బలహీనమైన ‘సాక్ష్యం’

బలహీనమైన ‘సాక్ష్యం’

ఏదైనా కేసు గెలవాలంటే కోర్టులో ‘సాక్ష్యం’ బలంగా ఉండాలి. అలానే థియేటర్లలో సినిమా ఆడాలంటే కథతో పాటు దానిని తెరకెక్కించే విధానంలోనూ కొత్తదనం ఉండాలి. మరి బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ హీరోగా, శ్రీవాస్‌ డైరెక్షన్‌లో అభిషేక్‌ నామా నిర్మించిన ‘సాక్ష్యం’ సినిమాలో అవి బలంగా ఉన్నాయో లేదో తెలుసుకుందాం.

తమ ఆగడాలకు అడ్డం వస్తున్నారనే కక్షతో విశ్వ (బెల్లంకొండ శ్రీనివాస్‌) కుటుంబం మొత్తాన్ని మునుస్వామి (జగపతిబాబు), అతని ముగ్గురు తమ్ముళ్ళు అతి కిరాతకంగా చంపేస్తారు. తన నెలల పిల్లాడిని ఓ లేగదూడకు కట్టేసి వారి బారి నుండి తప్పించి విశ్వ తల్లి సైతం కన్నుమూస్తుంది. ఆ పిల్లాడు నాటకీయ పరిణామాలతో కాశీ విశ్వనాథుడి సన్నిధికి చేరతాడు. పిల్లలు లేని శ్యాంప్రసాద్‌ (జయప్రకాశ్‌), అతని భార్య (పవిత్ర లోకేశ్‌) చేతులకు అక్కడి పురోహితుడు ఈ బిడ్డను అందిస్తాడు. వ్యాపార విస్తరణలో భాగంగా శ్యాంప్రసాద్‌ అమెరికాలో స్థిరపడతాడు. కోట్లకు వారసుడైన విశ్వ తండ్రి వ్యాపార వ్యవహారాల కంటే వీడియో గేమ్‌ డిజైనర్‌గా గుర్తింపు తెచ్చుకోవాలని తాపత్రయపడుతుంటాడు. అలాంటి సమయంలో ఆధ్మాత్మిక ప్రవచనాలు చెప్పే అందమైన అమ్మాయి సౌందర్య లహరి (పూజా హెగ్డే)తో ప్రేమలో పడతాడు. ఆమె తండ్రి ఠాగూర్‌ (రావు రమేశ్‌) ఇండియాలో మునుస్వామి అరాచకాలను అరికట్టడానికి ప్రయత్నించి, ప్రాణాల మీదకు తెచ్చుకుంటాడు.

మొదట్లో విశ్వను అభిమానించిన సౌందర్య లహరి ఆ తర్వాత అతన్ని అపార్థం చేసుకుంటుంది. ఇంతలో తండ్రి ప్రాణాపాయంలో పడ్డాడని తెలిసి, ఇండియాకు వచ్చేస్తుంది. ఆమెకు తన నిజాయితీని తెలియచేయాలనే కోరికతో విశ్వ కూడా ఆమె వెనుకే స్వదేశానికి వస్తాడు. అనుకోకుండా అతనికి మునుస్వామి తమ్ముళ్ళతో వైరం ఏర్పడుతుంది. చిన్న గొడవలే చినికి చినికి గాలివానగా మారి వారి మరణానికి విశ్వనే కారణమౌతాడు. విశేషం ఏమంటే తన స్నేహితుడు వాల్మీకి (అనంత శ్రీరామ్‌) తాము తీయబోయే వీడియో గేమ్‌ కాన్సెప్ట్‌లో చూపిన విధంగానే ఇక్కడా మునుస్వామి తమ్ముళ్ళు మరణిస్తూ ఉంటారు. దీనితో తన నిమిత్తం లేకుండానే ఇదంతా జరుగుతోందని విశ్వ గ్రహిస్తాడు. మరి తన కుటుంబ సభ్యులను అతి కిరాతకంగా చంపేసింది మునుస్వామేననే విషయం విశ్వకు తెలిసిందా? పంచభూతాలు విశ్వకు సాయం చేయడానికి కారణం ఏమిటి? ఇక్కడ ఇండియాలో జరగబోయే సంఘటనలు వాల్మీకికి ముందు ఎందుకు తట్టాయి? వీటన్నింటికి మనకు ద్వితీయార్ధంలో సమాధానం దొరుకుతుంది.

తన కుటుంబాన్ని హతమార్చిన వాళ్ళపై పగ తీర్చుకోవడం అనేది తెలుగులో నలిగి నలిగిపోయిన కథ. అయితే ఆ ప్రతీకారానికి పంచభూతాలూ పరోక్షంగా సాయం చేయడం, ఆ విషయం ఇటు హీరో, అటు విలన్‌కు తెలియక వారు అయోమయానికి గురికావడం అనేది కాస్తంత భిన్నమైన అంశమే. ఓ తప్పు చేసి ఎవరూ చూడలేదని అనుకున్నా లేదా అలా చూసిన వాళ్ళను అంతం చేసి సాక్ష్యం లేకుండా చేశామని తలచినా అది భ్రమేనని, పంచభూతాలు ప్రతి సంఘటనకూ సాక్షీభూతంగా ఉంటాయని, వాటి ద్వారా కూడా మనిషి శిక్షకు గురి అయ్యే ఆస్కారం ఉందని ఈ సినిమా చెబుతుంది. కానీ దీనిని అర్థవంతంగా, ఆమోద యోగ్యంగా చెప్పడంలో దర్శకుడు శ్రీవాస్‌ విఫలమయ్యాడు.

తొలి చిత్రం ‘అల్లుడు శీను’ నుండి బెల్లంకొండ శ్రీనివాస్‌ నటించిన ప్రతి సినిమా అనవసరమైన ఆర్భాటాలతో, హంగామాలతో నిర్మితమైనవే. ఇది కూడా అదే తరహాలో సాగింది. కథను మరింత సమర్థవంతంగా చెప్పాల్సింది పోయి, కాసులు గుమ్మరించేసి, భారీతనంతో సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకోవాలని చూశారు. కానీ అది బెడిసికొట్టింది. ప్రధానమైన అంశం పక్కకుపోయింది. పంచభూతాలు తలుచుకుంటే పాపం చేసిన వాళ్ళు ఏ విధంగా శిక్షించబడతారనే అంశం ఎలివేట్‌ కాలేదు. దాంతో ఇదీ రొటీన్‌ రివెంజ్‌ డ్రామానే అనే భావన ప్రేక్షకులకు కలిగింది.

నటీనటుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది ఏమీ లేదు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ నటన షరామామూలే! పూజా హెగ్డేలోనూ పరిణతి పెద్దంత కనిపించలేదు. జగపతిబాబు, అశుతోష్‌ రాణా, రవికిషన్‌ తదితరులు రొటీన్‌ పాత్రలే పోషించారు. హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ బాణీలు సాదాసీదాగా ఉన్నాయి. అయితే రీ-రికార్డింగ్‌ బాగుంది. అలానే ఆర్థర్‌ విల్సన్‌ సినిమాటోగ్రఫీ కూడా చక్కగా ఉంది. ఇందులో చెప్పుకోదగ్గ మరో విషయం బుర్రా సాయిమాధవ్‌ రాసిన సంభాషణలు. అవి అర్థవంతంగా, ఆలోచింపచేసే విధంగా ఉన్నాయి. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ లాంటి విజయవంతమైన చిత్రాలను రూపొందించిన శ్రీవాస్‌ కారణాలు ఏమైనా ‘సాక్ష్యం’ లాంటి భారీ చిత్రాన్ని సమర్థవంతంగా హ్యాండిల్‌ చేయలేదనిపిస్తుంది. ఇలాంటి సోషియో ఫాంటసీ సినిమాలకు గ్రాఫిక్స్‌ బాగుండాలి. అవీ గొప్పగా లేవు. మొత్తం మీద ఏదో కొత్తగా చేయాలని ప్రయత్నించి, మధ్యలోనే చేతులెత్తేసిన భావనను ఈ సినిమా ప్రేక్షకులకు కలిగిస్తుంది.

– చంద్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *