భారత కుర్రాళ్లు.. ప్రపంచకప్‌లో మొనగాళ్లు..

భారత కుర్రాళ్లు.. ప్రపంచకప్‌లో మొనగాళ్లు..

ఐసీసీ అండర్‌ -19 ప్రపంచకప్‌ టైటిల్‌ను మూడుసార్లు సొంతం చేసుకున్న భారత్‌, నాలుగోసారి కూడా విజేతగా నిలిచి సరికొత్త రికార్డు నెలకొల్పింది. న్యూజిలాండ్‌ బే ఓవల్‌లో ముగిసిన 2018 ఐసీసీ అండర్‌-19 ఫైనల్లో ఆస్ట్రేలియాను 8 వికెట్ల తేడాతో భారత జట్టు చిత్తు చేసింది. భారత్‌ విజయంలో ప్రధానపాత్ర వహించిన ఓపెనర్‌ మన్‌జోత్‌ కాల్రా ప్లేయర్‌ ఆఫ్‌ ది ఫైనల్స్‌, స్టార్‌ బ్యాట్స్‌మన్‌ శుభ్‌ మన్‌గిల్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఛాంపియన్‌షిప్‌ అవార్డులు గెలుచుకొన్నారు.

పవర్‌ఫుల్‌ బ్యాటింగ్‌, పదునైన బౌలింగ్‌, చురుకైన ఫీల్డింగ్‌తో రాహుల్‌ ద్రావిడ్‌ కోచ్‌గా, పథ్వీ షా కెప్టెన్‌గా టైటిల్‌ వేటకు దిగిన భారత్‌ లీగ్‌ దశలో మూడుకు మూడు, నాకౌట్‌ రౌండ్లో మూడుకు మూడు మ్యాచ్‌లు నెగ్గి తనకు తానే సాటిగా నిలిచింది.

లీగ్‌ నుంచి టైటిల్‌ సమరం వరకు

ఆస్ట్రేలియా, పావువా న్యూగినియా, జింబాబ్వే జట్లతో కూడిన గ్రూప్‌- బీ లీగ్‌ తొలిరౌండ్లో భారత్‌కు ఆస్ట్రేలియా రూపంలో గట్టి ప్రత్యర్థి ఎదురైనా 100 పరుగుల భారీ విజయంతో టైటిల్‌ వేట ప్రారంభిం చింది. ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్లు పథ్వీ, మన్‌జోత్‌ ఇద్దరూ సెంచరీలకు చేరువగా వచ్చి వెనుదిరగడం విశేషం.

ఆ తర్వాత గ్రూప్‌ రెండో రౌండ్లో పసికూనగా గుర్తింపు పొందిన పావువా న్యూగినియాతో జరిగిన పోటీలో సైతం భారత్‌కు ఎదురే లేకపోయింది. 100 ఓవర్ల పాటు జరగాల్సిన ఈ మ్యాచ్‌ కేవలం 29 ఓవర్ల షోగానే ముగిసిపోయింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ 10 వికెట్ల అలవోక విజయం నమోదు చేసింది.

అంతేకాదు. జింబాబ్వేతో ఆడిన ఆఖరి రౌండ్‌ పోటీలో సైతం భారత్‌కు పోటీనే లేకుండా పోయింది. 155 పరుగుల విజయ లక్ష్యంతో ఛేజింగ్‌కు దిగిన భారత్‌ కేవలం 21.4 ఓవర్లలోనే వికెట్‌ నష్టపోకుండా విజయం సొంతం చేసుకొంది. వన్‌డౌన్‌ శుభ్‌ మన్‌గిల్‌ 90, దేశాయ్‌ 56 పరుగుల స్కోర్లతో నాటౌట్‌గా నిలిచారు. భారత విజయంలో ప్రధానపాత్ర వహించిన శుభ్‌ మన్‌ గిల్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఇక క్వార్టర్‌ ఫైనల్లో బంగ్లాదేశ్‌ను సైతం భారత కుర్రాళ్లు అలవోకగా అధిగమించారు.

సెమీఫైనల్లోనూ అదే దూకుడు కొనసాగించి పాక్‌ను 203 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత్‌ ఆరోసారి ప్రపంచకప్‌ ఫైనల్స్‌కు అర్హత సంపాదించింది.

ఆరేళ్ల తర్వాత భారత్‌ షో

అందరూ ఊహించిన విధంగానే మాజీ ఛాంపియన్లు భారత్‌, ఆస్ట్రేలియా జట్ల ఫైనల్స్‌ ఏకపక్షంగానే సాగింది. ఆట ప్రారంభం నుంచి ముగింపు వరకూ భారత్‌ షోగానే సాగింది. టాస్‌ నెగ్గి ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకొన్న కంగారూలను భారత్‌ కేవలం 216 పరుగుల స్కోరుకే పరిమితం చేసింది.

217 పరుగుల స్వల్ఫ లక్ష్యంతో ఛేజింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు పథ్వీ, మన్‌జోత్‌ మొదటి వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభాన్ని ఇచ్చారు. పథ్వీ 29, శుభ్‌మాన్‌ 31 పరుగులకు అవుటైనా రెండోడౌన్‌ దేశాయ్‌తో జంటగా మన్‌ జోత్‌ భారత్‌ విజయం పూర్తి చేశాడు.

ఫైనల్లో మన్‌జోత్‌ దూకుడు

మన్‌జోత్‌ 102 బాల్స్‌లో మూడు సిక్సర్లు, 8 బౌండ్రీలతో 101 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో భారత్‌ 8 వికెట్ల తేడాతో నాలుగోసారి ప్రపంచకప్‌ విజేతగా నిలిచింది.

ఫైనల్లో సెంచరీ సాధించడం ద్వారా మన్‌జోత్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఫైనల్స్‌ అవార్డు అందుకొన్నాడు.

మొత్తం ఐదుమ్యాచ్‌ల్లో ఓ సెంచరీ, రెండు హాఫ్‌ సెంచరీలతో సహా 372 పరుగులు సాధించిన శుభ్‌ మన్‌గిల్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది ప్రపంచకప్‌ అవార్డు దక్కింది.

ద్రావిడ్‌ కల నిజమైంది

అండర్‌ 19లో భారత జట్టు విశ్వవిజేతగా నిలవడంతో కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్‌ సంతోషం వ్యక్తం చేశారు. అందరి సమష్టి కషితోనే ఈ విజయం సాధ్యమైందని చెప్పారు.

ఇప్పటి వరకు జరిగిన మొత్తం 16 జూనియర్‌ ప్రపంచకప్‌ టోర్నీల్లో భారత్‌ పలు అరుదైన రికార్డులు సాధించింది. 2000 సంవత్సరంలో శ్రీలంక వేదికగా ముగిసిన ప్రపంచకప్‌లో మహ్మద్‌ కైఫ్‌ కెప్టెన్సీలో భారత్‌ తొలిసారిగా విజేత కాగలిగింది. ఆ తర్వాత 2008 ప్రపంచకప్‌లో కొహ్లీ నాయ కత్వంలో భారత్‌ రెండోసారి ట్రోఫీని అందుకొంది.

2012లో ఉన్ముక్త్‌చంద్‌ కెప్టెన్‌గా భారత్‌ మూడోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఇప్పుడు పథ్వీ షా నాయకత్వంలో భారత కుర్రాళ్లు నాలుగోసారి ప్రపంచకప్‌ అందుకొని తమకు తామే సాటిగా నిలిచారు.

2006, 2016 టోర్నీల్లో మాత్రం రన్నరప్‌ స్థానాలతో సరిపెట్టుకొన్న భారత్‌ మొత్తంమీద ఆరు ఫైనల్స్‌ ఆడి, నాలుగు విన్నర్స్‌, రెండు రన్నరప్‌ ట్రోఫీలు అందుకొన్న తొలిజట్టుగా రికార్డుల్లో చేరింది.

భారత ఆటగాడిగా సీనియర్‌ ప్రపంచకప్‌ అందుకోలేకపోయిన ద్రావిడ్‌ కోచ్‌గా జూనియర్‌ ప్రపంచకప్‌ను అందించడం 2018 ప్రపంచకప్‌కు కొసమెరుపుగా మిగిలిపోతుంది.

– క్రీడా కృష్ణ , 84668 64969

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *