ధోనీకి పద్మభూషణ్‌ అందని ద్రాక్షేనా?

ధోనీకి పద్మభూషణ్‌ అందని ద్రాక్షేనా?

భారత క్రికెట్‌కు గత 13 సంవత్సరాలుగా అసమాన సేవలు అందిస్తున్న జార్ఖండ్‌ డైనమైట్‌ మహేంద్రసింగ్‌ ధోనీకి అవార్డులు, రివార్డులు ఏమాత్రం కొత్త కాదు. క్రీడారంగంలో పలు అత్యుత్తమ పురస్కారాలు అందుకొన్న ధోనీని దేశ మూడో అత్యున్నత పౌరపురస్కారం పద్మ భూషణ్‌కు బీసీసీఐ సిఫారసు చేసింది.

మూడోసారి

భారత క్రికెట్‌ చరిత్రను ఓసారి తిరగేస్తే ముంబై, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్‌ నగరాల నుంచి వచ్చిన సచిన్‌, గవాస్కర్‌, గుండప్ప విశ్వనాథ్‌, రాహుల్‌ ద్రావిడ్‌, అనీల్‌ కుంబ్లే, వెంకట్రాఘవన్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, విరాట్‌ కొహ్లీ, సౌరవ్‌ గంగూలీ లాంటి దిగ్గజ క్రికెటర్లు మనకు ఎందరో కనిపిస్తారు. క్రికెట్‌ చరిత్ర, వాతావరణం, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సదుపాయాలు ఏమాత్రం లేని జార్ఖండ్‌ లాంటి వెనుకబడిన, మారుమూల రాష్ట్రం నుంచి భారత క్రికెట్లోకి దూసుకొచ్చిన వికెట్‌ కీపర్‌ అండ్‌ బ్యాట్స్‌మన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ. భారత క్రికెట్‌ పుస్తకంలో ఈయనకు ఓ ప్రత్యేక అధ్యాయమే ఉండి తీరుతుంది. సౌరవ్‌ గంగూలీ, రాహుల్‌ ద్రావిడ్‌, అనీల్‌ కుంబ్లే, సచిన్‌ టెండుల్కర్‌ లాంటి బహుళ జనాదరణ పొందిన క్రికెటర్లతో సమానంగా ధోనికి ఆ స్థానాన్ని దక్కించుకున్నాడు.

జులపాల జుట్టుతో

రాంచీ ర్యాంబో గా భారత క్రికెట్లోకి 2004లో దూసుకొచ్చిన మహేంద్రసింగ్‌ ధోనీ క్రికెట్‌ మూడు ఫార్మాట్లు సాంప్రదాయ టెస్ట్‌ క్రికెట్‌, ఇన్‌ స్టంట్‌ వన్డే క్రికెట్‌, ధూమ్‌ ధామ్‌ టీ-20 క్రికెట్‌లలో భారత అత్యంత విజయవంతమైన వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌ మన్‌గా, విజయాలు, ప్రపంచ టైటిల్స్‌ సాధించిన కెప్టెన్‌గా తనకు తానే సాటిగా నిలిచాడు.అన్ని ఫార్మాట్లలోనూ టీమిండియాను మేటి జట్టుగా నిలిపిన ఘనత ధోనీకి మాత్రమే సొంతం. ధోనీ నాయకత్వం లోనే టీమిండియా టెస్ట్‌ క్రికెట్‌లో నంబర్‌ వన్‌ స్థానం సంపాదించింది. వన్డే, టీ-20 విభాగాలలో మూడు రకాల ఐసీసీ టోర్నీల్లో టీమిండియాను విజేతగా నిలిపిన మొనగాడు కూడా ధోనీ మాత్రమే. 2007 టీ-20 ప్రపంచకప్‌ , 2011 వన్డే ప్రపంచకప్‌, ఐసీసీ మినీ ప్రపంచకప్‌ ట్రోఫీలు ధోనీ నాయకత్వం లోనే భారత్‌ అందుకొంది.

కూల్‌ కెప్టెన్‌

ప్రపంచంలోని అత్యుత్తమ కెప్టెన్లలో ధోనీ మొదటి వరుసలో ఉంటాడనడంలో సందేహమే లేదు. జట్టులో ఒకడిగా కాకుండా జట్టును ముందుండి నడిపించే మొనగాడిగా నిలిచాడు. మ్యాచ్‌ను గొప్పగా ముగించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. 90 టెస్ట్‌ మ్యాచ్‌ల్లో ఆరు శతకాలు, 33 అర్థశతకాలు, 256 క్యాచ్‌లు, 38 స్టంపౌట్లు సాధించిన ధోనీ, వన్డే, టీ-20 ఫార్మాట్లలో తన హవా కొనసాగిస్తూనే వచ్చాడు. ఆస్ట్రేలియాతో ఇండోర్‌లో ముగిసిన మూడో వన్డే వరకూ 304 మ్యాచ్‌లు ఆడిన ధోనీ 10 సెంచరీలు, 66 హాఫ్‌ సెంచరీలతో 9 వేల 745 పరుగులు సాధించాడు. వికెట్‌ కీపర్‌గా 286 క్యాచ్‌లు, 103 స్టంపింగ్స్‌ సాధించాడు. వన్డే క్రికెట్‌ చరిత్రలో అత్యధికంగా 103 స్టంపింగ్స్‌ సాధించిన తొలి, ఏకైక వికెట్‌ కీపర్‌ ధోనీ మాత్రమే. టీ-20 క్రికెట్లో ఇటీవలి శ్రీలంక మ్యాచ్‌ వరకూ 78 మ్యాచ్‌లు ఆడిన ధోనీ 1212 పరుగులు, 43 క్యాచ్‌లు, 23 స్టంపింగ్స్‌ సాధించాడు. 300కు పైగా వన్డేలు ఆడిన ఆరో భారత ఆరో క్రికెటర్‌గా, క్రికెట్‌ మూడు ఫార్మాట్లలోనూ శత, అర్థ శతకాలు సాధించిన వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌గా రికార్డుల్లో చోటు సంపాదించాడు.

భారత దేశవాళీ టీ-20 క్రికెట్‌ ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిపాడు. ధోనీ సారథ్యంలోనే చెన్నై కింగ్స్‌ 2010, 2011 సీజన్లలో ఐపీఎల్‌, 2010, 2014 సీజన్లో ఛాంపియన్స్‌ లీగ్‌ టీ-20 ట్రోఫీలు అందుకొంది.

అవార్డులే అవార్డులు

రాంచీలోని ఓ దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన ధోనీ 2008, 2009 సీజన్లలో ఐసీసీ అత్యుత్తమ వన్డే క్రికెటర్‌ అవార్డు సంపాదించాడు. ఇంతకు ముందే క్రీడారంగంలో అత్యున్నత పురస్కారాలు అర్జున, రాజీవ్‌ గాంధీ ఖేల్‌రత్న అవార్డులు అందుకొన్న ధోనీ పద్మశ్రీ గౌరవం సైతం అందుకొన్నాడు. అయితే పద్మభూషణ్‌ పురస్కారం కోసం గతంలోనే ధోనీ పేరును బీసీసీఐ రెండుసార్లు సిఫారసు చేసినా ఈ క్రికెట్‌ భూషణుడు పద్మభూషణ్‌ మాత్రం కాలేకపోయాడు. ఐపీఎల్‌లో రెండేళ్ల నిషేధానికి గురైన చెన్నై ఫ్రాంచైజీ జట్టుకు ధోనీ నాయకత్వం వహించడం, బీసీసీఐ మాజీ కార్యదర్శి ఎన్‌. శ్రీనివాసన్‌తో సన్నిహితంగా ఉండటమే ఈ పురస్కారం రాకపోవడానికి కారణమని కొంతమంది అ

నుమానిస్తున్నారు.

ధోనీకి ముందు పద్మభూషణ్‌ పురస్కారం అందుకొన్న క్రికెట్‌ దిగ్గజాలలో రాజా భలీంద్ర సింగ్‌, విజయానంద గజపతి, లాలా అమర్‌ నాథ్‌, సీకె నాయుడు, చందుబోర్డే, డీబీ దేవధర్‌, సునీల్‌ గవాస్కర్‌, రాహుల్‌ ద్రావిడ్‌, కపిల్‌ దేవ్‌, సచిన్‌ టెండుల్కర్‌ ఉన్నారు. కేంద్రం రెండుసార్లు తిరస్కరించినా బీసీసీఐ మూడోసారి కూడా ధోనీ పేరునే సిఫారసు

 

చేసింది. ఈ మూడో ప్రయత్నంలోనైనా ధోనీ పద్మభూషణ్‌గా నిలవాలని కోరుకొందాం.

పి.వి సింధూ పేరు సైతం

పద్మభూషణ్‌ పురస్కారం కోసం బ్యాడ్మింటన్‌ క్వీన్‌ పీవీ సింధూ పేరును సైతం కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ సిఫార్సు చేసింది. రియో ఒలింపిక్స్‌ రజత విజయంతో దేశ అత్యున్నత క్రీడాపురస్కారం రాజీవ్‌ గాంధీ ఖేల్‌రత్న అవార్డును అందుకొన్న సింధూ 2017 ప్రపంచ బ్యాడ్మింటన్‌లో రజతంతో పాటు రెండు సూపర్‌ సిరీస్‌ టైటిల్స్‌ సైతం గెలుచుకోడంతో పద్మభూషణ్‌ పురస్కారం కోసం పంపినట్లు కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ ప్రకటించింది.

– క్రీడా కృష్ణ , 84668 64969

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *