పతకాల వీరుడు పంకజ్‌ !

పతకాల వీరుడు పంకజ్‌ !

భారత్‌కు విశ్వ విజేతలను, డజన్ల కొద్దీ ప్రపంచ టైటిల్స్‌ను అందించిన ఏకైక క్రీడ బిలియర్డ్స్‌ అండ్‌ స్నూకర్‌లో 32 ఏళ్ల పంకజ్‌ అద్వానీ ఆకాశమే హద్దుగా దూసుకు పోతున్నాడు. గత 22 సంవత్సరాలుగా క్యూ స్పోర్టే జీవితంగా మలుచుకొన్న పంకజ్‌ అద్వానీ ఇటు బిలియర్డ్స్‌లో మాత్రమే కాదు అటు స్నూకర్‌ గేమ్‌లోనూ ప్రపంచ విజేతగా చరిత్ర సష్టించాడు.

భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే భారత్‌లో క్రీడారంగం సైతం ఎంతో విలక్షణంగా కనిపిస్తుంది. జాతీయ క్రీడ హాకీతో పాటు కుస్తీ, విలువిద్య, క్రికెట్‌, బ్యాడ్మింటన్‌, షూటింగ్‌, బాక్సింగ్‌ లాంటి ఎన్నో క్రీడలున్నా, దేశానికి అత్యధిక ప్రపంచ టైటిల్స్‌, బంగారు పతకాలు అందించిన క్రీడ బిలియర్డ్స్‌ అండ్‌ స్నూకర్‌ మాత్రమే.

విల్సన్‌ జోన్స్‌ నుంచి పంకజ్‌ అద్వానీ వరకు

ఇన్‌డోర్‌ గేమ్స్‌లో రాయల్‌ గేమ్‌గా పేరుపొందిన బిలియర్డ్స్‌ అండ్‌ స్నూకర్‌కు ప్రపంచ ప్రధాన క్రీడల్లో మంచి గుర్తింపు ఉంది. ఇంగ్లండ్‌, భారత్‌, సింగపూర్‌,

చైనా, మాల్టా, పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌, కెనడా లాంటి దేశాల్లో విశేష ఆదరణ పొందుతున్న ఈ క్యూ స్పోర్ట్‌లో అత్యధిక ప్రపంచ టైటిల్స్‌ గెలుచుకొన్న దేశం ఏదంటే భారత్‌ మాత్రమే అన్న సమాధానం వినిపిస్తుంది.

ప్రపంచ వ్యాప్తంగా 90 దేశాలలో 10 కోట్ల 20 లక్షల మంది పురుషులు, మహిళలు బిలియర్డ్స్‌, స్నూకర్‌ క్రీడలు ఆడుతున్నారు. ఈ ఆటలకు 45 కోట్ల మంది అభిమానులున్నారు.

స్వాతంత్య్రానికి పూర్వం నుంచే మనదేశంలో బిలియర్డ్స్‌ అండ్‌ స్నూకర్‌ క్రీడ తన ఉనికిని చాటుకొంటూ వచ్చింది. 1920లో భారత క్రీడారంగంలోకి దూసుకొచ్చిన ఈ బిలియర్డ్స్‌ అండ్‌ స్నూకర్‌ క్రీడలు విల్సన్‌ జోన్స్‌, మైకేల్‌ పెరెరా, గీత్‌ సేథీ లాంటి తిరుగులేని మొనగాళ్లను అందించాయి.

అశోక్‌ శాండిల్యా, సుభాష్‌ అగర్వాల్‌ లాంటి ఛాంపియన్‌ క్రీడాకారులు వచ్చినా, బెంగళూరు సంచలనం పంకజ్‌ అద్వానీని మించిన మొనగాడు మరొకరు రాలేదు. పదేళ్ల చిరు ప్రాయంలోనే క్యూ స్పోర్ట్‌లో అడుగుపెట్టిన పంకజ్‌ అద్వానీ 12 ఏళ్ల వయసు నుంచే టైటిళ్ల వేట మొదలుపెట్టాడు.

తొలి ప్రపంచ టైటిల్‌

చిన్నవయసు నుంచే బిలియర్డ్స్‌ అండ్‌ స్నూకర్‌ క్రీడల్లో పాల్గొంటూ వచ్చిన పంకజ్‌ అద్వానీ 2003లో ప్రపంచ స్నూకర్‌ టైటిల్‌ సాధించడం ద్వారా తన జైత్రయాత్ర ప్రారంభించాడు.

2003 నుంచి 2017 మధ్య 14 సంవత్సరాల కాలంలో మొత్తం 17 ప్రపంచ టైటిల్స్‌ సాధించి తనకు తానే సాటిగా నిలిచాడు. భారత క్రీడా చరిత్రలోనే అత్యధిక ప్రపంచ టైటిల్స్‌ సాధించిన ఏకైక క్రీడాకారుడిగా రికార్డుల్లో చోటు సంపా దించాడు. బిలియర్డ్స్‌ 150 పాయింట్ల ఫార్మాట్‌తో పాటు టైమ్‌ ఫార్మాట్‌ విభాగాలలోనూ పంకజ్‌ అద్వానీ తిరుగులేని మొనగాడుగా గుర్తింపు పొందాడు.

2005, 2008, 2014, 2016, 2017 సంవత్సరాలలో పంకజ్‌ అద్వానీ 150 పాయింట్ల ఫార్మాట్లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలవడమే కాదు, టైమ్‌ ఫార్మాట్లోనూ 2005, 2007, 2008, 2009, 2012, 2014, 2015 సంవత్సరాలలో విశ్వ విజేతగా నిలిచాడు.

స్నూకర్‌ విభాగంలో 2003, 2015 సంవత్సరాలలో విశ్వ విజేతగా నిలిచిన పంకజ్‌ ప్రపంచ సిక్స్‌ రెడ్‌ స్నూకర్‌ టైటిల్స్‌ను 2014, 2015 సంవత్సరాలలో సాధించాడు. 2014లో ప్రపంచ టీమ్‌ బిలియర్డ్స్‌ టైటిల్‌ను సైతం భారత్‌కు అందించాడు.

అంతేకాదు పంకజ్‌ 29 సార్లు జాతీయ ఛాంపియన్‌గా నిలవడంతో పాటు 2006 దోహా ఆసియా క్రీడలు, 2010 గాంగ్జు ఆసియా క్రీడల్లో బంగారు పతకాలు సాధించాడు. 22 సంవత్సరాల తన క్రీడాజీవితంలో పంకజ్‌ అద్వానీ 55 బంగారు పతకాలు, 29 నేషనల్‌ టైటిల్స్‌, 17 ప్రపంచ టైటిల్స్‌ సాధించి, భారత్‌లో మరే క్రీడాకారుడూ సాధించని ఘనతను సొంతం చేసుకొన్నాడు.

అవార్డులే అవార్డులు !

క్రికెట్టే పిచ్చిగా భావించే మనదేశంలో బిలియర్డ్స్‌ అండ్‌ స్నూకర్‌ క్రీడల ద్వారా పంకజ్‌ అద్వానీ ప్రధాన క్రీడా, పౌరపురస్కారాలు అందుకొన్నాడు. 2004లో అర్జున అవార్డు, 2005-06లో దేశ అత్యున్నత క్రీడాపురస్కారం రాజీవ్‌ గాంధీ ఖేల్‌ రత్న, 2007లో ఏకలవ్య పురస్కారం, 2009లో పద్మశ్రీ పురస్కారం ఒకదాని వెనుక ఒకటిగా వచ్చి పంకజ్‌ అద్వానీని వరించాయి.

క్రికెట్లో సచిన్‌ టెండుల్కర్‌, బ్యాడ్మింటన్లో ప్రకాశ్‌ పడుకోన్‌, టెన్నిస్‌లో లియాండర్‌ పేస్‌, సానియా మీర్జా, షూటింగ్‌లో అభినవ్‌ బింద్రా, కుస్తీలో సుశీల్‌ కుమార్‌, బాక్సింగ్‌లో మేరీ కోమ్‌ ఎంతో…! క్యూ స్పోర్ట్‌లో పంకజ్‌ అద్వానీ అంతే ఘనుడని ప్రత్యేకంగా చెప్పాలా మరీ…!

– క్రీడా కృష్ణ , 84668 64969

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *