దశ దిశ

దశ దిశ

మాజంలో వివిధ రంగాలకు చెందిన వారిని ఒకే వేదికపై సమావేశపరచి వారి భావాలను పంచుకునేందుకు అవకాశం కల్పించేదే హెచ్‌.ఎం.టివి నిర్వహించే ‘దశ-దిశ’ కార్యక్రమం.

తెలంగాణలో టిఆర్‌ఎస్‌ పార్టీ నాలుగు సంవత్సరాల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా జూన్‌ 3వ తేదీన ఉదయం 9 గంటలకు హెచ్‌.ఎం. టి.వి (దశ-దిశ) ఓ కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. ఆ వివరాలు ఓ సారి చూద్దాం..!

ఉద్యమ పార్టీ

తెలంగాణలో 2014లో అధికార పీఠమెక్కిన తెలంగాణ రాష్ట్ర సమితికి, ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వా లను ఏర్పాటు చేసిన పార్టీలకు తేడా ఉంది. ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు రకరకాల కారణాల వల్ల ఆయా సందర్భాల్లో ఎన్నికైనవైతే.. తెరాస మాత్రం పధ్నాలుగేళ్ళ పాటు సుదీర్ఘ పోరాటం చేసి, ఉద్యమమే మూల వనరుగా పెరిగిన పార్టీ.. మరి ఆ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలంతా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనుకున్నారు. కాని ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు వేరేలా ఉన్నాయి. ప్రజలకు అన్యాయం జరుగుతున్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీని గాని, ధర్నాను గాని నిర్వహించలేని పరిస్థితి అంటూ వక్తలు పేర్కొనగా వీటన్నిటికి పరాకాష్టగా ప్రొఫెసర్‌ హరగోపాల్‌ ‘ముఖ్యమంత్రిని కలవడానికి పెద్ద పెద్ద వాళ్లకే వీలు కావడం లేదు. ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి ?’ అని చాలా ఆవేదనగా ప్రశ్నించారు.

కెజి టు పిజి ఏమైంది ?

రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి చెబుతూ వస్తున్న ‘కెజి టు పిజి ఉచిత విద్య’ సంగతేమో గాని రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామాల్లో ప్రభుత్వం పాఠశాలలను మూసివేసింది. దాంతో పేదవాడు తన పిల్లల్ని చదివించుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నాడని వివరంగా చెప్పారు హరగోపాల్‌. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యకు 12 శాతం నిధులు కేటాయిస్తే, తెలంగాణలో కేవలం 8 శాతమే కేటాయించారని ఆయన తెలిపారు. దేశం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వాలు విద్యా రంగానికి అధిక ప్రాధాన్యమివ్వాలన్నారు. జపాన్‌, కొరియా, అమెరికా లాంటి దేశాలు విద్యారంగానికి అధిక ప్రాధాన్యమిస్తాయని తెలిపారు.

అన్నింటికీ ఆంక్షలే..

వేదికపై పాల్గొన్న మహిళా నాయకురాలు సంధ్య తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చెబుతూ టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆఖరికి పెళ్లి బరాత్‌ (ఊరేగింపు)కు కూడా ఆంక్షలు విధించడాన్ని తప్పుపట్టారు. ‘ధర్నాచౌక్‌’ను ఎత్తివేయడంపై కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కెసిఆర్‌ మంత్రివర్గంలో ఒక్క మహిళ కూడా ఎందుకు లేరు ? అని ప్రశ్నించారు.

ఉద్యోగాలెక్కడ ?

తెలంగాణ ఏర్పడడానికి ముఖ్య కారణం నీళ్ళు – నిధులు- నియామకాలు. అయితే ప్రభుత్వం ఈ మూడింటిలో నియామకాల ప్రస్తావన మరిచి పోయిం దని, ఒకప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో దాదాపు పన్నెండు వందల యాభై మంది బోధనా సిబ్బంది ఉంటే ఇప్పుడు కేవలం నాలుగు వందల మంది మాత్రమే ఉన్నారని ప్రొఫెసర్‌ పి.ఎల్‌.విశ్వేశ్వర రావు అన్నారు. నియామకాల ప్రక్రియను ఎందుకు వేగవంతం చేయడం లేదని ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే కోర్టు అడ్డంకులు ఉన్నాయని చెబుతోందని, అడ్డంకులన్నింటిని తొలగించి ఆ ప్రక్రియను వేగవంతం చేసే ఆలోచన అసలు ప్రభుత్వానికి ఉందా? అని ఆయన ప్రశ్నించారు.

ప్రజలు మాతోనే ఉన్నారు….

ఇదే వేదికపై టిఆర్‌ఎస్‌ ప్రభుత్వ ప్రతినిధిగా పాల్గొన్న పెద్దపల్లి ఎంపి బాల్క సుమన్‌ ఆయా ప్రశ్నలకు స్పందిస్తూ తమ ప్రభుత్వం ప్రాజెక్టులను త్వరితగతిన ఎలా పూర్తి చేస్తోందో గణాంకాలతో సహ వివరించారు. అంతకుముందు కాంగ్రెస్‌ నాయకుడు నాగం జనార్దన్‌రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అయితే విద్య విషయంలో మేం గొప్పగా ప్రగతి సాధించామని చెప్పను గాని చేసిన వాగ్ధానాలను నిలబెట్టుకోడానికి మాత్రం మా పార్టీ కృషి చేస్తోందని సుమన్‌ అనడం నిజంగా నిజాయితీయే.

ముఖ్యమంత్రిని కలిసేందుకు ఎవరికీ అపాయింట్‌ మెంట్‌ ఇవ్వరు అన్నదానికి సుమన్‌ స్పందిస్తూ ఇటీవల ఆశా వర్కర్లు, ఆర్‌టిసి కార్మికులు, సింగరేణి సిబ్బంది.. ఇలా ఎందరో ముఖ్యమంతిని కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారని వివరించారు. ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం గురించి కూడా సుమన్‌ వివరించారు. ప్రజాదరణ తమకే ఉందని, రాష్ట్రం ఏర్పడిన అనంతరం ఇప్పటి వరకూ జరిగిన అన్ని ఉపఎన్నికల్లో, కార్పొరేషన్‌ ఎన్నికల్లో తామే విజయం సాధించామని గుర్తుచేశారు.

అలాగే ఓ సందర్భంలో అధికారపార్టీ ప్రతినిధు లలో కొందరు సంయమనం కోల్పోయి ఆవేశ పడుతూంటే కార్యక్రమ సమన్వయ కర్త ‘రూలింగ్‌ పార్టీ వాళ్లకు సహనం ఉండాలి కదా’ అన్నారు. ఇది చాలా సరైన మాట. ఎందుకంటే ఇది ముఖాముఖి కనుక తక్షణ స్పందనలు, ప్రతిస్పందనలుండటం సహజం. దీన్ని సకారాత్మకంగా తీసుకుని ముందుకు సాగడమే నిజమైన రాజకీయ దక్షతకి నిదర్శనం. ఒక సందర్భంలో ఎంపి సుమన్‌ మాటలను వ్యతిరేకించిన ఓ వ్యక్తిని ‘నువ్వు ఫలానా ఆర్గనైజేషన్‌కు చెందిన వాడివి కదా ! కూర్చో సోదరా’ అని అనడం సమాజంసం కాదు. ఎందుంటే చర్చ అన్నప్పుడు అనుకూల, ప్రతికూల అభిప్రాయాలను చెప్పేవారు కూడా ఉంటారు.

ఈ తరహా కార్యక్రమాలను మనం తప్పకుండా స్వాగతించాల్సిన అవసరముంది. కాని సమన్వయకర్త ఈ కార్యక్రమాన్ని ఇంకాస్త చక్కగా నిర్వహించి ఉండాల్సింది.

–   స్ఫూర్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *