మనం

మనం

‘ఐకమత్యమే మహాబలం’ అన్నారు పెద్దలు. ‘నేను’ అనేది అహంకారానికి నిదర్శనం. ‘మనం’ అనేది ఐకమత్యానికి ప్రతీక. ఈ రెండు విషయాలను మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి.

‘మనం’ అనే శీర్షికతో ప్రసిద్ధ నటుడు సాయి కుమార్‌ నేతృత్వంలో ప్రతి మంగళవారం రాత్రి 9.30 నిమిషాలకు ఈటివిలో ఒక గేమ్‌ షో ప్రసారమవు తోంది. ఈ కార్యక్రమంపై ఓ పరిశీలన.

సాయికుమార్‌ పేరు వినగానే తెలుగు సినీ ప్రేక్షకులకు దమ్మున్న పోలీస్‌ ఆఫీసర్‌ ‘అగ్ని’ గుర్తుకొస్తారు. గంభీరమైన గొంతుతో, అద్భుతమైన నటనతో, విరామం లేని డైలాగులతో తెలుగు సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన నటుడు ఆయన.

‘మనం’ కార్యక్రమం ద్వారా సాయికుమార్‌ మరోసారి ప్రేక్షకులకు దగ్గరయ్యారనే చెప్పాలి. నేటి సమాజంలో కుటుంబ సభ్యులందరూ కలిసి ఒకే చోట గడపడం గగనమైపోయింది. కేవలం పండగల్లో, ఇతర పార్టీల్లో మాత్రమే అందరూ కలుసుకుంటున్నారు. ఈ యాంత్రిక జీవనంలో ‘మనం’ అనే కార్యక్రమం ద్వారా కుటుంబ సభ్యులందర్ని ఒకే వేదికపై కలుసుకునేలా చేయడం నిజంగా మంచి ఆలోచన.

నాలుగు రౌండ్లు

ఈ కార్యక్రమ సరళి ప్రకారం ఇందులో నాలుగు రౌండ్లుంటాయి. అవి ‘మూడుముళ్ళ బంధం’, ‘ఏమండోయ్‌ ఆడండోయ్‌’, ‘సూపర్‌ 5’, ‘వాటమ్మా వాటీజ్‌ దిస్‌ బొమ్మ’.

ఇంకాస్త కఠినంగా ఉండొచ్చు

గతంలో కంటే ఇప్పుడు ప్రసార మాధ్యమాల వేగం, పరిధి పెరిగాయి. కనుక అన్నీ అరచేతిలో ఉండే మొబైల్‌ ద్వారానే లభ్యం కావడం వల్ల వయోబేధం లేకుండా అందరూ అన్ని విషయాలపైనా కనీస అవగాహన పెంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రశ్నల రౌండ్లు అయినటువంటి మొదటి (మూడుముళ్ల బంధం), మూడవ (సూపర్‌ 5) రౌండ్లలో సంధించే ప్రశ్నల స్థాయిని ఇంకాస్త పెంచొచ్చు.

ఏప్రిల్‌ 3న ప్రసారమైన కార్యక్రమంలో ‘ఒలింపిక్స్‌లో ప్రదానం చేసే మూడు పతకాలు ఏంటి?’, ‘హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్ళికి ముందు జరిపే మూడు ప్రక్రియలు ఏంటి ?’ లాంటి సింపుల్‌ ప్రశ్నలను అడిగారు. అయితే కార్యక్రమంలో పాల్గొన్న కుటుంబాల ప్రతినిధులు వీటిలో కొన్నిటికి సరిగ్గా సమాధానాలు చెప్పలేకపోయారు. అలాగే కుటుంబ సభ్యుల్లో ఒకరు చక్రం తిప్పుతూంటే (5 గరిష్ట సంఖ్యగా ఉన్న చక్రమది. అందుకే ఈ రౌండ్‌ పేరు సూపర్‌ 5 అని పెట్టారు) అది ఏ సంఖ్య వద్ద ఆగితే అన్ని సమాధానాల్ని అడిగిన ప్రశ్నకు చెప్పాలి. ఈ రౌండ్‌లో సినిమాలకు చెందిన ప్రశ్నల కన్నా మిగతా వాటికే ఎక్కువ ప్రాధాన్యమిస్తే బాగుండేది. లేదా ఆ సినిమా ప్రశ్నల విషయంలోనైనా కొద్దిగా నాణ్యత పాటిస్తే బాగుండేది.

మిగతా రెండు రౌండ్లు ‘ఏమండోయ్‌ ఆడండోయ్‌’ లో కార్యక్రమంలో పాల్గొన్న కుటుంబా ల్లోని భార్యాభర్తలు బంతులు బుట్టల్లో వేయడం, ‘వాటమ్మా వాటీజ్‌ దిస్‌ బొమ్మ’ లో కుటుంబ సభ్యులు ఆ స్టేజిపై ఉన్న క్యూబ్స్‌తో పోస్టర్‌లోని బొమ్మను తయారు చేయడం లాంటివి సరదాగా ఉన్నాయి.

అయితే ఇక్కడ ఏ రౌండ్‌లో ఎవరు ఎంత గెలిచారన్నది పెద్దగా ప్రాధాన్యం ఇవ్వనక్కరలేదు కదా! ఎందుకంటే ఈ ప్రోగ్రాం ప్రధాన ఉద్దేశం కుటుంబంలోని అన్ని తరాలు ఒకచోట కలుసు కోవడం. తండ్రి, తల్లి, భార్య, భర్త, కూతుళ్ళు, కొడుకులు, వదినలు, తమ్ముళ్ళు, వాళ్ళ పిల్లలు అందరూ సరదాగా గడపడం, తీసి జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడం.

అలాగే ఈ కార్యక్రమంలో (ఏప్రిల్‌ 3) ఇప్పటి తరం పాపులర్‌ పాటలకు కుటుంబంలోని యువతీ యువకులు సరదాగా స్టెప్స్‌ వేయడం లాంటివి బాగున్నాయి.

ఇలాంటి కార్యక్రమాల్లో ఎంత వద్దనుకున్నా కార్యక్రమాన్ని నిర్వహించే వ్యక్తి నేపథ్యం ప్రోగ్రాం మీద ప్రభావం చూపుతుంది. కాని ఇందులో ఆ పోకడలు తక్కువనే చెప్పాలి. ఏదో ఒకటి, రెండు చోట్ల సాయికుమార్‌కు మంచి గుర్తింపును తెచ్చిన ‘పోలీసు స్టోరీ’ చిత్రంలోని కొన్ని డైలాగులను చెప్పాలని ప్రేక్షకులు అడిగారు. సాయికుమార్‌ చెప్పక తప్పలేదు. తన కుమారుడు హీరో ఆది నటించిన చిత్రం ‘శమంతకమణి’ ప్రస్థావన కూడా వచ్చింది.

ఇంగ్లీషులోని ‘ఫామిలీ’ అనే పదంలో (ఎఫ్‌, ఎ, ఎం. ఐ, ఎల్‌. వై) ‘ఫాదర్‌ అండ్‌ మదర్‌ ఐ లవ్‌ యూ’ అన్న పదం దాగుందని సాయికుమార్‌ బంధువొకరు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఇలా చెప్పడం అందర్నీ ఆకట్టుకుంది. ఇంకో చెప్పుకోదగ్గ అంశమేమిటంటే సాధారణంగా ఈ తరహా కార్యక్రమాల్లో యాంకర్‌గా లేదా సమన్వయకర్తగా బాధ్యత వహించే వ్యక్తి షో మొదట్లో డాన్సు చేస్తూ తన ఎంట్రీ ఇస్తారు. కాని ఇందులో సాయికుమార్‌ అలా చేయలేదు. తన ఇమేజ్‌కు తగ్గట్టుగానే ప్రవర్తించారు.

ఏది ఏమైనా నేటి సమాజంలో డబుల్‌ మీనింగ్‌ డైలాగులతో, బూతు పంచులతో ప్రసారమవుతున్న కార్యక్రమాలకు ‘మనం’ ప్రోగ్రాం మినహాయింపు అవుతుంది. ప్రేక్షకులు సైతం ఇటువంటి కార్యక్రమాలనే ముందు ముందు చూడాలను కుంటున్నారు. గత ఎపిసోడ్స్‌లో జరిగిన పొరపాట్లను సవరించుకొని ఈ సారి మరింత అద్భుతంగా ఈ కార్యక్రమం కొనసాగాలని కోరుకుందాం !

– స్ఫూర్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *