ప్రపంచ బ్యాడ్మింటన్‌లో తెలుగు తేజాలు !

ప్రపంచ బ్యాడ్మింటన్‌లో తెలుగు తేజాలు !

ప్రపంచ బ్యాడ్మింటన్‌లో చైనా, మలేషియా, ఇండోనేషియా, డెన్మార్క్‌ దేశాల క్రీడాకారుల ఆధిపత్యానికి కాలం చెల్లింది. పురుషుల, మహిళల విభాగాలలో తెలుగుతేజాలు కిదాంబి శ్రీకాంత్‌, పీవీ సింధుల శకం ప్రారంభమయ్యింది.

ప్రపంచ బ్యాడ్మింటన్‌ పురుషుల, మహిళల విభాగాల్లో భారత క్రీడాకారులు ప్రధానంగా తెలుగుతేజాలు కిదాంబి శ్రీకాంత్‌, పీవీ సింధు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నారు.

అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ అంటే చైనా, ఇండోనేషియా, మలేషియా, డెన్మార్క్‌ మాత్రమే కాదు. భారత్‌ కూడా అని చాటి చెప్పారు. 2016, 2017 సీజన్‌లలో అత్యుత్తమంగా రాణించడం ద్వారా రెండోర్యాంక్‌లో నిలిచారు.

సూపర్‌ స్టార్‌ శ్రీకాంత్‌

భారత బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌లో ప్రకాశ్‌ పడుకోనె, పుల్లెల గోపీచంద్‌ తర్వాత అదేస్థాయి ఆటగాడు కిదాంబి శ్రీకాంత్‌ రూపంలో దొరికాడు. 2016, 2017 సీజన్‌లలో శ్రీకాంత్‌ అత్యుత్తమంగా రాణిస్తూ పదవ ర్యాంక్‌ నుంచి 2వ ర్యాంక్‌కు ఎదిగాడు. 2017 సీజన్‌లో ఒకటికాదు రెండుకాదు ఏకంగా నాలుగు సూపర్‌ సిరీస్‌ టైటిల్స్‌ సాధించడం ద్వారా ఈ గుంటూరు కుర్రోడు చరిత్ర సష్టించాడు.

శ్రీకాంత్‌ 2017 ఇండియన్‌ ఓపెన్‌ మాస్టర్స్‌, ఆస్ట్రేలియన్‌ మాస్టర్స్‌, డేనిష్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ టైటిల్స్‌ సాధించడం ద్వారా తన కెరియర్‌లోనే అత్యుత్తమ ర్యాంకు అందుకొన్నాడు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ చరిత్రలో ఒకే సీజన్‌లో నాలుగు సూపర్‌ సిరీస్‌ టైటిల్స్‌ సాధించిన ఆల్‌ టైమ్‌ గ్రేట్‌ స్టార్లు లిన్‌ డాన్‌, లీ చాంగ్‌ వీ, చెన్‌ లాంగ్‌ల సరసన శ్రీకాంత్‌ నిలిచాడు. భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలో ఒకే సీజన్‌లో మూడు సూపర్‌ సిరీస్‌ టైటిల్స్‌ సాధించిన సైనా నెహ్వాల్‌ రికార్డును శ్రీకాంత్‌ అధిగమించాడు.

టాప్‌ ర్యాంక్‌ దిశగా శ్రీకాంత్‌ అడుగులు

ప్రపంచ బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌లో నంబర్‌ వన్‌ ర్యాంక్‌ సాధించిన భారత తొలి, ఏకైక క్రీడాకారుడు ప్రకాశ్‌ పడుకోనె మాత్రమే. 1980లో ప్రకాశ్‌ టాప్‌ ర్యాంక్‌ సాధించిన తర్వాత 1990లో పుల్లెల గోపీచంద్‌ అత్యుత్తమంగా నాలుగో ర్యాంక్‌ మాత్రమే అందుకొన్నాడు. ఆ తర్వాత పారుపల్లి కశ్యప్‌, అజయ్‌ జయరామ్‌ లాంటి ఆటగాళ్లు ఎందరో వచ్చినా అత్యుత్తమ ర్యాంకు సాధించ లేకపోయారు. ప్రస్తుత సీజన్‌లో సూపర్‌ విజయాలతో కిదాంబి శ్రీకాంత్‌ అనూహ్యంగా రెండో ర్యాంక్‌కు చేరి టాప్‌ ర్యాంకర్‌ యాక్సెల్‌ సన్‌ తర్వాతి స్థానంలో నిలిచాడు. త్వరలో జరిగే చైనా ఓపెన్‌ మాస్టర్స్‌ టైటిల్‌ను సైతం శ్రీకాంత్‌ సాధించగలిగితే ప్రపంచ నంబర్‌ వన్‌ ర్యాంక్‌ సాధించే అవకాశం ఉంది.

ప్రపంచ బ్యాడ్మింటన్‌ సంఘం నిబంధనల ప్రకారం ఒక సీజన్‌ 52 వారాల కాలంలో 10 సూపర్‌ సిరీస్‌ టైటిల్స్‌లో అత్యుత్తమంగా రాణించిన, అత్యధిక టైటిల్స్‌ సాధించిన ఆటగాడికే టాప్‌ ర్యాంక్‌ సొంతం చేసుకొనే అవకాశం ఉంటుంది.

మహిళల సింగిల్స్‌లో గతంలోనే సైనా నెహ్వాల్‌ ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ సాధించిన తొలి భారత మహిళగా ఘనత సంపాదించింది. ఇప్పుడు అదే రికార్డును అందుకొనే అవకాశం శ్రీకాంత్‌తో పాటు సింధుకు సైతం వచ్చింది.

కొనసాగుతున్న సింధు జోరు

ప్రపంచ బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌లో కూడా భారత బ్యాడ్మింటన్‌ సిల్వర్‌ క్వీన్‌ సింధు జోరే కొనసాగుతోంది. రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించిన సింధు 2017 ప్రపంచ బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌లో సైతం రజత పతకంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఒలింపిక్స్‌ విజయం తర్వాత ఆడిన ఫ్రెంచ్‌, డేనిష్‌ ఓపెన్‌ టోర్నీల రెండో రౌండ్లోనే పరాజయా లతో ఉక్కిరిబిక్కిరైన సింధు చైనా సూపర్‌ సిరీస్‌ బరిలోకి మాత్రం 7వ సీడ్‌గా టైటిల్‌ వేటకు దిగింది. చైనాలోని ఫుజో వేదికగా ముగిసిన 2016 చైనా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టైటిల్‌తో సింధు తన సూపర్‌ టైటిళ్ల వేట ప్రారంభించింది. టైటిల్‌ సమరంలో చైనాకు చెందిన సన్‌యూను సైతం మూడుగేమ్‌ల పోరులోనే సింధు అధిగమించింది.

అంతేకాదు న్యూఢిల్లీలో ముగిసిన 2017 ఇండియన్‌ మాస్టర్స్‌ గ్రాండ్‌ ప్రి టైటిల్‌ను తొలిసారిగా గెలుచుకోడం ద్వారా తన కెరియర్‌లో రెండో మాస్టర్స్‌ టైటిల్‌ సొంతం చేసుకొంది.

ఏడో ర్యాంక్‌ నుంచి రెండో ర్యాంక్‌కు

ఇండియన్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ టైటిల్‌ విజయంతో సింధు మూడుస్థానాల మేర తన ర్యాంక్‌ మెరుగుపరచు కొని కెరియర్‌లోనే అత్యుత్తమంగా రెండో స్థానం సాధించగలిగింది. ప్రపంచ మహిళా బ్యాడ్మింటన్‌లో ప్రస్తుతం 2వ ర్యాంక్‌లో ఉన్న పీవీ సింధుకు ఇప్పటి వరకు ఐదు గ్రాండ్‌ ప్రి టైటిల్స్‌, రెండు సూపర్‌ సిరీస్‌ మాస్టర్స్‌ టైటిల్స్‌ గెలుచుకొన్న రికార్డు ఉంది.

2013, 2016 సంవత్సరాలలో మలేషియన్‌ గ్రాండ్‌ ప్రి టైటిల్‌తో పాటు మకోవా గ్రాండ్‌ ప్రిలో హ్యాట్రిక్‌ టైటిల్స్‌ సాధించింది.

ప్రపంచ బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌లో 2013, 2014 టోర్నీల్లో కాంస్య పతకాలు సాధించిన సింధు ఉబర్‌ కప్‌ 2014, 2016 టోర్నీల్లో సైతం బ్రాంజ్‌ మెడల్స్‌ సొంతం చేసుకొంది. 2014 ఆసియా క్రీడల్లో కాంస్య పతకం, కామన్వెల్త్‌ గేమ్స్‌లో బ్రాంజ్‌ మెడల్స్‌ గెలుచుకొని సింధు తనకు తానే సాటిగా నిలిచింది.

ఇటు కిదాంబి శ్రీకాంత్‌ అటు పీవీ సింధు రానున్నకాలంలో ప్రపంచ నంబర్‌ వన్‌ ర్యాంకుతో పాటు ఆల్‌ ఇంగ్లండ్‌, ప్రపంచ, ఒలింపిక్స్‌లలో స్వర్ణపతకాలు సాధించగలిగితే పరిపూర్ణ క్రీడా కారులుగా మిగిలిపోతారు.

ఇద్దరు భారత క్రీడాకారులు పురుషుల, మహిళల సింగిల్స్‌లో ప్రపంచ రెండోర్యాంక్‌లో నిలవడం ఓ అరుదైన రికార్డుగా మిగిలిపోతుంది. ఈ ఇద్దరూ ప్రపంచ నంబర్‌ వన్‌ ర్యాంకులో నిలిచే రోజు ఎంతో దూరం లేదు.

– క్రీడా కృష్ణ , 84668 64969

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *