భారతి

భారతి

‘భారతీ’ అనసూయమ్మ గట్టిగా పిలిచింది కూతురు భారతిని. వివేకానందుని సూక్తులు చదువుతున్న భారతి పుస్తకంలో దూర్చిన తలను పైకెత్తి ‘పిలిచావా అమ్మా ?’ అని అడిగింది.

అనసూయమ్మ వంటింట్లో నుంచి బయటకు వస్తూ ‘కాదమ్మా అరిచాను.’ అంది విసురుగా. అమ్మను కూల్‌ చేయడానికి సోఫాలో తన పక్కన కూర్చొని ‘ఎందుకమ్మా అంత కోపం ?’ అడిగింది గోముగా.

‘కోపం కాక ఇంకేంటి మీ నాన్న, నేనూ నీ పెళ్ళి గురించి ఎంత బెంగ పెట్టుకున్నామో తెలుసా?’

‘బెంగ దేనికమ్మా ? ఇప్పుడేమైందని ?’

‘నీకేం తెలుస్తుందమ్మా మా బాధ. ఇంట్లో స్థిరపడని కొడుకూ, పెళ్ళికాని కూతురూ కన్నవాళ్ళ గుండెల మీద కుంపటే. ఒక్కగానొక్క కూతురువి. నిన్ను చాలా అల్లారు ముద్దుగా పెంచాం. కోటలో రాణిలా చూసుకున్నాం’

‘నేను కాదన్నానా అమ్మా ?’

‘కాదనే అన్నావ్‌. ముందు రాజేశ్‌ నచ్చాడన్నావ్‌. నిశ్చితార్థం కాగానే తన ఊరికి రమ్మని పిలిచాడని మా అనుమతితో వెళ్ళావ్‌. అంతవరకూ బాగానే ఉంది. అక్కడ్నుంచి వచ్చినప్పటి నుండి రాజేశ్‌తో పెళ్ళి ఇష్టం లేదంటున్నావ్‌. నీకిది న్యాయమా? చెప్పు. నలుగురూ ఏమనుకుంటారు’

‘ఏమనుకుంటారా ? కామేశం గారి కూతురు మంచిది కాదనుకుంటారు’ పక్క గదిలో ఉన్న భారతి మేనత్త తన కొడుకును పెళ్ళాడనని భారతి చెప్పిందన్న ఉక్రోశంతో మేనకోడలి కేసి కొరకొరా చూస్తూ అంది.

అత్త మాటలకు భారతి చివ్వున తలెత్తి ‘అత్తా బావను పెళ్ళి చేసుకోవడం లేదనేగా ఈ అక్కసు. నీదసలే రక్త సంబంధం. నేను కూడా బావను పెళ్ళాడితే పిల్లలు అవిటివారిగా పుడతారు. అందుకే డాక్టర్లు రక్త సంబంధపు పెళ్ళిళ్ళు చేసుకో వద్దంటున్నారు’ అత్త మీద చొరవగా ఆమె భుజాల మీద చేతులు వేస్తూ బతిమాలింది. భారతి కురిపించిన ప్రేమకు అత్త కరిగిపోయింది.

‘భారతీ నీ మంచిగుణం ఇదేనమ్మా. నీ మీద ఎవరికి కోపం వచ్చినా మాటలతో కరిగించేస్తావే. ఇంతటి అందాల భరిణె, సుగుణాల రాశి నాకు కోడలుగా రాలేదని భాదగా ఉందమ్మా’ అంది భారతి మేనత్త. ‘కారణం చెప్పాను కదా అత్తా’ బదులుల్చింది భారతి.

‘మరి రాజేశ్‌ని ఎందుకొద్దంటున్నావో కారణం చెప్పనే లేదు’ అడిగింది అనసూయమ్మ. అమ్మకు ఆ రోజు జరిగింది ఎలా చెప్పాలో భారతికి తెలియలేదు. ఆ సంఘటన ఆమె కళ్ళ ముందు కదలాడింది. రాజేశ్‌ తనలాగే అగ్రికల్చర్‌ బి.ఎస్సి చదివాడు. చదువు పూర్తయిన తర్వాత సేంద్రియ ఎరువులను ఉపయోగిస్తూ సరికొత్త పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ అధిక దిగుబడులు పొందుతున్నాడు.

చిన్నప్పటి నుంచి తండ్రి ఉద్యోగం కారణంగా భారతి కూడా పట్నంలోనే పెరిగింది. ఒకరితో మరొకరికి సంబంధాలు లేకుండా బతుకుతున్న ఈ జనాలు, కాలుష్యం కోరల్లో చిక్కుకున్న ఈ నగరమంటే భారతికి వెగటు పుట్టింది.

పచ్చని పంట పొలాల మధ్య, ప్రేమ, ఆప్యాయతల మధ్య జీవించే పల్లెటూరి ప్రజలన్న, పల్లెటూరన్న భారతికెంతో ఇష్టం. తను పుస్తకాల్లో చదివిన ఉమ్మడి కుటుంబాలు, సంస్కృతీ, సాంప్రదాయాలు గ్రామాల్లోనే కనిపిస్తాయన్నది ఆమె భావన. అందుకే తాను రాజేశ్‌ను పెళ్ళాడితే ఉమ్మడి కుటుంబంలో అందరిలో ఒక్కరిగా ఆనందంగా పల్లెటూళ్లో జీవించొచ్చు అనుకుంది.

భారతి అంటే తండ్రి కామేశానికి చాలా అభిమానం. ‘నా కూతురికి మంచీ, చెడులు తెలుసు. తన నిర్ణయాన్ని నేనెప్పుడూ గౌరవిస్తాను. అందుకే తన కాలేజీలో సీనియర్‌ అయిన రాజేష్‌ను పెళ్ళాడటానికి నేను ఒప్పుకున్నాను’ అని ఒకరోజు తన భార్యతో చెప్పాడాయన.

నిశ్చితార్థం ఘనంగా జరిగింది. తాను పండించే పంటను చూసి సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఒకసారి రావచ్చుగా అని రాజేశ్‌ వాళ్లింటికి పిలిచాడు భారతిని.

‘పెళ్లి కాకుండానే !?’ అంది భారతి. ‘నిశ్చితార్థం అయితే సగం పెళ్ళి అయినట్లే’ చొరవగా అన్నాడు రాజేశ్‌.

‘పెళ్ళి కాకుండా మీ ఇంటి గడపతొక్కడమంటే.. ?’ తటపటాయించింది భారతి.

‘నిన్ను ఆహ్వానించింది మా ఇంటికి కాదు భారతీ. పంటపొలాలు చూసేందుకు’ రాజేశ్‌ బదులిచ్చాడు.

‘అమ్మనాన్నలను అడిగి, సరే అంటే వస్తా’ అందామె.

‘సుగుణాల రాశి భారతి’ రాజేశ్‌ కాంప్లిమెంట్‌ ఇచ్చాడు.

తల్లిదండ్రుల అంగీకారంతో రాజేశ్‌ వాళ్ల ఊరికెళ్లింది భారతి. రహదారికిరువైపులా పచ్చని తివాచీ పరిచినట్టుగా కళకళలాడే పంట పొలాలు, కిలకిలలాడే పక్షులు భారతికి కనువిందు చేశాయి. ఆమె హృదయం ఆనంద పరవళ్ళు తొక్కుతోంది పక్కనే ఉన్న వాగునీటి ప్రవాహంలా.

‘రాజేశ్‌ ఐ లవ్‌ దిస్‌ విలేజ్‌’ అంది ఆనందంగా. ‘విలేజ్‌ నా ! నాకు చెప్పావనుకున్నా’ దీర్ఘంగా నిట్టూర్చాడు రాజేశ్‌.

‘ఏయ్‌ దొంగ నీకో విషయం చెప్పనా ?’

‘ఏమిటది ?’

‘అసలు నువ్వు పల్లెటూరి వాడివనే నిన్ను పెళ్ళాడేందుకు ఒప్పుకున్నా’

‘అవునా ?’

‘అవును రాజేశ్‌ నేను ముందు నీ ఊరునే ప్రేమించా’

‘ఆ తరువాత నన్నా ?’ చిలిపిగా అడిగాడు రాజేశ్‌. భారతి సిగ్గుపడింది. ఆపై నవ్వింది.

‘భారతి నువ్వు నవ్వితే చాలా బాగుంటావ్‌’ అన్నాడు.

‘థ్యాంక్స్‌’ అంది భారతి.

ఇద్దరూ చకచకా నడుచుకుంటూ ముందుకెళుతున్నారు. భారతి ఒక్కసారిగా ఆగింది. ‘ఏమైంది భారతి’ అర్థంకాక అడిగాడు రాజేశ్‌. ఇద్దరు మహిళలు కనుచూపు మేరలో చెరో చెంబు పట్టుకుని వారి వైపే వెళ్తున్న రాజేశ్‌, భారతిని చూసి ఆగారు. అది గమనించిన రాజేశ్‌ ‘ఓ అది ప్రకృతి అవసరం. మనిషి కాలకృత్యాలు తీర్చుకోకపోతే కాలం స్తంభించి పోతుంది భారతి. పద ముందుకు’ అన్నాడు రాజేశ్‌.

వాళ్లను చూసి భారతి సిగ్గుతో తల దించుకుంది. రాజేశ్‌ మాటలేవీ తన చెవికెక్కడం లేదు. ‘ఏమైంది భారతి ఏం మాట్లాడటం లేదు’ అడిగాడు రాజేశ్‌. ‘రాజేశ్‌ మీ ఊళ్లో ఎవరికీ మరుగుదొడ్లు ఉండవా ?’ సీరియస్‌గా అడిగింది భారతి.

రాజేశ్‌ నవ్వుతూ ఇందాకటి సంగతి ఇంకా మర్చిపోలేదా ? ఇక్కడ అందరూ ఆరుబయటే కాలకృత్యాలు కానిచ్చేస్తారు’ అన్నాడు. భారతి ఆశ్చర్యపోయింది.

‘రాజేశ్‌ మనం ఏ కాలంలో ఉన్నాం. ఆరేళ్ళ బాలుణ్ణి హాస్టల్లో వేసే ముందు వాడి తల్లిదండ్రులు కూడా అక్కడ బాత్‌రూం ఉందో ? లేదో ? తెలుసుకొని ఆ తర్వాతే చేర్పిస్తున్నారు. అటువంటిది ఈ ఊళ్లో మహిళకు భద్రత లేదు. ఇది సిగ్గుతో తల దించుకోవాల్సిన విషయం’ అంది భారతి.

‘టేక్‌ ఇట్‌ ఈజీ భారతి’ కూల్‌గా అన్నాడు రాజేశ్‌.

‘ఇది చాలా సున్నితమైన విషయం రాజేశ్‌. ఆడవారికి ప్రాణం కన్నా మానమే మిన్న. ఛ ఛ చెప్పుకోవడానికే చచ్చేంత సిగ్గుగా ఉంది. రాజేశ్‌ ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకు. భార్యాభర్తలు కాపురం ఎక్కడ చేస్తారు నాలుగు గోడల మధ్యా ? లేక ఆరుబయటా ? కేవలం జంతువులే ఆరుబయట కాపురం చేస్తాయి. కాని మనుషులు కాదు. అందుకే వాటిని జంతువులన్నారు’ అంది భారతి. రాజేశ్‌ ఆలోచనలో పడ్డాడు.

‘రాజేశ్‌ నాకు నువ్వు చాలా బాగా నచ్చావ్‌. ఈ ఊరు ఇంకా నచ్చింది. నేను కోడలిగా వెళ్ళబోయే ఇల్లు పూరిల్లు అయినా అడ్జెస్ట్‌ అవుతాను. కాని బాత్‌రూమ్‌ లేకపోతే అస్సలుండలేను. నేనే కాదు ఏ మహిళా ఉండలేదు. రాజేశ్‌ నిన్ను ఒకటి అడగనా ? నాది గొంతెమ్మ కోరిక మాత్రం కాదు కనీస అవసరం. ఈ ఊళ్లోవాళ్లందరికి మరుగుదొడ్లపై అవగాహన కల్పించి వారికి మరుగుదొడ్ల నిర్మాణంలో సహాయపడు సరేనా ? ఉన్నత చదువులు చదువుకొని మనం ఈ మాత్రం కూడా చేయకపోతే మన చదువుకే అర్థం ఉండదు. నువ్వు దీనికి అంగీకరిస్తేనే మన పెళ్ళి జరుగుతుంది. లేకపోతే లేదు’ ఓపెన్‌గా చెప్పేసింది భారతి.

– – – –

ఆ విషయాన్ని తన తల్లికి వివరించింది భారతి. అంతలో భారతి తండ్రి కామేశం అప్పుడే బయటి నుంచి ఇంట్లోకి వచ్చారు. ‘నాన్నా నా చిన్నతనంలో నాయనమ్మ చనిపోతే నువ్వు దూరంగా ఉన్న అత్తకు టెలిగ్రామ్‌ పంపించావ్‌. కాని అత్త వచ్చే లోపు నాయనమ్మ పార్ధివ దేహం పాడైపోతుందని పెద్దలు చెప్పడంతో అత్త రాకుండానే నాయనమ్మ అంత్య క్రియలు కానిచ్చేశారు. అత్త వచ్చి వాళ్లమ్మ చివరి చూపైనా దక్కలేదని చాలా రోదించింది. ఇది జరిగి రెండు దశాబ్దాలైంది. రోజులు మారాయి. సాంకేతికత పెరిగింది. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా వెంటనే తెలిసిపోతుంది. అన్ని రంగాల్లోనూ ఎంతో మార్పు వచ్చింది. కాని నేటి సమాజంలో మహి ళల మానానికి మాత్రం రక్షణ కరువవుతోంది. కొన్ని ప్రాంతాల్లో స్త్రీలు కనీసం కాలకృత్యాలు కూడా తీర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. మన సమాజం ఎటువైపు వెళ్తోంది నాన్నా. రాజేశ్‌తో పెళ్ళికి ఓకే చెప్పిన నేను వాళ్ల ఊళ్లో మరుగుదొడ్లు లేవనే నో చెప్పాను. నేనేమైనా తప్పుచేశానా ?’ నాన్న అడిగింది భారతి. ‘లేదమ్మా నువ్వు చేసింది నూటికి నూరు పాళ్ళూ కరెక్ట్‌. నా కూతురెప్పుడూ తప్పు చేయదు’ అని భారతి భుజంపై చెయ్యేసి కూతురిని సమర్థించారు కామేశం.

– – – –

‘భారతీ నీతో నేను ఏడడుగులు వేసేందుకు సిద్ధం’ గుమ్మం నుండి లోపలికి వస్తూ అన్నాడు రాజేశ్‌.

‘రాజేశ్‌ ఎప్పుడొచ్చావ్‌ ?’ అడిగారు కామేశం.

‘భారతి మీతో మాట్లాడుతున్నప్పుడు అంకుల్‌’ సమాధానమిచ్చాడు రాజేశ్‌.

‘భారతీ మా ఇంట్లో బాత్‌రూమ్‌ కట్టడం మొదలు పెట్టారు. ఊళ్లో సగం మంది నా మాట విని బాత్‌రూమ్స్‌ కట్టించుకునేందుకు సముఖత వ్యక్తం చేశారు. మిగతా వాళ్లకి కూడా అవగాహన కల్పించాలంటే నాకు నీ తోడు కావాలి. నీకిష్టమైతే ఇద్దరం కలిసి నడుద్దాం’ భారతి వైపు చూస్తూ ఆమె జవాబు కోసం ఆగాడు రాజేశ్‌. ‘నీ మాటతో నేను ఏకీభవిస్తున్నాను. నీతో కలిసి నడుస్తాను’ అంటూ సిగ్గుపడింది భారతి.

– కె.వి.లక్ష్మణరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *