దాడులకు పాల్పడుతున్న టి.డి.పి.

దాడులకు పాల్పడుతున్న టి.డి.పి.

రాష్ట్ర రాజకీయాలు రోజులు గడుస్తున్న కొద్ది వేడెక్కుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయ వాతావరణం వేగంగా మారుతోంది. అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. అవి ముందస్తు ఎన్నికలా ? లేక వచ్చే సంవత్సరం యథా ప్రకారం జరుగుతాయా ? అనేది ఇంకా తేలలేదు.

గత నాలుగు సంవత్సరాలుగా నిద్రపోతున్న తెలుగు తమ్ముళ్ళకు ఏదో ఒకటి చేస్తే గాని తమకు సీటు రాదనే భయం పట్టుకుంది. ప్లాన్లు ఆలోచించారు. బిజెపి నాయకుల మీద దాడి చేస్తే నాయకుడి మెప్పుపొందవచ్చని ఆలోచిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాడులకు తెగపడుతున్నారు.

విభజన చట్టంలో ఏ అంశాలు ఉన్నాయో ! వాటి గురించి అవగాహన లేకపోయినప్పటికి చంద్రబాబు నాయుడి పాటను అందుకున్నారు. ప్రత్యేక హోదా, విభజన అంశాలు, విశాఖ రైల్వే జోను, కడప ఉక్కు ఫాక్టరీ ఇంతకు మించి వారు మాట్లాడుతున్నది మరొకటి లేదు. జగన్‌, పవన్‌, బిజెపి కుమ్మక్కయ్యారని రాష్ట్ర ముఖ్యమంత్రి నుండి సందు నాయకుడి వరకు ఒక్కటే మాట. ప్రతిరోజు వీరి మాటలతో ప్రజలు విసిగిపోయారనేది వాస్తవం. ఒక్క అబద్దం వందసార్లు చెబితే నిజం అవుతుందనే సూత్రం ఈ రోజు చెల్లుబాటు కాదు. ప్రజలకు అనేక మార్గాల ద్వారా అసలైన సమాచారం చేరుతోంది. వారు ఆలోచించిగలుగుతున్నారు. ఇటువంటి చౌకబారు ఎత్తుగడల వల్ల ఉపయోగం లేదు.

ఇక దాడులు విషయానికొస్తే…

ఇటీవలే కృష్ణా జిల్లాకు చెందిన టి.డి.పి శాసనమండలి సభ్యుడు రాజేంద్రప్రసాదు ప్రజల ముందు నవ్వుల పాలయ్యాడు. అవినీతిపై చర్చకు రమ్మని బిజెపి యువ నాయకుడ్ని ఇంటి వద్దకు ఉయ్యూరు ఆహ్వానించారు. తీరా ఆ నాయకుడు బయలుదేరిన తరువాత మధ్యలోనే కంకిపాడు వద్ద అరెస్ట్‌ చేయించిన సంఘటన, తరువాత నడిచిన నాటకం ప్రజలు గమనించారు. టి.డి.పి నాయకుల డొల్లతనం బయటపడింది.

అటువంటి నాయకులు టి.డి.పిలో చాలా మంది ఉన్నారు. ఎన్‌.డి.ఎతో భాగస్వామిగా ఉంటూ బిజెపిని విమర్శించిన నాయకులకు సంకీర్ణ భాగస్వామ్య నీతి, నియమాలు తెలుసో తెలియదో!

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగించు కొని తిరుపతి ఏడుకొండల వాడి దర్శనానికి కుటుంబంతో వచ్చారు బిజెపి అఖిల భారత అధ్యక్షులు అమిత్‌షా. విషయం తెలుసుకున్న పచ్చచొక్కాలు అనుకున్న పథకం ప్రకారం ఆయన కాన్వాయ్‌ మీద దాడిచేశాయి. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. దీనిని ఇదొక ప్రభుత్వం చేయించిన దాడిగా ప్రజలు నమ్ముతున్నారు.

దీనికి పూర్వం తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రం ఇస్తున్న నిధులను దుర్వినియోగం చేస్తోందనే విషయాన్ని బిజెపి శాసన మండలి సభ్యుడు సోము వీర్రాజు ప్రజల ముందుంచారు. ఇంకేముంది తెలుగు తమ్ముళ్ళు పచ్చ చొక్కాలు చించుకొని ఆయన ఇంటిమీద దాడి చేశారు. దీనిని ప్రభుత్వ దాడిగానే ప్రజలు భావిస్తున్నారు. ఎవరినీ అరెస్టు చేయలేదు. అనంతపురంలో వాస్తవాలను ప్రజల ముందుంచ టానికి వెళ్ళిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గెస్ట్‌హౌస్‌పై దాడి చేసారు.

వాస్తవానికి కేంద్రం ఇస్తున్న నిధులకు, సంక్షేమ పథకాలకు తన పేరు చేర్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను తప్పుతోవ పట్టిస్తున్నారు. ఈ విషయాన్ని మరుగుపరచి వాస్తవాలను ప్రజల ముందుంచే వారిపై దాడి చేయించడం అసహనానికి తార్కాణం.

నాలుగు సంవత్సరాల పాటు రాష్ట్రానికి కావలసినన్ని నిధులు తెచ్చుకొని ఆ తరువాత మాటిమాటికి ప్రత్యేక హోదాని కోరటం చంద్రబాబు అటు సంకీర్ణ ధర్మాన్ని, ఇటు రాష్ట్ర ప్రజలను వంచన చేసినట్లు కాదా ! వెన్నుపోటు రాజకీయాలకు పెట్టింది పేరైన చంద్రబాబు కేంద్రంలోని బిజెపి రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచిందనడం చిత్రంగా ఉరదని జనం హేళన చేస్తున్నారు.

హుద్‌ హుద్‌ తుఫాను తరువాత కేంద్రం ఇచ్చిన నిధుల లెక్కలు ఇంతవరకు కేంద్రానికి ఇవ్వలేదు. కేంద్రం ఇస్తున్న నిధులను వాడుకుంటూ పెట్టిన రోజు పెళ్ళి, లేని రోజు శ్రార్ధం అనే పద్ధతిలో చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. రోజు రోజుకు అసలు రంగు బయటపడుతురడడంతో అసహనానికి గురి అవుతున్న చంద్రబాబు బిజెపిపైన ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతున్నారు. చంద్రబాబు అసహనం ఆసరాగా రాజకీయ లబ్ధి పొందాలనుకున్న తెలుగుదేశం కార్యకర్తలు నాయకుడి మెప్పుకోసం దాడులకు తెగపడుతున్నారు.

40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన చంద్రబాబు నాయుడికి ప్రజాస్వామ్యం పట్ల నిబద్దత ఇదేనా ? అని ప్రజలు ప్రశ్నించు కుంటున్నారు.

– పి.వి. శ్రీరామశాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *