భారత క్రీడారంగంలో ముగ్గురే ముగ్గురూ !

భారత క్రీడారంగంలో ముగ్గురే ముగ్గురూ !

భారత క్రీడారంగానికి ఎనలేని కీర్తి సాధించి పెట్టిన మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ, క్యూస్పోర్ట్‌లో రారాజు పంకజ్‌ అద్వానీలకు కేంద్ర ప్రభుత్వం దేశ మూడో అత్యున్నత పౌరపురస్కారం పద్మభూషణ్‌ను ఇచ్చి గౌరవించింది. అంతేకాదు తెలుగుతేజం, భారత బ్యాడ్మింటన్‌ సంచలనం కిడాంబీ శ్రీకాంత్‌ను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణించే క్రీడాకారులకు అవార్డులు, రివార్డులు, పురస్కారాలు ఏమాత్రం కొత్త కాదు. తమ తమ క్రీడల్లో అందుకొనే అవార్డులతో పాటు దేశ పౌరపురస్కారాలు అందుకొన్నప్పుడే ఆయా క్రీడాకారుల జీవితం పరిపూర్ణమవుతుంది.

ప్రస్తుతం అలాంటి అనుభవమే భారత ఆల్‌ టైమ్‌ గ్రేట్‌ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌ మన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ, బిలియర్డ్స్‌ అండ్‌ స్నూకర్‌ క్రీడల రారాజు పంకజ్‌ అద్వానీలకు దక్కింది.

భారత 69వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్‌, పద్మశ్రీ పురస్కార గ్రహీతల్లో మహేంద్రసింగ్‌ ధోనీ, కిడాంబీ శ్రీకాంత్‌లతో పాటు మరికొందరు ఉన్నారు.

రాజీవ్‌ ఖేల్‌రత్న నుంచి పద్మభూషణ్‌ వరకు

కెప్టెన్‌గా, వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌గా భారత క్రికెట్‌కు గత దశాబ్ద కాలంగా అసమాన సేవలు అందించిన జార్ఖండ్‌ డైనమైట్‌కు దేశ మూడో అత్యున్నత పౌరపురస్కారం పద్మభూషణ్‌ అవార్డును ప్రభుత్వం ప్రకటించింది.

భారతజట్టుకు 2007లో టీ-20 ప్రపంచకప్‌, 2011లో వన్డే ప్రపంచకప్‌ ట్రోఫీలతో పాటు, 2009లో టెస్ట్‌ క్రికెట్లో భారత్‌ను ప్రపంచ నంబర్‌వన్‌ జట్టుగా నిలిపిన ఘనత కెప్టెన్‌గా ధోనీకి మాత్రమే దక్కుతుంది. 2008, 2009 సంవత్సరాలకు ఐసీసీ వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు గెలుచుకొన్న ధోనీ 2007లో దేశ అత్యున్నత క్రీడాపురస్కారం రాజీవ్‌ ఖేల్‌రత్న అందుకొన్నాడు.

2009 సంవత్సరంలోనే పద్మశ్రీ పురస్కారం స్వీకరించిన మహేంద్రసింగ్‌ ధోనీ పద్మభూషణ్‌ అవార్డు కోసం మరో తొమ్మిది సంవత్సరాలు వేచి చూడాల్సి వచ్చింది. అటు ఐసీసీ నుంచి, ఇటు భారత ప్రభుత్వం నుంచి గొప్ప గొప్ప అవార్డులు అందుకొన్న అతికొద్దిమంది భారత క్రికెటర్లలో ధోనీ ఒకడిగా నిలిచిపోతాడు.

బిలియర్డ్స్‌- స్నూకర్‌ రారాజు

బిలియర్డ్స్‌, స్నూకర్‌ క్రీడల్లో భారత్‌కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు మాత్రమే కాదు, ఆసియా క్రీడల్లో బంగారు పతకాలు, 18 ప్రపంచ టైటిల్స్‌ అందించిన పంకజ్‌ అద్వానీని సైతం ప్రభుత్వం పద్మభూషణ్‌ అవార్డుతో గౌరవించింది.

2006, 2010 సంవత్సరాలలో జరిగిన ఆసియా క్రీడల బిలియర్డ్స్‌లో పంకజ్‌ అద్వానీ భారత్‌కు బంగారు పతకాలు సంపాదించిపెట్టాడు. అంతేకాదు ప్రపంచ బిలియర్డ్స్‌, స్నూకర్‌ విభాగాలలో ఇప్పటి వరకు 18 ప్రపంచ టైటిల్స్‌ సాధించిన అసాధారణ రికార్డు సైతం పంకజ్‌ అద్వానీకి ఉంది.

గతంలోనే అర్జున అవార్డు, రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న, 2009లో పద్మశ్రీ పురస్కారాలు అందుకొన్న పంకజ్‌ అద్వానీ సైతం తొమ్మిదేళ్ల విరామం తర్వాత పద్మభూషణ్‌ గౌరవం సాధించాడు.

పద్మశ్రీ కిడాంబీ శ్రీకాంత్‌

భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌, తెలుగుతేజం తన కెరియర్‌లో తొలిసారిగా భారత నాలుగో అత్యున్నత పౌరపురస్కారం పద్మశ్రీని సొంతం చేసుకొన్నాడు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌లో ప్రస్తుతం 3వ ర్యాంక్‌ ప్లేయర్‌గా ఉన్న కిడాంబీ శ్రీకాంత్‌ గత సీజన్‌లో నాలుగు సూపర్‌ సిరీస్‌ టైటిల్స్‌ విజయాలతో సంచలనం సష్టించాడు.

గతంలో ఇదే గౌరవం సాధించిన తెలుగు బ్యాడ్మింటన్‌ దిగ్గజాలు పుల్లెల గోపీచంద్‌, సైనా నెహ్వాల్‌, పీవీ సింధుల సరసన నిలిచాడు.

24 ఏళ్ల శ్రీకాంత్‌ అంకితభావం, అసాధారణ విజయాలకు గుర్తింపుగానే కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో భుజం తట్టి ప్రోత్సహించింది.

పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన ఇతర ప్రముఖ క్రీడాకారులలో మహిళా వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చానూ, టెన్నిస్‌ స్టార్‌ సోమ్‌ దేవ్‌ వర్మన్‌, పారా ఒలింపిక్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ మురళీకాంత్‌ పేట్కర్‌ ఉన్నారు.

పద్మభూషణ్‌ అవార్డు గ్రహీతలు ధోనీ, పంకజ్‌ అద్వానీలతో పాటు పద్మశ్రీ కిండాబీ శ్రీకాంత్‌ సైతం దేశంలోని కోట్లాదిమంది యువజనులకు స్ఫూర్తిగా నిలుస్తారు.

– క్రీడా కృష్ణ , 84668 64969

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *