బొమ్మతనం

బొమ్మతనం

కథకుడు

రాజేష్‌ ఇండియాలో చదివాడు. అమెరికా వెళ్లాడు. తల్లిదండ్రులు చెప్పారని తల్లీ, తండ్రీ లేని విమలని పెళ్లి చేసుకున్నాడు. అమెరికాలోనే స్థిరపడ్డాడు. ఒక్కడే కొడుకు విశేష్‌. మనవడు పుట్టినప్పుడు అమ్మా, నాన్నా వచ్చి మూణ్ణెల్లుండి వెళ్లారు. తర్వాత వాళ్లు మళ్లీ అమెరికా రాలేదు.

రెండేళ్లక్రితం రాజేష్‌ తండ్రి ఆనంద్‌కి బైపాస్‌ సర్జరీ అన్నారు. రాజేష్‌ ఫోన్లో, స్కైపులో ధైర్యం చెప్పాడు. ఎంత ఖర్చరునా వెనుకాడొద్దని దన్ను ఇచ్చాడు. ‘డబ్బొద్దు, నువ్వొస్తే చాలు’ అంది తల్లి అన్నపూర్ణ. రాజేష్‌ వెళ్లలేకపోయాడు. ఆపరేషన్‌ తర్వాత స్వయంగా కుశలం తెలుసుకున్నాడు స్కైపులో.

ఆ సమయంలో వాళ్లకి పక్కన నిలబడ్డవాడు పక్కింటి మురళి. చిన్నప్పుడు మురళి రాజేష్‌కి అన్న కాని అన్న. ఇప్పుడు రాజేష్‌ తలిదండ్రులకి కొడుకు కాని కొడుకు.

రాజేష్‌ కొడుకు విశేష్‌కిప్పుడు ఎనిమిదేళ్లు. కన్నవారితో కలిసి అమెరికాతో పాటు యూరప్‌, ఆస్ట్రేలియా, ఆఫ్రికా ఖండాలు తిరిగాడు. ఆసియాలో జపాన్‌, సింగపూర్‌ చూశాడు. ఇండియా ఇంకా వెళ్లలేదు.

విశేష్‌కి తాత, బామ్మ అంటే ఇష్టమే. వారానికోసారైనా వాళ్లని స్కైపులో చూస్తాడు. మాట్లాడ్డానికి తెలుగు బొత్తిగా రాదు. బామ్మ, తాతల ఇంగ్లీషు ఉచ్చారణ తనకి అర్థం కాదు. అందుకని తనకి కాస్త తెలుగు నేర్పమని కన్నవారి నడిగాడు. ‘మేమే మర్చిపోతున్నాం, నీకేం నేర్పుతాం’ అన్నారు వాళ్లు ఇంగ్లీషులో.

అమెరికా వెళ్లాక వాళ్లు ఇంట్లోనూ ఇంగ్లీషులోనే మాట్లాడుతున్నారు. ఇండియాలో బంధువులతో ఫోన్లోనో, స్కైపులోనో మాట్లాడ్డానికే వాళ్లు తెలుగు వాడేది.

ఆరేళ్లొచ్చినప్పట్నించీ అడుగుతున్నాడు విశేష్‌ తాతనీ, బామ్మనీ చూడాలనుందని. కానీ రాజేష్‌కి కుదిరితే, విమలకి కుదరదు. విమలకి కుదిరితే రాజేష్‌కి కుదరదు. ఇద్దరికీ కుదిరితే విశేష్‌కి కుదరదు. ముగ్గురికీ కుదిరే సరికి విశేష్‌కి ఎనిమిదేళ్లొచ్చారు. తామంతా ఇండియా వస్తున్నట్లు తల్లికి, మురళికి చెప్పాడు రాజేష్‌.

మురళి

రోజూలాగే సూర్యుడు తూర్పు దిక్కునే ఉదరుంచాడు. నాకు మాత్రం పశ్చిమాన ఉదరుంచి నట్లు తోచింది.

రాజేష్‌ వస్తున్నాడంటే నాకు కొంచెం అసూయ, కొంచెం దిగులు. కొంచెం సంతోషం కూడా!

అమెరికాలో వాడి ఇల్లు, కార్లు, వైభవం వీడియోల్లో, ఫొటోల్లో చూశాను. వాడంటే అసూయే నాకు. ఆ అసూయ కొంచెమే. అయితే అది నా గొప్పతనమేమోనని గర్వపడుతుంటాను.

రాజేష్‌ లేనప్పుడు అన్నపూర్ణమ్మ అమ్మతనపు అనుభూతి అంతా నాదే! కొంత వాడితో పంచు కోవాల్సి వచ్చినప్పుడల్లా నాకు చాలా అసంతృప్తిగా ఉండేది. అలాంటిదిప్పుడు వాడు చాలా ఏళ్ల తర్వాత అమ్మని చూడ్డానికొస్తున్నాడు. వాడిపై అమ్మతనం ఉప్పొంగి కాసేపు నన్ను పక్కకి నెట్టేస్తే తట్టుకోగలనా అని దిగులు. ఆ దిగులు కొంచెం కాదేమోనన్న అనుమానం చాలు దాన్ని మరింత పెంచడానికి.

ఐతే రాజేష్‌ అమ్మకి ఒక్కగానొక్క కొడుకు. ఆమె ప్రాణాలన్నీ వాడిమీదే. ఎన్నో ఏళ్ల తర్వాత ఆమె వాణ్ణి కలుసుకుంటున్నందుకు అమ్మ ఎంత సంతోషిస్తుంది! మరి అమ్మ సంతోషమే నా సంతోషం!

నాకు తల్లి ఉంది. కానీ అమ్మ అనగానే అన్నపూర్ణమ్మే గుర్తొస్తుంది.

నా తల్లికి ఐదుగురు పిల్లలు. నాకు ఇద్దరు అక్కలు. ఓ తమ్ముడు, చెల్లి. మాకున్నది రెండెకరాల పొలం. నా తండ్రి వ్యవసాయంతోపాటు, చిన్న వ్యాపారాలూ చేస్తాడు. కాని మాకు ఆదాయం కంటే ఖర్చే ఎక్కువ.

మా ఇంటిపక్కనే అమ్మ ఇల్లు. వాళ్లకి నాలుగెకరాల పొలముంది. మాతో పోలిస్తే వాళ్లు ధనవంతులే. కానీ అమ్మ భర్త ఆనంద్‌ జల్సారాయుడు. ఎక్కువ సమయం పట్నంలో గడుపుతాడు. వ్యవసాయం అంతగా పట్టదు. ఒక్కగానొక్క కొడుకు రాజేష్‌ని మూడేళ్లు నిండగానే చదువుకోసం పట్నంలో రెసిడెన్షియల్‌ స్కూల్లో వేశాడు.

అమ్మ వ్యవసాయ పనులు తనే చూసుకుంటుంది. నోటి మంచితనంతో అసాధ్యాల్ని సుసాధ్యం చెయ్యగల వ్యవహారదక్షత ఉన్న మనిషి. తనవల్లనే వ్యవసాయం ఆ కుటుంబానికి లాభసాటి అరుంది. అందుకే భర్త కాపురాన్ని పట్నానికి మార్చడం లేదు.

చదువు పేరిట కొడుకు పట్నమెళ్లాడని, చాలామంది అమ్మపై జాలిపడేవారు. అమ్మకా జాలి నచ్చేది కాదు. పిల్లల భవిష్యత్తుకి పెద్దవాళ్లు త్యాగాలు చెయ్యాలనేది. అది మేకపోతు గాంభీర్యమనేవారు మా ఇంట్లో.

రాజేష్‌ పట్నం చదువు నాకు లాభించింది. రాజేష్‌ వయసు వాణ్ణరున నన్ను అమ్మ చేరదీసింది. తనలో ఉప్పొంగే అమ్మతనానికి ఆసరాగా నన్ను భగీరథుణ్ణి చేసింది. నన్ను లాలించేది. పాలించేది. అదిలించడానికీ, బెదిరించడానికీ కూడా సంకోచించేది కాదు. నేను తన కన్న కొడుకని తననుకునేది, నేననుకునేలా చేసింది.

మా ఇంటికి పెద్దకొడుకున్నేను. ఐనా మావాళ్లకి నా భవిష్యత్తుపై ధ్యాసే లేదు. నన్ను చదివించాలను కోలేదు. చిన్నప్పుడు ఆగమ్మకాకిలా తిరిగినా, పెద్దయ్యాక రైతు కూలీగా స్థిరపడొచ్చని వాళ్ల ఉద్దేశం.

అమ్మ నా గురించి ఆలోచించింది. నన్ను బడిలో వేసింది. నా పుస్తకాలు, ఫీజులు వగైరా బాధ్యతలు తనే తీసుకుంది. నేనెలా చదువుతున్నానో గమనించేది.

నేను మా ఇంట్లో ఉండేది తక్కువ. పడుకోవడం కూడా ఎక్కువగా అమ్మ దగ్గరే!

‘ఇలాగైతే నీ కొడుకు నీక్కాకుండా పోతాడమ్మా’ అని కొందరు నా తల్లిని హెచ్చరించారు. తను చలించలేదు, ‘ఎక్కడికి పోతాడమ్మా, అన్నపూర్ణమ్మ దగ్గరికేగా!’ అంది. ‘అన్నపూర్ణమ్మకో కూతురుంటే బాగుండేది. ఆ పిల్లనీ చదువులకి పట్నానికి పంపి, నా కూతుర్ని చేరదీసేది. నాకు ఇంకాస్త చాకిరీ తప్పేది’ అని కూడా అంది.

నా తల్లికి కన్న బిడ్డలంటే మమకారం లేదని కాదు. తనకి స్వతహాగా బద్ధకం. కబుర్లంటే ఇష్టం. ఇంటిపనులు చాలావరకూ నా అక్కలు చేస్తారు. అయినా తనకి పనెక్కువని గోల పెడుతుంది. ఆపైన డబ్బు ఇబ్బందులెలాగూ ఉన్నారు. తల్లీబిడ్డల అనుబంధాలు కూడా డబ్బుకి సంబంధించినంత వరకూ మానవ సంబంధాలే కావడం చాలా మధ్యతరగతి కుటుంబాలకు మామూలే!

ఐదేళ్ల వయసొచ్చేసరికి అన్నపూర్ణమ్మే నాకు అమ్మనిపించేది. సెలవుల పేరు చెప్పి రాజేష్‌ ఇంటికొచ్చినప్పుడు తప్ప… నిజానికి అప్పుడూ అమ్మ నన్ను తక్కువ చేసేదికాదు. కానీ రాకరాక వచ్చిన కొడుకు. కొన్నాళ్లు మాత్రమే ఉండి మళ్లీ వెళ్లిపోయే కొడుకు. వాడిమీద దృష్టి కాస్త ఎక్కువ పెట్టేది. వాడికోసం ఎక్కువ తాపత్రయపడేది.

నాలో కొంచెం అసూయ పుట్టేది. కానీ అది కాసేపే.

నేను రాజేష్‌కంటే నాలుగు నెలలు పెద్ద. ‘తమ్ముడికి మన పల్లెటూరి ఆటలు తెలియవు. నేర్పించు. వాడు కాస్త నెమ్మది. ఎవరూ వాణ్ణేమన కుండా నువ్వే చూసుకోవాలి’ అనేది నాతో. ‘అన్నయ్యున్నాడుగా, నీకిక్కడ క్షణం కూడా బోరు కొట్టదు. వాడు చెప్పినట్లు విను’ అని వాడికి చెప్పేది.

రాజేష్‌ మంచివాడు. బుద్ధిమంతుడు. చెప్పినట్లు వినేవాడు. పట్నంలో చదువుతున్న వాడు నా శిష్యుడు కావడం గర్వంగా కూడా ఉండేది.

వాడు పట్నం వెళ్లాక అమ్మ రోజూ వాణ్ణే తల్చుకునేది. వాడి విశేషాలు నాతో పంచుకునేది. ఆల్బంలో వాడి స్కూలు ఫొటోలు చూపించి ముచ్చటపడేది.

అమ్మ నా గురించి కూడా అలాగే తాపత్రయ పడుతూ రోజూ నన్ను పదేపదే తల్చుకోవాలంటే నేనూ కొన్నాళ్లు ఊరొదిలి ఎక్కడికైనా వెళ్లి రావాలనిపించేది. ఒకసారి ఆ మాట అమ్మతో అన్నాను.

అమ్మ వెంటనే కంగారుగా, ‘వద్దురా! పొరపాటున కూడా అలాంటి ఆలోచన మనసులోకి రానివ్వకు. నిన్నొదిలి క్షణం కూడా ఉండలేను’ అంది. నాకు గర్వంగా అనిపించింది. ఇంటికొచ్చినప్పుడు అమ్మ రాజేష్‌ని చాలా బాగా చూసుకోవచ్చు. కానీ వాణ్ణొదిలి ఉండగలదు. నన్నొదిలి ఉండలేదు. అందుకేనేమో, నేను టెన్త్‌ ప్యాసయ్యాక, ‘ఇంకా చదవాలనుంటే ప్రరువేటుగా కడుదువుగాని. నువ్వు ఊరొదిలి వెళ్లొద్దు’ అంది.

ఇంటర్లో చేరడానికి పట్నం వెడుతున్న నా క్లాస్‌మేట్స్‌ కొందరికి అమ్మ మాట గర్వంగా చెప్పాను.

‘నువ్వో వెర్రివాడివి. ఆ అన్నపూర్ణమ్మ తన కొడుకుని ఎక్కడెక్కడికో పంపి ఇంజనీర్నో, డాక్టర్నో చేస్తుంది. నిన్ను మాత్రం ఊళ్లోనే ఉంచి టుర్రిపప్పాగాణ్ణి చేస్తుంది. తనేం అమ్మ!’ అని తీసిపారేశారు వాళ్లు.

అమ్మ దగ్గర నేనేం దాచను. ఆ మాట తనకి చెప్పేశాను. దానికి అమ్మ, ‘అమ్మంటే నేనే కాదు. ఈ నేల అమ్మ. ఈ ఊరు అమ్మ. బతకడానికిక్కడే దారుంటే అమ్మనొదిలి వెళ్లాలన్న ఆలోచనే తప్పు’ అంది అమ్మ.

‘మరి రాజేష్‌ వెళ్లాడుగా’ అన్నాను.

‘రాజేష్‌ని వాళ్ల నాన్న పంపాడు. నాకే స్వేచ్ఛ ఉంటే, వాణ్ణిక్కడే ఉంచేసేదాన్ని. వాడి విషయంలో లేని స్వేచ్ఛ నీ విషయంలో నాకుంది. అందుకే నువ్వు నాకు రాజేష్‌కంటే ఎక్కువ’ అంది అమ్మ.

నాకు చాలా సంతోషంగా అనిపించింది. ‘కానీ నాకింకా చదువు కోవాలనుందమ్మా!’ అన్నాను.

‘చదువంటే కాలేజీకెళ్లడం, పరీక్షలు రాయడం కాదు. టెన్త్‌ దాకా చదివావు. నువ్విప్పుడు ఏ పుస్తకాన్నరునా చదివి అర్థం చేసుకోగలవు. ఉద్యోగానికి డిగ్రీ కావాలి కానీ, వ్యవసాయానికి జ్ఞానం చాలు. నువ్వా జ్ఞానాన్ని పెంపొందించే మంచి పుస్తకాలు చదువు. ఉద్యోగస్థుడికన్నా ప్రయోజకుడివవుతావు’ అంది అమ్మ.

అదీ నిజమేనేమో! పరీక్షలకని క్లాసు పాఠాల్లో పురాణకథలు చదివాను. వాటిని నాకంటే బాగా అర్థం చేసుకున్న తాతలు, అమ్మమ్మలు ఊళ్లో చాలామందున్నారు. వాళ్లే బడిలోనూ చదువుకోలేదు. రాయడం, చదవడం వచ్చు అంతే!

మా ఊళ్లో గ్రంథాలయముంది. అందులో చాలా పుస్తకాలున్నారు. పరీక్షలు లేని పుస్తకాల చదువు నాకు ఉత్సాహంగా ఉండేది. అది నా జ్ఞానానికీ, పరిజ్ఞానానికీ, అవగాహనకీ ఉపయోగ పడింది. అమ్మ ఆధ్వర్యంలో నేను క్రమంగా వ్యవసాయంలో స్థిరపడ్డాను. అమ్మ సలహాలతో చిల్లర వ్యాపారాలు కూడా చేస్తున్నాను.

అమ్మ నాకు పిల్లను చూసింది. అమ్మ నా భార్యకి అత్తరుంది. నా పిల్లలకి బామ్మరుంది.

ఊళ్లో అమ్మకి కొడుకుగా చెలామణీ అవుతున్నాను. నా హోదా, గౌరవం అమ్మతోనే ముడిపడి ఉన్నారు.

ఈలోగా రాజేష్‌ ఇంజనీరింగ్‌ చదివాడు. అమెరికా వెళ్లాడు. అమ్మ చూసిన అమ్మారునే పెళ్లి చేసుకున్నాడు.

చిన్నప్పుడైతే వాడు ఏడాదికి ఒకటి, రెండుసార్లు ఇంటికొచ్చేవాడు. అమెరికా వెళ్లాక మూడేళ్లు ఇంటిమొహం చూడలేదు. ఆ వచ్చింది కూడా పెళ్లి చేసుకునేందుకే. రాజేష్‌కి కొడుకు పుట్టాక, ఓసారి అమ్మ భర్తతో కలిసి అమెరికా వెళ్లింది. ఆర్నెల్లు ఉందామనుకుని మూణ్ణెల్లకే తిరిగొచ్చేసింది. తర్వాత మళ్లీ వెళ్లలేదు.

‘అది మన దేశం కాదు. అవి మన పద్ధతులు కాదు. డబ్బుకి గతిలేని వాళ్లో, డబ్బే ప్రధానమను కునేవాళ్ళో తప్ప మనవాళ్లు అక్కడుండలేరు’ అంది అమ్మ తిరిగొచ్చాక నాతో.

అయితే ఒకసారి అక్కడికి అలవాటు పడ్డవాళ్లు ఇక్కడుండలేరట. అక్కడ నిత్య జీవనశైలిలో అవినీతి లేదట. జనంలో నిజారుతీ ఎక్కువట. రోడ్లు, పరిసరాలు మహాశుభ్రంగా ఉంటాయట. అంతా పద్ధతిగా ఉంటారట. పేదరికం ఇంచుమించు లేదట. ఈ విషయాలు రాజేష్‌ చెప్పడమే కాదు, చూసొచ్చాక అమ్మ కూడా చెప్పింది.

అయితే అమ్మంటుంది, అక్కడి మనుషులు మనుషులు కాదు యంత్రాలని! ఆలుమగల మధ్య, కన్నవారికీ, బిడ్డలకీ మధ్య అనుబంధాలకంటే నియమాలే ప్రధానమట. ఆప్యాయతానురాగాల్ని డబ్బుతో కొలుస్తారట.

‘మూణ్ణెల్లున్నానక్కడ. మిమ్మల్నీ పిల్లల్నీ తల్చుకోని రోజు లేదు. చెప్పాలంటే మిమ్మల్ని వదిలుండలేకే తొందరగా వెనక్కొచ్చేశాను. వాళ్లకక్కడ వాళ్ల గొడవ తప్ప అరునవాళ్ల ధ్యాసే ఉండదు’ అంది అమ్మ.

నిజమే. ఇక్కడ నేనూ, నా భార్యాబిడ్డలూ కూడా అమ్మని బాగా మిస్సయ్యాం. తను తొందరగా తిరిగొచ్చేస్తే మేం చెప్పలేనంత సంతోషపడ్డాం. ఇక్కడ మేమూ, అమ్మా నియమాలెరుగని నిష్కల్మష ప్రేమానుభూతిని పొందుతున్నాం. అదక్కడ లేదంటుంది అమ్మ!

ఏదేమైనా ఫొటోల్లోనూ, వీడియోల్లోనూ రాజేష్‌నీ వాడి కుటుంబాన్నీ చూసుకుని తెగ మురిసిపోతుంది అమ్మ. వాడిప్పుడు స్వయంగా విచ్చేస్తున్నాడు. కొన్నాళ్లు నేను తనకి ఆనతానా?

ఒకవేళ రాజేష్‌ అమ్మని శాశ్వతంగా తనతో ఉండడానికి వచ్చెయ్యమంటే.

ఆ ఆలోచనే నన్ను వణికిస్తోంది. అమ్మ వాడికి హక్కు. కాదనడానికి లేదు. కానీ అమ్మ నాకు మాటలకందని అనుభూతి. వదులుకుని బతగ్గలనా? ఇంతకీ ఇప్పుడు అమ్మ ఆలోచనలెలా ఉన్నాయో!

అన్నపూర్ణమ్మ

రాజేష్‌ని చూడాలనుంది. విశేష్‌ని తాకాలనుంది. విమలతో కష్టం, సుఖం మాట్లాడాలనుంది. రాజేష్‌ మూడేళ్లప్పుడే నాకు దూరంగా వెళ్లాడు. తర్వాత వాడెప్పుడొచ్చినా అది చుట్టపుచూపే! వాడి పుట్టుక చదువుకోసం. చదువు వృత్తికోసం. బతుకు డబ్బు కోసం. జన్మనిచ్చాను కాబట్టి నేను వాడికి అమ్మని. కొడుకుగా వాడికీ, అమ్మగా నాకూ ఏ అనుబంధాలూ లేవు. చిన్నప్పట్నించి నేటివరకూ వాడి జీవితంలో ముఖ్య విశేషాల్ని ఫొటోల్లోనో, వీడియోల్లోనో, మొబైల్‌ ఫోన్ల తెరలమీదో చూస్తున్నాను.

అమ్మతనానికి స్పర్శానుభూతి కావాలి. అది నాకు మురళి ఇస్తున్నాడు. అలాగని రాజేష్‌కి ప్రేమాను రాగాలు లేవనడానికి లేదు. వాడు కుటుంబ సమేతంగా స్కైపులో కనబడతాడు. ‘మనం అనుబంధాలతో కాలాన్ని వెనక్కి నెడుతున్నాం. వాళ్లు శాస్త్రజ్ఞానంతో దూరాన్ని దగ్గర చేస్తున్నారు. జ్ఞాపకాల్ని పదిలం చేస్తున్నారు’ అంటాడు.

అమెరికాలో నయాగరా జలపాతాన్ని వాడు కాదు, వాడి మిత్రుడు చూపించాడు మాకు. ఆ దృశ్యాలన్నీ వీడియో తీస్తే, అక్కడ రాజేష్‌ చూశాడు. ఇక్కడ మురళికి చూపించాను. అమెరికా యాత్ర వీడియోలూ అంతే!

విమలకి చిన్నప్పుడే తల్లీ తండ్రీ యాక్సిడెంట్లో పోయారు. పిల్ల బుద్ధిమంతురాలు. బంధువుల పంచన అణగిమణగి ఉంటూ, ఇంజనీరింగ్‌ చదివింది. ఆమెకి అమ్మా నాన్నా లేని లోటు తీరాలని కోడలిగా చేసుకున్నా. కానీ విమలకి తల్లిదండ్రులు లేకపోవడం ఒక లోటుగా అనిపించినట్లు లేదు.

చిన్నప్పట్నించీ రెసిడెన్షియల్‌ స్కూల్లో చదివాడు రాజేష్‌. పరారు పంచన పెరిగి పెద్దరుంది విమల. ఇద్దరికీ జీవనధ్యేయం సంపాదన. ఆత్మీయతాను బంధాల స్థానం ఆ తర్వాత ఎక్కడో!

రెండేళ్లక్రితం ఆయనకి బైపాస్‌ సర్జరీ అరుంది. రాజేష్‌ చూడ్డానికి రాలేదు. ఖర్చుకి వెనకాడొద్దన్నాడు. ఎంత కావాలన్నా తను పంపుతానన్నాడు. దైవకృప వల్ల ఆ అవసరం పడలేదు.

ఆపరేషనయ్యే దాకా ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేస్తూనే ఉన్నాడు. ఐసియు నుంచి బయటికొచ్చాక. ఆయనతోనూ మాట్లాడాడు. ‘ప్రపంచం ఎంత చిన్నదైపోరుందో! వేల మైళ్ల దూరంలో ఉన్నా, పక్కనున్నట్లే మాట్లాడుకోవచ్చు’ అని వాడంటే ఆయన కొడుకు హోదాని తల్చుకుని గర్వపడ్డారు.

ఈ ప్రపంచం ఓ మిథ్య అంటారు వేదాంతులు. పక్కనుండాల్సిన కన్న కొడుకు ఎక్కడో ఉండి పక్కనున్న భ్రమని కలిగిస్తే మిథ్యాప్రపంచంలో మనమూ మనవంతు మిథ్యని సృష్టించుకుంటున్నా మనిపించింది.

వాడి ప్రగతి, హోదా ఆయనకి ముఖ్యం. వాడు నా అమ్మతనానికి ఆసరా కావడం నాకు ముఖ్యం!

వాణ్ణోసారి కళ్లారా చూడాలనుంది. మనవడు విశేష్‌ని హృదయానికి హత్తుకోవాలనుంది.

వాళ్లుండేది మూడు వారాలే కావచ్చు. వాటిని గంటలుగా, నిమిషాలుగా, సెకన్లుగా మార్చి ప్రతి క్షణాన్నీ అనుభూతిలోకి తెచ్చుకోవాలనుంది. ప్రస్తుతానికి నాకు క్షణమో యుగంలా గడుస్తోంది.

కథకుడు

రాజేష్‌ సకుటుంబంగా ఇండియా వచ్చాడు. తిరగడానికి ఓ కారు కుదుర్చుకున్నాడు. కొన్ని గంటలు తన ఊళ్లో తనవారి మధ్య గడిపాడు. తర్వాత విమల క్లాస్‌మేట్స్‌ ప్రోగ్రాం వేస్తే ఢిల్లీలో నాలుగు రోజు లున్నారు. రాజేష్‌ క్లాస్‌మేట్స్‌తో కలిసి కన్యాకుమారి ట్రిప్పు నాలుగు రోజులు. కన్నవారితో కలిసి తిరుపతి ట్రిప్పు నాలుగు రోజులు. ప్రతిచోటా ఫొటోలు, వీడియోలు.

ఉరకలు, పరుగులు. మనిషికి మనిషికి మాట్లాడుకునేందుకు సమయం దొరకలేదు. మనవణ్ణి కూడా చేత్తో తాకడానికి కాస్త సమయం చిక్కింది కానీ, మనసుతో తాకే అవకాశం రాలేదు అన్నపూర్ణమ్మకి.

రాజేష్‌ కుటుంబం ఇలా వచ్చారు, అలా వెళ్లిపోయారు. వాళ్లు అమెరికా చేరుకున్నాక, ఒకరోజు సాయంత్రం తల్లితో మాట్లాడ్డానికి స్కైపులోకి వచ్చారు. అన్నపూర్ణమ్మ ఉత్సాహంగా మాట్లాడు తోంది.

అదే సమయంలో విత్తనాలకి సంబంధించిన విషయమై అర్జెంటుగా మాట్లాడాల్సి అలా వచ్చిన మురళి, చటుక్కున వెనక్కి తగ్గాడు. అది అన్నపూర్ణమ్మ చూసింది. ‘మురళి వచ్చాడు. అర్జెంటు పననుకుంటాను. మనం మరోసారి మాట్లాడుకుందాం’ అని స్కైప్‌ క్లోజ్‌ చేసేసింది.

మురళి నొచ్చుకుని, ‘అమ్మవి, అలా అర్థాంతరంగా మాటలు ఆపేస్తే తమ్ముడేమను కుంటాడు?’ అన్నాడు.

అన్నపూర్ణమ్మ నవ్వి, ‘వాడు తమ్ముడు కాదురా, తమ్ముడి బొమ్మ. నువ్వు మనిషివి. నాకు బొమ్మలతో కంటే మనుషులతో మాట్లాడ్డమే ఎక్కువిష్టం’ అంది.

మురళి మొహం వెలిగిపోరుంది. అన్నపూర్ణమ్మ నుంచి రాజేష్‌కి ఇంతకాలంగా దక్కుతున్నది బొమ్మతనమనీ, ఆమె అమ్మతనం ఎప్పటికీ తనదేననీ అనిపించిందేమో మరి!

– వసుంధర

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *