బందాసింగ్‌ -17

బందాసింగ్‌ -17

చారితక్ర నవల

జరిగిన కథ

బైరాగి మాధోదాస్‌ తాంత్రిక విద్యల్లో దిట్ట. మాధోదాస్‌ గురు గోవింద్‌సింగ్‌ చేతుల నుండి అమృతం స్వీకరించాడు. గురు గోవింద్‌సింగ్‌ మాధోదాసును శిఖ్ఖు సైన్యానికి అధిపతిగా, మహాయోధులైన అరుదుగురు ఖాల్సాలను అతనికి సలహా మండలిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశాడు. మాధోదాసుకు బందాసింగ్‌ అని కొత్త పేరు ఇచ్చాడు. మొగలారూ పాలకుల అరాచకాల మీద యుద్ధం చెయ్యాలని, ధర్మవిరోధులైన మొగలారూలను శిక్షించాల్సిన బాధ్యత బందాసింగ్‌పై ఉంచుతున్నట్టు ఆదేశించాడు. బందాసింగ్‌ దానికి అంగీకరించి తన సైన్యంతో జైత్రయాత్రకు బయలుదేరాడు.

వజీర్‌ఖాన్‌, బందాసింగ్‌లకు జరిగిన భీకర యుద్ధంలో వజీర్‌ఖాన్‌ మరణించాడు. మొగలాయీలు బందాసింగ్‌ను లక్ష్యంగా చేసుకుని అతని సైన్యాన్ని తరిమివేశారు. బందా బహదూర్‌ నాలుగు వేల మంది ఖాల్సాలతో తన స్థావరంలో నిబ్బరంగా ఉన్నాడు. ఇంతలో బందాసింగ్‌, బినోద్‌సింగ్‌ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. బినోద్‌ సింగ్‌ తన అనుచర గణంతో మెరుపు వేగంతో కోటనుండి బయటపడి, శత్రుసేనని చీల్చుకుంటూ వెళ్ళిపోయాడు. మొగలాయీ సైనికులు కోట లోపలికి దూసుకు పోయి, మూడు వందలకు పైగా శిఖ్ఖుల్ని ఊచకోత కోశారు. బందాసింగ్‌తో సహా రెండు వందల మందిని బందీలుగా పట్టుకొని లాహోర్‌ వీధుల్లో ఈడ్చుకుంటూ తీసుకెళ్తున్నారు. ఎన్ని చిత్రహింసలు పెట్టిన ఖాల్సాల మొహాల్లో కించిత్తు కూడా బాధ, పశ్చాత్తాపం కనిపించలేదు. శిఖ్ఖులు మతం మారితే ప్రాణదానం చేస్తామని మొగల్‌ అధికారులు ప్రలోభపెట్టినా ఎవరూ వినిపించుకోలేదు. తరువాత చెరసాల అధికారులు ఇరవై మందికి పైగా ఉన్న శిఖ్ఖు సర్దారుల మీద దృష్టిపెట్టారు.

(జరిగిన కథ)

1716వ సంవత్సరం.

జూన్‌ 9వ తేదీ.

బందాసింగ్‌ని ఉంచిన పంజరాన్ని మళ్లీ ఏనుగు మీదకు ఎక్కించారు. అవహేళనగా చక్రవర్తిలాంటి దుస్తులు వేశారు. అతని నాలుగేళ్ల కుమారుడు అజయ్‌సింగ్‌ని ఒళ్లో కూర్చోబెట్టారు. ఏనుగు వెనుక ఇరవైమందికి పైగా ఉన్న అతని ప్రముఖ సర్దారులను నడిపించారు. వారి చేతులు కాళ్లకు సంకెళ్ళు వేశారు. ఈ ఊరేగింపు ఢిల్లీ పురవీధుల నుండి సాగింది. బహదుర్‌షా సమాధి కుతుబ్‌ ఉద్దీన్‌ మౌసీలియమ్‌ (ప్రస్తుత కుతుబ్‌మీనార్‌) వైపు వెళ్లింది.

ఊరేగింపు ఆ ప్రాంత శ్మశానానికి చేరుకున్నాక, బందీలకు మళ్లీ రెండు మార్గాలు సూచించారు. ఇస్లాం మతంలోకి మారటం లేదా మరణించటం.

దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేముంది?

అందరూ మరణాన్నే కోరుకున్నారు.

ఇక్కడ కూడా వాళ్లకి మరణశిక్ష అమలు చేసే ముందు మళ్ళీ అనేక క్రూర పద్ధతుల్లో హింసించారు. ఆ తర్వాత వారి తలలు నరికారు. వాటిని బల్లేలకు గుచ్చి, బందా బహాదుర్‌ చుట్టూ గుండ్రంగా పాతారు.

బందాసింగ్‌ గొంతుక్కూర్చుని ఉన్నాడు. వందలమంది ప్రేక్షకులు ఆ ఘోరదృశ్యాన్ని వీక్షిస్తున్నారు. బందా బహాదుర్‌ని గతించిన బహదుర్‌షా సమాధి చుట్టు ప్రదక్షిణం చేరుంచారు.

అటు తర్వాత బందాను ఈ విధంగా క్రూరాతిక్రూరంగా హత్య చేశారు..

ఒక చిన్న ఖడ్గాన్ని బందాసింగ్‌ చేతికిచ్చి అతని ప్రియాతిప్రియమైన ఏకైక కుమారుడు అజయ్‌సింగ్‌ని చంపమన్నారు. బందాసింగ్‌ మౌనంగా, నిశ్చలంగా కూర్చున్నాడు. అప్పుడు ఒక కసారు కత్తిదూసి ఆ పసిబాలుడి శరీరాన్ని అడ్డంగా చీల్చాడు.

గిలగిల కొట్టుకుంటున్న ఆ పసి దేహాన్ని చూస్తూ కసారు వికటంగా నవ్వాడు. అది చాలదన్నట్టు పసివాడి దేహం నుండి మాంసం ముక్కలు కోస్తూ బందా మొహం మీదకు విసిరెయ్యసాగాడు. పసివాడి గుండె బయటకు లాగి బందాబహదుర్‌ నోట్లో కుక్కాడు.

ఈ హింస జరుగుతున్నంతసేపూ బందాసింగ్‌ ఏమీ పట్టనట్లు మౌనంగా ‘వాహెగురు’ ధ్యానం చేస్తూ పరిసరాలకు అతీతంగా ఉండిపోయాడు.

బందాసింగ్‌ మీద మరిన్ని చిత్రహింసలు ప్రయోగించే ముందు అక్కడికి సమీపంలోనే ఉన్న మహమ్మద్‌ అమీన్‌ఖాన్‌ బందాను ఇలా ప్రశ్నించాడు.

‘నీ ప్రవర్తనతో ఇంతవరకూ ఒక దైవ విధేయుడు, విజ్ఞుడిగా మంచి పనులు చేసేవాడిగా అగుపిస్తున్నావు. అలాంటి నీకు ఇలాంటి కష్టాలు ఇక్కడ ఎందుకు కలుగుతున్నాయో చెప్పగలవా ?’

బందా మెల్లగా కళ్లు తెరిచాడు.

దృఢృ స్వరంతో ఇలా అన్నాడు.

‘నిరంకుశ ప్రభువులు ప్రజల్ని హింసలకు గురి చేస్తున్నప్పుడు వారిని శిక్షించటానికి భగవంతుడు నాలాంటి వారిని భూమి మీదకు పంపిస్తాడు. కానీ, మానవునిగా ఒక్కోమాటు న్యాయ పరిధుల్ని, నియమాల్ని అతిక్రమిస్తుంటాం. అందుకుగాను భూమి మీద ఉన్నప్పుడే వాటికి మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. భగవంతుడు నాకు ఏ విధంగానూ అన్యాయం చెయ్యలేదు’

ఈ మాటలు అన్నాక బందా బహాదుర్‌ దేహాతీత స్థితిలోకి వెళ్లిపోయాడు.

అప్పుడు కసారు ముందుకు వచ్చాడు.

బందా బహాదుర్‌ కుడి కంట్లో చురకత్తిని గుచ్చి కనుగ్రుడ్డును పెకలించి వేశాడు. తర్వాత ఎడమకన్ను కూడా పెకలించివేశాడు.

ఇంత చేస్తున్నా బందా సింగ్‌ శిలలా కూర్చున్నాడే తప్ప రవ్వంత కూడా బాధను వ్యక్తం చెయ్యలేదు.

ఆ క్రూరపిశాచం అప్పుడు కత్తి తీసుకుని బందాసింగ్‌ ఎడమ పాదం నరికి వేశాడు. తర్వాత రెండు చేతులూ నరికివేశాడు.

అప్పటికీ బందా బహాదుర్‌ భగవంతునిలో లీనమైన వాడిలా బాధాతీతంగా ఉండిపోయాడు.

చివరకు ఆ కసారు ఎర్రగా కాల్చిన ఇనుప పట్టకారులతో కొద్దికొద్దిగా బందాబహాదుర్‌ మాంసాన్ని శరీరంలోంచి బయటకు లాగాడు. అంతకన్నా హింసించటానికి ఏమీలేక, బందా బహాదుర్‌ శరీరాన్ని ఖండఖండాలుగా నరికివేశాడు.

(ఈ పూర్తి వివరాలు మొగల్‌ చరిత్రకారులు మహ్మద్‌ హరిసి, ఖఫీఖాన్‌, థార్‌టన్‌, ఎలిఫిన్‌స్టన్‌, థానేశ్వర్‌, ఇతరుల గ్రంథాల నుండి తెలుసుకోవచ్చు.)

ఈస్ట్‌ ఇండియా కంపెనీ వారు అప్పటికే భారతదేశంలో తిష్టవేశారు. బందా బహాదుర్‌ని హింసలకు గురిచేసున్త్న దృశ్యాన్ని కళ్లతో చూసిన కంపెనీ అధికారులు జాన్‌ సర్మన్‌, ఎడ్వర్డ్‌ స్టీఫెన్‌సన్‌, ఫోర్టు విలియం తమ గవర్నరుకిలా రాశారు.

‘శిఖ్ఖులు ఎంత ఓర్పుతో హింసను భరిస్తున్నారో చిన్న మాటలతో చెప్పగలిగేవి కాదు. చిట్టచివరి వరకూ ఒక్క శిఖ్ఖు కూడా తన మతాన్ని మారటానికి ఒప్పుకోలేదు. జూన్‌ 9వ తేదీన బందా బహాదుర్‌ వంతు వచ్చింది. అతడి చేతులు, కాళ్లు నరికి వేశారు. కళ్లు పీకివేశారు. ఎర్రగా కాల్చిన పట్టకార్లతో అతని మాంసాన్ని చీల్చారు. చివరకు అతని తల నరికి వేశారు’.

ఇవన్నీ అప్పటి సంఘటనలను ప్రత్యక్షంగా చూసిన చరిత్రకారులు రాసిన వాస్తవ సంఘటనలు.

అలా గురుగోవింద్‌ సింగ్‌ అనుయాయి బందా బహాదుర్‌ తన గురువు తనకు అప్పచెప్పిన పనిని నిర్వహిస్తూ, వాహెగురులో లీనమయ్యాడు.

——————-

మరింతగా శిఖ్ఖు మతం

బందా బహాదుర్‌ మరణంతో శిఖ్ఖు మతం అంతరించలేదు. పైగా మరింతగా విస్తరించింది.

బందా బహాదుర్‌ చూపిన వెలుగుబాటలో మరెందరో మహావీరులు నవాబ్‌ కపూర్‌సింగ్‌ విర్క్‌, సర్దార్‌ బుధ్‌సింగ్‌, సర్దార్‌ చరత్‌సింగ్‌, బాబా దీప్‌ సింగ్‌జీ షహీద్‌, సర్దార్‌ జస్సాసింగ్‌జీ అహ్లువాలియా, మహరాజా రంజిత్‌సింగ్‌, హరిసింగ్‌ భంగీ ఇలా ఎందరో శిఖ్ఖు మతాన్ని, శిఖ్ఖు ధర్మాన్ని ప్రపంచవ్యాప్తం చేశారు.

గురుగోవింద్‌ సింగ్‌ సందేశం ఇలా చెబుతుంది.

‘మానస్‌ కీ జాత్‌ సభై ఏకై పహచాన్‌ బో’

దీని అర్థం ‘మనుషులు తమని తాము హిందువు లనీ, ముస్లిములనీ, ఇమామ్‌లు, షఫీలనీ చెప్పుకో వచ్చు. కానీ వారినందర్నీ నేను కేవలం మానవులుగానే చూస్తాను’

అదీ శిఖ్ఖు గురువుల ప్రత్యేకత.

ఆది గురువు నానక్‌దేవ్‌ కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు. ఆయన వేసిన పునాది మీదనే శిఖ్ఖు ధర్మం ఐచ్ఛిక ఎంపికతో ప్రపంచమంతా వ్యాపించి వర్ధిల్లుతోంది. మతమార్పిడులు శిఖ్ఖుధర్మంలో లేవు.

——————-

మొగలారూల పతనం

ప్రపంచంలో భగవంతుని పాలన తప్ప, ఇతర పాలకుల అధికారం శాశ్వతంగా ఉండదు. అది అర్థం చేసుకోలేక, దైవధర్మాన్ని వదలి, స్వంత బుద్ధితో నిరంకుశ పాలనతో పాలకులు పాపరాశిని మూట గట్టుకుని చరిత్రహీనులుగా మిగిలిపోతుంటారు.

మొగల్‌ వంశంలో చివరిపాలకుడైన బహాదుర్‌షా జఫ్ఫార్‌ ఆంగ్లేయుల చేత దేశాంతర శిక్షకు గురయ్యాడు. అతనిని బర్మాలో బంధించి ఉంచారు. అతను అక్కడే మరణించాడు.

అన్ని క్రూర కృత్యాలు చేసిన మొగలారూ పాలకుల్ని ఇప్పుడు తలచేవారే లేరు ! తలచినా నిరసనగానే మాట్లాడుతారు.

కానీ, అదే సమయంలో ఈ దేశంలో జన్మించిన శిఖ్ఖు గురువులు గురు నానక్‌ నుండి గురు గోవింద్‌సింగ్‌ వరకు అందరు గురువుల్ని వారి వారి జయంతి, వర్ధంతిలను దివ్యస్మృతులుగా తలుస్తూ, శిఖ్ఖులు ఇప్పటికీ వేడుకలు చేసుకుంటూనే ఉన్నారు. ఆ గురువులు వారు శాశ్వతులు.

బందాసింగ్‌ బహాదుర్‌ తొలి శిఖ్ఖు సేనాపతిగా, శిఖ్ఖు రాజ్యస్థాపకునిగా, అసమాన త్యాగాలు, వీరత్వం చూపిన ‘మహాఖాల్సా’గా జీవించాడు. ప్రజల మనసుల్లో చిరంజీవిగా నిలిచిపోయాడు.

బందాసింగ్‌ బహాదుర్‌ అమరుడు

(అయిపోయింది)

–  కాటూరు రవీంద్ర త్రివిక్రమ్‌, 9849568901

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *