తడబడిన సైనికుడి కథ ‘నా పేరు సూర్య’

తడబడిన సైనికుడి కథ ‘నా పేరు సూర్య’

వేసవికాలంలో అగ్ర కథానాయకుల చిత్రాలు హల్‌చల్‌ చేస్తాయని అందరూ భావించారు. కలెక్షన్లపరంగా అది నిజమేమో కానీ మనసుల్ని ఆకట్టుకోవడంలో మాత్రం ఇవి ఆశించిన స్థాయిలో లేవు. ‘రంగస్థలం’ తర్వాత వచ్చిన ‘భరత్‌ అనే నేను’, తాజాగా విడుదలైన ‘నా పేరు సూర్య’ చిత్రాలు ఒకే బాటలో పయనించాయి. కథలోని బలహీనతలను మరిపించే విధంగా హీరోలు సినిమాను భుజానికెత్తు కుని ముందుకు నడిపే ప్రయత్నం చేశారు. వారికున్న స్టార్‌డమ్‌, వేసవి సెలవులు కలిసి రావడంతో కలెక్షన్ల పరంగా ప్రొడ్యూసర్లు, బయ్యర్లు హ్యాపీనేమో కానీ సగటు సినీ ప్రేక్షకుడు మాత్రం అంత సంతోషంగా అయితే లేడు. సూపర్‌హిట్‌ చిత్రాలకు రచన అందించిన వక్కంతం వంశీ ‘నా పేరు సూర్య… నా ఇల్లు ఇండియా’తో తొలిసారి మెగాఫోన్‌ పట్టాడు. రొటీన్‌కు భిన్నంగా దేశభక్తి కథలో కాస్తంత కమర్షియల్‌ అంశాలను రంగరించి, ఈ వేసవిలో జనం ముందుకు తెచ్చాడు.

కథ విషయానికి వస్తే… సూర్య (అల్లు అర్జున్‌) చిన్నప్పుడే తండ్రితో గొడవపడి ఇంటి నుండి వెళ్ళిపోతాడు. ఓ పెద్దాయన సాయం చేయడంతో ఆర్మీలో జవాన్‌గా చేరతాడు. బోర్డర్‌కు వెళ్ళి దేశం మొత్తానికి కాపలాగా ఉండాలని, తాను అక్కడ ఉన్నాననే భరోసాతో 120 కోట్లమంది భారతీయులు ప్రశాంతంగా నిద్రపోవాలన్నది సూర్య చిరకాల వాంఛ. కానీ అతనిలోని ఆవేశం కారణంగా ఎప్పటి కప్పుడు పై అధికారులతో తిట్లు తింటుంటాడు. ఒకానొక సందర్భంలో పాక్‌ తీవ్రవాదిని క్షణికా వేశంతో కాల్చి చంపేయడంతో సూర్యను ఉద్యోగం లోంచి తీసేస్తారు. అయితే ఎంతో వేడుకోవడంతో ఇండియాలోని టాప్‌ మోస్ట్‌ సైకాలజీ ప్రొఫెసర్‌ రామకృష్ణరాజు (అర్జున్‌ సర్జా) నుండి అతను ఆర్మీ ఉద్యోగానికి అర్హుడే అనే సర్టిఫికెట్‌ తెచ్చుకోమని ఉన్నతాధికారి చెబుతాడు. దాంతో సూర్య వైజాగ్‌ వస్తాడు. చిత్రం ఏమంటే ప్రొఫెసర్‌ రామకృష్ణ రాజు స్వయానా సూర్య తండ్రే. ఇంటి నుండి వెళ్ళిపోయిన సూర్య ఇప్పటికైనా తన తప్పు తెలుసుకున్నాడేమోనని ఆయన భావిస్తాడు. కానీ సూర్యలో మార్పు రాలేదని గ్రహిస్తాడు. చివరకు 21 రోజుల పాటు ఆగ్రహావేశాలకు లోనుకాకుండా, ఎలాంటి గొడవలూ చేయకుండా ఉంటే సర్టిఫికెట్‌ ఇస్తానని చెబుతాడు. ఆ సర్టిఫికెట్‌ ఇస్తే తాను అనుకున్న విధంగా బోర్డర్‌ సెక్యూరిటీకి వెళ్ళవచ్చనే ఆశతో సూర్య అందుకు అంగీకరిస్తాడు. మరి సూర్య ఆ పరీక్షలో నెగ్గాడా ? స్థానిక రాజకీయ నేత చల్లా (శరత్‌ కుమార్‌) తో ఎలాంటి గొడవలు ఎదురయ్యాయి? గతంలో ప్రేమించి దూరమైన వర్ష (అనూ ఇమ్మాన్యుయేల్‌) అతని జీవితంలోకి తిరిగి ఎలా అడుగుపెట్టింది? అనేది మిగతా కథ.

నిజానికి ఇదో సింపుల్‌ కథ. ఆవేశాన్ని కంట్రోల్‌ చేసుకోని ఓ ఆర్మీ జవాన్‌ బోర్డర్‌కు వెళ్ళాలనే తన అంతిమ లక్ష్యం కోసం ఎలాంటి ప్రతిబంధకాలను ఎదుర్కొన్నాడో చెప్పే కథ. అయితే ఈ కథకు కమర్షియల్‌ అంశాలు జోడించాలనే తలంపుతో ఫ్యామిలీ సెంటిమెంట్‌కు ప్రాధాన్యమిచ్చాడు దర్శకుడు, కథకుడు వక్కంతం వంశీ. సినిమా మొదలైన అరగంటలోనే తండ్రీ కొడుకుల కాన్‌ఫ్లిక్ట్‌ మొదలవుతుంది. అందులో ఉపకథగా సూర్య లవ్‌ సోర్టీ సాగుతుంది. అదంతా సరదాగా చూడటానికి బాగానే ఉంది. అయితే ఆ తర్వాతే కథాగమనం మందగించింది. ఈ దేశం కోసం ప్రాణాలు సైతం పణంగా పెడుతున్న జవాన్లను స్థానిక రాజకీయ నేతలు ఎలాంటి ఇబ్బందులకు గురిచేస్తున్నారు ? బాధితులు ముస్లింలు అయిన పక్షంలో, వారి వారసులు ఆ కసితో ఎలా టెర్రరిస్టులుగా మారుతు న్నారనే అంశాన్ని హైలైట్‌ చేయాలని దర్శకుడు భావించారు. దాంతో సరిహద్దు అవతల కాదు ఈవల ఉన్న దోహ్రులకు బుద్ధి చెప్పడం ప్రధానమని సూర్య భావించడంతో అతని లక్ష్యం నీరుకారిపోయింది. దాంతో ఎక్కడో మొదలైన కథ మరెక్కడికో వెళ్ళి పోయిన భావన ప్రేక్షకులకు కలుగుతుంది. ముస్తఫా (సాయికుమార్‌) కు జరిగిన అన్యాయం, ముస్తఫా కొడుకు అన్వర్‌ (విక్రమ్‌ లగడపాటి) ని వెతకడం కోసం సోషల్‌ మీడియా సాయంతో దేశమంతా జల్లెడ పట్టడమనే అంశాలు పేలవంగా ఉన్నాయి. అలానే సూర్యను ఓ మ్యూజీషియన్‌గా భావించి, అతన్ని ప్రేమించి, శరీరాన్ని సైతం అప్పగించేసి, ఆ తర్వాత సైనికుడని తెలిసి అతనికి దూరమైన వర్ష పాత్ర సైతం ఎలాంటి ప్రభావం చూపలేదు. సూర్యకు, అతని తల్లి (నదియా) కి మధ్య పెట్టిన ఒకటి రెండు సన్నివేశాలు సైతం పెద్దంతగా ఆకట్టుకోలేదు. సీనియర్‌ సైకాలజిస్ట్‌ అయి ఉండి రామకృష్ణరాజు సూర్యను ‘అన్‌ వాంటెడ్‌ చైల్డ్‌’ అంటూ అక్కసు వెళ్ళగక్కడంలోనూ అర్థం లేకుండా ఉంది. ఇన్ని బలహీనమైన సన్నివేశాల మధ్య కూడా సినిమా ఒక్కసారైన చూడొచ్చు అనుకోవడానికి అల్లు అర్జున్‌ నటనే కారణం. అలానే విశాల్‌, శేఖర్‌ నేపథ్య సంగీతం, వక్కంతం వంశీ రాసిన మాటలు బాగున్నాయి. పాటల్లో ‘సైనిక, లవర్‌ ఆల్సో – ఫైటర్‌ ఆల్సో’ ఆకట్టుకుంటాయి. ఎప్పటిలానే తనదైన డాన్స్‌తో అల్లు అర్జున్‌ అలరిం చాడు. యాక్షన్‌ సీక్వెన్స్‌ మాస్‌ మెచ్చేలా ఉన్నాయి. కథలో దేశభక్తి ఉన్నా, కమర్షియల్‌ అంశాలను సైతం అందులో జొప్పించి, ఎలాగైనా అందరినీ ఆకట్టుకో వాలని దర్శక నిర్మాతలు పడిన తపన పెద్దంతగా సఫలం కాలేదనే చెప్పాలి. అయితే ఉన్నంతలో ఓ మంచి ప్రయత్నాన్ని దర్శకుడు వక్కంతం వంశీ చేశారు. అది అభినందించదగ్గది. భవిష్యత్తులో అయినా అతను మరింత బలమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తాడని భావించొచ్చు. లగడపాటి శిరీషా, శ్రీధర్‌, బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమాకు నాగబాబు సమర్పకుడిగా వ్యవహరించారు. తెలుగుతో పాటు ఈ చిత్రం అటు తమిళ, మలయాళ భాషల్లోనూ ఒకేరోజున విడుదల కావడం విశేషం.

– చంద్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *