నూతన అనుభూతి కలిగించే ‘సింధూ దర్శన్‌ యాత్ర’

నూతన అనుభూతి కలిగించే ‘సింధూ దర్శన్‌ యాత్ర’

గత 22 సంవత్సరాలుగా ‘సింధూ దర్శన్‌ యాత్ర సమితి’ ఆధ్వర్యంలో దేశంలోని అన్ని ప్రాంతాల్లోని హిందువుల్లో ‘సింధూ నది, లడాక్‌, హిమాలయాలలోని భూభాగం మనదే’ అనే భావనను కలిగించడానికి ప్రతి సంవత్సరం నాలుగు రోజుల పాటు ‘సింధూ ఉత్సవాలు’ నిర్వహిస్తున్నారు. ఈ యాత్రలో ప్రతి సంత్సరం దాదాపు 2 వేల మంది హిందువులు, స్వామీజీలు పాల్గొంటున్నారు.

సింధూ దర్శన్‌ యాత్ర సమితిని 1997 జూన్‌ 23న ఎల్‌. కె. అడ్వానీ ప్రారంభించారు. దీనికి ఇంద్రేశ్‌కుమార్‌ మార్గదర్శనం చేస్తున్నారు. ఈ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి సింధూ నదిని దర్శించుకొని, అందులో పవిత్ర స్నానాలు ఆచరించడానికి వస్తున్న భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

ఈ వ్యాసకర్త 17 మంది సభ్యుల బృందంతో కలిసి ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి భాగ్యనగర్‌ నుండి బయల్దేరి వెళ్లారు. ఈ సంవత్సరం ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా ఆర్‌.ఎస్‌.ఎస్‌. సర్‌ కార్యవాహ భయ్యాజీ జోషి రెండు రోజుల పాటు పాల్గొని అందరికి ప్రేరణగా నిలిచారు. ఈ యాత్ర ప్రతి సంవత్సరం జూన్‌ 23 నుండి 26 వరకు నిర్వహిస్తారు.

లడాక్‌ భూభాగం సముద్ర మట్టానికి 11,500 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ రాత్రి ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్‌ నుండి 6 డిగ్రీల సెల్సియస్‌ మధ్యలో ఉంటాయి. పగటి పూట 14 డిగ్రీల నుండి 20 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉంటాయి. ఇక్కడ వాతావరణంలో ఆక్సిజన్‌ తక్కువగా నైట్రోజన్‌ ఎక్కువగా ఉంటుంది.

జూన్‌ 23న సాయంత్రం 4 గంటలకు జరిగిన ఉద్ఘాటన కార్యక్రమంలో పంజాబ్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మణిపూర్‌ రాష్ట్రాల నుండి వచ్చిన కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలతో దేశభక్తి పూరిత వాతావరణం నిర్మాణమైంది.

ఇంద్రేశ్‌ మాట్లాడుతూ లడాక్‌ భూభాగం, చారిత్రక నేపథ్యం, దాని చుట్టూ ఉన్న దర్శనీయ స్థలాలు, సింధూ నది ప్రాముఖ్యం, నాలుగు రోజుల పాటు పర్యాటకుల కర్తవ్యం, లడాక్‌ చారిత్రక పురుషుడు ‘ఝాలేనాథ్‌’ గురించి.. పాండవుల క్రీడా స్థలాలు, శివుడు తాండవం చేసిన ప్రదేశం గురించి వివరించారు.

వ్యాసకర్త బృందం మరునాడు ఉదయం సింధూ నదిలో స్నానమాచరించి, చుట్టూ ఉన్న దర్శనీయ స్థలాలు చూశారు. వాటిలో ముఖ్యమైనవి

1. పత్తర్‌ సాహెబ్‌ గురు ద్వారా :

ఇది లేహ్‌ నుండి కార్గిల్‌ వెళ్ళే దారిలో ఉంటుంది. ఇక్కడ పెద్ద శిలవద్ద సిక్కు మత స్థాపకుడు గురునానక్‌ ధ్యానం చేసి జ్ఞానోదయం పొందాడని ప్రతీతి. దానికి చిహ్నంగా ఇక్కడ ఒక పెద్ద గురు ద్వారా నిర్మించారు. ఇక్కడ ప్రతిరోజు లంగరు (భోజన) వ్యవస్థ ఉంటుంది.

2. సింధూ సంగమం :

సింధూ నది, జంస్కార్‌ నది ఈ ప్రదేశంలోనే కలుస్తాయి. సింధూ నది నీలం రంగులో ఉంటుంది. జంస్కార్‌ నది మట్టిరంగులో ఉంటుంది. ఈ రెండు నదులు కలిసి భారతదేశంలో కొంత ప్రాంతంలో ప్రవహించిన తరువాత పాకిస్తాన్‌లో ప్రవేశిస్తుంది. ఈ సంగమం ప్రపంచంలోనే అతి ఎత్తైన సంగమంగా చెబుతారు. జంస్కార్‌ నదిలో ‘రివర్‌ రాఫ్టింగ్‌’ చాలా ప్రాముఖ్యమైనది.

3. హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ (Hall of Fame) :

ఇక్కడ దేశ రక్షణలో తమ ప్రాణాలను పణంగా పెట్టిన సైనిక సోదరుల వీరోచిత పోరాట గాథలు, అమరులైన వారి చిహ్నాలు, వారు ఉపయోగించిన ఆయుధాలు, వారికి లభించిన సత్కారాలు మొదలైనవి చిత్రమాలికల రూపంలో అద్భుతంగా ప్రదర్శించారు. ఇక్కడ అమర వీరుల స్థూపం కూడా ఉంది. ప్రతిరోజు రాత్రి 7గం||లకు ‘సైనిక సంగీత ప్రదర్శన’ ఉంటుంది. తదుపరి Sound and Light show కూడా ఉంటుంది.

4. అయస్కాంత పర్వతం (మ్యాగ్నటిక్‌ హిల్‌) :

హిమాలయ పర్వత శ్రేణులలో మనకు అనేక అద్భుతాలు కనిపిస్తాయి. వాటిలో ఈ అయస్కాంత పర్వతం ఒకటి. ఇది లేహ్‌ నుండి 30 కి.మీ. దూరంలో ఉంటుంది. ఇది సముద్ర మట్టానికి 14,000 అడుగుల ఎత్తులో కలదు. దీని అయస్కాంత ప్రభావం దాదాపు 2 పర్లాంగుల దూరం నుండి కనబడుతుంది. అక్కడ ఒక వాహనాన్ని నిలిపితే అది నెమ్మదిగా తనవైపు ఆకర్షిస్తున్న దృశ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ప్రదేశంలో విమానాలు ఎగరడం నిషేధించారు.

5. పెన్‌ గంగ లేక్‌ :

ఇది లేహ్‌ నుండి 130 కి.మీ. దూరంలో ఉంటుంది. ఇది ఉప్పు నీటి సరస్సు. దీని పొడవు 134 కిలోమీటర్లు, వెడల్పు దాదాపు 700 చ.కి.మీ. ఉంటుంది. ఇది సముద్ర మట్టానికి 14,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. ప్రస్తుతం 60 శాతం సరస్సు చైనా ఆధీనంలో ఉంది. ఇక్కడికి వెళ్ళాలంటే అనుమతి పత్రం తప్పనిసరి.

6. ఖార్‌ దుంగ్లా :

ప్రపంచంలోనే ఎత్తైన రోడ్డు మార్గం. ఇది 18,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. అంటే మానస సరోవరం కంటే దాదాపు 3000 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది లేహ్‌ నుండి 39 కి.మీ. దూరంలో ఉంటుంది. ఖార్‌ దుంగ్లా వెళ్లే దారిలో ఎత్తైన హిమగిరులు దాటుకుంటూ వెళ్తున్నప్పుడు మేఘాలు తాకుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇది పూర్తిగా మంచుతో నిండిపోయి ఉంటుంది.

సింధూ దర్శన్‌ యాత్ర సమితి వారు యాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి గుర్తుగా ఒక మెమొంటో ఇచ్చారు. ఈ యాత్రలో పాల్గొంటే ప్రతి ఒక్కరికి కచ్ఛితంగా ఒక నూతన అనుభూతి కలుగుతుంది.

– వి. మల్లికార్జున్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *