భారత క్రీడా చరిత్రలో రికార్డు సృష్టించిన 2017

భారత క్రీడా చరిత్రలో రికార్డు సృష్టించిన 2017

భారత క్రీడాచరిత్రలో విజయవంతమైన ఏడాదిగా 2017 సంవత్సరం నిలిచింది. జాతీయ క్రీడ హాకీ, అనధికారిక జాతీయ క్రీడ క్రికెట్లో మాత్రమే కాదు బ్యాడ్మింటన్‌, షూటింగ్‌, బిలియర్డ్స్‌ అండ్‌ స్నూకర్‌ క్రీడల్లో సైతం 2017 విజయవంత మైన సంవత్సరంగా మిగిలిపోతుంది.

ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతంలో జనాభా పెరిగినంతగా క్రీడారంగం, సౌకర్యాలు పెరగలేదు. ప్రపంచీకరణ తర్వాతి కాలంలోనే భారత క్రీడారంగ ప్రగతి వేగం పుంజుకొంది. జాతీయ క్రీడ హాకీ, క్రికెట్‌, బ్యాడ్మింటన్‌, ఆర్చరీ, షూటింగ్‌, కుస్తీ, బాక్సింగ్‌, బిలియర్డ్స్‌ అండ్‌ స్నూకర్‌, టెన్నిస్‌ లాంటి క్రీడలు అనూహ్య ప్రగతి సాధించాయి. అయితే 2017 సంవత్సరం మాత్రం భారత క్రీడా పుస్తకంలో అత్యంత విజయవంతమైన సంవత్సరాలలో ఒకటిగా నిలుస్తుంది.

కొత్త ఊపిరి

జాతీయ క్రీడ హాకీలో భారతజట్టు 2017లో ప్రపంచ స్థాయిలో 6వ ర్యాంక్‌ సాధించింది. పదేళ్ల విరామం తర్వాత ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ హాకీ టైటిల్‌ను సైతం భారత పురుషుల జట్టు గెలుచుకొని జాతీయ క్రీడకు కొత్త ఊపిరి పోసింది.

భువనేశ్వర్‌ వేదికగా ముగిసిన ప్రపంచ హాకీ లీగ్‌ ఫైనల్స్‌లో జర్మనీపై సంచలన విజయం సాధించడం ద్వారా భారత్‌ మరోసారి పతక విజేతగా నిలిచింది. మలేషియా వేదికగా ముగిసిన సుల్తాన్‌ అజ్లాన్‌ షా గోల్డ్‌ కప్‌ హాకీ టోర్నీలో సైతం భారత్‌ కాంస్య పతకాన్ని సాధించింది.

క్రికెట్టు సూపర్‌ హిట్టు

అనధికారిక జాతీయ క్రీడ క్రికెట్‌ మూడు విభాగాలలోను 2017లో భారత్‌ అత్యుత్తమంగా రాణించింది. టెస్ట్‌ క్రికెట్లో ప్రపంచ నంబర్‌ వన్‌ ర్యాంక్‌, వన్డే, టీ-20 ఫార్మాట్లలో రెండో ర్యాంక్‌ సంపాదించింది.

2017 క్రికెట్‌ సీజన్‌లో టీమిండియా అత్యధిక స్వదేశీ సిరీస్‌లు ఆడటమే కాదు. అత్యధిక విజయాలను తన ఖాతాలో వేసుకుంది. శ్రీలంకతో గత సంవత్సర కాలంలో టీమిండియా మొత్తం మూడు ఫార్మాట్ల లోనూ 16 సిరీస్‌లు ఆడి ఓటమి అనేది లేకుండా నిలిచింది. విరాట్‌ కొహ్లీ, రోహిత్‌ శర్మ కెప్టెన్లుగా టీమిండియా మొత్తం 53 మ్యాచ్‌లు ఆడి 37 విజయాలు, 12 పరాజయాలతో అత్యంత విజయ వంతమైన జట్టుగా నిలిచింది. 2003 సీజన్‌లో ఆస్ట్రేలియా 47 మ్యాచ్‌లు ఆడి 38 విజయాలతో అగ్రస్థానంలో నిలిస్తే, 2017 సీజన్‌ విజయాల ద్వారా టీమిండియా ఆ తర్వాతి స్థానంలో కొనసాగుతోంది.

టెస్ట్‌, వన్డే, టీ-20 మొత్తం మూడు విభాగాలలోను అత్యధిక విజయాలు సాధించిన ఏకైక, ఒకే ఒక్క జట్టుగా టీమిండియా 2017 సీజన్‌ను ముగించింది.

కొహ్లీ హోరు.. రోహిత్‌ జోరు..

క్రికెట్‌ వ్యక్తిగత రికార్డుల్లో సైతం విరాట్‌ కొహ్లీ, రోహిత్‌ శర్మ తమకు తామే సాటిగా నిలిచారు. వన్డే, టీ-20 ఫార్మాట్లలో ప్రపంచ టాప్‌ ర్యాంక్‌ సాధించిన విరాట్‌ కొహ్లీ, టెస్ట్‌ క్రికెట్లో సైతం రెండోస్థానం పొందాడు. 2017 సీజన్లో విరాట్‌ కొహ్లీ 9 టెస్టులు, 26 వన్డేలు, 10 టీ-20ల్లో పాల్గొని రెండు డబుల్‌ సెంచరీలతో సహా 2 వేలకు పైగా పరుగులు సాధించాడు. కెప్టెన్‌గా వరుసగా రెండు డబుల్‌ సెంచరీలు బాదిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సష్టించాడు.

వన్డే, టీ-20 క్రికెట్‌ స్పెషలిస్ట్‌ రోహిత్‌ శర్మ కొహ్లీ అందుబాటులో లేకపోడంతో భారతజట్టు పగ్గాలు చేపట్టి శ్రీలంకతో తీన్మార్‌ వన్డే, టీ-20 సిరీస్‌ల్లో రికార్డు శతకాలు సాధించాడు. మొహాలీ వన్డేలో డబుల్‌ సెంచరీ, ఇండోర్‌ టీ-20 మ్యాచ్‌లో సునామీ సెంచరీ సాధించి చరిత్ర సష్టించాడు. శ్రీలంకతో టెస్ట్‌, వన్డే, టీ-20 మొత్తం మూడు ఫార్మాట్లలోనూ సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్‌గా రోహిత్‌ శర్మ రికార్డుల్లో చేరాడు. వన్డే క్రికెట్లో మూడు డబుల్‌ సెంచరీలు, టీ-20 క్రికెట్లో 35 బాల్స్‌లోనే ప్రపంచ రికార్డు శతకం నమోదు చేశాడు.

తెలుగు వెలుగుల బ్యాడ్మింటన్‌

బ్యాడ్మింటన్‌ పురుషుల, మహిళల సింగిల్స్‌లో తెలుగు తేజాలు కిదాంబీ శ్రీకాంత్‌, పీవీ సింధు 2017లో అంచనాలకు తగ్గట్టుగా రాణించి భారత బ్యాడ్మింటన్‌ ఖ్యాతిని పెంచారు. పురుషుల సింగిల్స్‌లో కిదాంబీ శ్రీకాంత్‌ అత్యుత్తమంగా 4వ ర్యాంక్‌ సాధించడంతో పాటు నాలుగు సూపర్‌ సిరీస్‌ టైటిల్స్‌ సాధించిన తొలి భారత ప్లేయర్‌గా నిలిచాడు. 2017 సీజన్‌ ఇండోనేషియా, ఆస్ట్రేలియా, డెన్మార్క్‌, ఫ్రెంచ్‌ మాస్టర్స్‌ సూపర్‌ సిరీస్‌ టైటిల్స్‌ విజేతగా శ్రీకాంత్‌ నిలిచాడు.

మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు రజత పతకాలతో మాత్రమే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఫైనల్స్‌కు చేరినా టైటిల్‌ సమరంలో ఒకుహరాతో పోరాడి ఓడింది. దుబాయ్‌ వేదికగా ముగిసిన సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌లో జపాన్‌ ప్లేయర్‌ యమగుచి నుంచి గట్టి పోటీ ఎదుర్కొని ఓడక తప్పలేదు. ఇండియన్‌ ఓపెన్‌, కొరియన్‌ ఓపెన్‌, సూపర్‌ సిరీస్‌ టైటిల్స్‌తో పాటు 3వ ర్యాంక్‌ సాధించిన సింధు 2017 సీజన్‌ను కొంచెం ఇష్టం. కొంచెం కష్టంగా ముగించింది.

క్యూ స్పోర్ట్స్‌ కింగ్‌ పంకజ్‌ అద్వానీ

మన దేశానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన క్యూ స్పోర్ట్స్‌ బిలియర్డ్స్‌ అండ్‌ స్నూకర్‌ విభాగా లలో పంకజ్‌ అద్వానీ తన సత్తా చాటుకున్నాడు. 2017 ఐపీఎస్‌ఎఫ్‌ ప్రపంచ స్నూకర్‌, బిలియర్డ్స్‌ విభాగాలలో పంకజ్‌ అద్వానీ విశ్వ విజేతగా నిలిచాడు. తాను సాధించిన ప్రపంచ టైటిల్స్‌ సంఖ్యను రికార్డు స్థాయిలో 18కి పెంచుకొన్నాడు.

షూటింగ్‌, బాక్సింగ్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, ఆర్చరీ లాంటి క్రీడల్లో సైతం భారత క్రీడాకారులు 2017లో చెప్పుకోదగ్గ విజయాలు సాధించగలిగారు. మొత్తం మీద భారత క్రీడా చరిత్రలో 2017 సంవత్సరం విజయాల పరంపరలో నిలిచింది.

– క్రీడా కృష్ణ , 8466864969

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *