పొలిటికల్‌ థ్రిల్లర్‌ భాగమతి

పొలిటికల్‌ థ్రిల్లర్‌ భాగమతి

‘బాహుబలి-2’ తర్వాత అనుష్క తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ‘భాగమతి’. నిజానికి గత ఏడాదే ఈ సినిమా విడుదల కావాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ ఎట్టకేలకు గణతంత్రదినోత్సవ కానుకగా విడుదలైంది. ‘మిర్చి’తో చిత్ర నిర్మాణంలోకి అడుగు పెట్టి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన వంశీ, ప్రమోద్‌ నిర్మించిన సినిమా ‘భాగమతి’. నాని నటించిన ‘పిల్లజమిందార్‌’తో చక్కని దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న జి.అశోక్‌ దీనికి దర్శకత్వం వహించారు. భారీ అంచనాలతో రూపుదిద్దుకున్న ‘భాగమతి’ మొదటిలో అంతా అనుకున్నట్లు చారిత్రకం కాదు, ఆ తర్వాత ప్రచారం జరిగినట్టు పూర్తి స్థాయి హారర్‌ చిత్రం కాదు. ఇదో పొలిటికల్‌ థ్రిల్లర్‌ మూవీ!

ఈశ్వర్‌ ప్రసాద్‌ (జయరాం) కేంద్రమంత్రి. రాష్ట్రంలోని ప్రభుత్వ పనితీరుతో ఈ ఎం.పి. విసిగి వేసారి పోతాడు. ప్రజల బాగు పట్టించుకోని ముఖ్య మంత్రిని, సొంత ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తాడు. దాంతో ప్రజలందరికీ అతను దేవుడిగా కనిపిస్తుంటాడు. అయితే ముఖ్యమంత్రి పీఠంపై అతని దృష్టి ఉందని, అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నాడని గ్రహించిన ఢిల్లీలోని హైకమాండ్‌ అతనిపై మచ్చ వేయాలనే నిర్ణయం తీసుకుంటుంది. అందుకోసం సి.బి.ఐ. ఎంక్వయిరీ వేస్తుంది. ఆ టీమ్‌కు హెడ్‌గా వైష్ణవి (ఆశా శరత్‌)ని నియమిస్తుంది. డైరెక్ట్‌గా ఈశ్వర్‌ ప్రసాద్‌ను ఎంక్వయిరీ చేయడం సరికాదని భావించిన వైష్ణవి… ఆయన దగ్గర సెకట్రరీగా ఉన్న ఐ.ఎ.ఎస్‌. ఆఫీసర్‌ చంచల (అనుష్క) ద్వారా విషయసేకరణ ప్రారంభించాలనుకుంటుంది. అప్పటికే ఓ మర్డర్‌ కేసు మోపబడిన చంచల పోలీస్‌ కస్టడీలో ఉంటుంది. అక్కడ నుండీ ఎవరికీ తెలియకుండా ఎంక్వయిరీ కోసం ఆమెను భాగమతి బంగ్లాకు తీసుకొస్తారు. ఈశ్వర్‌ ప్రసాద్‌ నిజంగానే అవినీతి పరుడా? అతని పేరు అడ్డం పెట్టుకుని వేరెవరైనా అతన్ని ఇరికించే పనిచేశారా? నిజాయితీ పరురాలైన చంచల ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? ఈశ్వర్‌ ప్రసాద్‌ నిజస్వరూపం గురించి ఆమెకు తెలుసా? సి.బి.ఐ. అధికారిణి వైష్ణవికి చంచల ఎలాంటి సమాచారం ఇచ్చింది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా మిగిలిన సినిమా సాగుతుంది.

నటీనటుల విషయానికి వస్తే అనుష్క ఈ సినిమా మొత్తాన్ని తన భుజస్కంధాల మీద వేసుకుని ముందుకు తీసుకెళ్ళింది. చంచలగా చక్కని నటన కనబరిచింది. భాగమతి పాత్రలో కనిపించేది మూడు నాలుగు సన్నివేశాల్లోనే అయినా… భయానక, భీభత్స రసాలకు ప్రాణం పోసింది. ఇక ఆమె ప్రేమికుడు శక్తిగా ఉన్ని ముకుందన్‌, రాజకీయ నేత ఈశ్వర్‌ ప్రసాద్‌గా జయరాం, శక్తి అన్నయ్య, ఎ.సి.పి.గా మురళీశర్మ చక్కగా నటించారు. కానిస్టేబుల్స్‌ పాత్రల్లో ధన్‌రాజ్‌, ప్రభాస్‌ శ్రీను, విద్యులేఖ రామన్‌ కాస్తంత వినోదం పంచే ప్రయత్నం చేశారు. అనుష్క కాకుండా మిగిలిన మూడు ప్రధాన పాత్రలను మలయాళ నటీనటులు పోషించడం విశేషం. నిజానికి ఆశా శరత్‌ ‘దృశ్యం’ మలయాళ రీమేక్‌తోనే తెలుగులోకి రావాల్సింది కానీ అప్పుడు ఆ పాత్రకు నదియాను తీసుకున్నారు. ఎట్టకేలకు ఆమె ఈ సినిమాలోనూ చక్కని పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రతో మనవాళ్ళ ముందుకు వచ్చింది. నటీనటుల నుండీ దర్శకుడు అశోక్‌ చక్కని నటన రాబట్టుకున్నాడు. ఈ సినిమా సాంకేతిక నిపుణుల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మది సినిమాటోగ్రఫీ, తమన్‌ సంగీతం గురించి. ఈ రెండు కూడా సినిమా మూడ్‌ను చక్కగా ఎలివేట్‌ చేశాయి. అలానే భాగమతి బంగ్లాను ఆర్ట్‌ డైరెక్టర్‌ రవీందర్‌ రెడ్డి చక్కగా రూపొందించాడు. కోటగిరి వేంకటేశ్వర రావు ఎడిటింగ్‌ కూడా బాగుంది. సినిమాలో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ చూస్తే మలయాళం మూవీ అనిపిస్తుంది.

ఇలాంటి పొలిటికల్‌ థ్రిల్లర్‌ చిత్రాలను హారర్‌ ముసుగు తొడిగి తీసుకురావడం అనేది కత్తిమీద సాములాంటిది. సినిమా అంతా అయ్యాక…. ఇదంతా కల్పితం అని చెప్పడం పెద్ద సాహసం అవుతుంది. ఒక్కసారి అదంతా నిజమని నమ్మిన ప్రేక్షకుల ఇగో దెబ్బతింటుంది. దాంతో ప్రతికూల ఫలితం వచ్చే ఆస్కారం కూడా లేకపోలేదు. ఈ సినిమా విషయంలో కొంత అదే జరిగింది. ప్రథమార్ధం ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా చకచకా సాగిపోయింది. ద్వితీయార్థంకు వచ్చేసరికీ నిజం నిదానంగా రివీల్‌ అయిపోవడంతో ప్రేక్షకులు డీలాపడతారు. ఆ మధ్య వచ్చిన ‘రాజుగారి గది’ కూడా దాదాపు ఇదే లైన్‌తో సాగింది. యు.వి. క్రియేషన్స్‌లాంటి నిర్మాణ సంస్థ లభించడం దర్శకుడు జి.అశోక్‌కు అదృష్టమే. ద్వితీయార్థం విషయంలో ఇంకాస్త శ్రద్ధపెట్టి ఉంటే… మరింత మంచి విజయం ‘భాగమతి’కి లభించి ఉండేది. హారర్‌ చిత్రాలను ఇష్టపడేవారు ఓసారి చూడొచ్చు.

– చంద్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *