పార్టీ ఫిరాయింపులు సరైనవేనా?

పార్టీ ఫిరాయింపులు సరైనవేనా?

రాజకీయాల్లో పార్టీలు మారడం సహజమే. తనకు అన్ని విధాలుగా సహకరించి, ప్రజాప్రతినిధిగా గెలిపించిన పార్టీని ఏవేవో కారణాలు చెప్పి వదిలేసి, మరో పార్టీలోకి వెళ్ళడం కూడా సహజమే.

ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా వైసిపి నుంచి టిడిపిలోకి ఫిరాయించిన ఎం.ఎల్‌.ఎ. విషయంలో అనేక టి.వి ఛానళ్ళు చర్చలు నిర్వహించాయి. వాటిని పరిశీలిద్దాం.

పార్టీ ఫిరాయింపులు కొత్తేం కాదు. పార్టీ అధిష్ఠానం గాని, మరెవరైనా గాని తన అభీష్టానికి వ్యతిరేకంగా వెళ్తే ఆ పార్టీకి చెందిన శాసనసభ్యులు, నాయకులు అక్కడ ఇమడలేక మరో చోటికి బిచాణా మార్చేయడం ఎప్పట్నించో ఉంది. అయితే అవన్నీ ఓ పద్ధతి ప్రకారం 2004కు ముందు వరకు జరిగేవి. ఆ రోజుల్లో పార్టీ మారాలనుకునే వాళ్ళు ప్రస్తుతమున్న పార్టీకి, ఆ పార్టీలోని పదవులకు రాజీనామా చేసేవారన్న మాట. కాని 2004 తర్వాత నుంచి ఆ పరిస్థితి కనిపించడం లేదని చర్చల్లో పాల్గొన్న వక్తలు అభిప్రాయపడ్డారు. సాక్షి టి.వి ప్రసారం చేసిన ‘ది ఫోర్త్‌ ఎస్టేట్‌ (నవంబరు 27 రాత్రి 8 గంటలకు)లో వక్తలు ఈ విషయంపై మాట్లాడారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రాజశేఖరరెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్న సమయంలో అనేకమంది టి.ఆర్‌.ఎస్‌. శాసనసభ్యులు కాంగ్రెస్‌లో చేరారు. అలాగే తెలుగుదేశం నుంచి కూడా చాలా మంది కాంగ్రెస్‌లో చేరారు. తాజాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అనేక మంది నాయకులు కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీల నుంచి పెద్దఎత్తున టి.ఆర్‌.ఎస్‌.లో చేరారు. ఆంధ్రప్రదేశ్‌ సి.ఎం. త్వరలో తెలంగాణలోనూ తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడమే ఆ వలసలకు కారణమని చర్చలో పాల్గొన్న ఒక వక్త అన్నారు. కాని అది అంత ఒప్పుకోలుగా లేదు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో అక్కడి ప్రతిపక్షమైన వైసిపి, కాంగ్రెస్‌ నుంచి ఇప్పటికి ఇరవై మందికి పైగా శాసనభ్యులు టి.డి.పి.లోకి చేరారు. అధికారపక్షానికి ఎందుకింత అభద్రతా భావమని విశ్లేషకులు చర్చలో పాల్గొన్న వారిని ప్రశ్నించారు.

పాడేరు ఎం.ఎల్‌.ఎ. గిడ్డీ ఈశ్వరిని టిడిపిలో చేర్చుకోడమెందుకు? అన్న ప్రశ్నకు స్థూలంగా ప్రతిపక్షాన్ని వీలైనంత బలహీన పరచడమే అన్న సమాధానాన్ని అర్థం చేసుకోవాలి. అయితే పార్టీ మారిన శాసనభ్యురాలు మాత్రం వైసిపిలో తన ఆత్మాభిమానం దెబ్బతిన్నదని, ఆత్మగౌరవాన్ని నిలుపుకోడానికే టిడిపిలోకి చేరానని ఎ.పి. 24 I 7 న్యూస్‌ ఛానల్‌లో లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ (నవంబరు 27 రాత్రి 8 గంటలకు ప్రసారమైంది) కార్యక్రమంలో చెప్పారు.

ఆత్మగౌరవం నిలుపుకోవడం వరకు అందరూ అంగీకరించినా తాను సూచించిన ఓ అభ్యర్థికి 2019 ఎన్నికలలో టిక్కెట్టును నిరాకరించడం బాధ కలిగించిదనడం అంత సబబుగా లేదు. ఎందుకంటే పార్టీ నాయకుడు ఒకో సీటుకు అనేకానేక ఆలోచనలు చేసి రకరకాల వ్యూహాల నేపథ్యంలో అభ్యర్థులను ఖరారు చేస్తాడు. తనకు నచ్చినట్టే జరగాలి అని పట్టుబట్టడం సముచితం కాదు. అయినా రాబోయే ఎన్నికలకు ఇంకా దాదాపు పద్దెనిమిది నెలల సమయముంది. ఈలోపు అనేక మార్పులు జరగడానికి అవకాశం ఉంది. అంతకన్నా తమ పార్టీ తీసుకున్న అసెంబ్లీ బహిష్కరణ స్టాండ్‌ నచ్చలేదనో, దానివల్ల తమ నియోజకవర్గ సమస్యలను చెప్పుకోడానికి అవకాశం లేకుండా పోయిందనో చెప్తే కొంతమేరకు వాస్తవంగా ఉండేది. ఇలాంటి అభిప్రాయంతోనే ఇంకొందరు పార్టీ మారేలా ఉన్నారని కూడా ఇదే ఛానల్‌ ‘మార్నింగ్‌ డిబేట్‌ విత్‌ వెంకటకృష్ణ’ (ఉదయం 7.30కి)లో పాల్గొన్న వ్తలు చెప్పారు.

రాజ్యసభ సీటు దక్కకుండా చేయడానికేనా

ఎపి అసెంబ్లీలో 44 సీట్లుంటే ఒక రాజ్యసభ సీటొస్తుంది. ప్రస్తుతం వైసిపికి అక్కడ 47 మంది ఉన్నారు. ఆ సంఖ్యను ఇంకా కుదించి వైసిపిని రాజ్యసభ స్థానం పొందకుండా చేసేందుకే అని చర్చలోని ఓ వక్త అన్నారు. అలా రాజ్యసభ సీటు అవతలి పార్టీకి పోనివ్వకుండా చేయడం వల్ల అధికార పార్టీకి ఒరిగేదేమీ లేదు. ప్రతిపక్ష పార్టీకి అధికంగా చేకూరేదీ కూడా గణనీయంగా ఏమిలేదు. ఇదే సందర్భంలో సాక్షి టి.వి. ప్రసారం చేసిన చర్చలో మరో ఆసక్తికరమైన అంశం చెప్పారు. అందులో పార్టీ ఫిరాయింపు వ్యవహారమంతా లోకేష్‌ను ముఖ్య మంత్రిని చేయడానికి పడుతున్న పాట్లుగా అభివర్ణిం చారు. కాని అది అంత సరైనదిగా అనిపించలేదు.

ప్రస్తుతమున్న పార్టీకి రాజీనామా చేయకుండా వేరే పార్టీలో చేరడం నైతికంగా తప్పని అందరూ చెబుతున్నా, దానికి విరుద్ధంగానే వాస్తవ ప్రపంచంలో జరుగుతోంది. కనుక దీనికి అడ్డుకట్ట వేయడం ఎలా? అన్నదానికి ఎపి 24I7లో నవంబరు 27 ఉదయం జరిగిన చర్చలో ఒక వక్త చెప్పినట్లు పదవ షెడ్యూల్‌లో తగిన సవరణలు చేసి ఎలక్షన్‌ కమిషనర్‌కు అధికారాలు ఇవ్వాలి. అలా చేయాలంటే సవరణలు ప్రతిపాదించి, ఆమోదింపచేయడానికి సరిపడే శక్తి సామర్థ్యాలు కేంద్రంలో ఉన్న అధికార పార్టీకి ఉండాలి. కాని మీ పార్టీ అలా ఎందుకు చేయడం లేదు అని కేంద్రంలోని అధికారపార్టీకి చెందిన ప్రతినిధిని ఈ చర్చల్లో ఓ వక్త అడిగారు. ఆ దిశగా ఆ పార్టీ ప్రయత్నాలు చేసి అమలుపర్చే వరకు ఈ మాదిరి జంపింగ్‌లు తప్పవేమో!

– స్ఫూర్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *