ప్రపంచ జిమ్నాస్టిక్స్‌లో తెలుగు వెలుగులు

ప్రపంచ జిమ్నాస్టిక్స్‌లో తెలుగు వెలుగులు

మెల్‌బోర్న్‌లో ముగిసిన ప్రపంచకప్‌ జిమ్నాస్టిక్స్‌లో హైదరాబాద్‌కు చెందిన అరుణా రెడ్డి కాంస్య పతకం నెగ్గి చరిత్ర సృష్టించింది. ఈ ఘనత సాధించిన భారత తొలి మహిళా జిమ్నాస్ట్‌గా రికార్డుల్లో చోటు సంపాదించింది.

కరాటే నుంచి జిమ్నాస్టిక్స్‌కు

హైదరాబాద్‌లోని ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన అరుణ తన తండ్రి నారాయణ రెడ్డి ప్రేరణతో ఐదేళ్ల చిరు ప్రాయంలోనే కరాటే క్రీడలోకి అడుగు పెట్టింది. ఎనిమిదేళ్ల వయసు వరకూ అదే క్రీడలో కొనసాగింది. అయితే అరుణ శరీరాకృతి మాత్రం జిమ్నాస్టిక్స్‌కు అతికినట్లు సరిపోడంతో శిక్షకుల సలహాతో జిమ్నాస్ట్‌గా మారింది.

హైదరాబాద్‌ లాల్‌ బహదూర్‌ ఇండోర్‌ స్టేడియంలో శిక్షకుడు బ్రిజ్‌ కిషోర్‌ పర్యవేక్షణలో అరుణ కఠోర సాధన చేసింది. ఎనిమిదేళ్ల వయసు నుంచే అంకిత భావంతో శ్రమించి జిమ్నాస్టిక్సే ఊపిరిగా చేసుకొన్న అరుణ అండర్‌ -19 విభాగంలో ఒలింపియన్‌ దీప కర్మాకర్‌ తర్వాతి స్థానంలో నిలిచింది. దేశంలోని ఇద్దరు అత్యుత్తమ జిమ్నాస్ట్‌లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకొంది.

నాన్న త్యాగం..

అరుణను అంతర్జాతీయ జిమ్నాస్ట్‌గా తయారు చేసి ప్రపంచ పతక విజేతగా చూడాలన్న తన కల నెరవేర్చుకోడానికి ఆమె తండ్రి నారాయణ రెడ్డి సొంతింటినే అమ్మకానికి పెట్టారు. ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బుతోనే తన కుమార్తెను ప్రపంచ శ్రేణి జిమ్నాస్ట్‌గా తీర్చి దిద్దారు.

అరుణ నిలకడగా రాణిస్తూ అంతర్జాతీయ జిమ్నాస్ట్‌గా ఎదుగుతున్న సమయంలో నారాయణ రెడ్డి హఠాన్మరణం పొందారు. దీంతో తీవ్ర డిప్రెషన్‌కు గురైన అరుణ ఆటకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. అయితే తమ కలల ఇంటిని తన కోసం విక్రయించిన నాన్న లక్ష్యం, జీవితాశయం గుర్తుకు వచ్చి గుండె దిటవు చేసుకొని తన సాధన కొనసాగించింది.

తండ్రి అకాలమరణంతో తల్లడిల్లిన అరుణ జిమ్నాస్టిక్స్‌పై ఏకాగ్రత కోల్పోయిన సమయంలో తల్లి, అక్క, బావ అండగా నిలిచారు. ఎలాంటి అవాంత రాలు లేకుండా తన కెరియర్‌ను కొనసాగించడంలో తోడ్పడ్డారు.

హైదరాబాద్‌లో నివాసం.. ఢిల్లీలో సాధన

అమెరికా, చైనా, యూరోప్‌ దేశాలతో పోల్చి చూస్తే భారత జిమ్నాస్టిక్స్‌లో ప్రపంచ ప్రమాణాలతో కూడిన పరికరాలు, శిక్షణ అంతంత మాత్రమే. బెంగాల్‌, త్రిపుర, హర్యానా వంటి రాష్ట్రాలకే మనదేశంలో జిమ్నాస్టిక్స్‌ క్రీడ పరిమితం. అయితే 2002 జాతీయ క్రీడల పుణ్యమా అని జిమ్నాస్టిక్స్‌ సాధనకు తగిన సౌకర్యాలు సమకూరాయి. హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న శిక్షణతోనే రిథమిక్‌ జిమ్నాస్టిక్స్‌లో అరుణ రెడ్డి, మేఘన రెడ్డి లాంటి తెలుగమ్మాయిలు వెలుగులోకి వచ్చారు. కాని అత్యాధునిక పరికరాలు, శిక్షణా సౌకర్యాలు న్యూఢిల్లీలో ఉండటంతో అక్కడే నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణా శిబిరాలలో అరుణా రెడ్డి ఏడాదికి ఐదు నెలలపాటు పాల్గొంటూ వస్తోంది.

రియో ఒలింపిక్స్‌ వాల్టింగ్‌ విభాగంలో నాలుగో స్థానంలో నిలిచిన దీప కర్మాకర్‌తో కలసి సాధన చేస్తూ అరుణ జిమ్నాస్ట్‌గా తన నైపుణ్యాన్ని అనూహ్యంగా మెరుగుపరచుకొంది.

అనేక పతకాలు

మనదేశంలో జిమ్నాస్టిక్స్‌కు ఆదరణ, ప్రోత్సాహం అంతంత మాత్రమే. అయినా అరుణ జిమ్నాస్ట్‌గానే తన సాధన కొనసాగించింది. గత 14 సంవత్సరాలుగా రోజుకు ఆరు గంటల చొప్పున సాధన చేస్తూనే వస్తోంది. జాతీయ సీనియర్‌, జూనియర్‌ విభాగాలలో మూడుసార్లు విజేతగా నిలిచింది. జాతీయ క్రీడల జిమ్నాస్టిక్స్‌లో రాష్ట్రానికి ఐదు పతకాలు సాధించి పెట్టింది. 2013లో ప్రపంచ జిమ్నాస్టిక్స్‌, 2014 కామన్వెల్త్‌ గేమ్స్‌, 2014 ఆసియా క్రీడలు, 2017 ఆసియా ఛాంపియన్‌ షిప్‌ పోటీల్లో పాల్గొన్నా అరుణ ఫైనల్‌ రౌండ్‌కు అర్హత సాధించలేకపోయింది. బ్యాంకాక్‌లో ముగిసిన ఆసియా జిమ్నాస్టిక్స్‌ పోటీల్లో చైనా, కొరియా, జపాన్‌, సోవియెట్‌ మాజీ రిపబ్లిక్‌ దేశాల జిమ్నాస్ట్‌లతో పోటీ పడి అత్యుత్తమంగా ఆసియా స్థాయిలో ఐదవ స్థానంలో నిలిచింది.

పతకం నాన్నకే అంకితం

14 సంవత్సరాల పాటు అంకితభావంతో సాధన చేస్తూ వచ్చిన అరుణ తొలి ప్రపంచ పతకాన్ని 22 ఏళ్ల వయసులో సాధించింది. 2018 కామన్వెల్త్‌ గేమ్స్‌ సన్నాహాలలో భాగంగా మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌ జిమ్నాస్టిక్స్‌ వాల్ట్‌ విభాగంలో అరుణ 13.416 పాయింట్లు సాధించడం ద్వారా కాంస్య పతకం అందుకొంది.

భారత జిమ్నాస్టిక్స్‌ చరిత్రలో రియో ఒలింపిక్స్‌లో దీప కర్మాకర్‌ నాలుగో స్థానంలో నిలిచింది. ఆసియా పోటీలు, 2014 కామన్వెల్త్‌ గేమ్స్‌లో కాంస్య పతకాలు సాధించినా ప్రపంచకప్‌లో పతకం సాధించలేక పోయింది. అయితే ఆ లోటును అరుణా రెడ్డి కాంస్య పతకంతో తీర్చింది. ప్రపంచకప్‌ జిమ్నాస్టిక్స్‌లో పతకం సాధించిన తొలి తెలుగు, భారత మహిళగా అరుణ రికార్డుల్లో చోటు సంపాదించింది. తాను సాధించిన తొలి ప్రపంచ పతకాన్ని తన తండ్రికి అంకితమిచ్చింది.

టోక్యో ఒలింపిక్సే లక్ష్యంగా

గత 14 సంవత్సరాలుగా సాధన చేస్తూ వచ్చిన అరుణ కెరియర్‌లో శ్రమకు తగ్గ ఫలాలు రావడం ఇప్పుడే ప్రారంభమయ్యాయి. ఆస్ట్రేలియాలోని గోల్డ్‌ కోస్ట్‌ వేదికగా ఏప్రిల్‌ 4 నుంచి జరిగే 2018 కామన్వెల్త్‌ గేమ్స్‌, జకార్తా వేదికగా జరిగే ఆసియా క్రీడల్లో పతకాలు సాధించడం, 2019లో జరిగే ప్రపంచ జిమ్నాస్టిక్స్‌, 2020లో టోక్యో వేదికగా జరిగే ఒలింపిక్స్‌కు అర్హత సాధించడమే తన ప్రస్తుత లక్ష్యాలని అరుణ ప్రకటించింది. ప్రపంచకప్‌ కాంస్య పతకంతో దేశానికి, తెలంగాణ రాష్ట్రానికి గర్వ కారణంగా నిలిచిన అరుణ రెడ్డికి అన్ని విధాలుగా అండగా నిలవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపైన ఎంతైనా ఉంది.

– క్రీడా కృష్ణ , 84668 64969

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *