పర్యాటకులను ఆకట్టుకుంటున్న ‘ఆంధ్రా ఊటీ’

పర్యాటకులను ఆకట్టుకుంటున్న ‘ఆంధ్రా ఊటీ’

– హార్పిలీ హిల్స్ కు పెరుగుతున్న తాకిడి

– ఎటు చూసినా పచ్చని పకృతితో కనువిందు చేస్తున్న అందాలు

ఆంధ్రప్రదేశ్‌ను ‘కోహినూర్‌ ఆఫ్‌ ఇండియా’ అని పిలుస్తారు. ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్రుల ప్రస్తావన ఉంది. బౌద్ధ సంబంధమైన గ్రంథాలలో కూడా ఆంధ్రరాష్ట్రం గురించి పేర్కొన్నారు. అశోకుని పదమూడవ శాసనంలో ఆంధ్రరాష్ట్రం గురించి వివరించడం విశేషం. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో బి. కొత్తకోట మండలంలో ఉన్న హార్సిలీ హిల్స్‌ను అందరూ ‘ఆంధ్రా ఊటీ’ అని పిలుస్తారు. ఈ ప్రాంతం అద్భుతమైన వేసవి విడిది కేంద్రంగా పేరుగాంచింది. ఇది మదనపల్లి – మొలకల చెరువు రహదారి మార్గంలో గల ‘కాండమడుగు’కు కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

హార్సిలీహిల్స్‌ను పూర్వం ఆ ప్రాంతవాసులు ‘ఏనుగుల మల్లమ్మ కొండలు’ అని పిలిచేవారు. ఈ కొండల మీద నేటికీ ‘ఏనుగుల మల్లమ్మదేవి’ ఆలయం ఉంది. గతంలో ఈ ప్రాంతం ఆంగ్లేయుల పాలనా కాలంలో కడప జిల్లా పరిధిలో ఉండేది. కాని నేడు చిత్తూరు జిల్లాలో ఉంది.

ఆంగ్లేయుల కాలంలో కడప జిల్లా కలెక్టర్‌గా ఉన్న ‘సర్‌ రాబర్ట్‌ హార్సిలీ’ పేరునే ఈ కొండలకు పెట్టారు. 1857వ సంవత్సరంలో ఏనుగుల మల్లమ్మ కొండలను ప్రథమంగా ఆయనే గుర్తించాడు. ఆ ప్రాంతాన్ని ఆయన తన వేసవి కార్యాలయంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం కొంతమంది వ్యక్తులతో ఆ కొండ ప్రాంతాన్ని పరిశీలించాడు. హార్సిలీకి ఆ ప్రదేశం బాగా నచ్చింది. దాన్ని బాగుచేయించి తన వేసవి కార్యాలయంగా మార్చుకున్నాడు. ఆనాటి నుండి ఏనుగుల మల్లమ్మ కొండల్ని ‘హార్సిలీ హిల్స్‌’గా స్థానికులు పిలుస్తున్నారు.

తరువాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం హార్సిలీహిల్స్‌ను గవర్నర్‌ వేసవి విడిది కేంద్రంగా ఏర్పాటు చేసింది. ఇపుడు ఆ ప్రాంతంలో మనకు కనిపిస్తున్న పెద్ద పెద్ద భవనాలన్ని ఆ కాలంలో నిర్మించినవే కావడం విశేషం.

1980లో హార్సిలీ హిల్స్‌ను ఆంధ్రప్రదేశ్‌ టూరిజం శాఖ ప్రత్యేక పర్యాటక కేంద్రంగా గుర్తించి, అభివృద్ధి చేసింది. నేడు ఇక్కడికి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి చాలా మంది విహార యాత్రికులు వస్తున్నారు. ఈ ప్రాంతం విదేశీయులను సైతం అమితంగా ఆకట్టుకుంటోంది. చుట్టూ కొండలు, పచ్చని ప్రకృతితో ఈ ప్రాంతం అద్భుతంగా ఉంటుంది. కొండల మీద ఆహ్లాదకరమైన వాతావరణం కనువిందు చేస్తుంది.

ఈ కొండల మీద ఉష్ణోగ్రత ఎన్నడూ ముప్ఫై డిగ్రీలకు మంచి నమోదు కాలేదు. పక్క రాష్ట్రమైన తమిళనాడులోని ఊటీ (ఉదక మండలం) ని మరిపించే అన్ని హంగులూ హార్సిలీ హిల్స్‌లో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. అందుకే దీన్ని ‘ఆంధ్రా ఊటీ’ అని అభివర్ణిస్తారు.

ఏ.పి. అటవీ శాఖ ఈ కొండల మీద ప్రకృతి అధ్యయన కేంద్రం, జంతు ప్రదర్శనశాల, ఎన్విరాన్‌మెంట్‌ కాంప్లెక్స్‌, నేచర్‌ స్టడీ సెంటర్‌ (ప్రకృతి అధ్యయన కేంద్రం) మొదలైన వాటిని ఏర్పాటు చేసింది. అంతేకాకుండా చిన్నపిల్లల కోసం జపాన్‌ దేశం నుండి ‘ప్లేఫెన్‌’ను తెప్పించి, ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయడం మరో వింతగా చెప్పవచ్చు. పన్నెండు సంవత్సరాలలోపు బాల, బాలికలు ప్లేఫెన్‌లో ఆడుకునేందుకు అనుమతిస్తారు.

ఇక్కడ ‘మైక్రోవేవ్‌ రిసీవర్‌’, ‘గాలికొండ’ మొదలైన దర్శనీయ ప్రాంతాలు యాత్రికులను అమితంగా ఆకట్టుకుంటాయి. హార్సిలీ హిల్స్‌కు చుట్ట పక్కల జిల్లాల నుంచే కాకుండా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి కూడా విహార యాత్రికులు విరివిగా వస్తారు.

గతంలో హార్సిలీ హిల్స్‌ మీద ఓ నవోదయ పాఠశాలను కూడా నడిపేవారు. అయితే కాలక్రమంలో కొండపైన నీటి సమస్య తీవ్రమవడంతో దాన్ని హార్సిలీ హిల్స్‌కు సమీపంలో ఉన్న మదనపల్లికి మార్చారు.

పురాతన కాలం నాటి కట్టడాలు కూడా అక్కడ నేటికీ చాలా ధృడంగా కనిపిస్తాయి. పట్టుపరిశ్రమ శాఖకు చెందిన ఫౌండేషన్‌ సీడ్‌ ఉత్పత్తి కేంద్రం, పోలీసు అతిథి గృహం, అటవీ శాఖ అతిథి గృహాలు మొదలైన భవనాలు నేటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. కొండలపైన నివసించే స్థానికులు కొందరు నీటి ఎద్దడిని తట్టుకోలేక ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవడం శోచనీయం.

ఈ ప్రాంతానికి నీటి సౌకర్యం లేదు. కొండల మీదికి ఎనిమిది కిలోమీటర్ల మేర మోటర్ల ద్వారా, పంపుల ద్వారా నీరు ఎక్కిస్తారు. ఒకవేళ ఈ మోటర్లుగాని, పైపులుగాని పాడైతే కొండల మీద నివాసమున్నవారు వారం, పది రోజుల పాటు దాహంతో అలమటించాల్సిందే.

సమైక్య ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గవర్నర్‌గా పనిచేసిన కీ.శే. కృష్ణకాంత్‌ ఒకసారి మూడు రోజుల పాటు హార్సిలీ హిల్స్‌లో బస చేశారు. అక్కడి తాగునీటి సమస్యను గ్రహించి రాష్ట్ర ప్రభుత్వానికి, సంబంధిత శాఖాధికారులకు ఆ ప్రాంత ప్రజలకు తాగునీరు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని లేఖ రాశారు.

ఈ ప్రాంతం సినిమా షూటింగులకు కూడా అనువైనది. ఏ.పి. పర్యాటక శాఖ హార్సిలీ హిల్స్‌ మీద దృష్టి పెడితే, మరింత అభివృద్ధి జరిగే అవకాశం ఉంది.

ఎలా వెళ్లాలి ?

రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల నుంచి చిత్తూరుకు వెళ్లడానికి బస్సు, రైల్వే సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. చిత్తూరు నుంచి బి. కొత్తకోటకు బస్సు లేదా ప్రైవేట్‌ వాహనాల్లో వెళ్లొచ్చు.

– డా|| మంతెన సూర్యనారాయణ రాజు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *