పరీక్ష

పరీక్ష

ఢిల్లీ నగరంలో నాదిర్షా సైన్యం పిల్లలూ, మహిళలూ, పెద్దలూ అనే భేదం లేకుండా ఎవరిని పడితే వారిని చంపేస్తున్న రోజులవి. వీధుల నిండా రక్తపుటేరులు. దుకాణాలన్నింటినీ మూసేశారు. ప్రజలు ఇంటి తలుపులు బిడాయించుకుని వాళ్ల ప్రాణాలు భద్రంగా ఉన్నాయని అనుకుంటున్నారు. కొన్నిచోట్ల విపణి వీధులన్నీ దోపిడీ అవుతున్నాయి. ఎవరూ కూడా మరొకరి ఆక్రోశాన్ని పట్టించుకోవడం లేదు. సంఘంలో ధనికులని చెప్పే వారి భార్యలు, అంటే బేగమ్‌లని వారి భవనాల నుంచి లాక్కొచ్చి మరీ అవమానిస్తున్నారు సైనికులు. అయినా ఆ ఇరానీ సైనికుల నెత్తుటిదాహం కాస్తయినా తీరడం లేదు. మానవ హృదయపు క్రౌర్యం, కాఠిన్యం దాని భయంకరమైన అసలు రూపాన్ని ప్రదర్శిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో నాదిర్షా ఆ సభా భవనంలోకి అడుగుపెట్టాడు.

అది ఢిల్లీ విలాసాలకి నిలయంగా ఉన్న కాలం. భోగ వస్తువులతోనే, సామగ్రితోనే ధనికుల నివాసాలన్నీ నిండి ఉండేవి. స్త్రీలకు సింగా రించుకోవడమే పని. ఇక పురుషులకు… సుఖించడం, భోగించడం తప్ప మరో ఆలోచన ఉండేది కాదు. రాజనీతి ఉండవలసిన చోటును కూడా కవిత్వమే ఆక్రమించింది. హిందూదేశం నలుమూలల నుంచి ఢిల్లీకి ధనరాశులు వచ్చిపడేవి. ఆ ధనమంతా మంచినీటిలా ఖర్చయ్యేది. రాజ్యమంతా వేశ్యలదే. మళ్లీ పక్షుల పందాలొకటి. ఢిల్లీ మహానగరం విలాస నిద్రలో జోగుతూ ఉండేది.

రాజప్రాసాదాలలోని ఆ ఐశ్వర్యాన్నీ, ఆ విలాస వస్తువులనీ చూశాకనే నాదిర్షా కళ్లు నిబిడాశ్చర్యంతో విచ్చుకున్నాయి. నాదిర్షా పుట్టింది దారిద్య్రంలో. అతడి జీవితమంతా గడిపింది యుద్ధభూమిలో. విలాసవంతమైన జీవతాన్ని రుచిమరిగిన వాడు కాడతడు. సమరభూమిలో ఎదుర్కొన్న సమస్యలు ఎన్నో! ఆ కష్టాలు ఎక్కడ? ఈ సుఖాల సామ్రాజ్యం ఎక్కడ? ఆ భోగ ప్రపంచం నుంచి అతడు కళ్లు తిప్పుకోలేకపోతున్నాడు.

సాయంకాలమైంది. తన సర్దార్లతో కలసి ఆ రాజభవనాన్ని వీక్షిస్తూ, ఇష్ట్టమైన వస్తువులను స్వాధీనం చేసుకుంటూ సభ కొలువు తీరే ఆ ప్రదేశానికి వచ్చాడు. పాలకుడు కూర్చునే ఆ మెత్తటి ఆసనం మీద ఆసీనుడయ్యాడు. అప్పుడు తన కూడా వచ్చిన సర్దార్లను వెళ్లిపొమ్మ ఆదేశించాడు. తన ఒంటి మీద ఉన్న ఆయుధాలని తొలగించి ఒక పక్కగా పెట్టాడు. ఆ భవన రక్షకుడిని పిలిపించాడు. అతడు రాగానే అన్నాడు నాదిర్షా.

”నాకు రాజవంశీకులైన మహిళల నాట్యం చూడాలని ఉంది. నీవు వెంటనే వెళ్లి వాళ్లందరిని సర్వాభరణాలతో అద్భుతంగా అలంకరింప చేసి, నా సమక్షంలో ప్రవేశపెట్టు. ఇందులో ఎలాంటి సందేహాలు, సంశయాలు నా చెవిన పడకూడదు. ఆలస్యం కాకూడదు.”

ఆ ఆదేశం వినగానే వణికిపోయాడు భవన రక్షకుడు. ప్రాణాలు పోయినట్లు అనిపించింది. వారు అసూర్యంపశ్యలు. అలాంటి సూర్యరశ్మి కూడా సోకని వారు ఇలా ఈ సభకు ఎలా వస్తారు? పైగా నాట్యం ఎలా చేస్తారు? ఢిల్లీ అంతఃపుర రాణులు ఇలాంటి అవమానాలను ఏనాడూ చవి చూడలేదు. ‘ఓరి నరహంతకుడా! ఈ నగరాన్ని రక్తంతో తడిపేసినా నీ హదయం చల్లారలేదా?’ అని అతడు మనసులో మథనపడ్డాడు. కానీ పైకి మాత్రం నాదిర్షా ముందు పల్లెత్తు మాట కూడా అనలేకపోయాడు. ఆ మహా హంతుకునితో మాట్లాడడం అంటే అగ్నిగుండంలో ప్రవేశించడం వంటి క్రూరమైన పని. అందుకే వంగి అభివాదం చేసి అంతఃపురానికి వెళ్లి వారికి నాదిర్షా మాటలు చెప్పాడు.

నాదిర్షా ఆదేశం చెవిన పడగానే రాణులంతా అయోమయంలో పడి, భయంతో విలవిలలాడి పోయారు. కొందరు నిస్సహాయంగా నింగి వైపు చూస్తూ ఉంటే ఇంకొందరు భగవంతుడిని వేడుకుంటున్నారు. అంతేకాని వారిలో ఏ ఒక్క మహిళ దష్టి కూడా కత్తి లేదా పిడిబాకు వంటి ఆయుధం మీదకు పోలేదు.

నిజానికి అక్కడ ఉన్న బేగమ్‌లు కొందరిలో క్షత్రియ రక్తమే ప్రవహిస్తున్నప్పటికి వారిలోని ఐహిక సుఖవాంఛ ‘జౌహర్‌’ అనే ఒకప్పటి నిప్పును చల్లారిపోయేటట్టు చేసింది. సుఖాలు, విలాసం లాలస ఆత్మ గౌరవాన్ని తుడిచి పెట్టేశాయి. వాస్తవానికి తమ మానమర్యాదలను రక్షించుకోవడానికి అవసరమైన ఏ ఉపాయం గురించి అయినా తమలో తాము ఆలోచించుకునేందుకు, సలహాలు ఇచ్చి పుచ్చుకునేందుకు కాస్త కూడా సమయం మిగలలేదు. గడుస్తున్న ప్రతి క్షణం వారందరి నుదుటిరాతని ఖరారు చేసుకుంటూ నిష్క్రమిస్తోంది. ఖిన్నులైపోయి, అంతా కలసి, ఆ మహా హంతకుడు ఆదేశించిన రీతిలోనే సభాస్థలికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు.

బేగమ్‌ల కళ్ల నిండా కన్నీటితెరలు. ‘భగవంతుడా!’ అని నిట్టూర్పులు విడుస్తూ కుమిలిపోతున్నారు. రత్నాలు, మణులూ, వజ్రాలతో తయారైన ఆభరణాలను యాంత్రికంగా శరీరాలకి తొడుగుతున్నారు. ఉబుకుతున్న కన్నీటిని ఆపుతూ కాటుక దిద్దకుంటున్నారు ఇంకొందరు. వేదనాభరితమైన వారి గుండెల పైన సుగంధ లేపనాలను అద్దుకుంటున్నారు. అంతమంది బేగమ్‌లలో ఒక్కరు కూడా భగవంతుడిపైన అయినా భారం మోపి, నాదిర్షా ఆదేశాన్ని ధిక్కరించేే సాహసం చేయలేకపోయారు. కొద్ది సమయంలోనే రాణివాసంలోని బేగమ్‌లందరూ ఆభరణాల కాంతితో మెరిసిపోతూ ఉండగా, సువాసనలు గుబాళిస్తూ ఉండగా సభా స్థలిలో కూర్చుని ఉన్న నాదిర్షా ఎదుట నిలిచారు.

—-  —– —

ఆ సుందరీమణులను ఓరకంట చూశాడు నాదిర్షా, కొద్దిసేపు. ఆపై అతడు కూర్చున్న ఆసనం మీదేఉన్న పొడవాటి బాలీసుకి అనుకొని పడుకున్నాడు. వెంటనే కళ్లు మూసుకున్నాడు. తన కరకు కరవాలాన్నీ, బాకునీ కూడా తీసేసి ముందు పెట్టాడు. మరునిమిషంలోనే నాదిర్షా కళ్లు మత్తుగా మూతలు పడడం మొదలయింది. ఒక్క క్షణం తరువాత ఒత్తిగిల్లి పక్కకు తిరిగి పడుకున్నాడు. కొన్ని లిప్తలలోనే అతడు గుర్రు పెట్టడం వినిపించింది. నాదిర్షా నిద్రలోకి జారుకున్న సంగతి రాణులందరికీ అవగతమైంది కూడా. దాదాపు అరగంట గడచిపోయింది. అతడు నిద్రపోతూనే ఉన్నాడు. బేగమ్‌లు మాత్రం గోడకి వేలాడగట్టిన బొమ్మల మాదిరిగా ఎక్కడివారు అక్కడే నిలబడి ఉన్నారు, తలలు వంచుకుని.

‘ఎంత భీకర ఆకారమో కదా! ఆ కళ్లు చూశావా, చింతనిప్పుల్లా ఎంత ఎర్రగా ఉన్నాయో! ఎంత భారీ ఖాయమో! వీడు మానవుడా! రాక్షసుడా!’ బేగమ్‌ల గుంపులో ఏ మూలనో గుసగుసలు.

అప్పుడే హఠాత్తుగా తెరుచుకున్నాయి నాదిర్షా కళ్లు.

ఆ రమణుల సమూహం అలాగే నిలిచి ఉంది ఎదురుగా.

అతడిలో హఠాత్తుగా వచ్చిన ఆ కదలిక చూసిన రాణులు భయంతో దగ్గరగా చేరిన గొర్రెల మందలా ముడుచుకుపోయారు. భయంతో గుండెలు వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఇప్పుడు నాట్యం ఆడమంటాడా? ఏమిటి దారి? ఆ పైవాడే ఈ దుర్మార్గుడి మనసు మార్చాలి. కొందరిలో ఏదో తెగింపు. ప్రాణాలు పోతే పోవచ్చు. అయినా వీడి ఎదుట నాట్యం చేయడమేమిటి? అది అసాధ్యం. అంతకు మించిన అవమానం ఉంటుందా?

అకస్మాత్తుగా నోరు విప్పాడు నాదిర్షా. ”బానిసల్లారా! నేను మీ అందరినీ పిలిచినది పరీక్షించడానికే. నా ఊహ నిజమని తేలిపోయింది. కానీ ఈ మాటని నేను చాలా బాధతోనే అంటున్నాను. ఏ జాతి మహిళల్లో ఆత్మ గౌరవం నశించిపోతుందో, ఆనాడు ఆ జాతి కూడా నశించి పోతుంది. మీలో ఏ కొంతయినా ఆత్మ గౌరవం మిగిలి ఉందా, లేదా పరీక్షిద్దామని అనుకున్నాను. ఇందుకే మీ అందరినీ పిలిపించాను. నేను మిమ్ములను అవమాన పరచాలని అనుకోలేదు. నేను మీరు అనుకున్నంత విలాసజీవిని కానేకాదు. నేను స్రీవ్యామోహంతో వేగిపోతున్న వాడిని కూడా కాదు. నేను మిమ్మల్ని పరీక్షించుదా మనుకున్నాను. కానీ మీలో.. మీలో ఆత్మాభిమానం ఇసుమంతయినా మిగలలేదని బాధపడుతున్నాను. మీరంతా నేను ఇచ్చిన ఆదేశాన్ని మీ పాదాల క్రింది పడేసి నలిపి వేయలేకపోయారెందువల్ల? నా ఆదేశాన్ని పాటించి నా ముందు నిలిచారు. అప్పుడు కూడా మీకు అవకాశం కల్పించాను. ఇంతమంది ఎదుట నేను నిద్రపోయినట్లు నటించాను. మీలో ఎవరైనా ఈ పిడిబాకుని తీసుకుని నా గుండెలలో పొడవలేకపోయారా? నేను పవిత్ర గ్రంథం మీద ప్రమాణం చేసి ఒక విషయం చెబుతున్నాను, వినండి. మీలో ఏ ఒక్కరైనా కత్తి మీద చెయ్యి వేసి ఉంటే నేను బ్రహ్మానందపడేవాడిని. ఆ కోమల హస్తాలకు నా తలను అప్పగించేవాడిని. కాని చిత్రంగా ఈ రోజు తైమూర్‌ వంశంలో జన్మించిన, తన మర్యాదని భంగపరచే వాడి మీద చెయ్యి ఏత్తే సాహసం ఏ ఒక్క మహిళ చేయలేకపోయింది. నేను చెబుతున్నాను వినండి! ఇక ఈ సామ్రాజ్యం ఎక్కువకాలం మనుగడ సాగించదు. వెళ్ళండి! చేతనైతే మీ సామ్రాజ్యాన్ని రక్షించు కోండి. లేకపోతే విలాసాలకి బానిసలై మీరే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళి పోతారు.”

హిందీ మూలం : ప్రేమ్‌చంద్‌

ఆంగ్లానువాదం : డాక్టర్‌ ఎం.జె.వార్సి

తెలుగు అనుసృజన : ‘సత్య’


మున్షీ ప్రేమ్‌చంద్‌

వేయి సంవత్సరాల బానిసత్వంతో కునారిల్లిన భారతజాతికి కలంతో పెద్ద కుదుపును ఇచ్చిన వారు మున్షీ ప్రేమ్‌చంద్‌ (జూలై 31, 1880.. అక్టోబర్‌ 8, 1936). భారతీయ సమాజానికి హేతువాదం అవసరమైనప్పుడు దానిని అందించిన మహనీయుల జాబితాలో ఆయన కూడా ఉంటారు. ఆధునిక సమస్యల ఆధారంగా భారతీయ సాహిత్యానికి వాస్తవిక వాదాన్ని అద్దినవారు ఆయనే. అసలు పేరు ధనపతిరాయ్‌. నవాబ్‌రాయ్‌, ప్రేమ్‌చంద్‌ ఆయన కలం పేర్లు. కాశీకి సమీపంలోని లాంహీలో జన్మించారు. ‘సేవాసదన్‌’,’గోదాన్‌’, ‘రంగభూమి’, ‘నిర్మల’, ‘గబన్‌’ ఆయన రాసిన అద్భుతమైన నవలలు. ‘బేటీ కా ధన్‌’, ‘కఫన్‌’, ‘ఈద్గా’ వంటి గొప్ప కథలు రాశారు. ‘పరీక్ష’ కథను ఆయన 1923, జనవరిలో రాశారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *