నూతన పథంలో ‘భరత్‌ అనే నేను’

నూతన పథంలో ‘భరత్‌ అనే నేను’

సక్సెస్‌ఫుల్‌ కాంబినేషన్‌కు ఊహించని క్రేజ్‌ వస్తుంటుంది. తాజాగా ఆ క్రేజ్‌నే నిర్మాత డివివి దానయ్య చక్కగా సొమ్ము చేసుకుంటున్నారు. హీరో మహేశ్‌బాబు, డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో గతంలో ‘శ్రీమంతుడు’ అనే సూపర్‌ హిట్‌ మూవీ వచ్చింది. ఆ తర్వాత మహేశ్‌ నటించిన ‘బ్రహ్మోత్సవం’, ‘స్పైడర్‌’ చిత్రాలు పరాజయం పాలయ్యాయి. ఈ నేపథ్యంలో మరోసారి మహేశ్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో ‘భరత్‌ అనే నేను’ సినిమా చేశాడు. దీనిని డివివి దానయ్య నిర్మించారు. ఓ హిట్‌ కాంబినేషన్‌తో సినిమా చేయడం దానయ్యకు కలిసొచ్చింది. ‘భరత్‌ అనే నేను’ సినిమా కొత్త రికార్డులను సృష్టిస్తోంది.

పూర్తి స్థాయి రాజకీయ నేపథ్యంలో సినిమాలు తెలుగులో తక్కువగా వచ్చాయని చెప్పాలి. ఏడాదికి ఒకటో రెండో సినిమాలు ఇలా వస్తుంటాయి. అయితే అగ్ర కథానాయకులు నటించే సినిమాలు చాలా చాలా అరుదు. అందువల్ల ఓ స్టార్‌ హీరో, ఓ భారీ బడ్జెట్‌ చిత్రంలో ముఖ్యమంత్రి పాత్ర పోషిస్తున్నాడనగానే రకరకాల ప్రశ్నలు ఉదయిస్తాయి. ఆ హీరో ఏ పార్టీని సపోర్ట్‌ చేయబోతున్నాడు ? ఆయన పోషించే సి.ఎం. పాత్ర ఎవరిని గుర్తు చేసేలా ఉంటుందనే సందేహాలు రావడం సహజం. అయితే ‘భరత్‌ అనే నేను’ అలా ఒకరిని ప్రత్యేకంగా పోల్చుకునేలా లేదు. కొద్దిగా కొత్తగా, నూతన పథంలో సాగిపోయిందీ సినిమా.

ఇక కథలోకి వెళితే… భరత్‌ రామ్‌ (మహేశ్‌ బాబు) తండ్రి రాఘవ (శరత్‌ కుమార్‌) తన స్నేహితుడు వరదరాజులు (ప్రకాశ్‌ రాజ్‌)తో కలిసి ఓ రాజకీయ పార్టీని స్థాపిస్తాడు. ఆ పార్టీ వ్యవహారంలో పడి భార్య (ఆమని), పిల్లాడిని పెద్దంతగా పట్టించుకోడు. భరత్‌ చిన్నప్పుడే అతని తల్లి అనారోగ్యంతో హఠాన్మరణం చెందుతుంది. దాంతో పిల్లాడి కోసమే రాఘవ మరో పెళ్ళి చేసుకుంటాడు. కానీ ఆ తల్లీ (సితార), కొడుకులకు మధ్య పెద్దంత సఖ్యత ఉండదు. దాంతో భరత్‌ కోరిక మేరకు అతన్ని తన దగ్గరి బంధువు దగ్గరికి లండన్‌ పంపుతాడు. అక్కడే భరత్‌ పెరిగి పెద్దవాడవుతాడు. ఇక్కడ అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో రాఘవ సి.ఎం. అవుతాడు. అయితే అతను కూడా హఠాన్మరణం చెందడంతో భరత్‌ లండన్‌ నుండి ఇండియాకు వస్తాడు. పార్టీ అధ్యక్షుడైన వరదరాజులుకు సి.ఎం. పదవిపై సుముఖత ఉండదు. దాంతో సి.ఎం. కుర్చీ కోసం పార్టీ ఎమ్మేల్యేలు రెండు గ్రూపులుగా విడిపోతారు. పార్టీ రెండుగా చీలిపోతుందని భయపడి, మధ్యేమార్గంగా భరత్‌ను సి.ఎం. కుర్చీలో కూర్చోపెడతాడు వరదరాజులు. ఇచ్చిన మాట నిలబెట్టుకోని వాడు మనిషే కాదని చిన్నప్పుడు తల్లి చెప్పిన మాటను మనసా, వాచా, కర్మణా పాటించే భరత్‌ సి.ఎం. అనే బాధ్యతను చాలా సీరియస్‌గా తీసుకుంటాడు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టు కోవడానికి ఎంత వరకైనా వెళతాడు. ఆ క్రమంలో అతన్ని సి.ఎం. చేసిన వరదరాజులుతోనూ గొడవలు వస్తాయి. అయినా వెనుతిరగడు. ఇదే సమయంలో వసుమతి (కియారా అద్వానీ) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు భరత్‌. రాజకీయంగా భరత్‌ను ఎదుర్కోలేని అధికార, ప్రతిపక్ష నేతలు ఈ ప్రేమను అడ్డం పెట్టుకుని రాజకీయ క్రీడ మొదలెడతారు. దాంతో భరత్‌ సి.ఎం. పదవికి రాజీనామా చేస్తాడు. తిరిగి అతను ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు, వసుమతి ప్రేమను ఎలా గెలుచుకున్నాడు అన్నది మిగతా కథ.

ఈ సినిమా చూస్తున్నంత సేపు మనకు ఇదే నేపథ్యంలో వచ్చిన ‘ఒకే ఒక్కడు’, ‘లీడర్‌’ సినిమాలు గుర్తొస్తాయి. అయితే ఇందులో నటించింది స్టార్‌ హీరో కావడంతో ఎన్నో మైనస్‌ పాయింట్స్‌ ప్రేక్షకుల దృష్టిలో పడకుండా కొట్టుకుపోయాయి. ఓ సాధారణ వ్యక్తి సి.ఎం.గా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆరు నెలలలోపు అతను ఎక్కడో ఒక చోట నుండి ఎమ్మెల్యేగా గెలుపొందాలి. కానీ ఈ సినిమాలో భరత్‌ తాను ఎనిమిది మాసాలు సి.ఎం.గా ఉన్నానని ఓ సందర్భంలో చెబుతాడు. కానీ మధ్యలో ఎక్కడా ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయాన్నే దర్శకుడు చూపించలేదు. ఇక వసుమతిని ఎంతో గాఢంగా ప్రేమించి, ఆమెను వివాహం కూడా చేసుకోవాలను కున్న భరత్‌ తమ ప్రేమాయణం గురించి మీడియాలో రకరకాలుగా వార్తలు వచ్చే సరికి దానికి ఖిన్నుడై ఏకంగా సి.ఎం. పదవికి రాజీనామా చేయడంలో ఔచిత్యర కనిపించదు. ఇలాంటి అంశాలు సినిమాలో అనేకం ఉన్నాయి. ప్రజల మేలు కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమని చెప్పినప్పుడు, పారిశ్రామికవేత్తలను, కళంకిత రాజకీయ నేతలను సైతం తాను ఉపేక్షించనని చెప్పినప్పుడూ అతనిలో మనకో మోది కనిపిస్తాడు. అలానే కొన్ని సన్నివేశాల్లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డి, ప్రస్తుత సి.ఎం. చంద్రబాబు ఛాయలూ కనిపిస్తాయి. కమర్షియల్‌ అంశాల కంటే కూడా తాను అనుకున్న కథను అనుకున్న విధంగా తెరమీద చూపించడానికే కొరటాల శివ ప్రాధాన్యం ఇచ్చారు. అది హర్షించదగ్గ విషయం.

నటీనటుల విషయానికి వస్తే సినిమాలో మనకు బలమైన ప్రతినాయకులు కనిపించరు. ప్రకాశ్‌రాజ్‌, దేవరాజు, రవిశంకర్‌ తదితరుల పాత్రలన్నీ చాలా సాదాసీదాగా ఉన్నాయి. బాలీవుడ్‌ నటీమణి కియారా అద్వానీ బాగానే నటించింది. మహేశ్‌ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది ! అతను ఏ పాత్రనైనా ప్రాణం పెట్టి చేస్తాడు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం, రవి కె చంద్రన్‌, తిరు సినిమాటోగ్రఫీ సినిమాను నిలబెట్టాయి. కథాగమనంలో ఏమంత మెరుపులు లేకపోయినా రొటీన్‌కు భిన్నంగా, అంతఃకరణ శుద్ధితో తీసిన సినిమా కావడంతో ‘భరత్‌ అనే నేను’ జనాదరణ పొందుతోంది.

– చంద్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *