మనీ.. మనిష

మనీ.. మనిష

ప్రయాణానికి అంతా సిద్ధం. ఆఖరి క్షణం జాగ్రత్తగా మరోమారు చూసుకుంటోంది పావని.

చంద్ర, కేశవ్‌ క్యాబ్‌లు బుక్‌ చేసే పనిలో ఉన్నారు. పిల్లా, పెద్దా కలిపి డజను మంది. రెండు ఇన్నోవాలు కావాలి.

మిగిలిన జనాభా అంతా హడావిడిగా ఉన్నారు.

రాజారావు ఫోన్‌లో ‘హలో శ్రీహరి అనంత కృష్ణన్‌ నంబరు నీకేమైనా తెలుసా ? పొద్దున శ్రీనుని అడిగాను తెలీదట. నీకు తెలుసేమోనని నీ నంబరు ఇచ్చాడు. అప్పట్నుంచి ట్రై చేస్తున్నా’ అంటూ పెద్దగా మాట్లాడుతున్నాడు. అందరికీ విసుగేసింది. రాజారావు భార్య సుధ మాత్రం బాహాటంగానే విసుక్కుంది. ‘చాదస్తానికైనా అంతుండాలి. ఇప్పుడా పిచ్చి ఫోన్లు అవసరమా ?’ అంటే మాట్లాడద్దు అని సైగ చేశాడాయన.

సామానంతా తీసుకుని ఇల్లుకు తాళం వేసి బయటికి వచ్చి టాక్సీలో కూర్చోబోతూ ఫోను ఆపేశాడు. ‘ఇతనికీ తెలీదట. కానీ పార్థసారధి అని తన ఫ్రెండ్‌ కడలూరులో ఉంటున్నాడు. ఆయనకు తెలుస్తుందట. అతనికి తానే ఫోన్‌ చేసి చెప్తానన్నాడు’ అని చెప్పాడు రాజారావు. అందరి మొహాల్లోనూ దాచుకుందామన్నా దాగని విసుగు. అదంతా రాజారావుకి అలవాటే. ఆ విషయంలో చాలా సార్లు వాదోపవాదాలు జరిగాయి.

స్టేషన్‌కి చేరారు. చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఏ.సి. టూ టైర్‌ కంపార్ట్‌మెంట్‌లో అందరూ ఎక్కి సర్దుకున్నారు. రైలు బయల్దేరగానే జేబులోంచి ఓ చిన్న పుస్తకం తీసి వెతకటం మొదలు పెట్టాడు రాజారావు. వెంకట్రావుకు ఏమైనా తెలుసేమో అని ఆ వెంకట్రావుకి ఫోన్‌ చేశాడు. కుశల ప్రశ్నలు అయ్యాక ‘నీకు అనంత కృష్ణన్‌ గుర్తున్నాడా ? రామేశ్వరంలో ఉంటాడు ?’ అంటూ మళ్ళీ మొదలు పెట్టాడు. కేశవ్‌కి చిర్రెత్తుకొచ్చింది. తండ్రిని ఏమీ అనలేక ‘అబ్బా ఏమిటమ్మా ఇదీ ? ప్రయాణం అనుకున్న దగ్గర్నించి వెతుకుతున్నారు ఆ అనంత కృష్ణన్‌ కోసం. నువ్వు చెప్పరాదా ?’ అన్నాడు.

‘నే చెప్తే వింటారా ? ఇదే ఆఖరు, ఇంకెక్కడికీ మాతో పెట్టుకోకుండా మీరు వెళ్ళండి సుఖంగా’ అంది ఉక్రోషంతో.

రాజారావు పద్దతి వేరు. రైల్వేలో గార్డుగా పనిచేసి రిటైర్‌ అయ్యాడు. భార్య సుధ. వాళ్ళ ఊరు రేపల్లె. అక్కడ సొంత ఇల్లుంది. రాజారావు కొడుకు కేశవ్‌- కోడలు పావని. కూతురు పేరు కళ్యాణి-ఆమె భర్త చంద్ర. వీళ్లందరూ హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తారు. వీళ్లకు ఇద్దరేసి పిల్లలున్నారు. తమ పిల్లల దగ్గరికి అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారు రాజారావు, సుధ.

కేశవ్‌, చంద్రలకు కొత్త ప్రదేశాలు చూడటమంటే చాలా ఇష్టం. వీలున్నప్పుడల్లా తీర్థయాత్రలకో, విహారయాత్రలకో వెళ్తూనే ఉంటారు. వెళ్ళినప్పుడు వీళ్ళనీ ప్రయాణం చేయిస్తారు.

రాజారావుది మొదటి నుంచీ స్నేహానికి ప్రాణం ఇచ్చే స్వభావం. ఉద్యోగ రీత్యా బదిలీలు. అన్ని ఊళ్ళలోనూ బోలెడంత మంది స్నేహితులు. ఊరు మారినా ఉత్తరాల ద్వారా స్నేహం కొనసాగిస్తూనే ఉంటాడు. పొరుగూరు వెళ్తుంటే అక్కడ స్నేహితులు ఎవరున్నారో వెతికి వాళ్లకి ఓ కార్డు రాసి, ఓ మారు వెళ్లి చూసి వస్తేగానీ తోచదు. రైలు ప్రయాణంలో మధ్య ఊళ్ళో ఎవరైనా ఉంటే నేను ఫలానా రోజున ఫలానా రైల్లో వెళ్తున్నా. నీకు వీలుంటే స్టేషనుకి రా. చూసి చాలాకాలం అయిందని ఉత్తరం రాస్తే గానీ ప్రాణం నిలవదు. వాళ్ళు స్టేషనుకి వచ్చి పలకరిస్తే ఆయన ఆనందానికి పట్టపగ్గాలుండవు. రాకపోతే విరోధం వహించడు. వీలు కాలేదేమో అని సరిపెట్టుకుంటాడు. ఎవరైనా ఊళ్లోకి వస్తే వాళ్ళని ఆప్యాయంగా ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇవ్వటం రాజారావుకు పరమానందం. రిటైరయినా అదే పద్దతి. ఉత్తరాలు పోయి ఫోన్లొచ్చాయి అంతే తేడా.

ఆయన మారలేదుగాని సమాజం మారి పోయింది. ఆప్యాయతలు తగ్గిపోతున్నాయి. ఏదో అవసరం పడితే తప్ప రాకపోకలుండటం లేదు. కాలంతో పాటు మారని రాజారావు ఇంటివారికి తలనొప్పిగా తయారయ్యాడు.

భువనేశ్వర్‌ వెళ్తున్నామని చెబితే అక్కడ మహాపాత్రా ఉన్నాడు. అతనికి ఫోన్‌ చేస్తే మనకు కావలసిన సాయం చేస్తాడని రాజారావు అనేవాడు. కొడుక్కి చిరాకు వేసేది. అవన్నీ పాతకాలంలో. ఇప్పుడు అన్ని ఏర్పాట్లూ ఆన్‌లైన్‌ మీదనే అయి పోతున్నాయి కదా అంటాడు కేశవ్‌. అయినప్పటికీ వెళ్ళే చోట ఎవరున్నారో కనుక్కుని వాళ్లకి ఫోన్‌ చేసి వెళ్లి చూసి రావాలనే ఆరాటం మాత్రం ఆవగింజంతైనా తగ్గలేదు రాజారావుకి. ఫలితం అందరికీ విసుగు.

ప్రస్తుతం అదే నడుస్తోంది. కుటుంబమంతా కలసి రామేశ్వరం ప్రయాణం పెట్టుకున్నారు. వాళ్ళ కుటుంబమే కాక కోడలి తల్లీ, అల్లుడి మేనత్త కూడా బయలుదేరారు.

రామేశ్వరంలో రాజారావు పాత స్నేహితుడు అనంత కృష్ణన్‌ ఉన్నాడు. అతని కోసం గాలిస్తున్నా డాయన. ‘ఎప్పటి మనిషి ?’ అని విసుక్కుంటున్నారు ఇంట్లోవాళ్ళు.

చెన్నై చేరారు. ముందుగా బుక్‌ చేసుకున్న హోటల్‌కి వెళ్లారు. రామేశ్వరం రైలు రాత్రికి. పగలంతా కొందరు గుడికి, కొందరు షాపింగ్‌కి వెళ్లారు. రాజారావు కోయంబేడులో ఉన్న పాత మిత్రుడు కృష్ణమూర్తి ఇంటికి వెళ్లొచ్చాడు. అందరూ ఎగ్మూర్‌ స్టేషన్లో ఉండగా రాజారావుకి ఫోనొచ్చింది. వెంకట్రావు ఫోన్‌ చేసి అనంత కృష్ణన్‌ నంబర్‌ ఇచ్చాడు. రాజారావుకి చెప్పలేనంత సంతోషం కలిగింది. వెంటనే ఫోన్‌ చేశాడు. మోగుతోంది గానీ ఎవరూ తియ్యలేదు. రామేశ్వరం వెళ్లే రైలు ఎక్కారు. భోజనాలు చేస్తూ ఉండగా మోగింది రాజారావు ఫోన్‌.

‘హలో యారు ? మిస్ట్‌ కాల్‌’ అంటూ వినిపించింది. ‘ఈజిట్‌ అనంత కృష్ణన్‌ ?’ అడిగాడు రాజారావు.

‘ఎస్‌’ అన్నాడు అవతలి మనిషి. అంతే ఆ తరువాత పదిహేను నిమిషాలు సాగిందా సంభాషణ. మామూలుగానే రాజారావు పెద్దగా మాట్లాడతాడు. ఆపై ఉత్సాహం. పక్క వాళ్ళ చెవులు చిల్లులు పడిపోయాయి.

‘నాన్నగారూ అక్కడ మనకు తీరిక ఉండదు. మీరు వేరే ప్రోగ్రాములు పెట్టకండి’ అన్నాడు కేశవ్‌ విసుగ్గా.

‘సరేలే. మీకు ఇబ్బంది కలగకుండా ఓ మారు కలిసొస్తాను’ అన్నాడాయన. అందరూ పక్కలు పరుచుకుని పడుకున్నారు.

హఠాత్తుగా అర్ధరాత్రి కలకలం. అందరూ నిద్ర లేచారు. కంగారు, గాబరా. మొదట ఎవరూ నమ్మలేదు. కాని అందరి ఫోన్లలోనూ అదే సమాచారం. వెయ్యి, అయిదు వందల నోట్లు రద్దయ్యాయి. అర్ధరాత్రి నుంచి చెల్లవు. నిర్ఘాంత పోయారు. ఎవరికీ కాళ్ళూ చేతులు ఆడలేదు.

ప్రయాణం అంటే అందరూ పెద్దనోట్లే తీసుకు బయలుదేరారు. అవి ఇప్పుడు చెల్లవు. హోటల్‌ వాళ్ళు వచ్చాక డబ్బు కట్టండన్నారు. వాళ్లకి క్రెడిట్‌ కార్డు సదుపాయం ఉంటే సరే లేకపోతె ఎలా ? ఏం చెయ్యాలి ?

కేశవ్‌, చంద్ర తలలు పట్టుకుని కూర్చున్నారు. వాళ్ళే కాదు రైల్లో ఎవ్వరూ నిద్ర పోలేదు. వెళ్ళేది పెద్ద పట్టణం కాదు మారుమూల యాత్రాస్థలం. పెద్దనోట్లు చెల్లకపోతే ఎలా ? అన్నీ సమస్యలే. తెల్లవారు ఝామున రామేశ్వరం చేరుకుంది రైలు. ఎన్నాళ్లుగానో చేయాలనుకుంటున్న యాత్ర చేయబోతున్నామన్న సంతోషం ఏ ఒక్కరిలోనూ లేదు. భయం, దిగులు. తప్పదు కాబట్టి రైల్లోంచి దిగారు.

హోటల్‌ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళాలి. కాని వాళ్ళెవరూ కనిపించలేదు. ఫోన్‌ చేసినా తియ్యటం లేదు. బయటికి వెళ్లి చూద్దామనుకోగానే ఓ పెద్దాయన వచ్చాడు. తెల్ల లుంగీ, తెల్ల షర్టు, నుదుట విభూతి, కుంకుమ బొట్టు.

‘రాజారావు.. రాజారావు’ అని ఏ.సి. పెట్టెల దగ్గర వెతుక్కుంటూ వస్తున్నాడు.

‘అనంతా.. అనంతా’ అంటూ ముందుకి వచ్చాడు రాజారావు. అమాంతం కావలించు కున్నాడు.

ఇద్దరూ తెగ ఆనంద పడిపోయారు. ఆ పరవశం నుండి బయట పడి తన వాళ్ళని పరిచయం చేశాడు రాజారావు. కన్నా, అమ్మణ్ణి అంటూ అందరినీ ఆప్యాయంగా పలకరించాడు కృష్ణన్‌. ఇంగ్లీష్‌, తమిళం, తెలుగు కలిపేసి మాట్లాడేస్తున్నాడు. కొడుకు శరవణని వెంట బెట్టుకొచ్చాడు. ‘పదండి మా ఇంటికి పోదాం’ అన్నాడు.

‘అయ్యో వద్దంకుల్‌. మేం హోటల్‌ బుక్‌ చేసుకున్నాం’ అన్నాడు కేశవ్‌.

‘ఆ హోటల్‌వానికి హార్ట్‌ ఎటాక్‌ వచ్చిందప్పా. చెన్నై తీసుక పోయి పూడిసినారు’ అని చెప్తూ ఉంటే శరవణ కలగజేసుకున్నాడు. ‘ఊరంతా గోలగా ఉంది. మా ఇంటికి వెళదాం’ అన్నాడు.

వీళ్లందరికీ చాలా మొహమాటంగా ఉంది. ఒక్కరూ ఇద్దరూ కాదు అంతమంది పోలోమంటూ పరాయి వాళ్లింటికి వెళ్లాలంటే మనసొప్పటం లేదు. కానీ తప్పదు.

ఆ తండ్రి, కొడుకులు మాత్రం వీళ్ళ సంఖ్య చూసి బెదిరిపోలేదు. ముందు రోజు ఫోన్లో మా ఇంటికి రమ్మని కృష్ణన్‌ అనటం, చాలామంది వస్తున్నాం హోటల్లో ఉంటామని రాజారావు చెప్పటంతో సిద్ధపడే వచ్చారు. స్టేషను బయటికి వచ్చాక మూడు ఆటోల్లో అతిథులను సామానుతో సహా సర్దేసి వాళ్లిద్దరూ బైక్‌ ఎక్కారు. గమ్యం చేరారు.

ఇల్లు తాతల నాటిది. బయట నీళ్లు జల్లి ముగ్గు వేసేశారు. ఇల్లాలు పద్మావతి స్నానం చేసేసి అతిథుల కోసం ఎదురు చూస్తోంది. ఆటోలు ఆగగానే ఎదురొచ్చింది. లోపలికి వెళ్లారు అందరూ. ఇంట్లోకి అడుగు పెట్టగానే కమ్మని కాఫీ వాసన గుబాళిస్తోంది.

కృష్ణన్‌కి ఇద్దరు కొడుకులు శరవణ, గణేశ. ఇద్దరూ ఆ ఊళ్ళోనే ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అంతా కలిసే ఉంటున్నారు. పరిచయాలు అయ్యాయి. ఇల్లు చిన్న చిన్న గదులతో, ఇంటి నిండా సామాను, మనుషులతో నిండుగా, సందడిగా ఉంది.

భర్తని పక్కకి పిలిచి ‘ఈ ఇంట్లో మనం ఎక్కడ ఇరుక్కుంటాం? తెల్లవారాక ఆ హోటల్‌కి వెళ్ళండి. అదికాకపోతే మరొకటి’ అంది పావని. తలాడించాడు కేశవ్‌.

కాఫీ రెడీ అని ఇంటివాళ్ళు తొందర పెడితే అందరూ మొహాలు కడుక్కొచ్చారు. కమ్మని కాఫీ, పిల్లలకి పాలు, అవి అవుతుండగానే నీళ్లు రెడీ స్నానం కానివ్వండి అన్నారు. అవీ అయ్యాయి.

కేశవ్‌, చంద్ర బయటికి వెళ్లారు. అంతటా అలజడిగా ఉంది. ఎక్కడా ఎవ్వరూ పెద్ద నోట్లు తీసుకోటం లేదు. ఏటిఎంలు బంద్‌. పిల్లా జెల్లాతో నానా అగచాట్లు పడుతున్నారు జనం. ఆ గొడవ చూశాక వాళ్ళిద్దరికీ ధైర్యం చాల్లేదు. మొండిగా వాళ్ళింట్లోంచి బయటికి వస్తే అవస్థల పాలై పోతాం. ఇవాల్టికి కానీ. రేపటికి కాస్త సెటిల్‌ అవుతుంది అప్పుడు చూద్దాం అనుకుని వెనక్కి వెళ్లిపోయారు.

ఇంట్లో అనంత కృష్ణన్‌ రాజారావుని కూర్చో బెట్టుకుని ప్రోగ్రాం సెట్‌ చేస్తున్నాడు. వీళ్ళని చూడగానే ‘మీకోసమే చూస్తున్నాం. ఎక్కడికి పోయారూ?’ అన్నాడు రాజారావు. వాళ్ళు సమాధానం చెప్పేలోగానే ‘కోవెలకి పోయొస్తామా?’ అన్నాడు కృష్ణన్‌. దగ్గరే అంటూ అందరినీ ఉట్టి కాళ్లతోనే నడిపించుకుంటూ తీసికెళ్ళాడు. అరకిలో మీటరు కూడా లేదు గుడి.

ఖాళీగానే ఉంది. ఇంకాసేపుంటే బాగా జనం వస్తారు అని చెప్పాడు. దర్శనం చేసుకుని ఇంటికి వచ్చారు. వేడి వేడి ఇడ్లీలు సిద్ధంగా ఉన్నాయి. టివిలో వార్తలు వస్తున్నాయి. టిఫిన్‌ తింటూ వార్తలు విన్నారు.

పెద్దనోట్లు బ్యాంకులో జమ చెయ్యాలి. దానికి గడువుంది. ప్రధాని మోది చేసింది మంచి పనే. నల్లధనం కొండల్లా కూడబెట్టిన వాళ్లకు ఆపద గానీ సామాన్యులకు నష్టం లేదు.

‘ఇంట్లో ఉంటే ఏదోలా సర్దుకోవచ్చు. కానీ మా లాగా బయటికి వచ్చిన వాళ్ళ గతి ఏమిటీ ?’ కేశవ్‌కి ఏడుపొక్కటే తక్కువ.

కృష్ణన్‌కి బాధేసింది ‘ఏమి కన్నా ఆ మాటలు ? మేం పరాయివాళ్ళమా? ఇది మాత్రం నీ ఇల్లు కాదా?” అని మందలించాడు.

‘అదికాదు అనంతా ? ఇంతమందిమి. మీకు ఇబ్బంది కదా ?’ అన్నాడు రాజారావు. ‘ఏం పర్వాలేదంకుల్‌. మాకేం ఇబ్బంది కాదు. రెండు రోజులేగా ఎలాగో సర్దుకుందాం’ అన్నాడు శరవణ. అతని భార్య జయలక్ష్మి, పావనితో అదే చెప్పింది. ‘యాత్రా స్థలంలో ఉండటం వల్ల చుట్టాలు రావటం అలవాటే. వీకుకు హోటల్‌లో ఉన్నంత సదుపాయంగా ఉండదు గానీ మాకేం ఇబ్బంది కాదు. మీరు మొహమాట పడకండి’ అంది.

కృష్ణన్‌ ఆ రెండు రోజులూ వాళ్ళ కార్యక్రమం రూపొందించాడు. ‘వెంటనే బయలుదేరి ధనుష్కోటి. వచ్చాక భోజనం చేసి ఊళ్ళో చూడాల్సినవి చూడటం. ఆ తరువాత మరోమారు కోవెలకి. మర్నాడు సముద్ర స్నానం, ఆ తరువాత 22 బావుల నీటి స్నానం. దర్శనం, అభిషేకం. భోజనం చేశాక అబ్దుల్‌ కలాం ఇల్లు చూసుకుని వచ్చి కాసేపు విశ్రాంతి. తరువాత ప్రయాణం. అంతే ఆ మాత్రం దానికే ఓ కంగారు పడిపోతున్నావు కన్నా. ఈ హోటల్లో బస చెయ్యటం ఇప్పుడొచ్చింది. మా రోజుల్లో తెలిసిన వాళ్ళింటికేగా పోయేది ?’ అన్నాడు కేశవ్‌తో.

కృష్ణన్‌ అంత సులువుగా చెప్పేశాడు గానీ అతని సహాయం అడుగడుగునా అవసరం అయింది. ముఖ్యంగా డబ్బు, క్రెడిట్‌ కార్డుతో పని గడవదు. పెద్దనోట్లు చెల్లవు. అన్ని వంద రూపాయల నోట్లు లేవు.

‘నాకు ఇవ్వండి చిల్లర ఇస్తును’ అని పెద్ద నోట్లు తీసుకుని చిల్లర ఇచ్చాడు కృష్ణన్‌. అవి కూడా ఎడాపెడా వాడకుండా అవకాశం ఉన్న చోట తన పలుకుబడి ఉపయోగించాడు. మొత్తానికి అనుకోని ఆపద వచ్చినా రాజారావు కుటుంబం యాత్రకు ఏ లోటూ రాలేదు సరికదా ఆ ఊరివాడు తోడుండటం వల్ల మామూలుగా అందరూ చూసేవే కాకుండా ఏకాంత రామయ్య ఆలయం, జటాయు తీర్ధం మొదలైనవి కూడా చూశారు.

కృష్ణన్‌ చిన్న కొడుకు తోడుగా ఉండి అన్నీ చూపించాడు. కోడళ్ళు ప్రేమగా మాట్లాడుతూ స్నేహంగా మెసిలారు. కృష్ణన్‌ ఆనందం అంతా ఇంతా కాదు. పాత స్నేహితుడు వచ్చి తనింట్లో చెయ్యి కడిగాడని తెగ సంబర పడిపోయాడు. భాష రాకపోయినా ఇంటి ఇల్లాలు పద్మావతి నవ్వుతూ అపర అన్నపూర్ణలా వండి పెట్టింది.

రాత్రి రైల్లోకి పులిహోర పెరుగన్నం కట్టి ఇచ్చింది. బొట్టుపెట్టి తాంబూలంతో కొబ్బరికాయ ఇచ్చింది.

స్టేషన్‌కి కృష్ణతో పాటు కొడుకులిద్దరూ వచ్చారు. రెండురోజులు కలిసి ఉండటంతో స్నేహం ఏర్పడింది.

అనుకోకుండా కలుసుకున్నాం. ఇక మీద క్రమం తప్పకుండా ఫోన్లు చేసుకుంటూ ఉందాం అనుకున్నారు పాత మిత్రులిద్దరూ.

రైలెక్కించి కదిలేదాకా ఉన్నారు వాళ్ళు.

రైలు కదులుతూ ఉంటే రాజారావుతో పాటు అందరి కళ్ళూ చెమర్చాయి.

చెన్నై చేరాక క్రెడిట్‌ కార్డుతో పని గడిచి పోయింది. రాత్రి రైలెక్కి తెల్లారేసరికి ఇంటికి చేరారు.

వీళ్ళని చూడగానే ఎలా జరిగింది ప్రయాణం? ఏమీ ఇబ్బంది పడలేదుకదా? అనడిగారు ఇరుగు పొరుగువాళ్ళు.

అంతా విని అక్కడ ‘మీ వాళ్ళు ఉండటం అదృష్టం. మీలా వెళ్లిన వాళ్ళు చాలామంది అవస్థలు పడ్డారు. టి.వి.లో చూశాం తిరుమలలో పాలు, కాఫీ ఫలహారం ఉచితంగా ఇచ్చారట. మిగిలిన చోట్లలో కూడా భోజనం చేసేందుకు డబ్బులేక సత్రంలోనే తిన్నారట’ అని చెప్పారు.

రామేశ్వరం వెళ్లొచ్చాక రాజారావు కుటుంబ సభ్యుల్లో చాలా మార్పు వచ్చింది. అదివరకు లాగా ఆయన తన మిత్రులకు ఫోన్లు చేసి మాట్లాడుతుంటే చాదస్తం అని విసుక్కోటం లేదు. సుధ కల్పించుకుని ‘ఆయన భార్య ఉందా ? నేను పలకరిస్తాను’ అని చొరవ చూపిస్తోంది.

గతంలో ఆయన ఏ మిత్రుడి ఇంటికైనా వెళ్తానంటే ఎందుకూ అంత దూరం పడిపోవటం అని విసుక్కోవడం లేదు కొడుకు. ‘నేను ఆఫీసుకు వెళ్తూ దిగబెడతాను. తిరిగి వచ్చేటప్పుడు క్యాబ్‌లో రండి’ అని మర్యాదగా చెప్తున్నాడు. అంతేకాదు పోస్ట్‌మాన్‌ గుమ్మంలో ఉత్తరం వేసి పోయినట్లూ తండ్రిని గేటుముందు దించి పోకుండా లోపలికి వెళ్లి తండ్రి మిత్రుడిని పలకరించి మరీ వెళ్తున్నాడు.

రామేశ్వరంలో కలిగిన అనుభవంతో వాళ్లకి జ్ఞానోదయం అయింది. ఇప్పటికే ఎన్నో యంత్రాల వల్ల జీవితం సుఖమయం అయింది. భవిష్యత్తులో ఇంకా ఎన్నో సదుపాయాలూ రావచ్చు. ఎన్ని ఉన్నా, ఎంత ఉన్నా అవేవీ మనిషికి సాటిరావు. ఒక్క మనిషి అండగా ఉంటే చాలు కొండంత బలం. ఎందుకంటే ఈ యంత్రాలూ, డబ్బులు మనిషి కనిపెట్టినవి. మనిషి దేవుని సృష్టి !

– పొత్తూరి విజయలక్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *