తిరుగులేదు

తిరుగులేదు

ఆసియాకప్‌ క్రికెట్‌లో తనకు ఎదురేలేదని టీమిండియా మరోసారి సత్తా చాటింది. వరుసగా రెండోసారి, ఓవరాల్‌గా ఏడోసారి ఆసియాకప్‌ నెగ్గి చరిత్ర సృష్టించింది.

2018 ఆసియాకప్‌ క్రికెట్‌ టోర్నీ సైతం డిఫెండింగ్‌ చాంపియన్‌ టీమిండియా షోగానే ముగిసింది. దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం వేదికగా గత రెండు వారాలుగా సాగిన ఈ టోర్నీలో మాజీ చాంపియన్లు శ్రీలంక, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్ఘనిస్థాన్‌, హంకాంగ్‌ జట్లతో పోటీపడిన ఇండియా జట్టు తిరుగులేని విజేతగా నిలిచింది.

ఈ టోర్నీ తొలిదశ మూడు జట్ల గ్రూప్‌ లీగ్‌లో హాంకాంగ్‌, పాకిస్థాన్‌ జట్లను ఓడించిన ఇండియా, రెండోదశ సూపర్‌ ఫోర్‌రౌండ్‌లో సైతం బంగ్లాదేశ్‌, పాక్‌ జట్లను చిత్తు చేసింది. అయితే అఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్‌ను మాత్రం టైగా ముగించక తప్పలేదు.

ఆఖరి ఓవర్‌, ఆఖరి బంతి వరకూ ఎడతెగని ఉత్కంఠతో సాగిన ఫైనల్లో బంగ్లాదేశ్‌ నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్న టీమిండియా చివరకు 3 వికెట్లతో నెగ్గి ఊపిరి పీల్చుకొంది.

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రెండోస్థానంలో ఉన్న టీమిండియాకు ఆసియాకప్‌ గెలుచుకోడం ఇది ఏడోసారి కావడం ఓ రికార్డుగా మిగిలిపోతుంది.

ధావన్‌, రోహిత్‌ల జోరు

గ్రూప్‌ లీగ్‌ నుంచి టైటిల్‌ సమరం వరకూ టీమిండియా టాపార్డర్‌, ప్రధానంగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, వైస్‌ కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ పరుగుల మోత మోగించారు. చెరో సెంచరీతో, ప్రస్తుత ఆసియా కప్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లుగా నిలిచారు. బౌలింగ్‌లో భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా, చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, కేదార్‌ జాదవ్‌ తమ స్పిన్‌ జాదూతో ప్రత్యర్థి జట్లకు పగ్గాలు వేశారు. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ జట్లపై భారత్‌ రెండేసి సార్లు విజయాలు సాధించడంలో ప్రధానపాత్ర వహించారు.

అంతేకాదు ప్రపంచ నంబర్‌ వన్‌ ఆటగాడు, ప్రధాన కెప్టెన్‌ విరాట్‌ కొహ్లీకి విశ్రాంతి ఇచ్చినా, రోహిత్‌ శర్మ తాత్కాలిక కెప్టెన్‌గా టీమిండియా తానేమిటో నిరూపించుకోగలిగింది.

నాలుగోసారి

బంగ్లాదేశ్‌ ఆసియాకప్‌ ఫైనల్‌ వరకూ రావడం, తుదిమెట్టుపై జారిపడిపోడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుత ఆసియాకప్‌ ఫైనల్లో సైతం అదే సాంప్రదాయం కొనసాగింది. సూపర్‌ ఫోర్‌ ఆఖరి రౌండ్‌ పోటీలో పాకిస్థాన్‌పై సంచలన విజయం సాధించడం ద్వారా, నాలుగోసారి ఫైనల్స్‌కు అర్హత సంపాదించిన బంగ్లాదేశ్‌ చివరకు టైటిల్‌ సమరంలో టీమిండియా చేతిలో ఓడిపోక తప్పలేదు. ఫైనల్లో ఓపెనర్‌ లిట్టన్‌ దాస్‌ మెరుపు సెంచరీతో చక్కటి ఆరంభాన్ని ఇచ్చినా, బంగ్లాదేశ్‌ టాపార్డర్‌ పేకమేడలా కూలి చేజేతులా ఓటమి కొనితెచ్చుకొంది.

ఏడు టైటిల్స్‌

గత 36 సంవత్సరాల ఆసియాకప్‌ రికార్డులను ఓసారి చూస్తే, గత 16 సంవత్సరాల కాలంలో ఎనిమిదిసార్లు ఫైనల్స్‌ చేరిన ఒకే ఒక్క జట్టు టీమిండియా మాత్రమే. అంతేకాదు, ఎనిమిది ఫైనల్స్‌లో ఏడుసార్లు విన్నర్‌, ఓసారి రన్నరప్‌ ట్రోఫీ అందుకొన్న ఏకైకజట్టు కూడా టీమిండియానే కావడం విశేషం.

1984లో యూఏఈ వేదికగానే శ్రీకారం చుట్టుకొన్న ఆసియాకప్‌, గత మూడున్నర దశాబ్దాల కాలంలో అంతై ఇంతై అన్నట్లుగా ఎదిగిపోయింది. ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో జరిగే ఈ టోర్నీ, 36 సంవత్సరాల చరిత్రలో అత్యధికంగా, ఏడుసార్లు విజేతగా నిలిచిన ఏకైక జట్టు భారత్‌ మాత్రమే.

ఇప్పటికే రెండుసార్లు ప్రపంచ విజేతగా ఉన్న భారత జట్టు 1984 ప్రారంభ ఆసియాకప్‌ నుంచి ప్రస్తుత 14వ ఆసియాకప్‌ వరకూ ఏడుసార్లు ట్రోఫీ అందుకొంటే, ఐదుటైటిల్స్‌తో శ్రీలంక రెండు, రెండు ఆసియాకప్‌ ట్రోఫీలతో పాకిస్థాన్‌ మూడు స్థానాల్లో నిలిచాయి.

మొదటి విజయం

భారతజట్టు 1984, 1988, 1990, 1995, 2008, 2016, 2018 సంవత్సరాలలో ఆసియాకప్‌ విజేతగా నిలిచింది.

మాజీ చాంపియన్లు పాకిస్థాన్‌, శ్రీలంక జట్ల జోరు తగ్గి బంగ్లాదేశ్‌, అఫ్ఘనిస్థాన్‌ లాంటి జట్ల దూకుడు పెరగడం, టీమిండియా తన ఆధిపత్యాన్ని కొనసాగించడం, 2018 ఆసియాకప్‌ ప్రత్యేకతలుగా మిగిలిపోతాయి.

క్రికెట్‌ అభిమానులు ఎక్కువగా ఉన్న ఆసియా ఖండంలో క్రికెట్‌ అంటే భారత్‌, పాక్‌, శ్రీలంక జట్లు మాత్రమే కాదు, అఫ్ఘనిస్థాన్‌ కూడా అని ప్రపంచానికి తొలిసారిగా తెలిసి వచ్చింది.

– క్రీడా కృష్ణ , 84668 64969

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *