ధీర వనిత

ధీర వనిత

ఎవరైనా అపరిచిత వ్యక్తి రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు కొంత దూరంలో ఆ రోడ్డు రెండుగా చీలిపోతే ఏ దారిలో వెళ్తే తను గమ్యం చేరగలడో, ఏ దారిలో వెళ్తే దారి తప్పిపోతాడో తెలియక తికమకపడతాడు. సరైన దారి చూపించే వారు దగ్గరలో లేకపోతే లాటరీ వేసి ఏదో దారి పట్టుకుంటాడు. అదృష్టం బాగుంటే ఆ దారి అతడిని గమ్యం చేరుస్తుంది. జీవితంలో ఇలాంటి చిక్కు పరిస్థితులు ఏర్పడటం సహజం.

హైస్కూల్లో చదివే రోజుల్లో నేనొక కథ చదివాను. అది మూడు చేపల కథ. మొదటిది అనాగత విధాత. రాబోయే ఆపదను ముందే ఊహించుకొని దానికి ప్రతిక్రియ చేసుకునేది. రెండవ తెగకు చెందినది ప్రత్యున్నమతి. వచ్చిన ఆపదను సమయ స్ఫూర్తితో అధిగమించేది. మూడవది దీర్ఘసూత్రి. ఎప్పటికీ ఏ ఆలోచనా తెగనిది. ఇలాగే మనుషులలోనూ ఉంటారు. మొదటి రెండు రకాల వారు కష్టాల నుంచి గట్టెక్కుతారు. మూడవ రకం వారు ఎటూ తేల్చుకో లేక కష్టాలను అనుభవిస్తూ ఉంటారు.

నేను దీర్ఘసూత్రిని కాను. అనాగత విధాతను కాను. ప్రత్యున్నమతిలా సందర్భం వచ్చినప్పుడు చేయి జారిపోకుండా నిర్ణయం తీసుకుంటాను. ఒక రోజు నేను చదివిన కాలేజీ ప్రిన్సిపాల్‌గారు దారిలో కనిపించి నన్ను వారింటికి తీసుకెళ్ళారు.

‘శోభా ! ఇప్పుడేం చేస్తున్నావు ? చదువై పోయిందిగా ఇంట్లో కూర్చొని గోళ్ళు కొరుక్కుంటు న్నావా ? నీ లాంటి చురుకైన దానికి ఉపాధ్యాయ వృత్తి రాణిస్తుంది. జీతం కోసం చేసే ఉద్యోగం కాదది. ఎందరో బాల, బాలికలను తీర్చిదిద్దగల మ¬న్నత ఆశయం గల వృత్తి అది. ఒకసారి లోకమాన్య బాలగంగాధర తిలక్‌ గారిని ఎవరో ప్రశ్నించారు ‘స్వాతంత్య్రం వచ్చిన తరువాత మీరు మంత్రిమండలిలో చేరుతారా ?’ అని.

అందుకు తిలక్‌గారేమన్నారంటే ‘ఎందరో మంత్రులను, ఉన్నత అధికారులను దేశానికందించేది అధ్యాపక వృత్తి. నేను ఫెర్గూసన్‌ కాలేజీలో తిరిగి వ్యాఖ్యాతగా చేరుతాను’ అన్నారు. నీకు తెలుసుగా తన వద్ద చదివిన విద్యార్థులు ఉన్నత పదవులనలంక రించితే ఎక్కువ సంతోషించేది ఉపాధ్యాయుడే. ఒక మంత్రిని గాని, ఒక అధికారిని గాని పదవిలో ఉన్నంత వరకే అతడిని గౌరవిస్తారు. అతను ఆ పదవి నుంచి తప్పుకున్న తరువాత అతడిని ఎవరూ పట్టించుకోరు. కాని ఉపాధ్యాయుడిని శిష్యులు జీవితాంతం గౌరవిస్తారు. మన కాలేజీ అనుబంధ హైస్కూల్లో సైన్సు టీచర్‌ పోస్టు ఖాళీ అయింది. ఇంత వరకు పనిచేసినామె పెళ్ళి చేసుకుని రిజైన్‌ చేసింది. నీవు వెంటనే అప్లై చెయ్యి. అప్లికేషన్‌ ఫార్మాలిటీకే. నీవు కావాలంటే రేపే జాయిన్‌ కావచ్చు’ అన్నారు ఉజ్జ్వలగారు.

అదృష్టం తనంతట తానుగా వచ్చి తలుపు తట్టితే ఎవరైనా తలుపులు తెరవకుండా ఉంటారా ? అయితే అమ్మ ఇష్టపడుతుందో ? లేదో ? అనుమానం. ‘మా అమ్మా, నాన్నలతో మాట్లాడాలి’ అని మాత్రం ఆమెతో అన్నాను.

ఇంటికి వచ్చి ప్రిన్సిపాల్‌ ఉజ్జ్వలగారు చెప్పింది అమ్మకు చెప్పాను. అమ్మ కోపంగా చూసింది.

‘బాగుంది. కూసే గాడిద మేసే గాడిదను చెరిపిందంటారు. ఆవిడ బాల బ్రహ్మచారిణి. పెళ్ళి పెటాకులు లేకుండా ఉద్యోగం పట్టుకొని ఊగులాడు తోంది. ఏ మందో మాకో పెట్టి నిన్ను పెళ్ళి చేసుకోనివ్వదు’ అంది అమ్మ.

నేను ఉద్యోగం మోజులో పెళ్ళిని వాయిదా వేస్తానేమోనని అమ్మ భయం. ఎప్పటి సంగతో ఇప్పుడెందుకు ? ఆ సమయం వస్తే అప్పుడాలో చించవచ్చనేది నా ఉద్దేశం. అమ్మకు ఇష్టం లేకపోయినా నేను ఉద్యోగంలో చేరితే అమ్మ అడ్డు చెప్పలేదు.

తల్లిదండ్రులు యుక్త వయస్సు పిల్లలకు మార్గదర్శకంగా నిలబడాలి. ప్రధానంగా తల్లి కుమార్తె ప్రవర్తనకు బాధ్యత వహించి బుద్ధులు చెప్పాలి. అప్పుడా పిల్లలపై బాహ్య ప్రపంచపు ప్రభావం అంతగా పడదు. సీతాదేవి అలాంటి పెంపకంలో పెరిగింది. కాబట్టి ఆమెను ఆదర్శమూర్తిగా గౌర విస్తున్నాం అంటుంది అమ్మ. ఒకసారి ఉద్యోగంలో చేరితే పెద్దల ప్రభావం నుంచి బయట పడి సంప్రదాయ విరుద్ధ పనులు పిల్లలు చేస్తారేమోనని, తల్లిదండ్రులు ఆడపిల్లలకు కొన్ని ఆంక్షలు విధించాలని అనుకుంటారు.

‘అమ్మా ! ఎన్నో విషయాల గురించి మీరు నాకు చెప్పారు. మీ పెంపకంలో పెరిగాను. నా ప్రవర్తన విషయంలో ఒకరి ప్రమేయం లేకుండా నిర్ణయం తీసుకోగల ధీమా నాకు ఉంది’ అన్నాను.

‘అదే నా భయం. పెద్దల ప్రమేయం లేకుండా పిల్లలు తీసుకునే నిర్ణయాలు ఒక్కొక్కప్పుడు బెడసికొడతాయి’ అంది అమ్మ.

ఉద్యోగంలో చేరనిచ్చింది కాని ‘నీకు పెళ్ళి సంబంధం కుదరగానే నీవు ఉద్యోగం వదిలేయాలి’ అని షరతు పెట్టింది. ఆ మేరకు వాగ్ధానం చేసాను.

————————–

మూడు సంవత్సరాలు కాలేజీ అనుబంధ పాఠశాలలో సైన్సు టీచరుగా పని చేసిన తరువాత కాలేజీలో అసిస్టెంట్‌ లెక్చరర్‌గా ప్రమోషన్‌ ఇచ్చారు.

మా కళాశాలలో జుగురు అనే పిల్ల బి.ఎస్‌.సి. మొదటి సంవత్సరంలో చేరింది. ఆ పిల్ల నక్సల్‌ ప్రభావిత దంతేవాడా జిల్లాలోని ఓ కుగ్రామం నుంచి వచ్చింది. పుష్టిగా, పొడుగ్గా ఉంటుంది. శారీరకంగా బలంగా ఉండేది. కాని మానసికంగా బలహీన మైంది. ఎందువల్లనో అందరి పిల్లల్లా ఉత్సాహంగా ఉండేది కాదు. ఎప్పుడూ చివరి బెంచీలో ఒంటరిగా కూర్చునేది. ఆ పిల్ల హైయర్‌ సెకండరీలో మంచి మార్కులు తెచ్చుకుంది. మొదటిసారిగా కాలేజీ మెట్లెక్కిన పిల్లలలో ఉత్సాహం ఉంటుంది. కాని ఆమెలో లేదు.

నా స¬ధ్యాయులు ఆమె వైఖరికి విసిగి పోయారు. ఆమె నిరాసక్తతకు పెదవి విరిచారు. నేను ఉపాధ్యాయురాలిని. నా కర్తవ్యం ఏమిటి ? నాకొక సూక్తి గుర్తుకొచ్చింది. ‘సామాన్య ఉపాధ్యాయుడు పాఠం చెబుతాడు. మంచి ఉపాధ్యాయుడు వివరిస్తాడు. ఉత్తమ ఉపాధ్యాయుడు చేసి చూపిస్తాడు. అత్యున్నత ఉపాధ్యాయుడు ప్రేరణ కలిగిస్తాడు’ ఒకరోజు జుగురును స్టాఫ్‌ రూంకి రమ్మన్నాను.

‘జుగురు ! క్లాసులు మొదలైన దగ్గర నుంచి నిన్ను గమనిస్తున్నాను. నీవు చదువుపై శ్రద్ధ ఎందుకు చూపడం లేదు ? మొదటి క్లాసు టెస్టులో నువ్వు ఏమీ రాయలేదు. మీ ఇంట్లో పరిస్థితులు బాగోలేవా? ఆర్థిక ఇబ్బందులా ? అనారోగ్యమా ?’

ఆ పిల్ల నా ప్రశ్నలు ప్రశాంతంగానే విన్నది. కాని జవాబు చెప్పలేదు. ‘నువ్వు మౌనంగా కూర్చుంటే నేనేమని అర్థం చేసుకోగలను ? నువ్వు మనస్సు విప్పి నీ సమస్య చెప్తే నేను నీకు సహాయం చేయగలను. గురు, శిష్యుల అనుబంధం.. తల్లి, పిల్లల అనుబంధం ఒక్కటే.. నీవు నా కుమార్తె లాంటి దానివి. నా కూతురి సమస్యలను పరిష్కరించడం నా కర్తవ్యం కాదా ? నువ్వు నిస్సంకోచంగా చెప్పు. నువ్వు ఎంతటి రహస్యం చెప్పినా అది మన ఇద్దరి మధ్యనే ఉంటుంది’ అన్నాను. ఆమెను ఎలాగైనా మాట్లాడించాలి. పొడిపొడిగా అడిగితే నా ప్రశ్నలు ఆమె గుండె లోత్తుల్లోకి వెళ్ళవు.

‘మేడమ్‌ ! నన్నొదిలేయండి. క్లాసులో మీకు ఇంకా ముప్ఫైమంది పిల్లలున్నారు’ అంది. ఆ జవాబు చెప్పడానికి చాలా సమయం తీసుకుంది. అప్పటికే ఆమె కనుకొనకుల్లో నీటి బిందువులు. బొత్తిగా మాట్లాడకుంటే నేను విసిగిపోయి ఆ పిల్లను వెళ్ళిపోమంటాను. ఈ సమాధానం నాకు మార్గం చూపింది.

‘ఇదేం సమాధానం ? ఆ ముప్ఫై మందిలో నీవు లేవా ? తల్లి పిల్లలనందరిని సమానంగా చూస్తుంది. నీ తల్లికి నీ సమస్యలను చెప్పవా ? మరి నా దగ్గరెందుకు సంకోచం?’ అన్నాను.

ఆమె ఏడుపు మొదలెట్టింది. నేను భయపడ్డాను. ఎవరైనా వచ్చి చూస్తే నేను ఆ పిల్లను దండించాను అనుకుంటారని.

‘నిన్ను ఏమన్నానని ఏడుస్తున్నావు జుగురు ? అందరిలా నేను చూస్తూ ఊరుకోలేను. నీవు పాసైతే నా జీతం పెరగదు.. ఫెయిల్‌ అయితే నా జీతం తరగదు. నేను నీ బాగుకోరే దానిని. నా మీద నీకు నమ్మకం లేకపోతే కళ్ళు తుడుచుకుని వెళ్ళిపో. పుణ్యానికి పోతే పిచ్చకుంచమందిట వెనుకటికెవరో. నీ విషయంలో కలుగజేసుకోవడం నా తప్పే’ అన్నాను. అలా చురకలేస్తే ఆమె జవాబు చెబుతుందన్న చిరు ఆశ.

జుగురు కళ్లు తుడుచుకొని బ్యాగ్‌ లోంచి ఒక ఫోటో తీసి నాకిచ్చింది. జుగురులా నల్లగా పొడుగ్గా ఉన్నాడు. నవ్వు ముఖం.. పధ్నాలుగేళ్ళు ఉండవచ్చు.

‘ఎవరీ అబ్బాయి ?’ అన్నాను.

‘నా తమ్ముడు మేడమ్‌’

‘నీ లాగే చదుకుంటున్నాడా?’

‘ఇంతవరకు చదివాడు. ఈ సంవత్సరం నుంచి స్కూల్‌కి వెళ్ళడం లేదు’

‘కారణం ? తండ్రికి అండగా ఉండాలని చదువు మానేసాడా ? లేక చదువుకోవడం ఇష్టం లేదా ?’

‘మేడమ్‌ ! వాడికి చదువుకోవాలని ఉంది’ మళ్ళీ జుగురు దుఃఖాన్ని ఆపుకోలేక పోయింది. ఆమె తిరిగి విషయం చెబుతుందని నాకు తెలుసు.

‘ఒకరోజు నేనూ, నా తమ్ముడు సంతకు వెళ్తున్నాం. దారిలో నలుగురైదుగురు ఆకతాయిలు నన్ను అల్లరి పెట్టడానికి ప్రయత్నించారు. నా తమ్ముడికి కోపం వచ్చింది. వారితో గొడవ పడ్డాడు. అవతలి వారు నలుగురు. వీడి మీద కలియబడ్డారు. బెల్ట్‌తోను, రాళ్ళతోను కొట్టి గాయపరిచారు. ఇంతలో కొందరు అటుగా వస్తూంటే పారిపోయారు. నా తమ్ముడు నేలమీద పడి ఉన్నాడు. రక్తం కారుతోంది. అక్కడున్నవారి సహాయంతో డాక్టరు దగ్గరకు వెళ్ళాం. అతను ప్రథమ చికిత్స చేసి దంతేవాడా తీసుకెళ్ళ మన్నాడు. వారం, పది రోజుల్లో వాడి ఆరోగ్యం కుదుటపడింది. అయితే వెన్నెముక దెబ్బతింది. ఇప్పుడు వాడు చక్రాల కుర్చీకే పరిమితమయ్యాడు. మేడమ్‌ మీరే చెప్పండి.. ఈ పరిస్థితులలో నేను చదవలగనా ? ఇంటికి వెళ్ళి పోవాలనుకుంటున్నాను’ అంది జుగురు.

ఆమె చెప్పింది విని నేను బాధపడ్డాను. మెట్రోలలోనే కాదు మారుమూల గ్రామాలలోను యువకులు ఆడపిల్లలను గౌరవంగా బ్రతకనీయడం లేదు. దీనికి కారణం ఏమిటి ? పాశ్చాత్య సంస్కృతికి దాసులై భారతీయ సంస్కృతిని విస్మరించడం. తల్లిదండ్రులు ఆడపిల్లలకు బుద్ధులు నేర్పుతున్నారు. కాని మగ పిల్లలను అచ్చు వేసిన ఆంబోతుల్లా వదిలి వేస్తున్నారు.

జుగురు చదువు మానేయడం నాకు ఇష్టం లేదు. విజయం సాధించాలంటే అంతులేని పట్టుదల, ప్రబలమైన సంకల్ప శక్తిని కలిగి ఉండాలి. విఘ్నాలు లేకుండా ఏ పనినైనా సులభంగా సాధించడం ఎన్నడైనా సాధ్యమా ? అని ప్రశ్నిస్తారు స్వామి వివేకానంద.

జుగురు పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. ఇలాంటి విపత్కర పరిస్థితులలో ఎవరి మనసైనా వికలం కావడం సహజం. అయితే పరిస్థితులను అధిగమించాలి. దృఢ సంకల్పం, పవిత్ర ఆశయం తప్పక సత్ఫలితాలనిస్తాయి. వీటిని ఆయుధాలుగా గ్రహించిన వారు అన్ని విఘ్నాలను ఎదుర్కొని నిలబడ గలుగుతారు.

‘జుగురూ ! అంతా దైవేచ్ఛ. ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. నేను అల్పజీవిని అని నీవు అనుకుంటున్నావు. అంటే నీవు ఒక అసత్యాన్ని పలుకుతున్నావన్నమాట. నిన్ను ఓదార్చేందుకు నా దగ్గర మాటలు లేవు. కాని నేను స్వామి వివేకానందుని జీవితంలోని ఓ ఉదంతాన్ని చెప్తాను. అప్పుడు నీలో ధీరత్వం మేలుకొంటుంది. శ్రద్ధగా విను’ అన్నాను. వివేకానందుని పేరు వినగానే ఆమె కళ్లలో ఓ మెరుపు మెరిసింది.

‘చూడమ్మా ! ఓ సారి స్వామి వివేకానంద కాశీ వీధుల్లో నడిచి వెళ్తూండగా ఓ కోతుల గుంపు వెంటపడింది. స్వామీజీ భయంతో పరుగు తీయసాగారు. అంతలో ఒక వృద్ధ సాధువు ఎదురై ‘ఎందుకలా భయపడి పరుగెడతావు? వాటికి ఎదురు తిరుగు’ అంటూ హితవు పలికాడు. వెంటనే స్వామీజీ వెనక్కి తిరిగారు. ఒక్కసారిగా ఆ కోతుల సమూహం తోక ముడిచింది. స్వామీజీ ఈ ఉదంతాన్ని తన ప్రసంగాలలో తరచూ ఉటంకిస్తూ ‘ఈ సంఘటన నుంచి నేను ఒక పాఠం నేర్చుకున్నాను. మనం ఎంత భయపడితే మనల్ని సమస్యలు అంతగా భయ పెడుతాయి. మనం వాటిని సవాలుగా ఎదుర్కొంటే మాయమవుతాయి. ధైర్యంగా, స్థైర్యంగా నిలబడాలి. అప్పుడే విజయం సాధిస్తాం’ అన్నారు స్వామి వివేకానంద.

ఇక మీ తమ్ముడి విషయం ఆలోచిద్దాం. వెన్నెముక దెబ్బ తిన్నంత మాత్రాన అతడు చదువుకి అనర్హుడా ? కాళ్ళు లేని వారు, చేతులు లేనివారు, గుడ్డివారు, చెవిటి, మూగవారు సైతం చదువుకొని ఎన్నో విజయాలు సాధిస్తున్నారు. వివేకానందుని సాహిత్యంతో పాటు అలాంటి వికలాంగుల గురించిన పుస్తకాలు మీరిద్దరూ చదవాలి’ అన్నాను.

‘మేడమ్‌ ! నాకు ఈ ప్రపంచం అంటే రోతగా ఉంది. మేం ఏం చేసామని మాకీ శిక్ష. తమ్ముడిని తలచుకొని నేను నిరంతరం బాధపడుతున్నాను. నాకు చదువు మీద ఇష్టం సన్నగిల్లింది. ఇంటికి పోయి వాడిని చూసుకుంటాను’ అంది.

కథ మళ్ళీ మొదటికొచ్చింది. ఆమెకు నా మాటలు విశ్వాసం కలిగిస్తాయనుకున్నాను.

‘జరిగిందేదో జరిగిపోయింది. దాన్ని తిరగతోడడం ఎవరికీ సాధ్యం కానిది. నిర్ధుష్టమైన సంకల్పంతో నిన్ను నువ్వు అనుసంధానించుకొని వికాసం కోసం ప్రయత్నించు. హృదయానికీ, మేధస్సుకూ వైరుధ్యం కలిగినప్పుడు హృదయాన్నే అనుసరించు. దీక్షగా చదువు కొనసాగించు, డిగ్రీ కాగానే పీజీలో చేరు. ఈ అయిదు సంవత్సరాలు చదువునొక తపస్సుగా భావించు. నీకు మంచి ఉద్యోగం దొరుకుతుంది. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. చాలామంది అనేక కారణాల వలన చదువులకు దూరమై హీనంగా బ్రతుకుతున్నారు. పట్టెడు మెతుకుల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. నీవు వారికి ఆదర్శం కావాలి’ అన్నాను.

‘మేడమ్‌ ! మీరు చెప్పింది నిజమే. నేను చదువు మానేస్తే రెండింటికీ చెడ్డ రేవడినవుతాను. మీరు నాలో పేరుకు పోయిన నైరాశ్యాన్ని పారద్రోలారు. మీకు కృతజ్ఞతలు’ అంది.

ఆమెలో మార్పు వచ్చినందుకు నాలోని ఉపాధ్యాయుడే కాదు మాతృత్వమూ పులకరించింది.

————————–

జుగురుకి మొదటి సంవత్సరం పరీక్షలు కాకముందే కుటుంబ కారణాల వలన నేను ఉద్యోగానికి రాజీనామా చేసి పిల్లలను తీసుకొని మా వారి దగ్గరకు వెళ్ళిపోయాను. మావయ్య గారు చనిపోయారు. అత్తగారు ముసలితనం వలన ఏ పనులు చేయలేకపోతున్నారు. పైగా ఎప్పుడూ ఆమెకు ఆడ సహాయం కావాలి.

అయిదారేళ్ళు గడిచిపోయాయి. నాకొక ఉత్తరం వచ్చింది. ఈ అయిదేళ్ళలో మేం రెండు ఊళ్లు మారాం. అయినా ఆ ఉత్తరం రీ డైరెక్ట్‌ చేయబడి నాకు వస్తే ఆశ్చర్యం వేసింది. ఈ రోజుల్లో మొబైల్‌ ఫోన్లు, వాట్సప్‌లు, ఈ మెయిల్స్‌ తప్పిస్తే ఉత్తరాలు ఏమొస్తున్నాయి ? ఎవరు రాశారో కవరు చించే వరకు అర్థం కాలేదు. శ్రీనగర్‌ నుంచి వచ్చింది. ఎవరా ? అని కింద సంతకం చూసాను. జుగురు రాసిన ఆ ఉత్తరం చూడగానే నాకు పరమ సంతోషం కలిగింది.

పురుషులకే సవాలుగా నిలిచే సైనిక ఉద్యోగంలో జుగురు అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. ఆమెను జమ్మూకశ్మీర్‌లో వేసారు. డ్యూటీలో జాయిన్‌ అవగానే ఆమె నాకు ముందుగా ఆ విషయం రాసింది. ఎం.ఎస్‌.సి.లో ప్రథమ శ్రేణిలో పాసైంది. ఇప్పుడు ఆర్మీలో అధికారి. ఆమె తమ్ముడు ఆత్మ విశ్వాసంతో శారీరక అస్వస్థతను అధిగమించాడు. హైయర్‌ సెకండరీ పాసయ్యాడు. ఛత్తీస్‌ఘర్‌ ప్రభుత్వంలో పని చేస్తున్నాడు. ఇప్పుడు ఊతకర్రల సహాయంతో నడవగలుగుతున్నాడు. చివరగా ఆమె రాసిన వాక్యాలు నా హృదయాన్ని హత్తుకున్నాయి.

‘నేనూ, నా తమ్ముడు వివేకానందుని సాహిత్యాన్ని చదువుతున్నాము. అగాధంలో కూరుకుపోతున్న మా జీవితాలను ఆకాశమంత ఎత్తుకి చేర్చి మీ ద్వారా స్ఫూర్తిని నింపిన స్వామి వివేకానందునికి ఆజన్మాంతం ఋణ పడి ఉంటాము. మీరు నాలో వెలిగించినది చిన్న దీపమే కావచ్చు… అది ఇప్పుడు మా జీవితాలలో కోటి సూర్య ప్రభలను ప్రకాశింప జేస్తోంది. మీకు ఎలా కృతజ్ఞతలు తెలపాలో నాకు తెలియడం లేదు’

ఆ కృతజ్ఞతల జడివానలో నా ఆనంద భాష్పాలు కలిసిపోయాయి. జుగురు ధీరవనిత… నాకు స్వామి వివేకానందుని సూక్తి గుర్తుకొచ్చింది.

‘మానసిక బలహీనతలను అధిగమించి లెమ్ము… నేను ధీరత్వాన్ని, స్థిర బుద్ధినీ కలిగి ఉన్నానని భావించి మనస్సులోని బలహీనతలను అధిగమించడానికి ప్రయత్నించు’ అందరూ ఆ బాటలో నడిస్తే ధీరులు, త్యాగులు, దేశభక్తులు కారా ?!

–  గుమ్మా ప్రసాదరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *