పరిష్కారం

పరిష్కారం

కాలు కాలిన పిల్లిలా ఇంట్లోకి, బయటకి తిరగసాగింది సుభద్ర. పొద్దున గొడవ జరిగాక వెళ్ళిన భర్త రాజారావు ఇంకా రాలేదు. ‘సమయం నాలుగు దాటింది. అసలే షుగరు పేషెంటు’ అనుకుంటూ కంగారు పడుతోంది. లోపల అత్తగారు పడుకున్న గదిలోకి తొంగి చూసింది. ఆమె కూడా ఆందోళనగా గుమ్మం వేపే చూస్తున్నారు.

సుభద్రను చూడగానే ‘వచ్చాడానే ?’ అని అడిగారు. ఆవిడ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా విసురుగా తల తిప్పుకుని బెడ్‌రూమ్‌లోకి వెళ్ళి మంచం మీద వాలిపోయింది.

పొద్దున్నే అత్తగారిని చూసే నర్సు ‘నేను ఇక చేయను. ఈ వారం కాగానే వెళ్ళిపోతాను’ అని డిక్లేర్‌ చేసింది. దాంతో గుండె గుభేల్‌మంది సుభద్రకు. ఇంకా చేయడం నా వల్ల కాదు. ఏదన్నా ఆశ్రమంలో చేర్పిద్దామని గొడవ పెట్టుకుంది భర్తతో.

‘ఇంకా వారం ఉంటానంది కదా ! ఈ లోపల ఎవర్నన్నా చూద్దాంలే’ అన్నాడు రాజారావు. కానీ ఈరోజే ఏ సంగతీ తేలాలి అని పట్టుపట్టింది సుభద్ర. దాని ఫలితమే టిఫిన్‌ కూడా తినకుండా రాజారావు బయటకెళ్ళి పోవడం.

‘ఏమే ! సుభద్రా ఫోనన్నా చేశాడంటే రాజా’ లోపల్నుండి కేకేశారు. ఈవిడకి ఏదీ పని చేయకపోయినా నోరు మటుకు బాగా పని చేస్తుందని కోపంగా అనుకుని ‘ఇంకా లేదు’ అని కూర్చున్న చోటు నుండే అరిచి చెప్పింది.

అప్పుడే లోపలికి వస్తున్న అన్నపూర్ణ ‘ఏమైంది అక్కయ్య ఈ రోజు చాలా కోపంగా ఉన్నావు?’ అని అడిగింది.

‘చూడు అన్నపూర్ణ నర్సు ఈ వారం అయ్యాక వెళ్ళి పోతానంటుంది. నేనేమో ఆ తర్వాత ఏదన్నా ఓల్డేజ్‌ ¬మ్‌లో చేర్పిద్దామంటున్నాను. మీ బావగారు ఒప్పుకోవడం లేదు. ‘మా అమ్మ మమ్మల్ని ఎంతో ప్రేమగా, గారాబంగా పెంచింది. ఈ వృద్ధాప్యంలో ఆవిడని ప్రశాంతంగా ఉంచే బాధ్యత మనది’ అంటూ ఏవో తొక్కా, తోటా మాటలు చెప్తారు. ప్రేమగా ఈయనొక్కడినే పెంచారా? మిగతా వాళ్ళకు కూడా బాధ్యత ఉంది కదా ? వాళ్ళెవరూ ఇటువైపు కూడా చూడరు. ఏ ఆరు నెలలకో ఒకసారి వస్తారు. దానికే ఆవిడ పొంగిపోయి ఇంత చాకిరి చేస్తున్న నన్ను వదిలేసి వాళ్ల గురించే చెప్తారు. అయినా ఆయన్ని ప్రేమగా చూసిందేమో కానీ నా మీద అంత ప్రేమ ఏమీ చూపలేదు కదా ! పైపెచ్చు మాటలనడం. అయినా కూడా నేను నా బాధ్యత అనుకునే చేస్తున్నాను. మనిషిని పెడితే ఆ మనిషిని పట్టుమని పదిరోజులుండనివ్వరు. నేను చేయలేను. ఇన్నిసార్లు పనివాళ్లు మానేస్తుంటే కొత్తవాళ్ళను పంపడానికి నర్సింగ్‌ వాళ్ళు ఒప్పుకోవడం లేదు. బయటివాళ్ళను పెట్టుకుందామంటే నమ్మకంగా ఉంటారో, ఉండరో. మా సమస్యలకు కాలమే జవాబు చెప్పాలి’ అంటూ నిట్టూర్చింది సుభద్ర. గాభరాగా ఉందేమో మనిషి కనబడేసరికి మనసులోదంతా బయటికి వచ్చింది.

‘ఎవరే వచ్చింది ?’ మళ్ళీ లోపల్నుండి కేకేసారు.

‘ఈవిడకి అన్నీ కావాలి. చెప్పలేక చస్తున్నాను’ అంటూ చిన్నగా మనసులో అనుకుని ‘అన్నపూర్ణ అత్తయ్యా’ అని లోపలికి వినపడేట్లు చెప్పింది.

‘అన్నపూర్ణ ఇదే పరిస్థితి. అన్ని వివరాలూ కావాలి. రోజంతా మాట్లాడుతూనే ఉంటారు. నన్ను మాట్లాడమంటారు. ఏం ఉంటాయి రోజూ. ఆవిడ నిద్రపోరు. నన్ను నిద్రపోనివ్వరు. పని వాళ్ళను ఉండనివ్వరు’

‘పూర్ణా ఇటు రావే. ఇటొచ్చి కూర్చో !’ పిలిచారు.

‘వెళ్ళు నిన్ను కదలనివ్వరింక. నేను మనకు కాఫీ కలుపుకుని వస్తాను’ అని చెప్పి కిచెన్‌లోకి వెళ్ళింది సుభద్ర.

‘ఈ విధంగా రోజూ ఉంటుంది. కానీ ఈ రోజు ఇంకా కఠినంగా ఉన్నట్లుంది పరిస్థితి’ అనుకుంటూ లోపలికి వెళ్ళింది అన్నపూర్ణ.

సుభద్ర, రాజారావులకు కొడుకు, కూతురు. ఇద్దరూ అమెరికాలో సెటిల్‌ అయ్యారు. వాళ్ళు అక్కడికి వెళ్ళిన కొత్తలోనే ఇద్దరూ వెళ్ళి అమెరికా అంతా చూసి వచ్చారు. అప్పటికింకా పార్వతమ్మ ఓపిగ్గా ఉండి ఒంటరిగా చేసుకోగలిగిన స్థితిలోనే ఉన్నారు. అందుకే ఇద్దరూ కలిసి వెళ్ళి రాగలిగారు. ఆ తర్వాత వృద్ధాప్యం మీద పడి ఆవిడ ఓపిక సన్నగిల్లి పోతూ చివరికి మంచానికి అంకితం అయ్యారు. కానీ విపరీతమైన వాగ్ధాటి, జ్ఞాపక శక్తీ ఉన్నాయి.

ఎప్పుడో పదేళ్ళ క్రితం చిన్న మనవరాలి పురిటికి వెళ్ళి వచ్చింది సుభద్ర. అప్పుడు కూడా ఒక్కతే వెళ్ళింది. తల్లిని ఒంటరిగా వదల్లేక రాజారావు రాననేశాడు. ఆ తర్వాత పిల్లల ఇళ్ళల్లో జరిగిన ఏ ఫంక్షన్‌కూ వెళ్ళలేకపోయారు. అదొక అసంతృప్తి ఉన్నా రాజారావు మనసు నొప్పించ లేకపోయింది. ఇప్పుడు కూడా ఓపిక లేకే ఆశ్రమం అంటోంది అంతే. నిజానికి రాజారావు అన్న, చెల్లి ఇదే ఊళ్ళో ఉంటారు. అవసరాల కన్నా తీసుకెళ్ళొచ్చు వాళ్లమ్మను. కానీ పెద్దకోడలు నేనే పెద్దదాన్నయ్యాను నా వల్ల కాదనేసింది. కూతుర్ని కష్టపెట్టాల్సొస్తుందని ఈవిడ వెళ్ళదు. ఏతావాతా అత్తగార్ని చూసుకునే బాధ్యత సుభద్రకి తప్పలేదు. మంచిగా ఉన్నప్పుడు ఏమనకున్నా కోపం వచ్చినప్పుడు మొగుడిపై అరుస్తుంది. వాళ్ళు కూడా తీసుకెళ్ళొచ్చు కదా అని. దానికి సమాధానం లేదు రాజారావు దగ్గర. అందుకే ‘మా అమ్మనే చూడాలి అనే కూతురు, కొడుకూ, మా అత్తగారికి ఎందుకు చేయాలనే కోడలూ, అల్లుడూ భూమికి భారం’ అని తప్పించుకుంటాడు. లేదా ఇలా బయటికి వెళ్ళిపోతాడు.

గదిలో నుండి రుక్మిణీ కళ్యాణం శ్రావ్యంగా ఆలపిస్తోంది అన్నపూర్ణ. ‘అన్నపూర్ణ కంఠం భలేగా ఉంటుంది’ అనుకుంటూ కాఫీ ట్రేతో గదిలోకి వెళ్ళబోతుంటే రాజారావు ఎదురుపడ్డాడు. భర్తను చూడగానే గొప్ప రిలీఫ్‌ కలిగింది సుభద్రకు.

‘కాఫీ తాగుతారా ? అన్నం పెట్టేదా ?’ అడిగింది.

మౌనంగా ట్రేలోంచి ఒక గ్లాసు తీసుకుని తన రూమ్‌లోకి వెళ్ళిపోయాడు రాజారావు. భర్త వైపు ఒకసారి చూసి అన్నపూర్ణ దగ్గరికి వెళ్ళి ఇద్దరికీ కాఫీ ఇచ్చింది సుభద్ర.

‘బామ్మా ! నేను ఊరెళ్తున్నాను. వారం తర్వాత వస్తాను’ కాఫీ తాగుతూ చెప్పింది అన్నపూర్ణ.

‘అదేంటే ? అన్ని రోజులెందుకు ? నువ్వు రాకపోతే నాకేమీ తోచదు. నువ్వొస్తే సందడి’

‘తొందరలోనే వస్తాలే కొంతమంది పేషెంట్లున్నారు’ అందామె. అన్నపూర్ణ సైకియాట్రిస్ట్‌. రెండు, మూడు నెలల క్రితం పక్క ఫ్లాట్‌లో దిగారు. చాలా తొందరగా వీళ్లకు ప్రేమ పాత్రురాలైంది.

‘అక్కా నేనెళ్ళొస్తాను’ అని చెప్పి వెళ్ళిపోయింది పూర్ణ.

—-  —- —-

‘ఎక్కడికెళ్ళారండి ? భోజనం చేద్దురుగాని రండి’ అంటూ భర్తను పిలిచింది సుభద్ర.

‘ఆకలి లేదు. రాత్రికి తింటాలే’ రాజారావు గొంతులో దుఃఖం కనబడుతోంది. మూసుకున్న కళ్ళ నుండి నీళ్ళు కారుతున్నాయి. ఒక్కసారిగా కంగారు పడిపోయింది సుభద్ర.

‘ఏం జరిగిందండీ ? అయినా ఇక నేనేమీ అనను లెండి. అసలే షుగరు. కొద్దిగా ఉప్మా అన్నా చేస్తాను’

‘ఏమీ వద్దు కూర్చో. ఆశ్రమం గురించి వివరాలు కనుక్కోవడానికి వెళ్ళాను. వచ్చేవారం ఆ అమ్మాయి వెళ్ళగానే జాయిన్‌ చేద్దాం’ కళ్ళ మీది నుంచి చేతులు తీయకుండానే చెప్పాడు. ఎక్కడో నూతిలో ఉండి మాట్లాడుతున్నట్లుగా ఉంది రాజారావు గొంతు.

‘ఏంటీ ? నిజమా !’ ఏదో రిలీఫ్‌ సుభద్ర గొంతులో.

రాజారావు ఏం మాట్లాడలేదు.

ఈ సంతోషంలో రాజారావు ఏమీ తినలేదన్న సంగతే మర్చిపోయిందామె.

—-  —- —-

పార్వతమ్మ చాలా గొడవపెట్టింది వెళ్ళాలే నంటూ, ఉండలేనంటూ. కానీ ఏమీ వినిపించుకో కుండా దింపేసి వచ్చారు. ఇంట్లోకి వస్తూనే పెద్దగా ఏడ్చాడు రాజారావు. అది చూసి సుభద్ర తప్పు చేశానా ? అని ఒక్క క్షణం ఫీలైంది. కానీ చేయాల్సిన సేవ గుర్తొచ్చి గుండె దిటవు పరుచుకుంది.

రోజులు గడుస్తున్నాయి. ఎప్పుడూ ఏమీ మాట్లాడని రాజారావుకి మాటలు ఎక్కువయ్యాయి. ఏదేదో మాట్లాడుతూనే ఉన్నాడు. తన చిన్నప్పటి సంగతులు, తల్లి తమనెంతో గారాబం చేసేదనీ, తాను చేసే అల్లరంతా ఎంత సహనంగా భరించేదో కథలు కథలుగా చెప్తున్నాడు. ఏ తల్లైనా అంతే కదా అనుకుందే కానీ అసలే బాధలో ఉన్నాడని పైకి ఏమీ అనలేదు సుభద్ర.

ఆ రోజు అన్నపూర్ణ వస్తే ఏం చేయాలని సలహా అడిగింది సుభద్ర. భర్త బాధ చూడలేకపోతున్న సుభద్రలోని మంచితనం కనబడింది అన్నపూర్ణకి.

ఆ రోజు ఇద్దరూ తీరిగ్గా కాఫీ తాగుతున్నారు. ‘నీకు చెప్పానా శుభా ! నాకప్పుడు పధ్నాలుగు ఉంటాయేమో. అర్ధరాత్రి నాకు విపరీతమైన డుపులో నొప్పి వచ్చింది. నాన్న లేరు ఊళ్ళో. అంత రాత్రివేళ అమ్మ నన్ను బుజాన వేసుకుని ఆసుపత్రికి తీసుకెళ్తే మొదలు మీకు ట్రీట్‌మెంట్‌ ఇవ్వాలి అన్నాట్ట. ఇంకోసారి ఏమైందో తెలుసా ? విపరీతమైన వాంతులు నాకు. రోజుకెన్ని దుప్పట్లు పాడు చేసేవాణ్ణో లెక్కలేదు. అయినా కొంచెం కూడా విసుక్కోకుండా నన్ను శుభ్రం చేసేది. ఏ తల్లైనా ఇంతే ప్రేమగా చేస్తుంది కదా శుభా. మరి అంత ప్రేమను నేను ఎందుకు తిరిగి ఇవ్వలేక పోతున్నాను. మీ అమ్మ కూడా నిన్ను అలాగే పెంచి ఉంటుంది కదా ! మరి మా అమ్మను నేనెందుకు ఇంత రాక్షసంగా వదిలే శాను ? నేనంత అనారోగ్యంతో అవస్తపడుతుంటే నన్ను వదిలించుకోవాలని అమ్మ చూడలేదు. పైపెచ్చు ప్రపంచంలోని ఆప్యాయతని ఇచ్చింది కదా ?’ తల్లి గురించి చెప్తుంటే రాజారావు వదనం దీప్తివంత మవుతున్నది. తను చేసింది తల్చుకుంటే మ్లానమవుతున్నది.

సుభద్రకి వెర్రెత్తి పోయింది. ‘ఏంటండీ మీరు చావగొడుతున్నారు ముచ్చట్లతో. ‘నాయనా రారా ! కాసేపు వచ్చి నా దగ్గర కూర్చోరా అంటే బలవంతపు బ్రాహ్మణార్థం లాగా ఐదు నిమిషాలు కూర్చునేవారు. మన నలభై ఏళ్ళ సంసార జీవితంలో మీరు ఇంతగా మాట్లాడ్డం ఇప్పుడే. నిజమే ఆ పెద్దావిడకి ఇప్పుడు ఏం కావాలి ? కబుర్లు చెప్పేవాళ్ళు, వెనకటి సంగతులని చెప్పేవాళ్ళు కావాలి. మీరు రాక పోయేసరికి నన్ను సతాయించేవారు. ఈ బుద్ధేదో ముందే ఉంటే ఈ నెమరు వేయడం ఏదో ఆవిడ దగ్గర వేసినట్లైతే మీ ఇద్దరికీ కూడా ఎంత కాలక్షేపం అయ్యేది ? అమ్మా! ఏం చేస్తున్నావు ? మందులేసు కున్నావా ? నిద్ర బాగా పడుతోందా ? అంటూ ఎన్నడైనా దగ్గర కూర్చున్నారా ? బాధ్యత అని ఊరుకుంటే సరిపోదు. అయినా నాకు తెలీక అడుగు తాను. మీరొక్కరే కొడుకా? ఇంతకాలం మీ అన్నా, చెల్లీ ఆర్నెల్లకోసారి ఇక్కడికొచ్చేవారు. ఇప్పుడు మీరు కూడా వాళ్ళతో కలసి ఆశ్రమానికి వెళ్ళరండి. లేదా మీరు కూడా అక్కడే చేరిపోండి’ ఒక్క అరుపు అరిచి అక్కడి నుంచి లేచి వెళ్లిపోయింది సుభద్ర. భార్య వెళ్ళిన వైపే సాలోచనగా చూస్తుండి పోయాడు రాజారావు.

—-  —- —-

తెల్లవారింది. ఇంకా పూర్తిగా మెలకువ రాక దొర్లుతున్న రాజారావు బయట హాల్‌లో నుండి గలగలా కబుర్లు విని బయటికి వచ్చి చూసి ఆశ్చర్యపోయాడు. అన్న, వదిన, చెల్లి కాంత, బావ ప్రకాశం అందరూ ఉన్నారు.

‘ఇదేంటన్నయ్యా ? ఇంత పొద్దున్నే.. ఏంటి విశేషం?’ ‘ఊరికే వచ్చాం రా ! మొహం కడుక్కుని రా. కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం’

‘ఇప్పుడు చెప్పండి అన్నయ్య, బావగార్లు నా మీద దాడి చేసారేంటి ?’

‘ఏం లేదురా అమ్మాయి సుభద్ర ఫోన్‌ చేసింది. అర్జంటుగా ఒకసారి రమ్మని. ఇప్పుడు నువ్వు చెప్పు సుభద్రా ఏంటి సంగతి ? ఎందుకు రమ్మన్నావు?’

‘ఏం లేదు బావగారు అత్తయ్యగారిని ఆశ్రమంలో చేర్చిన దగ్గరి నుండి ఈయన ఏదేదో మాట్లాడు తున్నారు. సరే మీరు కూడా వస్తే మీ అందరూ కలిసి మీ చిన్ననాటి సంగతులు మాట్లాడుకుంటారు కదా అని రమ్మన్నాను. మీరు మాట్లాడుతూ ఉండండి. నేను టిఫిన్‌ చేసుకొస్తాను’

‘నేనూ వస్తాను’ అంది శాంత. ఇద్దరూ వంటింట్లోకి వెళ్ళారు. కొద్దిసేపయ్యేసరికి హాల్‌లో నుండి నవ్వులు, ముచ్చట్లు వినపడుతున్నాయి. ఇళ్లంతా నవ్వులతో సందడిగా ఉంటే చాలా హాయిగా అనిపించింది. ఇంతకు ముందు కూడా వీళ్ళందరూ వచ్చినా ఎలా ఉన్నావు ? అని తల్లిని పలకరించి ఎవరో తరుముతున్నట్లే వెళ్ళిపోయేవారు. ఇప్పు డెందుకీ మార్పు ? ఇక బాధ్యతలు పంచుకోవాల్సి వస్తుందనే భయం లేకనా ? ఏమో ?!

—-  —- —-

అందరూ సాయంత్రం కాఫీలు కూడా తాగి హాయిగా కూర్చున్నారు. ‘బావగారూ ఇలా చెప్పొచ్చో చెప్పుకూడదో నాకు తెలీదు. కానీ ఈ పదిహేను రోజుల నుండి మీ తమ్ముడి పరిస్థితి చూశాక నాకు చాలా భయమేసింది. ఎంత బాధ పడిపోతున్నారో చెప్పలేను. కారణాలు ఏమన్నా కానీ ఇంతకాలం నేను నా బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాననే అనుకుంటున్నాను. అసలు విషయానికి వస్తే మీ తమ్ముడు మీ అమ్మగారిని బాగా మిస్‌ అవుతున్నారు. ఇక్కడ ఉన్నప్పుడు మీ అమ్మగారు ఒంటరి తనాన్ని బాగా ఫీలయ్యేవారు. ఆవిడకి కబుర్లు చెప్పేవాళ్ళు లేక ఆవిడ చెప్పేవి వినేవాళ్ళు లేక నన్ను వేధించేవారు. అదీగాక ఇప్పుడు మనం అంతా కలిసి ఈ రోజంతా సరదాగా గడిపాం. మరి ఆవిడ ఉన్నప్పుడు మనం ఇలా ఎందుకులేము ? అప్పుడు కూడా మనం ఇలా రెగ్యులర్‌గా కలిసి ఈ ఆహ్లాద వాతావరణాన్ని ఆవిడకి చూసే అవకాశాన్ని ఇచ్చినట్లైతే ఈ పరిస్థితి వచ్చేది కాదు. అందుకేనేమో భగవంతుడు ఇది తెలుసుకునే అవకాశాన్ని మనకు ఇచ్చాడు. అదృష్టవంతులం’ చిన్నగా మాట్లాడుతున్నా స్పష్టంగా చెబుతోంది సుభద్ర. ‘అందుకే నేనొకటి నిర్ణయించుకున్నాను’ అని చెప్పింది. అందరూ కుతూహలంగా చూశారు.

‘అత్తయ్యగారిని తిరిగి ఇంటికి తీసుకొద్దామను కుంటున్నాను’ ఒక్క క్షణం పిన్‌డ్రాప్‌ సైలెన్స్‌ అలుము కుంది. రాజారావు మొహం వెలిగిపోయింది.

‘నిజమే మీరు విన్న మాట. అత్తయ్యను తీసుకొస్తాను. కానీ మీరందరూ నాకొక వాగ్దానం చేయాలి. అత్తయ్య ఇంతకుముందు లానే నా దగ్గరే ఉంటారు. మీరంతా కూడా ఎప్పుడు వీలైతే అప్పుడు రండి. ఆవిడ చుట్టూ కూర్చోండి. ఆవిడ చెప్పే కబుర్లు వినండి. మీ బాల్యంలోకి వెళ్ళండి. మీరు కూడా మీకు గుర్తొచ్చినవి చెప్పండి. అత్తయ్యగారు తనకు కబుర్లు చెప్పేవాళ్లు లేక తను చెప్పేవి వినే వాళ్లు లేకే అల్లాడి పోయేవారు. అయినా ఒకప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడమంత మంచి టానిక్‌ ఇంకోటి లేదు. నేను అర్థం చేసుకున్నంత వరకు ఆవిడకు, నాకు ఇదొక్కటే ప్రాబ్లమ్‌. సంతోషం సగం బలం. ఆ బలాన్ని ఆవిడకి ఇద్దాం. పనుల్లో షేరింగ్‌ అక్కర్లేదు. మాటలు షేర్‌ చేసుకుందాం’ అంటూ చివర్లో చురక వేసింది.

రాజారావు మొహం పువ్వులా విచ్చుకుంది. ‘నేను పొద్దున్నే ఫోన్‌ చేసి చెప్పాను. అత్తయ్యగారు రెడీగా ఉంటారు. ఇప్పుడే వెళ్ళి తీసుకొద్దాం’ అంది సుభద్ర కమాండింగ్‌గా.

—-  —- —-

‘బావగారు అక్కయ్య చాలామంచిది. పెరిగే వయసు, అలసటను తట్టుకోలేకే అలా అన్నట్టుంది. ముందు మీరు బామ్మగారిని ఆశ్రమంలో చేర్పించండి. మీ బాధంతా అక్కయ్యతో చెప్పుకోండి. అప్పుడు ఫలితం చూడండి’ అని చెప్పింది అన్నపూర్ణ తనను సలహా అడిగిన రాజారావుతో.

‘అక్కయ్య ! బావగారు ఈ విధంగానే కొన్ని రోజులున్నారంటే డిప్రెషన్‌లోకి వెళ్ళి నేనే ట్రీట్‌మెంట్‌ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు నువ్వు ఏది ముఖ్యం అనేది ఆలోచించుకోవాలి. బావగారు ముఖ్యమను కుంటే వెళ్ళి అర్జంటుగా బామ్మగార్ని తీసుకురా. సంతోషం పంచుకుంటే పెరుగుతుంది. పంచుకుంటే అలసట తగ్గుతుంది. షేరింగ్‌ అనేది ఎప్పుడైనా ముఖ్యమే. అందుకని మీ వాళ్ళందరినీ పిలిచి పరిస్థితి వివరించు. ఆ తర్వాత ఎలా ఉండాలనేది నువ్వే నిర్ణయించుకో’ అంది’ అని సుభద్రకు కూడా సలహా ఇచ్చింది అన్నపూర్ణ.

చుట్టూ కూర్చొని తనతో మాట్లాడుతూ సందడి చేస్తున్న కొడుకులూ, కోడళ్ళూ కూతురు, అల్లుడు, మనవలను చూస్తుంటే పార్వతమ్మకి ఎంతో బలం వచ్చి పదేళ్ళు తగ్గినట్లుగా ఉంది. ఆ సందడిని చూస్తూ రాజారావు, సుభద్ర అన్నపూర్ణకి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నారు తమకో చక్కటి పరిష్కారం చెప్పినందుకు.

– త్రినయిని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *