృష్ణ సోదరుడు ఎబిఎన్‌ ఆంధ్రజ్యోతి ఛానల్‌ ‘వసంత కోకిల వెళ్లి పోయింది’ అన్న పేరుతో ప్రసారం చేసిన కార్యక్రమంలో తెలిపారు. శ్రీదేవి తన కుమార్తె జాహ్నవిని కూడా హిందీ చిత్రం ద్వారానే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలను కున్నారు. కాని ఆ కల నెరవేరకుండానే అమె స్వర్గానికి వెళ్లిపోయారు.

శ్రీదేవి తమిళనాడులోని శివకాశిలో జన్మించారు. బాలనటిగా తెలుగు, కన్నడ, తమిళ, మళయాల చిత్ర రంగాల్లో తనదైన ముద్ర వేశారు. తర్వాత కొంతకాలం విశ్రాంతి తీసుకున్న శ్రీదేవి 2012లో హిందీలో ‘ఇంగ్లీష్‌ వింగ్లీష్‌’ చిత్రం ద్వారా రెండవ ఇన్నింగ్స్‌ను ప్రారంభించి విజయం సాధించారు. శ్రీదేవి నటించిన చివరి చిత్రం ‘మామ్‌’ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

శ్రీదేవి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రధాని నరేంద్ర మోది, నటులు కమల్‌హాసన్‌, రజనీకాంత్‌, చిరంజీవి, వెంకటేష్‌, అక్షయ్‌కుమార్‌, తదితరులు ప్రార్థించారు.

– స్ఫూర్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *