దటీజ్‌ సచిన్‌

దటీజ్‌ సచిన్‌

భారత క్రికెట్‌ దేవుడు మాస్టర్‌ సచిన్‌ టెండుల్కర్‌ మరోసారి తన పెద్దమనసును చాటుకొన్నాడు. ప్రపంచ మేటి క్రికెటర్‌గా మాత్రమే కాదు రాజ్యసభ సభ్యుడిగా కూడా భారత పార్లమెంట్‌కే వన్నె తెచ్చాడు. పెద్దల సభలో సభ్యుడిగా ఆరేళ్ల తన ఇన్నింగ్స్‌ను ముగించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు.

ఒకే ఒక్కడు

సచిన్‌ రమేశ్‌ టెండుల్కర్‌ మొన్నటి, నిన్నటి, నేటితరాల క్రికెట్‌ కమ్‌ క్రీడాభిమానులకు అత్యంత సుపరిచితమైన పేరు. 45 సంవత్సరాల క్రితం ముంబై బాంద్రాలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన సచిన్‌ 15 ఏళ్ల చిరుప్రాయంలోనే ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో ప్రభంజనం సృష్టించాడు. 16 ఏళ్ల వయసులోనే భారత టెస్ట్‌ జట్టులో చోటు సంపాదించాడు. ఆ తర్వాత నుంచి 22 సంవత్సరాల పాటు ఏకబిగిన అంతర్జాతీయ క్రికెట్‌ కెరియర్‌ కొనసాగించి రికార్డుల మోత మోగించాడు. ఇన్‌స్టంట్‌ వన్డే క్రికెట్‌, సాంప్రదాయ టెస్ట్‌ క్రికెట్‌ అన్న తేడా లేకుండా భారత, ప్రపంచ క్రికెట్‌కే మూలవిరాట్టుగా నిలిచాడు. తన ఆటతీరు, ఎదిగినకొద్దీ ఒదిగి ఉండాలనే తత్వం, అంతకుమించి అసాధారణ వ్యక్తిత్వంతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకొన్నాడు. జన సంమోహక క్రికెటర్‌గా నీరాజనాలు అందుకొన్నాడు.

క్రికెట్‌ ఎవరెస్ట్‌

సాంప్రదాయ టెస్ట్‌ క్రికెట్లో 200 టెస్టులు, 51 సెంచరీలు, టన్నుల కొద్దీ పరుగులు, వన్డే క్రికెట్లో 443 వన్డేలు, 49 శతకాలు, 15వేలకు పైగా పరుగులు సాధించి ఈ ఘనత సాధించిన ఒకే ఒక్కడిగా నిలిచాడు. మానవ సాధ్యంకాని ఎన్నో రికార్డులు నమోదు చేసి ప్రపంచ క్రికెట్‌ సూపర్‌మ్యాన్‌గా గుర్తింపు తెచ్చుకొన్నాడు సచిన్‌.

రాజ్యసభ సభ్యుడిగా..

రెండు దశాబ్దాల నాన్‌స్టాప్‌ క్రికెట్‌ కెరియర్‌ తర్వాత రిటైర్మెంట్‌ ప్రకటించిన సచిన్‌ క్రికెటేతర క్రీడల ప్రమోటర్‌గా, ఫ్యామిలీ మ్యాన్‌గా మాత్రమే కాదు రాజ్యసభ సభ్యుడిగాను కొత్త ఒరవడి సష్టించాడు. ఆరేళ్ల క్రితం రాష్ట్రపతి విచక్షణ కోటా కింద రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టిన సచిన్‌ తనవంతుగా విలక్షణ సేవలందించాడు.

అయితే మొత్తం 397 రోజుల రాజ్యసభ సమావేశాలలో కేవలం 29 రోజులు మాత్రమే హాజరై సచిన్‌ విమర్శలు ఎదుర్కొన్నాడు. తన పదవీ కాలంలో వివిధ అంశాలపై సచిన్‌ 22 ప్రశ్నలు మాత్రమే సంధించగలిగాడు. అయితే రాజ్యసభకు సచిన్‌ హాజరు శాతం తక్కువగా ఉన్నా ప్రజలకు తాను అసమాన సేవలు అందించాడు. రాజ్యసభ సభ్యుడిగా తన పదవీకాలం ఆరేళ్లలో అందుకొన్న మొత్తం 86 లక్షల 23 వేల 266 రూపాయల వేతనాన్ని ప్రధానమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చి దటీజ్‌ సచిన్‌ టెండుల్కర్‌ అనిపించుకొన్నాడు. అంతేకాదు సచిన్‌ గొప్ప మనసును చూసి ప్రధాని నరేంద్ర మోది సైతం ఫిదా అయిపోయారు. సచిన్‌ విరాళంగా ఇచ్చిన ప్రతిరూపాయిని జాగ్రత్తగా ఖర్చు చేస్తామని, ఆపన్నులకు అందేలా చూస్తామని ప్రకటించారు.

ఆదర్శం..

భారత పార్లమెంట్‌ సభ్యుల్లో ఇప్పటి వరకూ ఏ ఒక్కరూ సచిన్‌ లాగా తమ మొత్తం వేతనం, భత్యాలను విరాళంగా ఇవ్వలేదు. సచిన్‌ అంతటితోనే ఆగిపోలేదు. రాజ్యసభ సభ్యుడిగా తనకు కేటాయించిన మొత్తం 30 కోట్ల రూపాయల నిధుల్లో 97 శాతాన్ని దేశంలోని వివిధ రాష్ట్రాలలో అభివద్ధి పనుల కోసం వినియోగించాడు. దేశంలోని మారుమూల ప్రాంతాలలో కనీస సదుపాయాలకు నోచుకోని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం 7 కోట్ల 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు.

ఇక ‘సంసద్‌ గ్రామ్‌ ఆదర్శ యోజన’ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన పుట్టంరాజు కండ్రిక, మహారాష్ట్రలోని డోంజా గ్రామాలను దత్తత తీసుకొని ఆ గ్రామాల రూపురేఖలనే సమూలంగా మార్చి వేశాడు. సంసద్‌ గ్రామ్‌ ఆదర్శ యోజన పథకాన్ని అత్యంత సమర్థవంతంగా అమలు చేసి నిధులను ఖర్చు పెట్టిన పార్లమెంటు సభ్యులలో సచిన్‌ నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచాడు.

సేవా కార్యక్రమాలు

సచిన్‌ రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టక ముందే క్రికెటర్‌గా ఉన్న సమయంలోనే తన కుటుంబ సభ్యుల సహకారంతో ‘అప్నాలయ్‌’ సంస్థ ద్వారా ముంబై మహానగరంలోని మురికివాడల పిల్లల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాడు. లక్షలాదిమంది బాలలకు బలవర్థక ఆహారం, దుస్తులు, విద్యా సౌకర్యాలను తన ట్రస్టు ద్వారా కల్పిస్తూ వస్తున్నాడు. వేలాదిమందికి ఉచితంగా గుండె, కంటి ఆపరేషన్లు చేయిస్తూ తనవంతు సేవ చేస్తున్నాడు.

క్రికెటేతర క్రీడలతో..

క్రికెట్‌ నుంచి సచిన్‌ రిటైరైనా క్రికెటేతర క్రీడలతో తన అనుబంధం కొనసాగిస్తున్నాడు. ఐపిఎల్‌లో ముంబై ఇండియన్స్‌ మెంటార్‌గా, ఇండియన్‌ సాకర్‌ లీగ్‌లో కేరళ బ్లాస్టర్స్‌ కో ఓనర్‌గా, ఇండియన్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌లో ముంబై జట్టు సహ యజమానిగా ఉన్న సచిన్‌ క్రికేటతర క్రీడాకారులకు తనవంతుగా సేవలందిస్తున్నాడు. కుటుంబం కోసం పూర్తి సమయం కేటాయిస్తున్న సచిన్‌ నేటితరంలోనూ ఎందరో యువక్రికెటర్లకు స్ఫూర్తి ప్రదాతగా ఉంటూ తన ప్రత్యేకతను కాపాడుకొంటున్నాడు. జీవించి ఉండగానే భారతరత్న పురస్కారం అందుకొన్న ఒకే ఒక్కడు సచిన్‌ మాత్రమే .

ఏది ఏమైనా సచిన్‌ లాంటి అసాధారణ క్రికెటర్‌ రిటైర్మెంట్‌ జీవితాన్ని తన విలక్షణ సేవా కార్యక్ర మాలతో పునీతం చేసుకొంటున్నాడు. రాజ్యసభ సభ్యుడిగా సచిన్‌ తన ఉదారత్వాన్ని చాటుకొన్నట్లే దేశంలోని మిగిలిన పార్లమెంట్‌ సభ్యులూ చాటుకోగలిగితే భారత ప్రజాస్వామ్యంలో సరికొత్త అధ్యాయానికి తెరతీసినట్లే అవుతుంది.

– క్రీడా కృష్ణ , 84668 64969

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *