ప్రపంచ క్రికెట్లో విరాట్‌ పర్వం !

ప్రపంచ క్రికెట్లో విరాట్‌ పర్వం !

శతాబ్దాల చరిత్ర కలిగిన క్రికెట్‌ ఆటలో ఎంతోమంది గొప్ప క్రికెటర్లు ఇలా వచ్చి, అలా వెళ్తుంటారు. కాని కలకాలం గుర్తుండిపోయే అత్యంత అరుదైన ఆటగాళ్ళు కొద్దిమంది మాత్రమే కనిపిస్తారు. అలాంటి వారిలో చోటు కోసం భారత కెప్టెన్‌ విరాట్‌ కొహ్లీ తన ఆటతీరుతో ఇప్పటికే అర్హత సంపాదించాడు. అత్యంత వేగంగా యాభై అంతర్జాతీయ శతకాలు సాధించిన ఇద్దరు క్రికెటర్లలో ఒకడిగా నిలిచాడు. క్రికెట్‌ దేవుడు సచిన్‌ టెండూల్కర్‌ పేరుతో ఉన్న ‘వంద’ వందల రికార్డు దిశగా మెరుపువేగంతో దూసుకుపోతున్నాడు.

క్రికెట్‌కు, సెంచరీకి అవినాభావ సంబంధం ఉంది. శతకాలు లేని క్రికెట్‌ను ఊహించడం అసాధ్యం. శతాబ్దాల చరిత్ర కలిగిన క్రికెట్లో బ్యాట్స్‌ మన్‌గా పేరు తెచ్చుకొన్న ఆటగాళ్లంతా సెంచరీలతో తమ పేరును ముడిపెట్టుకోడానికి తహతహ లాడిపోతుంటారు. బ్యాట్‌ పట్టుకొని క్రీజులోకి దిగారంటే చాలు అలవోకగా శతకం బాదేయగల నేర్పున్న దిగ్గజ క్రికెటర్లు అతికొద్దిమంది మాత్రమే మనకు కనిపిస్తారు.

సచిన్‌ టు విరాట్‌ కొహ్లీ

ఐదురోజుల సాంప్రదాయ టెస్ట్‌ క్రికెట్‌ మాత్రమే కాదు. 50 ఓవర్ల ఇన్‌స్టంట్‌ వన్డే క్రికెట్‌తో కలిపి చూస్తే అత్యధిక అంతర్జాతీయ శతకాలు సాధించిన అరుదైన రికార్డు భారత క్రికెట్‌ దేవుడు సచిన్‌ టెండూల్కర్‌ పేరుతోనే ఉంది.

1990 దశకం నుంచి 2013 వరకు అంతర్జాతీయ క్రికెట్లో తిరుగులేని ఆటగాడిగా కొనసాగిన మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ 200 టెస్ట్‌ మ్యాచ్‌ల్లో 51 శతకాలు, 463 వన్డేల్లో 49 సెంచరీలు సాధించి తనకు తానే సాటిగా నిలిచాడు. వంద అంతర్జాతీయ క్రికెట్‌ శతకాలు సాధించిన ఒకే ఒక్కడిగా, తొలి క్రికెటర్‌గా క్రికెట్‌ పుస్తకంలో తనకంటూ ఓ ప్రత్యేక అధ్యాయం సష్టించుకొన్నాడు. డజన్ల కొద్దీ ప్రపంచ రికార్డులు సాధించి భారత క్రికెట్‌కే గర్వకారణంగా నిలిచాడు.

సచిన్‌ తర్వాత అత్యధిక సెంచరీలు సాధించిన క్రికెటర్ల వరుసలో ఆస్ట్రేలియా ఆల్‌ టైమ్‌ గ్రేట్‌ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ కనిపిస్తాడు. తన కెరియర్‌లో 375 వన్డేలు, 168 టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడిన పాంటింగ్‌ మొత్తం 71 శతకాలు నమోదు చేశాడు. టెస్టుల్లో 41, వన్డేల్లో 30 సెంచరీలు సాధించిన ఘనత పాంటింగ్‌కు మాత్రమే దక్కుతుంది.

దటీజ్‌ కుమార సంగక్కర

శ్రీలంక మాజీ కెప్టెన్‌ కుమార సంగక్కర 63 శతకాలతో అత్య ధిక అంతర్జాతీయ సెంచరీలు సాధించిన దిగ్గజ క్రికెటర్లలో మూడో స్థానం సంపా దించాడు. 404 వన్డేల లో 25 సెంచరీలు, 134 టెస్టుల్లో 39 సెంచరీలు సాధించిన రికార్డు సంగక్కరకు ఉంది. అత్యధికంగా 11 ద్విశతకాలు సాధించిన ఆధునిక టెస్ట్‌ క్రికెటర్‌ కుమార సంగక్కర మాత్రమే.

సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌ జాక్‌ కలిస్‌ 62 అంతర్జాతీయ శతకాలు సాధించి, నాలుగో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. కలిస్‌ 166 టెస్టుల్లో 45 సెంచరీలు, 328 వన్డేలలో 17 శతకాలు సాధించాడు. బౌలర్‌గా 565 వికెట్లు సాధించిన ఏకైక బ్యాటింగ్‌ ఆల్‌ రౌండర్‌ జాక్‌ కలిస్‌ మాత్రమే.

శ్రీలంక మాజీ కెప్టెన్‌ జయవర్థనే 54 శతకాలు సాధించాడు. 149 టెస్టుల్లో 34 శతకాలు, 448 వన్డేల్లో 19 సెంచరీలు సాధించడం ద్వారా ఐదో అత్యుత్తమ బ్యాటింగ్‌ దిగ్గజంగా గుర్తింపు తెచ్చుకొన్నాడు.

కరీబియన్‌ క్రికెట్‌ దిగ్గజం బ్రియన్‌ లారా 53 శతకాలతో తన క్రికెట్‌ జీవితాన్ని ముగించాడు. 131 టెస్టుల్లో 34, 299 వన్డేల్లో 19 శతకాలు సాధించిన లారాకు టెస్ట్‌, ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్లలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన అరుదైన రికార్డు ఉంది. టెస్ట్‌ క్రికెట్లో 400 నాటౌట్‌, ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్లో 50 పరుగుల నాటౌట్‌ స్కోర్లు సాధించిన ఏకైక క్రికెటర్‌ బ్రియన్‌ లారా మాత్రమే.

ఇద్దరూ ఇద్దరే

నేటితరం క్రికెటర్లలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కొహ్లీ, సౌతాఫ్రికా టెస్ట్‌ కెప్టెన్‌ హషీమ్‌ ఆమ్లా సెంచరీల బాదుడులో రేసుగుర్రాల్లా దూసుకుపోతున్నారు. ఈ ఇద్దరూ కేవలం 438 ఇన్నింగ్స్‌లలోనే యాభై అంతర్జాతీయ సెంచరీల రికార్డును అందుకొని సమ ఉజ్జీలుగా నిలిచారు. అత్యంత వేగంగా మొదటి 50 శతకాలు సాధించిన మొనగాళ్లుగా నిలిచారు.

హషీమ్‌ ఆమ్లా 2017 సీజన్‌ వరకు ఆడిన 109 టెస్టుల్లో 28 శతకాలు, 158 వన్డేల్లో 26 సెంచరీలు సాధించాడు. మొత్తం 54 శతకాలతో మహేల జయవర్థనే రికార్డును సమం చేశాడు.

భారత కెప్టెన్‌ విరాట్‌ కొహ్లీ సైతం అత్యంత వేగంగా యాభై అంతర్జాతీయ సెంచరీలు బాదడంలో ఆమ్లాకు సరిజోడిగా నిలిచాడు. కోల్‌కతా వేదికగా శ్రీలంకతో ముగిసిన తొలి టెస్ట్‌ వరకు మొత్తం 61 మ్యాచ్‌లు ఆడిన కొహ్లీ 18 సెంచరీలు, న్యూజి లాండ్‌తో ముగిసిన 2017 వన్డే సిరీస్‌ వరకు ఆడిన 202 మ్యాచ్‌ల్లో 32 సెంచరీలు, మొత్తంగా 263 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనే 50 శతకాలు నమోదు చేశాడు. 29 ఏళ్ల వయసుకే శతకాల అర్థశతకాన్ని పూర్తి చేసిన కొహ్లీ, వచ్చే దశాబ్దకాలం ఇదే స్థాయి ఆటతీరు, నిలకడ ప్రదర్శించగలిగితే సచిన్‌ శతశతకాల రికార్డును అధిగమించగలుగుతాడు. మాస్టర్‌ సచిన్‌ రికార్డును కేవలం విరాట్‌ కొహ్లీ మాత్రమే అధిగమించాలని కోరుకుందాం.

టాప్‌ బ్యాండ్స్‌

సచిన్‌ టెండూల్కర్‌ 100 సెంచరీలు

రికీ పాంటింగ్‌ 71 సెంచరీలు

కుమార సంగక్కర 63 సెంచరీలు

జాక్‌ కలిస్‌ 62 సెంచరీలు

జయవర్థనే 54 సెంచరీలు

బ్రియన్‌ లారా 53 సెంచరీలు

హషీమ్‌ ఆమ్లా 51 సెంచరీలు

విరాట్‌ కొహ్లీ 50 సెంచరీలు

రాహుల్‌ ద్రావిడ్‌ 48 సెంచరీలు

ఏబీ డివిలియర్స్‌ 45 సెంచరీలు

– క్రీడా కృష్ణ , 84668 64969

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *