ప్రపంచ మహాబలి ఎవరో !

ప్రపంచ మహాబలి ఎవరో !

ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రకాల క్రీడలు. నేలమీద, నీటిలో, నింగిలో, మంచుపైన జరిగే రకరకాల ఆటలు. సత్తా చాటుకోడానికి ఎన్నో రకాల పరీక్షలు. విశ్వవ్యాప్తంగా 200కు పైగా దేశాలు. ప్రపంచ వ్యాప్తంగా వేలాదిమంది మహాబలులు. అయితే విశ్వ మహాబలుడు ఎవరో తేల్చడానికి ఏటా నిర్వహించే పోటీలకు ఈ ఏడాది ఆసియా ఖండంలో ఒకటైన పిలిఫ్పీన్స్‌ దేశం ఆతిథ్యమిస్తోంది.

కండరగండల సవాల్‌

బరువులు ఎత్తడానికి, కుస్తీలు పట్టడానికి, ముష్టిఘాతాలు కురిపించడానికి, శరీర సౌష్టవాన్ని ప్రదర్శించడానికి వెయిట్‌ లిఫ్టింగ్‌, రెజ్లింగ్‌, బాక్సింగ్‌, బాడీబిల్డింగ్‌ లాంటి ప్రపంచ ప్రముఖ క్రీడలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే బరువులు ఎత్తే వారు కుస్తీలోనూ, మల్లయుద్ధ యోధులు బరువులు ఎత్తడంలోనూ, బాక్సర్లు శరీర సౌష్టవం ప్రదర్శించడంలోనూ, బాడీబిల్డర్లు బాక్సింగ్‌ లేదా వెయిట్‌ లిఫ్టింగ్‌ అంశాలలో రాణించలేరు. రాణించాలన్న రూలూ ఏమీలేదు.

ఈ అంశాలను దష్టిలో ఉంచుకొనే అసలు, సిసలు బలాఢ్యుడు, విశ్వ మహాబలి ఎవరో నిర్ణయించడానికి తొలిసారిగా1977లో ప్రపంచ మహాబలుల పోటీలు ప్రారంభించారు. తొలిరోజుల్లో అమెరికాలోని పవర్‌ లిఫ్టర్లు, బాడీబిల్డర్లు, ఫుట్‌బాల్‌ ప్లేయర్లకు మాత్రమే పరిమితమైన విశ్వ మహాబలుడి పోటీలు ఆ తర్వాతి కాలంలో యూరోప్‌, ఆసియా ఖండ దేశాలకు సైతం విస్తరించాయి.

ఎలాంటి పరీక్షలుంటాయి ?

ప్రపంచంలోనే మహాబలుడు ఎవరు ? మహా బలుడి సత్తాను ఎలా నిర్ధారిస్తారు? వారి సత్తాను తేల్చడానికి ఎలాంటి పరీక్షలు ఉంటాయి? అన్న ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానమే ఉంది.

గత 41 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ పోటీలకు అనుకున్నంతగా ప్రచారం లేదు. అయితే ప్రపంచ మహాబలి పోటీలను ప్రిలిమినరీ, ఫైనల్‌ అని రెండు దశలుగా నిర్వహిస్తారు.

తొలిదశ అర్హత పోటీల్లో లోడ్‌ అండ్‌ డ్రాగ్‌, లోడ్‌ అండ్‌ ఫార్వర్డ్‌ వాక్‌, ట్రక్‌ పుల్‌, ఓవర్‌ హెడ్‌ ప్రెస్‌, ఆర్మ్‌ ఓవర్‌ ఆర్మ్‌, టాస్‌, డెడ్‌ లిఫ్ట్‌, అట్లాస్‌ స్టోన్స్‌ అంశాలలో అత్యధిక పాయింట్లు సాధించిన మొనగాళ్లకే ఫైనల్‌ రౌండ్‌ కమ్‌ టైటిల్‌ సమరంలో పాల్గొనే అవకాశం ఉంటుంది.

రకరకాల పోటీలు

150 నుంచి 200 కిలోల బరువున్న పోటీ దారులు బరువులు ఎత్తడం, బరువులు లాగడం లాంటి అశాలలో తమ సత్తాను చాటుకోవాల్సి ఉంటుంది. 159 కిలోల బరువున్న బండరాళ్లను ఎత్తి, ఓ చోట నుంచి మరోచోట ఉంచడం, 188 టన్నుల బరువున్న భారీ విమానాలను, వంద టన్నుల బరువున్న భారీ ట్రక్కులను లాగటం ఈ పోటీలలో ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. వంద కిలోల ఎరువులు లేదా ఇసుక బస్తాలను మోస్తూ పరుగెత్తే అంశాన్ని ఫార్మర్స్‌ వాక్‌ పేరుతో నిర్వహిస్తారు.

నాటి నుంచి నేటి వరకు

ప్రాథమిక రౌండ్‌ పోటీలను విజయవంతంగా అధిగమించిన మొనగాళ్లకు మాత్రమే టైటిల్‌ సమరంగా జరిగే ఫైనల్‌ రౌండ్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఫైనల్లో మాత్రం ఐదు అంశాలలో తమ ప్రతిభను నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఫ్రేమ్‌ క్యారీ, కార్‌ డెడ్‌ లిఫ్ట్‌, లోడింగ్‌ రేస్‌, ట్రక్‌ పుల్‌, మ్యాక్స్‌ ఓవర్‌ హెడ్‌, అట్లాస్‌ స్టోన్స్‌ అంశాలలో పోటీలు ఉంటాయి.

ఈ పోటీల గత నాలుగు దశాబ్దాల రికార్డులను చూస్తే పోలెండ్‌కు చెందిన మారియస్‌ పుడునోవస్కీకి మాత్రమే ఐదుసార్లు విశ్వమహాబలుడిగా నిలిచిన అరుదైన రికార్డు ఉంది. విజేతగా నిలిచిన మొనగాడికి ప్రపంచ మహాబలుడి టైటిల్‌తో పాటు 72వేల డాలర్లు ప్రైజ్‌ మనీగా ఇస్తారు.

2015 తర్వాత తిరిగి ఆసియాలో

2018 ప్రపంచ మహాబలుడి పోటీలకు పిలిఫ్పీన్స్‌ రాజధాని మనీలాను వేదికగా ఎంపిక చేశారు. 2015 తర్వాత ఓ ఆసియా ఖండ దేశాన్ని ఎంపిక చేయడం ఇదే మొదటిసారి. గతంలో మలేసియాలోని పుత్రజయ నగరం ఈ పోటీలకు ఆతిథ్యమిచ్చింది. 2018 ఏప్రిల్‌ 28 నుంచి క్వాలిఫైయింగ్‌ రౌండ్స్‌, మే 5, 6 తేదీలలో ఫైనల్స్‌ నిర్వహిస్తారు. ఈ పోటీలలో పాల్గొన్న బలశాలులు, భారీ బండరాయి బంతులను ఎత్తడం, హెవీ ట్రక్కులను లాగడం లాంటి మొత్తం ఐదు అంశాలలో తమ సత్తాను చాటుకోవాల్సి ఉంటుంది. ఫ్రేమ్‌ క్యారీ, అట్లాస్‌ స్టోన్స్‌, లోడింగ్‌ రేస్‌, ట్రక్‌పుల్‌, మాక్స్‌ ఓవర్‌ హెడ్‌ విభాగాలలో బలశాలురుగా నిలిచిన వారిని వరల్డ్‌ స్ట్రాంగెస్ట్‌ మ్యాన్‌గా ప్రకటిస్తారు.

ఈ పోటీల కోసం ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలోని కోట్లాదిమంది అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. వివిధ దేశాలకు చెందిన మహాబలులు పాల్గొనే ఈ పోటీలు ఆసక్తికరంగా సాగటమేకాదు, ఆసియా ఖండ దేశాల అభిమానులను సైతం అలరిస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు.

– క్రీడా కృష్ణ , 84668 64969

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *