మహిళా బాక్సింగ్‌లో మేరి గోల్డ్‌

మహిళా బాక్సింగ్‌లో మేరి గోల్డ్‌

భారత మహిళా బాక్సింగ్‌ దిగ్గజం. మణిపూర్‌ మణిపూస మేరీకోమ్‌ పునరాగమనం స్వర్ణ పతకంతో ప్రారంభమయ్యింది. హోచిమిన్‌ సిటీ వేదికగా ముగిసిన 2017 ఆసియా మహిళల బాక్సింగ్‌ టోర్నీ 48 కిలోల విభాగంలో మేరీకోమ్‌ ‘మేరీ గోల్డ్‌’ గా నిలిచింది. 34 ఏళ్ల వయసులో, ముగ్గురు బిడ్డల తల్లిగా, పార్లమెంట్‌ సభ్యురాలి ¬దాలో ఆసియా బాక్సింగ్‌ బంగారు పతకం సాధించిన తొలి భారత మహిళగా చరిత్ర సష్టించింది.

మణిపూర్‌ మణిపూస మేరీకోమ్‌ భారత క్రీడాభిమానులకు ఏమాత్రం పరిచయం అవసరం లేని పేరు. కేవలం ముష్టిఘాతాల క్రీడ ‘బాక్సింగ్‌’ కోసమే పుట్టిన క్రీడాకారిణి. గత రెండు దశాబ్దాలుగా భారత మహిళా బాక్సింగ్‌లో నిత్యనూతనంగా వెలుగొందుతున్న మేరీకోమ్‌ 34 ఏళ్ళ లేటు వయసులోనూ తన పంచుల్లో వాడీ వేడీ ఏమాత్రం తగ్గలేదని చాటుకొంది.

మారుమూల పల్లె నుంచి ప్రపంచ స్థాయికి

ఈశాన్య భారత రాష్ట్రం మణిపూర్‌లోని చురాచంద్‌పూర్‌ జిల్లాలోని కాంగ్తీ గ్రామానికి చెందిన మేరీకోమ్‌కు బాల్యం నుంచి క్రీడలంటే ఎంతో ఇష్టం. ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ అంశాలైన 400 మీటర్ల పరుగు, జావలిన్‌ త్రో అంశాలలో మంచి అథ్లెట్‌గా గుర్తింపు తెచ్చుకోవాలన్న పట్టుదల మేరీలో ఉండేది. అయితే 1988 బ్యాంకాక్‌ ఆసియా క్రీడల బాక్సింగ్‌లో బంగారు పతకం సాధించిన మణిపూర్‌ బాక్సర్‌ డింకో సింగ్‌ స్ఫూర్తితో మేరీకోమ్‌ బాక్సింగ్‌ వైపు దష్టి మళ్లించింది.

‘ఆడపిల్లలకు బాక్సింగ్‌ లాంటి మొరటు క్రీడ ఏంటి’? అంటూ అమ్మానాన్నలతో పాటు గ్రామస్థులూ నిరుత్సాహ పరచినా మేరీకోమ్‌ తన సాధన కొనసాగించింది. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో రాణించిన మేరీకోమ్‌ ఆ తర్వాత జాతీయ స్థాయిలోనూ గుర్తింపు సంపాదించింది.

ఐదుసార్లు విశ్వవిజేతగా

ప్రపంచ అమెచ్యూర్‌ మహిళా బాక్సింగ్‌లో ఐదుసార్లు విశ్వవిజేతగా బంగారు పతకాలు సాధించిన ఘనత మేరీకోమ్‌కు మాత్రమే దక్కుతుంది. వరుసగా ఆరు ప్రపంచకప్‌ పోటీల్లో ఐదు స్వర్ణాలు, ఓ రజత పతకం సాధించిన అరుదైన, అసాధారణ రికార్డు కూడా మేరీకోమ్‌ పేరుతోనే ఉంది.

కెరియర్‌ ప్రారంభంలో 45 కిలోలు, ఆ తర్వాత 46 కిలోల విభాగాలలో విశ్వవిజేతగా నిలిచిన మేరీకోమ్‌ ప్రస్తుతం 48 కిలోల విభాగంలో తన పోటీ కొనసాగిస్తోంది. ఇక ఆసియా మహిళా బాక్సింగ్‌ పోటీలలో సైతం ఐదు బంగారు పతకాలు గెలుచుకొన్న భారత ఏకైక బాక్సర్‌ మేరీకోమ్‌ మాత్రమే.

2003, 2005, 2010, 2012 ఆసియా పోటీల్లో స్వర్ణ పతకాలు సాధించిన మేరీకోమ్‌ 2008 ఆసియా బాక్సింగ్‌ పోటీలో మాత్రం రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

మూడేళ్ల విరామం తర్వాత

లండన్‌ వేదికగా జరిగిన 2012 ఒలింపిక్స్‌లో తొలిసారిగా ప్రవేశపెట్టిన మహిళా బాక్సింగ్‌లో మేరీకోమ్‌ భారీ అంచనాలతో బరిలోకి దిగినా చివరకు కాంస్య పతకంతో స్వదేశానికి తిరిగిరాక తప్పలేదు.

2010 గాంగ్జావో ఆసియా క్రీడల్లో కాంస్యం, 2014 ఇంచియోన్‌ ఆసియా క్రీడల్లో బంగారు పతకాలు సాధించిన మేరీకోమ్‌ ఆ తర్వాత బాక్సింగ్‌ నుంచి విరామం తీసుకొంది. అప్పటికే ముగ్గురు బిడ్డల తల్లిగా ఓ వైపు కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే మూడేళ్లపాటు బాక్సింగ్‌కు దూరమైన మేరీకోమ్‌ 2016లో రాజ్యసభ సభ్యురాలిగా ఎంపికయ్యింది. అంతేకాదు భారత బాక్సింగ్‌ పరిశీలకురాలిగానూ బాధ్యతలు తీసుకొంది. ఇలా పలురకాల కారణాలతో బాక్సింగ్‌కు దూరంగా ఉన్నా నిర్లక్ష్యం చేయకుండా సాధన కొనసాగిస్తూనే వచ్చింది.

అవార్డులే అవార్డులు

వియత్నాం రాజధాని హోచిమిన్‌ సిటీ వేదికగా ముగిసిన 2017 ఆసియా మహిళా బాక్సింగ్‌ 48 కిలోల విభాగంలో పోటీకి దిగిన మేరీకోమ్‌ స్థాయికి తగ్గట్టుగా రాణిస్తూ సెమీఫైనల్లో జపాన్‌, ఫైనల్లో ఉత్తర కొరియా బాక్సర్లను చిత్తు చేయడం ద్వారా బంగారు పతకం సొంతం చేసుకొంది.

ప్రపంచ అమెచ్యూర్‌ బాక్సింగ్‌లో మాత్రమే కాదు ఆసియా బాక్సింగ్‌ లోనూ ఐదు బంగారు పతకాలు సాధించడం ద్వారా మేరీగోల్డ్‌గా నిలిచిపోయింది.

2003 లో అర్జున అవార్డు, 2006 లో పద్మశ్రీ, 2009 లో దేశ అత్యున్నత క్రీడాపురస్కారం రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న, 2013 లో పద్మభూషణ్‌ అవార్డులు పొందిన మేరీకోమ్‌ మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌లో ఓ బాక్సింగ్‌ అకాడమిని నిర్వహిస్తోంది.

ముగ్గురు బిడ్డల తల్లిగా, పార్లమెంట్‌ సభ్యురాలిగా, భారత బాక్సింగ్‌ పరిశీలకురాలిగా, అంతర్జాతీయ బాక్సర్‌గా బహుముఖ బాధ్యతలు నిర్వర్తిస్తూ మేరీకోమ్‌ భారత మహిళలకు గర్వకారణంగా, స్ఫూర్తి దాయకంగా నిలుస్తోంది. మేరీకోమ్‌ 2022 ఏప్రిల్‌ 24 వరకు రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగుతుంది. ఇంతటి ఘనతను సాధించిన మేరీకోమ్‌ను ‘మేరీగోల్డ్‌’ అనడం ఏమాత్రం అతిశయోక్తికాదు.

– క్రీడా కృష్ణ , 84668 64969

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *